ఉప్పు.. పప్పు.. బియ్యం...నెట్ నుంచి నట్టింటికి..
- క్లిక్ కొడితే కిరాణా సరుకులు సిద్ధం
- నగరంలో నయా వ్యాపారం
- అందుబాటులోకి ‘ఆన్‌లైన్ గ్రాసరీస్’
‘ఆన్‌లైన్’లో దొరకని వస్తువు లేదు.. అందని సేవలు లేవు.. ఒక్క క్లిక్ కొడితే ఎలాంటి వస్తువైనా ముంగిట్లోకి వచ్చేస్తుంది. ఇలాంటి వాటిలో ఇప్పుడు గృహిణికి కావాల్సిన ‘కిరాణా సరుకులు’ కూడా చేరిపోయాయి. ఇందుకు ‘ఆన్‌లైన్ గ్రాసరీస్’ వేదికగా నిలుస్తోంది.
సిటీకి చెందిన విక్రమ్ చక్రవర్తి ఈ ఆన్‌లైన్ సేవలను హైదరాబాద్ వాసులకు పరిచయం చేశారు. కూర్చున్న చోటుకే సకల వస్తువులు తెచ్చుకునే ట్రెండ్ పెరుగుతుండడంతో అన్నింటికీ ఆన్‌లైన్‌లో ఆర్డర్ ఇచ్చే అలవాటు వచ్చేసింది.
విదేశాల్లో ఎక్కువగా కనిపించే ఈ మాదిరి సీన్.. ఇప్పుడు మన సిటీలోనూ విస్తరిస్తోంది. ‘అమెరికాలో ఉద్యోగ జీవితంలో ఎప్పుడూ బిజీగా ఉండే అక్కడివారు ఆన్‌లైన్ ద్వారా బుక్ చేస్తే ఇంటికి అవసరమయ్యే ప్రతి సామాను డెలివరీ చేస్తారు. కస్టమర్ల టైమ్‌ను సేవ్ చేస్తుంటాయి వందలసంఖ్యలో సంస్థలు. పెద్దగా ట్రాఫిక్ ఇబ్బందులు కూడా తప్పుతాయి. ఈ ట్రెండ్‌ను గమనించిన విక్రమ్ http://www.callgroceries.com వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. ఇంటికి అవసరమయ్యే క్వాలిటీ కిరాణా సామాను ఆన్‌లైన్ ద్వారానే బుక్ చేసుకునే సౌకర్యాన్ని కల్పించారు. తాజా కూరగాయాలను సైతం ఆర్డర్ ఇచ్చే విధంగా రూపకల్పన చేశారు.
గృహిణుల కోసం కాల్‌సెంటర్
మన సిటీలో దాదాపు 70 శాతం మంది గృహిణులు ఇంటి పనులను చూసుకుంటున్నారు. నెలకు సరిపడా ఇంటి సామాను తీసుకొద్దామన్నా ఈ భాగ్యనగరంలో వారికి వీలులేకుండా పోతుంది. సమీపంలో కిరాణా దుకాణాలున్నా అనుకున్న బ్రాండ్ సామాను దొరకదు. ఒకచోట ఒక వస్తువు.. ఇంకోచోట ఇతర వస్తువులు కొనాల్సి వస్తుంది. ఇలాంటప్పుడు వారికి షాపింగ్ చేయడం గగనమవుతుంది. అవసరమయ్యే ప్రతి వస్తువు చీటీపై రాసి భర్తకు ఇచ్చినా.. ఉద్యోగ బిజీలో ఉండటం వల్ల షాపింగ్ విషయాన్ని వాళ్లు వాయిదా వేస్తుంటారు. ఒకవేళ వెళ్లినా ట్రాఫిక్ తిప్పలు.. పార్కింగ్ సమస్య తప్పవు. ఇలాంటి సమస్యలు లేకుండా కావాల్సిన అన్ని సరుకులను ఇంటికి అందిస్తోంది కాల్‌గ్రాసరీస్ వెబ్‌సైట్.
అయితే, గృహిణులందరికీ ఆన్‌లైన్‌పై అంతగా నాలెడ్జ్ లేకపోవడంతో ‘కాల్ సెంటర్’ (7893939393) ను అందుబాటులోకి తెచ్చారు. ఎప్పుడు కాల్ చేసినా 24 గంటల్లోపు వారి ఇంటికి కిరాణా సామాను చేరుస్తామంటున్నారు విక్రమ్ చక్రవర్తి. నాగోల్‌లో తమ సంస్థ కార్యకలాపాలున్నా సిటీ నలువైపుల నుంచి ఆన్‌లైన్ ఆర్డర్లతో పాటు కాల్స్ భారీగానే వస్తున్నాయని తెలిపారు. లింగంపల్లి, పటాన్‌చెరువు, జీడిమెట్ల, బాలానగర్, మేడ్చల్, రాజేంద్రనగర్, ఉప్పల్, దిల్‌సుఖ్‌నగర్, వనస్థలిపురం.. ఇలా అన్ని ప్రాంతాల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోందని, ఆర్డర్ రాగానే తమ సిబ్బంది డోర్ డెలివరీ చేస్తున్నారన్నారు.
అందుబాటులో నెలవారీ ప్యాకేజీ
నెలకు సరిపడా సరుకులను రూ. 1,499 కే అందిస్తోంది ఈ కాల్ గ్రాసర్సీ వెబ్‌సైట్. ఇందులో పప్పు, చక్కెర, ఇడ్లీ రవ్వ, గోధుమ రవ్వ, బొంబాయి రవ్వ, గోధుమ, జీరా, ఆవాలు, పుట్నాలు, పల్లీలు, ఆయిల్, చింతపండు, సబ్బులు, పేస్టులు.. ఇలా 30 ఐటమ్స్‌తో ఆఫర్ ఇస్తున్నట్టు విక్రమ్ తెలిపారు. దీంతో పాటు ప్రత్యేక డిస్కౌంట్లు సైతం ఇస్తున్నట్టు చెప్పుకొచ్చారు. తాజా కూరగాయలతో పాటు స్వీట్లు, పచ్చళ్లు కూడా అందిస్తున్నామని, ప్రతి కస్టమర్‌కు బెస్ట్ సేవలు అందించడమే తమ లక్ష్యమన్నారు.