Ramadan 2025 : విశేషాల శుభమాసం | Ramadan 2025 begins with the crescent moon | Sakshi
Sakshi News home page

Ramadan 2025 : విశేషాల శుభమాసం

Published Fri, Feb 28 2025 11:29 AM | Last Updated on Fri, Feb 28 2025 3:56 PM

Ramadan 2025 begins with the crescent moon

పవిత్ర రమజాన్‌ అత్యంత శుభప్రదమైన నెల. మానవుల మానసిక, ఆధ్యాత్మిక వికాసానికి, జీవన సాఫల్యానికి కావలసిన అనేక అంశాలు దీనితో ముడిపడి ఉన్నాయి. మానవాళికి మార్గదర్శనం చూపే పవిత్ర ఖురాన్‌ ఈ నెలలోనే అవతరించింది. ‘రోజా’ వ్రతం విధి గావించబడిందీ ఈ నెలలోనే. వెయ్యి నెలలకన్నా విలువైన రాత్రి అని చెప్పబడిన ‘లెలతుల్‌ ఖద్ర్‌ / షబెఖద్ర్‌’ ఈ నెలలోనే ఉంది. ఈ నెలలో చేసే ఒక్కో మంచిపనికి అనేక రెట్ల పుణ్యఫలం లభిస్తుంది. సహజంగా ఈ నెలలోఅందరూ సత్కార్యాలవైపు అధికంగా మొగ్గుచూపుతారు. దుష్కార్యాలు గణనీయంగా తగ్గిపోతాయి. 

సమాజంలో ఒక మంచి మార్పు కనబడుతుంది. ఫిత్రా ఆదేశాలు కూడా ఈ నెల లోనే అవతరించాయి. ‘ఫిత్రా’ అన్నది పేద సాదల హక్కు. దీనివల్ల వారికి కాస్తంత ఆర్థిక వెసులుబాటు లభిస్తుంది. ఎక్కువ శాతం మంది ‘జకాత్‌’ కూడా ఈ నెలలోనే చెల్లిస్తారు. ఇదికూడా పేదసాదల ఆర్థిక అవసరాలు తీర్చడంలో గణనీయంగా తోడ్పడుతుంది. ఈ నెలలో ‘తరావీహ్‌’ నమాజులు ఆచరించ బడతాయి. అదనపు పుణ్యం మూటకట్టుకోడానికి ఇదొకసువర్ణ అవకాశం. ఈ నెలలో చిత్తశుద్ధితో రోజా (ఉపవాస దీక్ష) పాటించేవారి గత అపరాధాలన్నీ మన్నించబడతాయి. 

చదవండి: National Science Day ప్రజల చేతిలో ఆయుధం సైన్స్‌

ఉపవాసులు  ‘రయ్యాన్‌’ అనే ప్రత్యేక ద్వారం గుండా స్వర్గప్రవేశం చేస్తారు. ఈ విధమైన అనేక ప్రత్యేకతలు ఉండబట్టే దేవుడుఈ నెలను బహుళ ప్రయోజనకారిగా తీర్చిదిద్దాడు. మానవుల ఇహపర ప్రయోజనాలకు, సాఫల్యానికి ఇతోధికంగా దోహద పడే నెల రమజాన్‌. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ సువర్ణ అవకాశాన్ని సద్విని యోగం చేసుకోడానికి శక్తివంచన లేని కృషి చెయ్యాలి. ఇంతటి ప్రాధాన్యత కలిగిన ఉపవాసవ్రత ఉద్దేశ్యాన్ని, లక్ష్యాన్ని కూడా దేవుడు చాలా స్పష్టంగా విశదీకరించాడు. 

మానవ సమాజంలో భయభక్తుల వాతావరణాన్ని, నైతిక, మానవీయ విలువలను, బాధ్యతాభావం, జవాబుదారీతనాన్ని పెంపొందించడమే ఉప వాసాల ధ్యేయం. మానవ సహజ బలహీనతల వల్ల ఏవైనా చిన్నాచితకా తప్పొప్పులు దొర్లిపోతూ ఉంటాయి. ఈ లోపాల నుండి ఉపవాసాన్ని రక్షించి పరిశుద్ధ పరచడానికి ముహమ్మద్‌ ప్రవక్త(స) ఫిత్రాలు చెల్లించమని ఉపదేశించారు.
 

– యండి. ఉస్మాన్‌ ఖాన్‌
(రమజాన్‌ మాసం ప్రారంభం కానున్న సందర్భంగా) 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement