citiplus
-
‘ఫన్ హైదరాబాద్’.. వాయిస్ ఆఫ్ ఫెయిల్యూర్స్
‘విజయం’ ఆనందాల మత్తులో ముంచుతుంది.. ‘ఫెయిల్యూర్’ మనం ఎక్కడున్నామో చూపిస్తుంది. కానీ వేదికలన్నీ విజయానివే.. ప్రచారమూ దానికే.. అందుకే ప్రతి గెలుపు వెనక దాగున్న ఓటమి మరుగున పడిపోయి ఓటమి గొంతు మూగబోతుంది. ఈ విషయాన్ని గ్రహించిన అయిదుగురు మెక్సికన్ కుర్రాళ్లు ‘ఫెయిల్యూర్’కి డయాస్ ఇవ్వాలనుకున్నారు. అందుకు ఓ సంస్థను ఏర్పాటు చేశారు. దీని స్ఫూర్తితో మన హైదరాబాద్‌లోనూ ఫెయిల్యూర్ వేదిక వెలసింది. అదే ‘ఫన్ హైదరాబాద్’. ఇటీవల నగరంలోని ఓ ప్రాంతంలో ఓ కో వర్కింగ్ ప్లేస్‌లో 45 మంది సమావేశమయ్యారు. అందులో స్టూడెంట్స్ నుంచి ప్రొఫెషనల్స్ దాకా భిన్న వయసువారున్నారు. ఒకొక్కరూ వేదికనెక్కి ఆత్మీయులతో మాట్లాడుతున్నట్టు వారి మనసులో ఉన్నదంతా చెప్పుకున్నారు. అంతకుముందు వాళ్లంతా స్నేహితులు కాదు. కనీసం తెలిసిన వాళ్లూ కారు. అప్పుడే పరిచయం. వీరందరినీ కలిపిన కామన్ పాయింట్ ‘ఫెయిల్యూర్’. ఒక్క సమావేశంలోనే ఆప్తమిత్రులుగా చేసింది. గెలుపునకు లేని శక్తి ఇదే! అక్కడ చేరిన వారంతా జీవితాల్లో ఏయే దశల్లో ఓటమిని చూశారో చెప్పుకున్నారు. తమ లాంటి పరాజితులు చాలామంది ఉన్నారన్న ధైర్యాన్ని కలిగించింది. ఆ కథలను తమ విజయానికి సోపానాలుగా మార్చుకునే శక్తిని పెంచింది. ఇదీ ‘ఫన్ హైదరాబాద్’ చేసే పని. ఈ సంస్థకు నగరంలో స్థానం కల్పించింది చంద్రకాంత్ పొలిశెట్టి. ఇలా పుట్టింది.. మెక్సికో దేశంలో 2012లో ఓ సంస్థ ప్రాణం పోసుకుంది. ఈ మూడేళ్లలో 35 దేశాల్లోని వంద నగరాలకు విస్తరించింది. అలా ఈ యేడు జనవరిలో హైదరాబాద్‌కు చేరుకుంది. అయితే ఇక్కడ సంస్థ మెక్సికన్ పేరును ఇక్కడ ఉచ్చరించడానికి ఇబ్బంది పడతారని.. 'fun hydrabad' పేరుతో ప్రచారమవుతోంది. ప్రపంచంలోని ఈ సంస్థ సభ్యులు నెలకోసారి సమావేశమవుతున్నా ఇక్కడ మాత్రం మూడు నెలలకు ఓ ఈవెంట్‌ను నిర్వహిస్తున్నారు చంద్రకాంత్ అండ్ టీమ్. మొదటి ఈవెంట్‌కి 30 మంది హాజరైతే మొన్న జరిగిన రెండో ఈవెంట్‌కి 45 మంది వచ్చారు. ‘ఫన్ హైదరాబాద్’ మెక్సికన్ సంస్థ పేరుతోనే ఫేస్బుక్ పేజీ ఉంది. తమ ఫెల్యూర్ స్టోరీస్‌కి ఓ వేదిక కావాలనుకునే వారు, తమ ఓటమి కథలను ఇతరులతో పంచుకోవాలనుకునేవారు, ఇతరుల కథలను గెలుపు పాఠాలుగా మలచుకోవాలనుకునే వారంతా ఈ ఫేస్బుక్ పేజీ ద్వారా తమ పేరును రిజిష్టర్ చేయించుకుంటారు. ఇలా ఇప్పటికి నగరంలో 150 మంది నమోదయ్యారు. వీరిలో విద్యార్థులు, బిజినెస్, పారిశ్రామికవేత్తలు, రచయితలు, కళాకారులు, సాఫ్ట్వేర్ నిపుణులు.. ఇలా అన్ని రంగాలవారూ ఉన్నారు. ఓటమి గెలుపునకు తొలిమెట్టు అంటారు. ఈ సంస్థ ఆ సూత్రాన్నే ఫాలో అవుతోంది. ఈ ఆలోచన ఎందుకు వచ్చిందంటే.. ‘ఇన్ఫోసిస్‌లో సీనియర్ సిస్టమ్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నా. హైదరాబాద్‌లో స్టార్టప్ కల్చర్ బాగా పెరిగింది. ఆ ఈవెంట్స్ అన్నిటికీ అటెండ్ అయ్యేవాడిని. పార్టిసిపెంట్స్ తమ సక్సెస్ స్టోరీస్‌నే షేర్ చేసుకునేవారు. ఆ జర్నీలో ఎన్నో మలుపులు.. ఎన్నో ఫెయిల్యూర్స్ ఉంటాయి. కానీ ఆ ఫెయిల్యూర్స్‌ని ఎవరూ ప్రస్తావించేవారు కాదు. అప్పుడే ఫెయిల్యూర్‌కి ఓ వేదిక ఉండాలి.. ఆ వాయిస్‌ని వినిపించాలి అనుకున్నా. ఈ సమయంలోనే మెక్సికో సంస్థ గురించి తెలిసి సంప్రదించా. దానికి అనుబంధంగా దేశంలో మొదటిసారి హైదరాబాద్‌లో నేనే స్టార్ట్ చేశా. మామూలుగా ఇలాంటి మీటింగ్స్, ఈవెంట్స్ అన్నీ వీకెండ్స్‌కి ప్లాన్ చేసుకుంటారు. కానీ మేం గురువారం ఖాయం చేసుకున్నాం. ఎందుకంటే వీకెండ్స్‌లో ఫ్యామిలీస్‌తో ఉంటారు.. ఏవో ప్రోగ్రామ్స్ పెట్టుకుంటారు. ఆ ఒత్తిడిలో మీటింగ్స్‌కి వచ్చినా సీరియస్‌గా ఉండరు. కాబట్టి మిడ్ వీకైతే ఆసక్తిగా వస్తారని గురువారం పెట్టాం. మొదటి ఈవెంట్‌కి కేవలం మౌత్ పబ్లిసిటీతోనే 30 మంది వచ్చారు. రెండో ఈవెంట్‌కి ఫేస్బుక్ పబ్లిసిటీ పనిచేసింది. మా ఈవెంట్ గురించి తెలుసుకున్న బిట్స్ పిలానీ వాళ్లు మమ్మల్ని అప్రోచ్ అయ్యారు. రెస్పాన్స్ బాగా వస్తోంది కాబట్టి భవిష్యత్తులో ఇంకా పెద్దగా చేయాలనుకుంటున్నాం. దానికి తగ్గ స్పాన్సర్స్ కోసమూ చూస్తున్నాం. స్పీకర్స్‌గా కూడా సీనియర్ మోస్ట్ పీపుల్ వచ్చే అవకాశం ఉంది’ అని చెప్పారు చంద్రకాంత్. -
ఉప్పు.. పప్పు.. బియ్యం...నెట్ నుంచి నట్టింటికి..
- క్లిక్ కొడితే కిరాణా సరుకులు సిద్ధం - నగరంలో నయా వ్యాపారం - అందుబాటులోకి ‘ఆన్లైన్ గ్రాసరీస్’ ‘ఆన్లైన్’లో దొరకని వస్తువు లేదు.. అందని సేవలు లేవు.. ఒక్క క్లిక్ కొడితే ఎలాంటి వస్తువైనా ముంగిట్లోకి వచ్చేస్తుంది. ఇలాంటి వాటిలో ఇప్పుడు గృహిణికి కావాల్సిన ‘కిరాణా సరుకులు’ కూడా చేరిపోయాయి. ఇందుకు ‘ఆన్లైన్ గ్రాసరీస్’ వేదికగా నిలుస్తోంది. సిటీకి చెందిన విక్రమ్ చక్రవర్తి ఈ ఆన్లైన్ సేవలను హైదరాబాద్ వాసులకు పరిచయం చేశారు. కూర్చున్న చోటుకే సకల వస్తువులు తెచ్చుకునే ట్రెండ్ పెరుగుతుండడంతో అన్నింటికీ ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చే అలవాటు వచ్చేసింది. విదేశాల్లో ఎక్కువగా కనిపించే ఈ మాదిరి సీన్.. ఇప్పుడు మన సిటీలోనూ విస్తరిస్తోంది. ‘అమెరికాలో ఉద్యోగ జీవితంలో ఎప్పుడూ బిజీగా ఉండే అక్కడివారు ఆన్లైన్ ద్వారా బుక్ చేస్తే ఇంటికి అవసరమయ్యే ప్రతి సామాను డెలివరీ చేస్తారు. కస్టమర్ల టైమ్‌ను సేవ్ చేస్తుంటాయి వందలసంఖ్యలో సంస్థలు. పెద్దగా ట్రాఫిక్ ఇబ్బందులు కూడా తప్పుతాయి. ఈ ట్రెండ్‌ను గమనించిన విక్రమ్ http://www.callgroceries.com వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. ఇంటికి అవసరమయ్యే క్వాలిటీ కిరాణా సామాను ఆన్లైన్ ద్వారానే బుక్ చేసుకునే సౌకర్యాన్ని కల్పించారు. తాజా కూరగాయాలను సైతం ఆర్డర్ ఇచ్చే విధంగా రూపకల్పన చేశారు. గృహిణుల కోసం కాల్‌సెంటర్ మన సిటీలో దాదాపు 70 శాతం మంది గృహిణులు ఇంటి పనులను చూసుకుంటున్నారు. నెలకు సరిపడా ఇంటి సామాను తీసుకొద్దామన్నా ఈ భాగ్యనగరంలో వారికి వీలులేకుండా పోతుంది. సమీపంలో కిరాణా దుకాణాలున్నా అనుకున్న బ్రాండ్ సామాను దొరకదు. ఒకచోట ఒక వస్తువు.. ఇంకోచోట ఇతర వస్తువులు కొనాల్సి వస్తుంది. ఇలాంటప్పుడు వారికి షాపింగ్ చేయడం గగనమవుతుంది. అవసరమయ్యే ప్రతి వస్తువు చీటీపై రాసి భర్తకు ఇచ్చినా.. ఉద్యోగ బిజీలో ఉండటం వల్ల షాపింగ్ విషయాన్ని వాళ్లు వాయిదా వేస్తుంటారు. ఒకవేళ వెళ్లినా ట్రాఫిక్ తిప్పలు.. పార్కింగ్ సమస్య తప్పవు. ఇలాంటి సమస్యలు లేకుండా కావాల్సిన అన్ని సరుకులను ఇంటికి అందిస్తోంది కాల్‌గ్రాసరీస్ వెబ్సైట్. అయితే, గృహిణులందరికీ ఆన్‌లైన్‌పై అంతగా నాలెడ్జ్ లేకపోవడంతో ‘కాల్ సెంటర్’ (7893939393) ను అందుబాటులోకి తెచ్చారు. ఎప్పుడు కాల్ చేసినా 24 గంటల్లోపు వారి ఇంటికి కిరాణా సామాను చేరుస్తామంటున్నారు విక్రమ్ చక్రవర్తి. నాగోల్‌లో తమ సంస్థ కార్యకలాపాలున్నా సిటీ నలువైపుల నుంచి ఆన్లైన్ ఆర్డర్లతో పాటు కాల్స్ భారీగానే వస్తున్నాయని తెలిపారు. లింగంపల్లి, పటాన్చెరువు, జీడిమెట్ల, బాలానగర్, మేడ్చల్, రాజేంద్రనగర్, ఉప్పల్, దిల్సుఖ్నగర్, వనస్థలిపురం.. ఇలా అన్ని ప్రాంతాల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోందని, ఆర్డర్ రాగానే తమ సిబ్బంది డోర్ డెలివరీ చేస్తున్నారన్నారు. అందుబాటులో నెలవారీ ప్యాకేజీ నెలకు సరిపడా సరుకులను రూ. 1,499 కే అందిస్తోంది ఈ కాల్ గ్రాసర్సీ వెబ్సైట్. ఇందులో పప్పు, చక్కెర, ఇడ్లీ రవ్వ, గోధుమ రవ్వ, బొంబాయి రవ్వ, గోధుమ, జీరా, ఆవాలు, పుట్నాలు, పల్లీలు, ఆయిల్, చింతపండు, సబ్బులు, పేస్టులు.. ఇలా 30 ఐటమ్స్‌తో ఆఫర్ ఇస్తున్నట్టు విక్రమ్ తెలిపారు. దీంతో పాటు ప్రత్యేక డిస్కౌంట్లు సైతం ఇస్తున్నట్టు చెప్పుకొచ్చారు. తాజా కూరగాయలతో పాటు స్వీట్లు, పచ్చళ్లు కూడా అందిస్తున్నామని, ప్రతి కస్టమర్‌కు బెస్ట్ సేవలు అందించడమే తమ లక్ష్యమన్నారు. -
నో మోర్ సైలెన్స్
ఆటపాటలు, స్టేజ్ షోలు..వీటితో పాటు తొలిసారి ‘ఎల్జీబీటీ’ కళాకారులు చిత్రించిన బొమ్మలూ కొలువుదీరాయి. ప్రతి పాట..ఆట.. ప్రతి చిత్రం.. వాళ్ల జీవనశైలిని గౌరవించమని చెబుతున్నవే!. ఈ వేడుక కేవలం జెండర్ మైనారిటీల కోసమే నిర్వహించింది కాదు. వాళ్ల ఉనికిని హేళన చేస్తున్న సమాజం కోసం కూడా! వాళ్లను అర్థం చేసుకునే వేదికైంది!. అందుకే ఆ ఆవరణలో ఓ తల్లి కనిపించింది కొడుకు (గే)కి అండగా, ఓ అక్క వచ్చింది చెల్లి (ట్రాన్స్‌జెండర్)కి తోడుగా, ఓ స్నేహితురాలు హాజరైంది తోటి స్నేహితురాలి (బై సెక్సువల్)కి మద్దతుగా, తండ్రీ ఉన్నాడు కూతురు కోసం (లెస్బియన్).. ఆశ్చర్యంగా నిశ్శబ్దం బద్దలైంది.. చర్చ మొదలైంది ఓ తల్లి నుంచే!. మేమున్నాం.. ‘నేనో ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాను. నాకు ఒక్కడే కొడుకు. వాడు డాక్టర్. తను ‘గే’ అనేది తను ఎంబీబీఎస్ చదువుతున్నప్పుడు తెలిసింది. వినగానే నేనేమీ కుంగిపోలేదు. ‘ఓకే నాన్నా.. డోంట్‌వర్రీ..’ అన్నాను. కౌన్సెలింగ్‌కి ఒప్పించాను. తర్వాత ఇంటర్నెట్లో, ఇంగ్లిష్ మ్యాగజైన్స్‌లో ఎల్జీబీటీ గురించి సమాచారం తెలుసుకున్నాక తనను అర్థం చేసుకోవడం మొదలుపెట్టాను. అయితే నా ప్రవర్తనకు మా అబ్బాయి ఆశ్చర్యపోయాడు. ‘అమ్మేంటి? నేను చెప్పింది విని అరుస్తుంది, ఏడుస్తుంది అనుకుంటే ఇంతలా నాకు సపోర్ట్ చేస్తుంది’ అని. కొన్నాళ్లకి మావారికీ నెమ్మదిగా విషయం చెప్పాను. అతనూ అర్థం చేసుకున్నాడు. తప్పు మా పిల్లాడిది కాదు కదా!. వాడి బర్త్ అలా ఉన్నప్పుడు మా అబ్బాయినెందుకు శిక్షించాలి? పైగా వీళ్లు సమాజంలో ఎవరినీ ఇబ్బంది పెట్టట్లేదు. వాళ్ల బతుకేదో వాళ్లు బతుకున్నారు. ఇది పూర్తిగా కుటుంబ విషయం. రేపొద్దున్న నా కొడుకు ఇంకో అబ్బాయితో సహజీవనం చేసినా మాకు సమ్మతమే. ఇలాంటి పిల్లల్ని ముందు తల్లిదండ్రులే అర్థం చేసుకోవాలి. అప్పుడే సమాజమూ వాళ్లను గౌరవిస్తుంది’ అంటూ తన గళమిప్పింది ఆ అమ్మ. ముందు మాట్లాడలేదు.. జర్నలిజం అండ్ సైకాలజీలో గ్రాడ్యుయేషన్ చేస్తున్న అమృతా లారెన్స్ అయితే- ‘నేను బై సెక్సువల్‌ని. ఇంటర్లో ఉన్నప్పుడు నా సెక్సువాలిటీ ఏంటో తెలియక చాలా స్ట్రగుల్ అయ్యాను. అబ్బాయిలను చూస్తే ఎలాంటి ఫీలింగ్స్ కలిగేవో, అమ్మాయిలను చూసినా అలాంటి ఫీలింగ్సే కలిగేవి. చదువుని నెగ్లెక్ట్ చేశాను. ఆ టైమ్‌లోనే లండన్‌లో ఉన్న నా ఫ్రెండ్ జెన్నిఫర్‌తో నా పరిస్థితి గురించి డిస్కస్ చేశాను. అప్పుడు నా మెదడు చేసే అలజడిని ఏమంటారో తెలిసింది. నా ఉనికేంటో అర్థమైంది. ఏదైనా బతకాలని ధైర్యం తెచ్చుకున్నాను. చదువు మీద శ్రద్ధ పెట్టాను. డిగ్రీ ఫస్టియర్ ఎండింగ్లో నాన్నకు చెప్పాను. అప్పటికే అమ్మ చనిపోయింది. నేను చెప్పింది విన్న నాన్న రెండు రోజులు నాతో మాట్లాడలేదు. తర్వాత- ‘నువ్వేంటో నీకు తెలుసు కాబట్టి.. ఎలా ఉండాలో కూడా తెలుసుకున్నావ్ కాబట్టి తండ్రిగా నా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది. కానీ ఏం చేయాలనుకున్నా చెప్పి చెయ్. ఏదీ దాచొద్దు’ అని చెప్పాడు. ఆ రెండు రోజులు నాన్న నాలాంటి వాళ్ల గురించిన సమాచారం తెలుసుకున్నాడు. మాకు ఎలాంటి సపోర్ట్ కావాలో అర్థం చేసుకున్నాడు. బయట కూడా నా గురించి దాచను. నచ్చిన వాళ్లు నాతో ఉంటారు. నచ్చని వాళ్లు తప్పుకుంటారు. కొంతమంది మాటలతో పించ్ చేస్తుంటారు. ఇవేమీ పట్టించుకోను. నేనో మంచి రైటర్ని కావాలి, అంతకన్నా గొప్ప ఫొటో జర్నలిస్ట్‌ని కావాలి, నాకు నచ్చినట్టు బతకాలి.. ఇవే నా లక్ష్యాలు’ అని చెబుతుంది ఎంతో నిర్భయంగా. వాళ్లూ మనలాంటి మనుషులే.. సమాజంలో రకరకాల మనుషులున్నారు. జెండర్ మైనారిటీస్ను గౌరవంగా చూడడమనేది యూత్ నుంచే మొదలవ్వాలి. యూతే భావి నిర్ణేతలు కాబట్టి.. వాళ్ల ఆలోచనల్లో మార్పు రావాలి. వాళ్ల వల్ల ఇతరులకు ఇబ్బంది లేనప్పుడు సొసైటీ నుంచి వాళ్లనెందుకు ఐసోలేట్ చేయాలి? వాళ్ల ఆత్మగౌరవాన్నెందుకు కించపర్చాలి? వాళ్లకూ మనసుంది, మనం గౌరవించాలి. - ప్రాప్తి, సెయింట్ జోసెఫ్స్ కాలేజ్ శ్రేయస్సు కాంక్షిస్తున్నారు.. జెండర్ మైనారిటీస్కున్న స్కిల్స్, వ్యక్తిత్వాలు ఎంత అద్భుతమైనవో చాటేందుకు నిర్వహిస్తున్నదే ఈ కార్నివాల్. ఆర్ట్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్‌లో వాళ్లకున్న ప్రావీణ్యం, వాళ్లు ఎలాంటి లైఫ్‌ని లీడ్ చేస్తున్నారో ఈ ఉత్సవంలో పాల్గొంటే తెలుస్తుంది. వాళ్లు అనాథ పిల్లలకు చదువులు చెప్పిస్తున్నారు, వైద్య సేవలందిస్తున్నారు. జెండర్ మైనారిటీస్‌కి, సమాజానికి మధ్య ఉన్న అంతరాన్ని చెరిపేయడానికే ఈ వేడుకను నిర్వహిస్తున్నాం. కిందటేడు ఎల్జీబీటీస్ కన్నా మిగిలినవాళ్లే ఎక్కువొచ్చారు. ఇప్పుడూ అదే రెస్పాన్స్. - నవదీప్, కార్నివాల్ నిర్వహణలో భాగస్వామి క్వీర్ క్యాంపస్ నేపథ్యమిదీ.. లెస్బియన్, గే, బై సెక్సువల్, ట్రాన్స్‌జెండర్.. వాళ్లూ మనుషులే. వారికీ ఆత్మ గౌరవం ఉంటుంది. అది వారి ప్రాథమిక హక్కు. వారికి మిగిలిన సమాజానికి మధ్య దూరాన్ని తగ్గించేందుకు పుట్టిందే క్వీర్ క్యాంపస్. చాన్నాళ్ల కిందట ఇది జర్మనీలో మొదలైంది. ఆపై దిల్లీ, కోల్‌కతా, ముంబై నగరాలను దాటి కిందటేడాది హైదరాబాద్ చేరుకుంది. ఇక్కడిది ఊపిరిపోసుకోవడానికి ఆద్యులు అభి, సత్య అనే యువకులు. ‘మా గళం వినిపించడానికి ఓ వేదిక కావాలి. మనసులో మాటను ఆటపాటగా అందిస్తే అందరికీ చేరుతుంది. ఆలోచనలు రేకెత్తిస్తుంది. అలా మా ఉనికి పోరాటాన్ని గౌరవప్రదంగా మలచడానికి, దాని గురించి అందరికీ అవగాహన కల్పించడానికి అప్పటికే మనుగడలో ఉన్న ఈ క్వీర్ క్యాంపస్‌ను డయాస్‌గా మలచుకోవాలనుకుని నిరుడు క్వీర్ క్యాంపస్ హైదరాబాద్‌ను స్టార్ట్ చేశాం. త్వరలో ఇతర పట్టణాలకు, ఊళ్లకూ స్ప్రెడ్ చేయాలనుకుంటున్నాం’ అని చెబుతాడు అభి. - సరస్వతి రమ -
ఫన్టాస్టాటిక్ డే
ప్రపంచవ్యాప్తంగా మెజారిటీ జనాలు మందేసి, విందేసి, చిందేసి మజా చేసే ‘ఫన్’టాస్టిక్ డే డిసెంబర్ 31. ఇయరెండింగ్లో ఏడాది పొడవునా అనుభవించిన బాధలన్నింటినీ బాటిల్లో దించేసి, హ్యాపీగా న్యూఇయర్‌కు స్వాగతం చెప్పడానికి ‘మందు’భాగ్యులందరూ ఈ రోజు కోసం డిసెంబర్ మొదటి వారం నుంచే చకోరాల్లా ఎదురు చూస్తుంటారు. న్యూ ఇయర్ ఈవ్గానే డిసెంబర్ 31 పాపులరైనా, ఇదేరోజును ‘మేకప్ యువర్ మైండ్ డే’గా కొందరు, ‘అన్‌లక్కీ డే’గా ఇంకొందరు, ‘నో ఇంటరప్షన్ డే’గా మరికొందరు జరుపుకోవడం కూడా ఆనవాయితీగా వస్తోంది. రోమన్ కేథలిక్‌లు ఈ రోజును సెయింట్స్ గౌరవార్థం ‘ఆల్ సెయింట్స్ డే’గా పాటిస్తారు. వీటికి తోడుగా కొందరు సాధుజీవులు ‘వరల్డ్ పీస్ మెడిటేషన్ డే’ను దాదాపు రెండు దశాబ్దాల కిందట ప్రపంచానికి పరిచయం చేశారు. ఇవన్నీ సరే, ఇదే రోజును ప్రపంచ తాగుబోతుల దినంగా ప్రకటించాలని మందెరుగని మందభాగ్యుల డిమాండ్. ఎవరేమన్నను... ఎవరేమన్నా, ఏమైనా అనుకున్నా.. జానేదేవ్ అనుకునే సగటు హైదరాబాదీ మాత్రం జోరుగా, హుషారుగా ‘పదండి మందుకు.. పదండి మందుకు..’ అంటూ కొత్త సంవత్సరానికి ఘనస్వాగతం పలికేందుకు ఇప్పటికే సన్నాహాలు ప్రారంభించాడు. హైదరాబాదీల హంగామాకు హోరెత్తుతున్న న్యూఇయర్ ఈవెంట్ల ప్రచారమే నిదర్శనం. క్లబ్బులు, పబ్బులు, రెస్టారెంట్లు, బార్లు భారీ ‘మందో’ బస్తును సిద్ధం చేసుకుంటున్నాయి. వేడుక అన్న తర్వాత ఖానా, పీనా షరామామూలే! అయితే, న్యూ ఇయర్ వేడుకలో ఖానా, పీనాలకు తోడుగా గానా బజానాలకూ సమ ప్రాధాన్యం ఇవ్వడం ‘సిటీ’జనుల తెహజీబ్. ఈసారి కూడా నగరంలో గానా బజానా కార్యక్రమాలు లెక్కకు మిక్కిలిగానే ఏర్పాటవుతున్నాయి. ఇవన్నీ సహజ భోగలాలసులైన కళాపోషకుల ఏర్పాట్లు. ఇది ఒకవైపు దృశ్యం మాత్రమే. నాణేనికి మరోవైపు లాగానే నగరానికీ మరోవైపు ఉంటుంది. దాన్ని దర్శిస్తే... చాలామంది ‘మేకప్ యువర్ మైండ్ డే’ అని గుర్తు తెచ్చుకుని, కొత్త సంవత్సరంలో తీసుకోబోయే తీర్మానాల కోసం సన్నద్ధులవుతారు. అయ్యప్ప స్వాముల సీజన్ కూడా కావడంతో భజన కార్యక్రమాలు న్యూఇయర్ సందడికి ఆధ్యాత్మికతను అద్దుతాయి. ఇక పండుగ వాతావరణాన్ని చూడటమే తప్ప, పండుగ చేసుకోలేని నిరుపేదల సాయం కోసం కొందరు చారి‘టీ’ పార్టీలనూ నిర్వహిస్తారు. మొత్తమ్మీద న్యూఇయర్ వేడుకలను హరివిల్లంత వైవిధ్యభరితంగా జరుపుకొనేందుకు హైదరాబాదీలంతా సర్వసన్నద్ధంగా ఉన్నారు. - పన్యాల జగన్నాథదాసు