వాటికన్ సిటీ, రోమన్ క్యాథలిక్కు, పోప్ ఫ్రాన్సిస్, సినాడ్, నథాలీ బెకార్ట్
వాటికన్ సిటీ: రోమన్ క్యాథలిక్కుల గురువు పోప్ ఫ్రాన్సిస్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. సంప్రదాయాన్ని పక్కనబెట్టి కీలకమైన సినాడ్ (బిషప్పుల మహాసభ) అండర్ సెక్రటరీ పదవికి మొట్టమొదటిసారిగా మహిళను ఎంపిక చేశారు. ఆమెకు ఓటింగ్ హక్కులను కూడా కల్పించారు. కొత్తగా నియమితులైన ఇద్దరు అండర్ సెక్రటరీల్లో ఒకరు స్పెయిన్‌కు చెందిన లూయిస్ మారిన్ డీ సాన్ మార్టిన్ కాగా, మరొకరు ఫ్రాన్సుకు చెందిన సిస్టర్ నథాలీ బెకార్ట్(51) కావడం గమనార్హం.
క్రైస్తవ మతంలో సిద్ధాంతపరంగా తలెత్తే ప్రధాన ప్రశ్నలపై సినాడ్ అధ్యయనం చేస్తుంది. సినాడ్‌లో బిషప్పులు, కార్డినల్స్ తోపాటు నిపుణులు కూడా ఉంటారు. వీరిలో బిషప్పులు, కార్డినల్స్‌కు మాత్రమే ఓటింగ్ హక్కులుంటాయి. అండర్ సెక్రటరీగా నియమితురాలైన బెకార్ట్‌కు కూడా ఓటింగ్ హక్కు కల్పించారు. చర్చికి సంబంధించిన విషయాల్లో సూక్ష్మపరిశీలన, నిర్ణయాలు తీసుకోవడంలో మహిళలు కీలకంగా మారాలన్న పోప్ ఫ్రాన్సిస్ ఆకాంక్ష మేరకు ఈ నియామకం జరిగిందని సినాడ్ సెక్రటరీ జనరల్ కార్డినల్ మరియో గ్రెక్ తెలిపారు. ‘గతంలో నిపుణులుగా, పరిశీల కులుగా మాత్రమే మహిళలు సినాడ్‌లో ఉండే వారు.
సిస్టర్ బెకార్ట్ ఎంపికతో మహిళలు ఓటింగ్ ప్రక్రియలో పాల్గొనేందుకు కూడా అవకాశం కలిగింది’అని ఆయన పేర్కొన్నారు. ఫ్రాన్సు లోని జేవియర్ సిస్టర్స్ సంస్థ సభ్యురాలైన బెకార్ట్, ప్యారిస్‌లోని ప్రఖ్యాత హెచ్‌ఈసీ బిజినెస్ స్కూల్ నుంచి మేనేజ్‌మెంట్‌లో డిగ్రీ పొందారు. బోస్టన్ యూనివర్సిటీలో కూడా ఆమె అధ్యయనం చేశారు. 2019 నుంచి సినాడ్‌కు కన్సల్టెంట్‌గా కొనసాగుతున్నారు. కాగా, సినాడ్ తరువాతి సమావేశం 2022లో జరగనుంది. 2019లో అమెజాన్‌పై ఏర్పడిన ప్రత్యేక సినాడ్ సమావేశానికి 35 మంది మహిళా ఆడిటర్లను ఆహ్వానించినప్పటికీ వారెవరికీ ఓటింగ్ హక్కులు ఇవ్వలేదు.
Comments
Please login to add a commentAdd a comment