రేవ్ పార్టీ కేసు మాఫీకి యత్నం
న్యూ ఇయర్ వేడుకల్లో అశ్లీల నృత్యాలు
ఏర్పాటు చేసిన కూటమి నేతలు
వారిని తప్పించేందుకు తెరవెనుక కుట్ర
సాక్షి, కోనసీమ జిల్లా: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మండపేట రేవ్ పార్టీ కేసు మాఫీకి యత్నాలు ముమ్మరంగా జరుగుతున్నట్టు తెలుస్తోంది. అశ్లీల నృత్యాల్లో పాల్గొన్న కూటమి నేతలను తప్పించేందుకు తెరవెనుక రాజకీయ కుట్ర జరుగుతోంది. కేసులో ఏ–1 నిందితుడిగా లే అవుట్ యజమాని కొమ్ము రాంబాబుపై పోలీసులు కేసు నమోదు చేయడం విమర్శలకు తావిస్తోంది.
పోలీసుల తీరును ఎమ్మెల్సీ, వైఎస్సార్ సీపీ నియోజకవర్గ కో ఆర్డినేటర్ తోట త్రిమూర్తులు ఖండించగా, టీడీపీ ఎమ్మెల్యే, రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్ వేగుళ్ల జోగేశ్వరరావు సైతం సంఘటన స్థలంలో రాంబాబు లేరని చెప్పడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. నూతన సంవత్సర వేడుకల కోసం మండపేట, కపిలేశ్వరపురం మండలాలకు చెందిన కొంతమంది జనసేన నాయకులు భారీ లైటింగ్, సౌండ్ సిస్టమ్‌తో మండపేటలోని ఒక లేఅవుట్‌లో అశ్లీల నృత్యాలు ఏర్పాటు చేసిన విషయం విదితమే. డీజే సాంగ్స్, విద్యుత్ వెలుగుల్లో మద్యం తాగుతూ వారితో నృత్యాలు చేయించారు.
మొదట అర్ధ నగ్నంగా, తర్వాత పూర్తి వివస్త్రలుగా హిజ్రాలు నృత్యం చేయడం వారితో కలసి కూటమి నాయకులు చిందులు వేయడం వీడియోల్లో స్పష్టంగా కనిపించింది. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటనలో రెండు రోజుల కిందట పట్టణ పోలీసులు 13 మందిపై కేసు నమోదు చేశారు. వీడియోల్లో మరో 15 మంది వరకూ జనసేన, టీడీపీ నాయకులను పోలీసులు గుర్తించినట్టు తెలుస్తోంది. వారిని తప్పించేందుకు పోలీసులపై పైస్థాయి నుంచి ఒత్తిళ్లు వస్తున్నట్టు సమాచారం. వారిని అరెస్టు చూపిస్తారో? లేక తప్పిస్తారో వేచి చూడాలి.
చెడ్డపేరు వస్తుందన్న భయంతో..
ఈ అశ్లీల నృత్యాల్లో జనసేన, టీడీపీకి చెందిన 70 మందికి పైగా హాజరైనట్టు తెలుస్తోంది. ఇందులో పలువురు మండల, జిల్లా స్థాయి ముఖ్య నేతలు ఉన్నట్టు సమాచారం. సంఘటన స్థలం పక్కనే నిర్మాణంలో ఉన్న స్లాబ్‌పైకి ఎక్కి వీరు వేడుకలు తిలకించినట్టు చెబుతున్నారు. సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ కావడంతో రెండు పార్టీలకు చెడ్డ పేరు వస్తుందని భావించిన ఆ పార్టీల నేతలు సంఘటనతో సంబంధం లేని లేఅవుట్ యజమాని పేరిట వైఎస్సార్ సీపీ నేతను కేసులో ఇరికించడం గమనార్హం. వాస్తవానికి వైఎస్సార్ సీపీ నేత రాంబాబు ఆధ్వర్యంలో గతంలో ఏర్పాటు చేసిన ఈ లేఅవుట్‌లో ఇప్పటికే చాలా వరకూ స్థలాలు అమ్ముడుపోయాయి. కొందరు తమ స్థలాల్లో ఇళ్లు, అపార్ట్‌మెంట్లు నిర్మాణ పనులు చేసుకుంటున్నారు. మరికొందరు నిర్మాణ సామగ్రిని తరలించుకుంటున్నారు. స్థల యజమానులు నిర్మాణ సామాగ్రి తెచ్చుకునేందుకు వీలుగా లే అవుట్ గేట్లు తెరిచి ఉంచుతున్నారు.
ఎలా బాధ్యుడిని చేస్తారు: ఎమ్మెల్సీ తోట
రియల్ ఎస్టేట్ వ్యాపారి అయిన రాంబాబు లేఅవుట్ వేసి స్థలాలు అమ్ముతుంటారని, ఆయనపై పోలీసులు ఏవిధంగా కేసు పెడతారని ఎమ్మెల్సీ, వైఎస్సార్ సీపీ మండపేట నియోజకవర్గ ఇన్‌చార్జి తోట త్రిమూర్తులు ప్రశ్నించారు. వైఎస్సార్ సీపీ నేత లేఅవుట్‌లో అశ్లీల నృత్యాలు జరిగాయంటూ మీడియా అడిగిన ప్రశ్నను ఆయన ఖండించారు. స్థలాలు అమ్మేసిన తర్వాత కొనుగోలు చేసుకున్న వారు తమకు నచ్చినట్టుగా వినియోగించుకుంటారని, అందుకు లేఅవుట్ యజమానిని ఏ విధంగా బాధ్యుడిని చేస్తారని ఎమ్మెల్సీ తోట మండిపడ్డారు. అధికార పార్టీ అండదండలతోనే మండపేట నడిబొడ్డున మునుపెన్నడూ లేని విధంగా ఈ అశ్లీల నృత్యాలు జరిగాయన్నారు.
రాంబాబు అక్కడ లేరు: ఎమ్మెల్యే వేగుళ్ల
సంఘటన స్థలంలో కొమ్ము రాంబాబు లేరు కాబట్టే పోలీసులు ఆయనపై ఏ–1గా కేసు నమోదు చేసినప్పటికీ, పోలీసులు ఆయన్ని ఇంకా అరెస్టు చేయలేదని ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు చెప్పడం కొసమెరుపు. తాము పోలీసులకు ఏమీ చెప్పలేదని, వారే సుమోటాగా కేసు నమోదు చేశారని ఆయన చెప్పుకొచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment