కోడలు.... ఆమె నాకు పుట్టిన పిల్ల కాదు. ఎక్కడో పుట్టినపిల్ల. ఎక్కడో చదువుకుంది.. ఎవరి ఇంటినుండో వచ్చింది. అయితే నాకు కోడలిగా వచ్చింది. నా కొడుకును సంతోష పెట్టింది. నా వంశాన్ని పెంచింది. నాకు మనవడిని, మనవరాలిని ఇచ్చింది. నాకు, నా భార్యకు ఊతకర్ర.. చేతికర్ర అయింది. ముప్పూటలా ప్రేమను పంచిపెడుతున్నది. అటువంటి కోడలును చూసుకుని అత్తామామలు మురిసిపోతారు. అందుకే శాస్త్రం కోడలికి పెద్దపీట వేసింది. మామగారు కాలం చేస్తే... తద్దినం పెట్టేటప్పుడు కొడుకు అక్కడే ఉన్నా దీపం పెట్టే అధికారం మాత్రం కోడలికే ఇచ్చింది. ఏ కారణంచేతనయినా ఆమెకు అవాంతరం ఏదయినా వస్తే... ఆమె మళ్ళీ యోగ్యత పొందినప్పుడే తద్దినం పెట్టాలని చెప్పింది. అంత గొప్ప ఉపకారం చేస్తున్న కోడలిని... మా కిచ్చిన కన్యాదాతకు ప్రతిఫలంగా ఏమిచ్చి గౌరవించగలం!!
నా కూతురిని వేరొకరి ఇంటి కోడలిగా పంపితే.. నేను ఒక మహోపకారం చేసినట్లు. నా కూతురు వేరొకరికి ధర్మపత్ని అయింది. ఆయన తరిస్తున్నాడు. ఆయన సంతోషంగా ఉన్నాడు. ఆయన సంతానాన్ని పొందాడు. నేను తాతయినట్టుగానే ఆయన తల్లిదండ్రులు తాత, నాయనమ్మలయి వారు సంతోషిస్తున్నారు. భగవంతుడు నాకేమి ఇచ్చాడో వేరొకరికి కూడా ఇచ్చాడు. అది నాకు గొప్ప సంతృప్తి. ఎవరంటారు శాస్త్రం ఆమెకు తక్కువ చేసిందని!!! తండ్రికి ఆమె 21 తరాలు తరించే అవకాశం ఇచ్చింది.
పిల్లను ఇస్తున్నాం... కన్యాదానం చేస్తున్నామంటే... ఏదో పంచలచాపు ఇస్తున్నట్లు కాదు... ఆ పిల్ల మీద అధికారం తల్లిదండ్రులకు ఎప్పుడూ ఉంటుంది. పరమ మర్యాద, గౌరవం అల్లుడి దగ్గరే మొదలవుతుంది. మంచి అల్లుడిని పొందడం అంటే మరో కొడుకును కన్నంత ఆనందం. కొడుకు చూపే అభిమానంకన్నా కోడలి అభిమానం పొందిన వారు మరో పదేళ్ళు ఎక్కువగా బతుకుతారు. మా అల్లుడు బంగారం. మా అమ్మాయిని గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్నాడన్న ఆనందం వారి ఆయుర్దాయాన్ని పెంచుతుంది.
కాంచీపురంలో ఒక వృద్ధ వేదపండితుడు తటస్థపడి మాటల సందర్భంలో ఇలా అన్నాడు.. ‘‘అల్లుడు మంచివాడయితే మీకు మరో కొడుకున్నట్టే. మంచివాడు కాకపోతే మీరు నిత్యం చచ్చిపోయినట్లే. కారణం కూతురి బాధను చూడలేక, చూసి.. మింగలేక.. కక్కలేక మీకు ఆ స్థితి ఏర్పడుతుంది.’’ అని.
మనిషిని మనిషి బాధపెట్టుకోవడమయినా, బతికించుకోవడమయినా మన అనుబంధాలనుబట్టి ఉంటుంది. గృహస్థాశ్రమ వైశిష్ట్యాన్ని అర్థం చేసుకుంటే... ఓహ్... ఇంత గొప్పగా మాట్లాడి ఇస్తున్నారా పిల్లను... అనిపిస్తుంది. అందుకనే ‘ధర్మేచ అర్థేచ కామేచ....ఏషా నాతి చరితవ్యా... ధర్మప్రజాసంపత్తి అర్థం స్త్రీయం ఉద్వహే’ .. నేను ఈమెను దేనికోసం స్వీకరిస్తున్నాను..ధార్మికమైన సంతానం కోసం... జీవితంలో మొదట భార్య ఊరట, తరువాత కొడుకు ఊరట, తదుపరి కోడలు ఊరట, పిదప మనవడు, మనవరాలు ఊరట...అదీ గృహస్థాశ్రమ వైభవం... తాత పక్కన ఉంటే మనుమలకు ఒక విశ్వవిద్యాలయం పక్కన ఉన్నట్టే.
– బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు
Comments
Please login to add a commentAdd a comment