ఫన్‌టాస్టాటిక్ డే
ప్రపంచవ్యాప్తంగా మెజారిటీ జనాలు మందేసి, విందేసి, చిందేసి మజా చేసే ‘ఫన్’టాస్టిక్ డే డిసెంబర్ 31. ఇయరెండింగ్‌లో ఏడాది పొడవునా అనుభవించిన బాధలన్నింటినీ బాటిల్‌లో దించేసి, హ్యాపీగా న్యూఇయర్‌కు స్వాగతం చెప్పడానికి ‘మందు’భాగ్యులందరూ ఈ రోజు కోసం డిసెంబర్ మొదటి వారం నుంచే చకోరాల్లా ఎదురు చూస్తుంటారు. న్యూ ఇయర్ ఈవ్‌గానే డిసెంబర్ 31 పాపులరైనా, ఇదేరోజును ‘మేకప్ యువర్ మైండ్ డే’గా కొందరు, ‘అన్‌లక్కీ డే’గా ఇంకొందరు, ‘నో ఇంటరప్షన్ డే’గా మరికొందరు జరుపుకోవడం కూడా ఆనవాయితీగా వస్తోంది. రోమన్ కేథలిక్‌లు ఈ రోజును సెయింట్స్ గౌరవార్థం ‘ఆల్ సెయింట్స్ డే’గా పాటిస్తారు. వీటికి తోడుగా కొందరు సాధుజీవులు ‘వరల్డ్ పీస్ మెడిటేషన్ డే’ను దాదాపు రెండు దశాబ్దాల కిందట ప్రపంచానికి పరిచయం చేశారు. ఇవన్నీ సరే, ఇదే రోజును ప్రపంచ తాగుబోతుల దినంగా ప్రకటించాలని మందెరుగని మందభాగ్యుల డిమాండ్.
ఎవరేమన్నను...
ఎవరేమన్నా, ఏమైనా అనుకున్నా.. జానేదేవ్ అనుకునే సగటు హైదరాబాదీ మాత్రం జోరుగా, హుషారుగా ‘పదండి మందుకు.. పదండి మందుకు..’ అంటూ కొత్త సంవత్సరానికి ఘనస్వాగతం పలికేందుకు ఇప్పటికే సన్నాహాలు ప్రారంభించాడు. హైదరాబాదీల హంగామాకు హోరెత్తుతున్న న్యూఇయర్ ఈవెంట్ల ప్రచారమే నిదర్శనం. క్లబ్బులు, పబ్బులు, రెస్టారెంట్లు, బార్లు భారీ ‘మందో’ బస్తును సిద్ధం చేసుకుంటున్నాయి. వేడుక అన్న తర్వాత ఖానా, పీనా షరామామూలే! అయితే, న్యూ ఇయర్ వేడుకలో ఖానా, పీనాలకు తోడుగా గానా బజానాలకూ సమ ప్రాధాన్యం ఇవ్వడం ‘సిటీ’జనుల తెహజీబ్. ఈసారి కూడా నగరంలో గానా బజానా కార్యక్రమాలు లెక్కకు మిక్కిలిగానే ఏర్పాటవుతున్నాయి. ఇవన్నీ సహజ భోగలాలసులైన కళాపోషకుల ఏర్పాట్లు.
ఇది ఒకవైపు దృశ్యం మాత్రమే. నాణేనికి మరోవైపు లాగానే నగరానికీ మరోవైపు ఉంటుంది. దాన్ని దర్శిస్తే... చాలామంది ‘మేకప్ యువర్ మైండ్ డే’ అని గుర్తు తెచ్చుకుని, కొత్త సంవత్సరంలో తీసుకోబోయే తీర్మానాల కోసం సన్నద్ధులవుతారు. అయ్యప్ప స్వాముల సీజన్ కూడా కావడంతో భజన కార్యక్రమాలు న్యూఇయర్ సందడికి ఆధ్యాత్మికతను అద్దుతాయి. ఇక పండుగ వాతావరణాన్ని చూడటమే తప్ప, పండుగ చేసుకోలేని నిరుపేదల సాయం కోసం కొందరు చారి‘టీ’ పార్టీలనూ నిర్వహిస్తారు. మొత్తమ్మీద న్యూఇయర్ వేడుకలను హరివిల్లంత వైవిధ్యభరితంగా జరుపుకొనేందుకు హైదరాబాదీలంతా సర్వసన్నద్ధంగా ఉన్నారు.
- పన్యాల జగన్నాథదాసు