‘ఫన్ హైదరాబాద్’.. వాయిస్ ఆఫ్ ఫెయిల్యూర్స్
‘విజయం’ ఆనందాల మత్తులో ముంచుతుంది.. ‘ఫెయిల్యూర్’ మనం ఎక్కడున్నామో చూపిస్తుంది. కానీ వేదికలన్నీ విజయానివే.. ప్రచారమూ దానికే.. అందుకే ప్రతి గెలుపు వెనక దాగున్న ఓటమి మరుగున పడిపోయి ఓటమి గొంతు మూగబోతుంది. ఈ విషయాన్ని గ్రహించిన అయిదుగురు మెక్సికన్ కుర్రాళ్లు ‘ఫెయిల్యూర్’కి డయాస్ ఇవ్వాలనుకున్నారు. అందుకు ఓ సంస్థను ఏర్పాటు చేశారు. దీని స్ఫూర్తితో మన హైదరాబాద్‌లోనూ ఫెయిల్యూర్ వేదిక వెలసింది. అదే ‘ఫన్ హైదరాబాద్’.
ఇటీవల నగరంలోని ఓ ప్రాంతంలో ఓ కో వర్కింగ్ ప్లేస్‌లో 45 మంది సమావేశమయ్యారు. అందులో స్టూడెంట్స్ నుంచి ప్రొఫెషనల్స్ దాకా భిన్న వయసువారున్నారు. ఒకొక్కరూ వేదికనెక్కి ఆత్మీయులతో మాట్లాడుతున్నట్టు వారి మనసులో ఉన్నదంతా చెప్పుకున్నారు. అంతకుముందు వాళ్లంతా స్నేహితులు కాదు. కనీసం తెలిసిన వాళ్లూ కారు. అప్పుడే పరిచయం. వీరందరినీ కలిపిన కామన్ పాయింట్ ‘ఫెయిల్యూర్’. ఒక్క సమావేశంలోనే ఆప్తమిత్రులుగా చేసింది. గెలుపునకు లేని శక్తి ఇదే! అక్కడ చేరిన వారంతా జీవితాల్లో ఏయే దశల్లో ఓటమిని చూశారో చెప్పుకున్నారు. తమ లాంటి పరాజితులు చాలామంది ఉన్నారన్న ధైర్యాన్ని కలిగించింది. ఆ కథలను తమ విజయానికి సోపానాలుగా మార్చుకునే శక్తిని పెంచింది. ఇదీ ‘ఫన్ హైదరాబాద్’ చేసే పని. ఈ సంస్థకు నగరంలో స్థానం కల్పించింది చంద్రకాంత్ పొలిశెట్టి.
ఇలా పుట్టింది..
మెక్సికో దేశంలో 2012లో ఓ సంస్థ ప్రాణం పోసుకుంది. ఈ మూడేళ్లలో 35 దేశాల్లోని వంద నగరాలకు విస్తరించింది. అలా ఈ యేడు జనవరిలో హైదరాబాద్‌కు చేరుకుంది. అయితే ఇక్కడ సంస్థ మెక్సికన్ పేరును ఇక్కడ ఉచ్చరించడానికి ఇబ్బంది పడతారని.. 'fun hydrabad' పేరుతో ప్రచారమవుతోంది. ప్రపంచంలోని ఈ సంస్థ సభ్యులు నెలకోసారి సమావేశమవుతున్నా ఇక్కడ మాత్రం మూడు నెలలకు ఓ ఈవెంట్‌ను నిర్వహిస్తున్నారు చంద్రకాంత్ అండ్ టీమ్.
మొదటి ఈవెంట్‌కి 30 మంది హాజరైతే మొన్న జరిగిన రెండో ఈవెంట్‌కి 45 మంది వచ్చారు. ‘ఫన్ హైదరాబాద్’ మెక్సికన్ సంస్థ పేరుతోనే ఫేస్‌బుక్ పేజీ ఉంది. తమ ఫెల్యూర్ స్టోరీస్‌కి ఓ వేదిక కావాలనుకునే వారు, తమ ఓటమి కథలను ఇతరులతో పంచుకోవాలనుకునేవారు, ఇతరుల కథలను గెలుపు పాఠాలుగా మలచుకోవాలనుకునే వారంతా ఈ ఫేస్‌బుక్ పేజీ ద్వారా తమ పేరును రిజిష్టర్ చేయించుకుంటారు. ఇలా ఇప్పటికి నగరంలో 150 మంది నమోదయ్యారు. వీరిలో విద్యార్థులు, బిజినెస్, పారిశ్రామికవేత్తలు, రచయితలు, కళాకారులు, సాఫ్ట్‌వేర్ నిపుణులు.. ఇలా అన్ని రంగాలవారూ ఉన్నారు. ఓటమి గెలుపునకు తొలిమెట్టు అంటారు. ఈ సంస్థ ఆ సూత్రాన్నే ఫాలో అవుతోంది.
ఈ ఆలోచన ఎందుకు వచ్చిందంటే..
‘ఇన్ఫోసిస్‌లో సీనియర్ సిస్టమ్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నా. హైదరాబాద్‌లో స్టార్టప్ కల్చర్ బాగా పెరిగింది. ఆ ఈవెంట్స్ అన్నిటికీ అటెండ్ అయ్యేవాడిని. పార్టిసిపెంట్స్ తమ సక్సెస్ స్టోరీస్‌నే షేర్ చేసుకునేవారు. ఆ జర్నీలో ఎన్నో మలుపులు.. ఎన్నో ఫెయిల్యూర్స్ ఉంటాయి. కానీ ఆ ఫెయిల్యూర్స్‌ని ఎవరూ ప్రస్తావించేవారు కాదు. అప్పుడే ఫెయిల్యూర్‌కి ఓ వేదిక ఉండాలి.. ఆ వాయిస్‌ని వినిపించాలి అనుకున్నా. ఈ సమయంలోనే మెక్సికో సంస్థ గురించి తెలిసి సంప్రదించా. దానికి అనుబంధంగా దేశంలో మొదటిసారి హైదరాబాద్‌లో నేనే స్టార్ట్ చేశా.
మామూలుగా ఇలాంటి మీటింగ్స్, ఈవెంట్స్ అన్నీ వీకెండ్స్‌కి ప్లాన్ చేసుకుంటారు. కానీ మేం గురువారం ఖాయం చేసుకున్నాం. ఎందుకంటే వీకెండ్స్‌లో ఫ్యామిలీస్‌తో ఉంటారు.. ఏవో ప్రోగ్రామ్స్ పెట్టుకుంటారు. ఆ ఒత్తిడిలో మీటింగ్స్‌కి వచ్చినా సీరియస్‌గా ఉండరు. కాబట్టి మిడ్ వీకైతే ఆసక్తిగా వస్తారని గురువారం పెట్టాం. మొదటి ఈవెంట్‌కి కేవలం మౌత్ పబ్లిసిటీతోనే 30 మంది వచ్చారు. రెండో ఈవెంట్‌కి ఫేస్‌బుక్ పబ్లిసిటీ పనిచేసింది. మా ఈవెంట్ గురించి తెలుసుకున్న బిట్స్ పిలానీ వాళ్లు మమ్మల్ని అప్రోచ్ అయ్యారు. రెస్పాన్స్ బాగా వస్తోంది కాబట్టి భవిష్యత్తులో ఇంకా పెద్దగా చేయాలనుకుంటున్నాం. దానికి తగ్గ స్పాన్సర్స్ కోసమూ చూస్తున్నాం. స్పీకర్స్‌గా కూడా సీనియర్ మోస్ట్ పీపుల్ వచ్చే అవకాశం ఉంది’ అని చెప్పారు చంద్రకాంత్.