అవి పొగడ్తలా... తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త!!! | story about Success, Failure | Sakshi
Sakshi News home page

అవి పొగడ్తలా... తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త!!!

Published Sun, May 1 2016 1:57 AM | Last Updated on Sun, Sep 3 2017 11:07 PM

అవి పొగడ్తలా... తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త!!!

అవి పొగడ్తలా... తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త!!!

మనం చేసే ప్రతి ప్రయత్నంలో విజయం, వైఫల్యం అని ఉంటుంటాయి. ఒక చోట విజయం వరిస్తే ఇక నా అంతటి వాడు లేడని రొమ్మువిరుచుకుని తిరగకూడదు, అక్కరలేని భేషజాలకు పోయి పాడయిపోకూడదు. ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్రయత్నం ఫెయిల్ అయినట్లు కనబడుతుంటుంది. అలా ఫెయిలవడం నీ జీవితంలో వృద్ధిలోకి రావడానికి కారణం కావాలి. కాబట్టి ఎప్పుడైనా ఎవరిదైనా వైఫల్యం సంభవిస్తే బెంగపెట్టుకుని స్తంభించి పోకూడదు. మళ్ళీ ఉత్సాహంగా పూనికతో వృద్ధిలోకి రావాలి.

 విజయవాడలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీకి వైస్‌ఛాన్స్‌లర్‌గా పనిచేసిన డాక్టర్ ఐవిరావుగారి సోదరుడికి ఒకప్పుడు ఏదో పరీక్షలో ఒక పేపర్‌లో రెండు మార్కులు తక్కువొచ్చాయి. ఆయన మళ్ళీ కొంతకాలం చదవవలసి వచ్చింది. ఆయనేం బెంగపెట్టుకోలేదు. శ్రద్ధగా చదువుకున్నారు. అలా చదువుకున్నందుకు ఫలితం - భారతదేశంలో ఎవరూ పొందని కీర్తిని ఆయన పొందారు. చిన్నపిల్లల్లో వచ్చే ఒక ప్రత్యేకమైన వ్యాధి మీద ఆయన నిష్ణాతుడై ప్రపంచవ్యాప్తంగా కీర్తిగడించిన డాక్టరయ్యారు.

 ఒకప్పుడు పదోతరగతి ఫైనల్ పరీక్షలకు ముందు ఒక టాలెంట్ పరీక్షలాంటిది పెట్టేవారు. అలా ఒక పాఠశాల పెట్టి విజేతలకు బహుమతి ప్రదానం చేయడానికి నన్ను పిలిచారు. ఈ పరీక్షల్లో వచ్చిన మార్కులను బట్టి రాష్ర్టస్థాయిలో ర్యాంకులు తెచ్చుకునే అవకాశం ఉన్న వారిని గుర్తించేవారు. దీనిలో ప్రథమ బహుమతి గెలుచుకున్న విద్యార్థి మొత్తం బంధుగణాన్ని అంతటినీ ఏకంగా ఒక బస్సులో తీసుకువచ్చాడు. నేను దాన్ని తప్పుపట్టడం లేదు. కానీ ఆ పిల్లవాడిని ఆ బంధువులు ఏ స్థితిలో చూశారంటే... వాడు జీవితంలో ఇక చేరవలసిన పైస్థానాన్ని చేరినట్లుగా భావించారు.

వాడికి ప్రైజ్ ఇస్తున్నప్పుడైతే వాడి అతిశయం, వాడి అహంకారం చూస్తే వీడికొక మంచిమాట చెప్పకపోతే తప్పుచేసిన వాడినవుతాననిపించి ‘బాబూ! నీతో ఒక్కమాట మాట్లాడవచ్చా’ అన్నాను. వాడు ’చెప్పండి’ అన్నాడు. ‘‘ జీవితానికి ఇది చివరి పరీక్ష కాదు, కానీ ఈ పరీక్షలో పొందిన విజయం తర్వాతి పరీక్షలో బాధకు కారణం కాకుండా చూసుకో’’ అన్నాను. నేను చెప్పిన మాట వాడికేమేరకు అర్థమైందో నాకు తెలియదు. ఈలోగా రెండోబహుమతి పొందిన విద్యార్ధి ఎంతో బాధగా వచ్చి నిలబడ్డాడు. ‘ఎందుకలా  ఉన్నావు’ అని అడిగితే వాడన్నాడు కదా... ‘‘నాకు రెండు మార్కులే తక్కువ వచ్చాయి.

ఫస్ట్ రావాలని ఎంతో ప్రయత్నం చేశా’’ అని చాలా బాధగా చెప్పాడు. నేనన్నానూ... ‘‘ఇదేం ఫైనల్ పరీక్ష కాదుకదా, ఒక ప్రయత్నం చేశావు. అంతే! రేపటి పరీక్షకు బాగా చదివి పేపర్లో నీ ఫొటో పడేటట్లు ఇక నుంచి బాగా ప్రిపేర్‌కా’’ అన్నాను. మొదటి బహుమతి అందుకున్న విద్యార్థి ఆ తర్వాత పుస్తకం పట్టుకున్నాడని నేననుకోవడం లేదు. కారణం ఫైనల్ ఫలితాల్లో మొదటి వేల ర్యాంక్స్‌లో లేడు. రెండోబహుమతి  విద్యార్థి స్టేట్ ఫస్ట్ వచ్చాడు!

 పొగడ్తకు మించి లోకంలో పాడవడానికి మరొక కారణం కూడా కనిపించదు. అందుకే ఇటువంటి సందర్భాల్లో దక్షిణ దేశంలో ఇప్పటికీ ఒక సంఘటన గురించి చెబుతుంటారు. జంబుకేశ్వరం అని ఒక దేవాలయం ఉంది. ఆ దేవాలయం అర్చకులు మహారాజదర్శనానికి కూడా వెళ్ళేవారుకారు. అవసరమనిపిస్తే మహారాజుగారే వారి దర్శనానికి వస్తారు. ఒకప్పుడు ఒక యువరాజుకు పట్టాభిషేకం అయింది. జంబుకేశ్వరం తప్ప అన్ని దేవాలయాల నుంచి అర్చకులు వెళ్ళి ఆశీర్వచనం చేశారు. జంబుకేశ్వరం ఆలయం అర్చకులు ఎందుకు రాలేదని అడిగితే ‘‘వారేమీ ఆశించరు. వారు రారు.

వాళ్ళ దగ్గరకు మనమే వెళ్ళాలి’’ అని మంత్రి చెప్పాడు. కొత్త రాజు కొద్దిసేపు ఆలోచించి ఒక అద్భుత సన్మానపత్రం రాయించి అది పట్టుకుని వెళ్ళాడు. అర్చకులకు కబురుపంపి ఆలయ సమీపంలోని ఒక చెట్టుకింద కూర్చున్నాడు. అర్చకులను స్వాగత సత్కారాలతో గొడుగులుపట్టి తీసుకువచ్చి వారికా సన్మాన పత్రం చదివి వినిపించి సత్కారం చేసి వెళ్ళిపోయాడు. ఆ పత్రాన్ని రోజూ చదువుకున్న అర్చకులకు రాసినవాడిమీద ప్రీతి అంకురించి, నియమ నిష్ఠలను వదిలేసి ఆ తర్వాత వారే రాజుగారి దగ్గరకు వెళ్ళిపో యారు. అందుకే నిబద్ధత కలిగిన ఒక పండితుణ్ణి పాడుచేయాలంటే ఏం చేయాలని అడిగితే... ఒక సన్మానం చేయండి చాలు’’ అంటారు.

 జీవితంలో పొగడ్త అన్నది ఎంత మోతాదులో పుచ్చుకోవాలో అంతే మోతాదులో పుచ్చుకోవాలి. మందులే కదా అని మోతాదుకు మించి తీసుకుంటే విషమై చచ్చిపోతారు. నా చిన్నతనంలో జరిగిన ఒక సంఘటన గుర్తుకొస్తున్నది. మా ఊళ్ళో ఒక పశువుల కాపరికి ఓరోజు బాగా దగ్గువస్తే డాక్టర్‌గారి దగ్గరకు తీసుకుపోయారు. ఆయన ఒక ద్రావకం ఇచ్చి ‘‘మూడుపూటలా ఒక చెంచా చొప్పున తాగు. మూడురోజుల తర్వాత వచ్చి ఎలా ఉందో చెప్పు’’ అన్నారు.

వాడింటికి వెళ్ళి మొత్తం సీసామందు ఒక్కసారే తాగేశాడు. వెంటనే కింద పడిపోతే డాక్టర్ దగ్గరకు తీసికెళ్ళారు. ఆయనేదో విరుగుడు మందిస్తే లేచి కూర్చున్నాడు. అప్పుడు డాక్టర్‌గారు ఎందుకలా తాగావని అడిగారు. ‘మూడుపూటలా ఒక చెంచా చొప్పున మూడు రోజులకు 9 చెంచాలు తాగితే ఒక్కసారే తగ్గుతుందని అలా తాగేశానండీ’ అన్నాడు వాడు. అది మూర్ఖత్వం కాదు, అమాయకత్వం.

 అలాగే మీకు బాగా మార్కులొచ్చి, ఉన్నత స్థితికి వెళ్ళి, జీవితంలో బాగా వృద్ధిచెంది, నా దగ్గరకు వచ్చి - ‘‘సార్, మీ ప్రసంగానికి ప్రభావితులమై జీవితంలో నిలదొక్కుకోవడం వచ్చింది. ఇప్పుడు మేం జీవితంలో ఎటువంటి క్లిష్ట సంఘటనలకు భయపడడంలేదు’’ అన్నారనుకోండి.. ‘‘ఎంతవాడివయ్యావునాయనా... నా మాట విని ... ఇంత వృద్ధిలోకి వచ్చావు’’ అని అనకూడదు నేను. ‘‘ఇలాగే జీవితంలో వృద్ధిలోకి రా. అంతా గురు కటాక్షం.

నీ గురువుల అనుగ్రహం నీయందు ఎల్లవేళలా నిలబడుగాక’’ అనో లేదా ‘‘అంతా ఈశ్వర కటాక్షం. వృద్థిలోకి వస్తున్నావు’’ అని మాత్రమే అనాలి. అలాగాక ఉత్తినే పొగిడితే అది మత్తు అయి కూర్చుంటుంది. మీరు పెద్ద డాక్టర్లయినా, పెద్ద ఇంజనీర్లయినా లేక అందమైన ఆడపిల్లయినా మిమ్మల్ని ఎవరైనా పొగుడుతున్నప్పుడు అది ఎందుకో అర్థంచేసుకోలేకపోతే మాత్రం ఆ తరువాత విలపించి ప్రయోజనం ఉండదు.   

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement