సర్వసాధారణంగా లోకంలో ..ఎవరయినా విజయం సాధిస్తే..దానికి వారు ఎంత కష్టపడిందీ పదేపదే చెప్పుకుని పొంగిపోతుంటారు. అది సహజం కూడా. కానీ అపజయం ఎదురయితే మాత్రం... ‘మనం చేయాల్సింది చేశాం కానీ ఫలితం లేకపోయింది’ అంటారు.. అంటే విజయం అయితే తన స్వంతం. అదే వైఫల్యం చెందితే అందరినీ కలుపుకుంటారు.
తన వైఫల్యాన్ని అంగీకరించరు..ఇది కూడా ఎక్కువగా చూస్తుంటాం. కానీ విశ్వవిఖ్యాత భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ విజేత, రామన్ ఎఫెక్ట్ సష్టికర్త సర్ సివి రామన్ ఏమంటారంటే... ‘‘ఎక్కడ నేను వైఫల్యం చెందానో దానికి యజమానిని నేను. నేనే కర్తను, నేనే భోక్తను, నేనే దానికి పూర్తిగా బాధ్యుణ్ణి. అసలు నేను వైఫల్యం చెందకపోతే .. నేను నేర్చుకోవడం ఎలా సాధ్యపడుతుంది!!!’’– అని.
దిద్దుకుందామన్న స్పృహ లేకపోతే దోషం కానీ, దిద్దుకోవడానికి సిద్ధంగా ఉండి.. తాను పొందిన వైఫల్యాలను అనుభవంగా స్వీకరించి, అది నేర్పిన పాఠాలతో మరింత జాగ్రత్తగా తమ ప్రయత్నాలను కొనసాగిస్తానంటే... ఇక సమస్యే ముంది!!! నిజానికి అందరిలో ఉండాల్సిన లక్షణం అది.
సుందరకాండలో స్వామి హనుమ... ‘‘నాలుగు అంగుళాలు కూడా వదలకుండా లంకా పట్టణమంతా గాలించేసాను. సీతమ్మ కనబడలేదు. అంటే సీతమ్మ ఇక్కడ లేదేమో.. సీతమ్మ క్షేమ సమాచారం లేకుండా నేను తిరిగి వెడితే..అక్కడ రాముడు శరీరం వదిలేస్తాడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, కౌసల్య, సుమిత్ర, కైకేయి, కోసల రాజ్య ప్రజలు, వానర రాజ్యంలో ఉన్నవాళ్ళు...అందరూ హతాశులైపోతారు. నేను వెళ్ళి సీతమ్మ సమాచారం దొరకలేదని చెప్పి ఇంతమందిని బాధపెట్టడం కంటే ఈ సముద్రపు ఒడ్డున కూర్చుని ప్రాయోపవేశం చేస్తాను.
శరీరం వదిలేస్తాను’’ అన్నాడు... హనుమ అంత బలశాలి లంకంతా వెతికి సీతమ్మజాడ తెలియకపోతే... ఎంత నిరాశ, ఎంత నిస్పృహæ... అది కొద్దిసేపే... వెంటనే తన బాధ్యతలను గుర్తు చేసుకున్నాడు.. ‘అసలు మనిషికి శోకం పొందకుండా ఉండడం, బాధ పడకుండా ఉండడం, వైఫల్యానికి బాధపడినా దాన్ని విడిచి మళ్లీ... దిద్దుకుని ఉత్సాహం పొంది ఎక్కడ వైఫల్యం చెందాడో అక్కడ తిరిగి విజయం అందుకోవడానికి సాధన మొదలుపెట్టడం ముఖ్యం’ అనుకున్నాడు.
ఎక్కడ వస్తువు పోగొట్టుకున్నామో అక్కడ వెతికితే ఫలితం... ఎక్కడ వైఫల్యం చెందామో అక్కడ విజయం సాధిస్తే అది ఇచ్చే తృప్తి, అది నేర్పిన పాఠం, అది నేర్పిన అనుభవం ఎప్పటికీ గుర్తుండిపోతాయి... అటువంటి పరిస్థితులు ఎదురయినప్పుడు మరింత స్ఫూర్తినిస్తాయి... అన్న వివేకం మనల్ని ముందుకు నడిపించడమే గాక మరిన్ని విజయాలను రుచి చూపిస్తుంది. అంతే తప్ప నేనేది చేసినా ఇంతే... అయినా నాకా శక్తి ఎక్కడిది.. అని నిరాశపడితే జీవితం ముందుకు కదలదు.
మేడమీద ఉన్న కిటికీలోంచి ఇద్దరు వ్యక్తులు బయటికి చూస్తే... ఒకడికి కింద ఉన్న బురదనేల, మురికి కనిపించి నిరాశ పరిస్తే.. మరొకడికి ఆకాశంలో నక్షత్రాలు, చంద్రుడు, వెలుగులు కనిపించి మురిపిస్తాయి. వాళ్ళ దక్పథాల్లోనే తేడా.. ఆశావాదం ఉన్న వాళ్లు జీవితంలో వృద్ధిలోకి వస్తారు... నిరాశావాదులు నిరాశను ప్రయత్నపూర్వకంగా వదిలించుకోవాలి. రామన్ చెప్పినట్లు వైఫల్యాలను మనసారా అంగీకరిస్తే... అది మనల్ని ఎన్నటికీ నిరాశపరచకపోగా... కొత్త శక్తినిస్తుంది.
బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు
Comments
Please login to add a commentAdd a comment