Roman Catholic
-
సినాడ్ అండర్ సెక్రటరీగా మహిళ
వాటికన్ సిటీ: రోమన్ క్యాథలిక్కుల గురువు పోప్ ఫ్రాన్సిస్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. సంప్రదాయాన్ని పక్కనబెట్టి కీలకమైన సినాడ్ (బిషప్పుల మహాసభ) అండర్ సెక్రటరీ పదవికి మొట్టమొదటిసారిగా మహిళను ఎంపిక చేశారు. ఆమెకు ఓటింగ్ హక్కులను కూడా కల్పించారు. కొత్తగా నియమితులైన ఇద్దరు అండర్ సెక్రటరీల్లో ఒకరు స్పెయిన్‌కు చెందిన లూయిస్ మారిన్ డీ సాన్ మార్టిన్ కాగా, మరొకరు ఫ్రాన్సుకు చెందిన సిస్టర్ నథాలీ బెకార్ట్(51) కావడం గమనార్హం. క్రైస్తవ మతంలో సిద్ధాంతపరంగా తలెత్తే ప్రధాన ప్రశ్నలపై సినాడ్ అధ్యయనం చేస్తుంది. సినాడ్‌లో బిషప్పులు, కార్డినల్స్ తోపాటు నిపుణులు కూడా ఉంటారు. వీరిలో బిషప్పులు, కార్డినల్స్కు మాత్రమే ఓటింగ్ హక్కులుంటాయి. అండర్ సెక్రటరీగా నియమితురాలైన బెకార్ట్‌కు కూడా ఓటింగ్ హక్కు కల్పించారు. చర్చికి సంబంధించిన విషయాల్లో సూక్ష్మపరిశీలన, నిర్ణయాలు తీసుకోవడంలో మహిళలు కీలకంగా మారాలన్న పోప్ ఫ్రాన్సిస్ ఆకాంక్ష మేరకు ఈ నియామకం జరిగిందని సినాడ్ సెక్రటరీ జనరల్ కార్డినల్ మరియో గ్రెక్ తెలిపారు. ‘గతంలో నిపుణులుగా, పరిశీల కులుగా మాత్రమే మహిళలు సినాడ్‌లో ఉండే వారు. సిస్టర్ బెకార్ట్ ఎంపికతో మహిళలు ఓటింగ్ ప్రక్రియలో పాల్గొనేందుకు కూడా అవకాశం కలిగింది’అని ఆయన పేర్కొన్నారు. ఫ్రాన్సు లోని జేవియర్ సిస్టర్స్ సంస్థ సభ్యురాలైన బెకార్ట్, ప్యారిస్‌లోని ప్రఖ్యాత హెచ్ఈసీ బిజినెస్ స్కూల్ నుంచి మేనేజ్మెంట్లో డిగ్రీ పొందారు. బోస్టన్ యూనివర్సిటీలో కూడా ఆమె అధ్యయనం చేశారు. 2019 నుంచి సినాడ్‌కు కన్సల్టెంట్‌గా కొనసాగుతున్నారు. కాగా, సినాడ్ తరువాతి సమావేశం 2022లో జరగనుంది. 2019లో అమెజాన్‌పై ఏర్పడిన ప్రత్యేక సినాడ్ సమావేశానికి 35 మంది మహిళా ఆడిటర్లను ఆహ్వానించినప్పటికీ వారెవరికీ ఓటింగ్ హక్కులు ఇవ్వలేదు. -
ఇండోనేషియాలో విరుచుకుపడ్డ ఉగ్రవాదులు
-
ఇండోనేసియాలో ఉగ్రదాడి
సురబయ: ఇండోనేసియాపై ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు. దేశంలోని రెండో అతిపెద్ద నగరమైన సురబయలోని మూడు చర్చిలపై ఆత్మాహుతిదళ ఉగ్రవాదుల దాడిలో 13 మంది మృతిచెందగా.. 41 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో ఓ మహిళ, ఓ చిన్నారి కూడా ఉన్నారు. ఇండోనేసియాలో మైనారిటీలైన క్రిస్టియన్లపై కొంతకాలంగా దాడులు జరుగుతున్నప్పటికీ.. 2000 తర్వాత వీరిపై ఉగ్రదాడి జరగటం ఇదే తొలిసారని స్థానిక పోలీసులు పేర్కొన్నారు. సురబయలోని సాంటామారియా రోమన్ కేథలిక్ చర్చిపై ఉదయం 7.30 గంటలకు (స్థానిక కాలమానం ప్రకారం) తొలిదాడి జరిగింది. ఇద్దరు ఆత్మాహుతి దళ సభ్యులతోపాటు నలుగురు మృతిచెందారు. ఇది జరిగిన కొద్ది నిమిషాల్లోనే సమీపంలోని క్రిస్టియన్ చర్చ్ ఆఫ్ డిపొనెగొరోలో రెండో ఉగ్రదాడి జరిగింది. వెంటనే మాంగెరలోని పెంతెకోస్ట్ చర్చ్‌పై ఉగ్రవాదులు దాడిచేశారు. ఘటన గురించి తెలియగానే ఇండోనేసియా అధ్యక్షుడు జోకో విడోడో సురబయ చేరుకుని బాధితులకు అందుతున్న వైద్యసేవలను సమీక్షించారు. ఈ ఘటనకు తామే బాధ్యులమని ఐసిస్ పేర్కొంది. ఉగ్రవాదులంతా ఒకే కుటుంబం వారే ఈ మూడు దాడుల్లో ఆరుగురు ఆత్మాహుతి బాంబర్లు పాల్గొన్నారని పోలీసులు తెలిపారు. దాడులకు పాల్పడిన ఆరుగురు ఒకే కుటుంబానికి చెందిన వారని.. ఇందులో ఇద్దరు బాలికలు కూడా ఉన్నారని పోలీసులు వెల్లడించారు. తల్లిదండ్రులతోపాటు ఇద్దరు కూతుళ్లు (9, 12 ఏళ్లు), ఇద్దరు యువకులు ఈ దాడిలో పాల్గొన్నారని వెల్లడించారు. ఈ కుటుంబమంతా ఇటీవలే సిరియానుంచి తిరిగి వచ్చిందని స్థానిక మీడియా పేర్కొంది. నలుగురు ఉగ్రవాదుల కాల్చివేత ఆదివారం తెల్లవారుజామున వెస్ట్ జావా టౌన్స్‌లో నలుగురు అనుమానిత ఉగ్రవాదులను పోలీసులు కాల్చిచంపారు. మరో ఇద్దరిని అరెస్టు చేశారు. అయితే ఈ ఘటనకు నిరసనగానే దాడి జరిగి ఉంటుందా? అనే విషయంపై ఇంకా స్పష్టత లేదు. అరెస్టయిన వారు ఇండోనేసియాలో దాడులకు పాల్పడుతున్న జేఏడీ సభ్యులని సమాచారం. -
ఫన్టాస్టాటిక్ డే
ప్రపంచవ్యాప్తంగా మెజారిటీ జనాలు మందేసి, విందేసి, చిందేసి మజా చేసే ‘ఫన్’టాస్టిక్ డే డిసెంబర్ 31. ఇయరెండింగ్లో ఏడాది పొడవునా అనుభవించిన బాధలన్నింటినీ బాటిల్లో దించేసి, హ్యాపీగా న్యూఇయర్‌కు స్వాగతం చెప్పడానికి ‘మందు’భాగ్యులందరూ ఈ రోజు కోసం డిసెంబర్ మొదటి వారం నుంచే చకోరాల్లా ఎదురు చూస్తుంటారు. న్యూ ఇయర్ ఈవ్గానే డిసెంబర్ 31 పాపులరైనా, ఇదేరోజును ‘మేకప్ యువర్ మైండ్ డే’గా కొందరు, ‘అన్‌లక్కీ డే’గా ఇంకొందరు, ‘నో ఇంటరప్షన్ డే’గా మరికొందరు జరుపుకోవడం కూడా ఆనవాయితీగా వస్తోంది. రోమన్ కేథలిక్‌లు ఈ రోజును సెయింట్స్ గౌరవార్థం ‘ఆల్ సెయింట్స్ డే’గా పాటిస్తారు. వీటికి తోడుగా కొందరు సాధుజీవులు ‘వరల్డ్ పీస్ మెడిటేషన్ డే’ను దాదాపు రెండు దశాబ్దాల కిందట ప్రపంచానికి పరిచయం చేశారు. ఇవన్నీ సరే, ఇదే రోజును ప్రపంచ తాగుబోతుల దినంగా ప్రకటించాలని మందెరుగని మందభాగ్యుల డిమాండ్. ఎవరేమన్నను... ఎవరేమన్నా, ఏమైనా అనుకున్నా.. జానేదేవ్ అనుకునే సగటు హైదరాబాదీ మాత్రం జోరుగా, హుషారుగా ‘పదండి మందుకు.. పదండి మందుకు..’ అంటూ కొత్త సంవత్సరానికి ఘనస్వాగతం పలికేందుకు ఇప్పటికే సన్నాహాలు ప్రారంభించాడు. హైదరాబాదీల హంగామాకు హోరెత్తుతున్న న్యూఇయర్ ఈవెంట్ల ప్రచారమే నిదర్శనం. క్లబ్బులు, పబ్బులు, రెస్టారెంట్లు, బార్లు భారీ ‘మందో’ బస్తును సిద్ధం చేసుకుంటున్నాయి. వేడుక అన్న తర్వాత ఖానా, పీనా షరామామూలే! అయితే, న్యూ ఇయర్ వేడుకలో ఖానా, పీనాలకు తోడుగా గానా బజానాలకూ సమ ప్రాధాన్యం ఇవ్వడం ‘సిటీ’జనుల తెహజీబ్. ఈసారి కూడా నగరంలో గానా బజానా కార్యక్రమాలు లెక్కకు మిక్కిలిగానే ఏర్పాటవుతున్నాయి. ఇవన్నీ సహజ భోగలాలసులైన కళాపోషకుల ఏర్పాట్లు. ఇది ఒకవైపు దృశ్యం మాత్రమే. నాణేనికి మరోవైపు లాగానే నగరానికీ మరోవైపు ఉంటుంది. దాన్ని దర్శిస్తే... చాలామంది ‘మేకప్ యువర్ మైండ్ డే’ అని గుర్తు తెచ్చుకుని, కొత్త సంవత్సరంలో తీసుకోబోయే తీర్మానాల కోసం సన్నద్ధులవుతారు. అయ్యప్ప స్వాముల సీజన్ కూడా కావడంతో భజన కార్యక్రమాలు న్యూఇయర్ సందడికి ఆధ్యాత్మికతను అద్దుతాయి. ఇక పండుగ వాతావరణాన్ని చూడటమే తప్ప, పండుగ చేసుకోలేని నిరుపేదల సాయం కోసం కొందరు చారి‘టీ’ పార్టీలనూ నిర్వహిస్తారు. మొత్తమ్మీద న్యూఇయర్ వేడుకలను హరివిల్లంత వైవిధ్యభరితంగా జరుపుకొనేందుకు హైదరాబాదీలంతా సర్వసన్నద్ధంగా ఉన్నారు. - పన్యాల జగన్నాథదాసు