మానవ జీవితం ద్వంద్వాలమయం. కష్టసుఖాలు, కలిమిలేములు, జయాపజయాలు జీవన గమనంలో సహజ పరిణామాలు. జయాపజయాల గురించి మన సమాజంలో పట్టింపు మోతాదు కంటే ఎక్కువే! విజేతలకు వీరపూజలు చేయడం, పరాజితులను విస్మృతిలోకి తోసిపారేయడం సర్వ సాధారణం. అయితే, జయాపజయాలు దైవాధీనాలని ఆధ్యాత్మికవాదుల విశ్వాసం.
ఎవరెన్ని సూక్తులు చెప్పినా, ఎవరూ గెలుపు కోసం ప్రయత్నాలను మానుకోరు. ఎట్టి పరిస్థితుల్లోనూ తమకు గెలుపు దక్కాలనుకునే పట్టుదలతో పగ్గాలు విడిచిన గుర్రాల్లా దూసుకుపోయేవారు కొందరు ఉంటారు. గెలుపు కోసం ఎలాంటి అడ్డదారులు తొక్కడానికైనా, ఎంతటి నీచానికి దిగజారడానికైనా తెగబడేవారు ఇంకొందరు ఉంటారు.
శక్తికి మించిన విజిగీషతో రగిలిపోయేవారు చరిత్రను రక్తసిక్తం చేస్తారు. అడ్డదారుల్లో పడి అడ్డదిడ్డంగా పరుగులు తీసి, అడ్డు వచ్చినవాళ్లను నిర్దాక్షిణ్యంగా తొక్కిపడేసి అందలాలెక్కుతారు. విజయోన్మత్తతను తలకెక్కించుకుని విర్రవీగుతారు. కాలం ఎప్పుడూ ఒక్కలాగానే ఉండదు. మార్పు దాని సహజ స్వభావం. కాలం మారి, పరిస్థితులు వికటించినప్పుడు విజేతలమనుకుని అంతవరకు విర్రవీగిన వారు పెనుతుపాను తాకిడికి కుప్పకూలిన తాటిచెట్లలా నేలకూలిపోతారు. మన పురా ణాల్లో దుర్యోధనుడు, మన సమీప చరిత్రలో హిట్లర్ వంటి వారు అలాంటి శాల్తీలే!
‘అజ్ఞానపు టంధయుగంలో/ తెలియని ఏ తీవ్రశక్తులో/ నడిపిస్తే నడిచి మనుష్యులు/ అంతా తమ ప్రయోజకత్వం/ తామే భువి కధినాథులమని/ స్థాపించిన సామ్రాజ్యాలూ/ నిర్మించిన కృత్రిమ చట్టాల్/ ఇతరేతర శక్తులు లేస్తే/ పడిపోయెను పేకమేడలై’ అన్నాడు మహాకవి శ్రీశ్రీ. అజ్ఞానపుటంధ యుగంలోనే కాదు, వర్తమాన అత్యాధునిక యుగంలోనూ పరిస్థితుల్లో పెద్ద మార్పు కనిపించడం లేదు.
మొరటు బలం, మూర్ఖత్వం, మోసం, కుట్రలతో సాధించిన అడ్డగోలు విజయాలను తలకెక్కించుకుని, అదంతా తమ ప్రయోజకత్వంగా తలచి విర్రవీగే విజయోన్మత్తులలో దేశాధి నేతల మొదలుకొని చిల్లరమల్లర మనుషుల వరకు నేటికీ ఉన్నారు. ఇలాంటి వాళ్లలోనే దుర్యోధ నుడికి గుడి కట్టి పూజించేవాళ్లు, హిట్లర్‌ను ఆరాధించే వాళ్లు, లేని సుగుణాలను కీర్తిస్తూ నిరంకు శులకు బాకాలూదే వాళ్లు కనిపిస్తారు.
గోబెల్స్‌కు బాబుల్లాంటి దుష్ప్రచార నిపుణులు నిర్విరామంగా ఊదరగొడుతూ, జీవితానికి గెలుపే పరమార్థమనే భావనకు ఆజ్యం పోస్తున్నారు. వీళ్ల ప్రభావం కారణంగానే ఓటమిని జీర్ణించుకోలేని తరం తయారవుతోంది.
మనుషుల స్థితిగతులను గెలుపు ఓటములతోనే అంచనా వేయడం మన సమాజానికి అలవాటైపోయింది. గెలవాలనే ఒత్తిడి ఒకవైపు, ఓటమి భయం మరోవైపు బతుకుల్లో ప్రశాంతతను ఆవిరి చేస్తున్నాయి. పరీక్షలను ఎదుర్కొనే విద్యార్థుల నుంచి ఎన్నికలను ఎదుర్కొనే రాజకీయ నాయకుల వరకు ప్రతి ఒక్కరికీ ఈ ఒత్తిడి తప్పడం లేదు.
గెలుపు ఒత్తిడి కొందరిని మానసికంగా కుంగదీస్తుంది. ఇంకొందరిని అడ్డదారులు తొక్కిస్తుంది. సమాజంలో ప్రబలుతున్న ఈ ధోరణిని సొమ్ముచేసుకోవడానికి కొందరు మేధావి రచయితలు విజయ సోపానమార్గాలను పుస్తకాలుగా అచ్చోసి జనాల మీదకు వదులుతారు. నానావిధ ప్రసార, సామాజిక మాధ్యమాల్లో వ్యక్తిత్వ వికాస ప్రవచనాలతో ఊదరగొడతారు.
‘విజయానికి కావలసినది పదిశాతం ప్రేరణ, తొంభైశాతం కఠోర శ్రమ’ అన్నాడు థామస్ ఆల్వా ఎడిసన్. విద్యుత్తు బల్బును కనుక్కొనే ప్రయత్నంలో ఆయన వెయ్యి వైఫల్యాలను చవిచూశాడు. ‘విద్యుత్ బల్బును కనుక్కోవడంలో వెయ్యిసార్లు విఫలమై, ఇప్పుడు సాధించారు కదా! ఇప్పుడు మీకేమనిపిస్తోంది?’ అని ఒక పాత్రికేయుడు ఆయనను ప్రశ్నించాడు. ‘వెయ్యిసార్లు నేను విఫలమవలేదు. వెయ్యి అంచెల తర్వాత విద్యుత్ దీపాన్ని కనుక్కోగలిగాను’ అని బదులిచ్చాడాయన.
వైఫల్యాలే విజయానికి సోపానాలని గ్రహించడానికి ఎడిసన్ అనుభవమే మంచి ఉదాహరణ. గెలుపు కోసం ప్రయత్నించే వాళ్లు ఓటమికి కూడా మానసిక సంసిద్ధతతో ఉండాలి. ఓటమి ఎదురైనప్పుడు రెట్టించిన పట్టుదలతో పునఃప్రయత్నం చేయడానికి తగిన శక్తి యుక్తులను సమకూర్చుకోవడానికి తగిన ఓరిమితో ఉండాలి. ఈ రెండూ లోపించడం వల్లనే పరీక్షల్లో వైఫల్యం ఎదురైనప్పుడు అర్ధంతరంగా ఆత్మహత్యలకు పాల్పడుతున్న వారెందరో!
స్వేచ్ఛగా జీవితాన్ని జీవించడమే ఒక సాఫల్యం. ఈ ఎరుక లేకనే చాలామంది జీవితాలను వ్యర్థం చేసుకుంటారు. చిల్లర గెలుపుల కోసం, పదవుల కోసం, పదవులను పదిలపరచుకోవడం కోసం అధికార బలసంపన్నుల ముందు సాగిలబడతారు. ‘వాని జన్మంబు సఫల మెవ్వాడు పీల్చు/ ప్రాణవాయువు స్వాతంత్య్ర భరభరితమొ/ పరుల మోచేతి గంజికై ప్రాకులాడు/ వాని కంటెను మృతుడను వాడెవండు?’ అన్నాడో చాటు కవి. ‘విజయమే అంతిమం కాదు.
వైఫల్యమేమీ ప్రాణాంతకం కాదు’ అని తేల్చేశాడు బ్రిటన్ మాజీ ప్రధాని విన్‌స్టన్ చర్చిల్. కాబట్టి వైఫల్యం ఎదురైనంత మాత్రాన ముంచుకొచ్చే ముప్పేమీ ఉండదు. విజయం సాధించినంత మాత్రాన అమాంతంగా ఒరిగిపడే ఆకాశమూ ఉండదు. ‘వైఫల్యాల నుంచి ఏమీ నేర్చుకోకపోవడమే మన అసలు పొరపాటు’ అంటాడు అమెరికన్ పారిశ్రామికవేత్త హెన్రీ ఫోర్డ్. వైఫల్యాలే మనకు గుణపాఠాలు నేర్పే గురువులు. గురువులను గౌరవించడం మన సంప్రదాయం. వైఫల్యాలను గౌరవించడం, విజయాలను వినయంగా శిరసావహించడమే మన కర్తవ్యం!
జయాపజయాలు
Published Mon, May 15 2023 3:30 AM | Last Updated on Mon, May 15 2023 3:30 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment