performances
-
స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారా ? క్యూ 3లో లిస్టింగ్ కంపెనీల రిజల్ట్స్
న్యూఢిల్లీ: స్టాక్ మార్కెట్‌పై సామాన్యులకు ఆసక్తి పెరిగింది. రాబడుల కోసం షేర్ మార్కెట్‌వైపు చూస్తున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అయితే ఇన్వెస్ట్ చేసే ముందు ఆయా కంపెనీల పనితీరు తెలుసుకోవడం మంచిదని మార్కెట్ నిపుణులు ఎప్పుడూ సూచిస్తుంటారు. సెప్టెంబర్ త్రైమాసిక ఫలితాలను కంపెనీలు వరుసగా ప్రకటిస్తున్నాయి. అందులో కొన్ని లిస్టింగ్ కంపెనీల పనితీరు వివరాలు ఇలా ఉన్నాయి. పిరమల్... వీక్ స్తుత ఆర్థిక సంవత్సరం(2021–22) రెండో త్రైమాసికంలో డైవర్సిఫైడ్ దిగ్గజం పిరమల్ ఎంటర్ప్రైజెస్ నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జులై–సెప్టెంబర్(క్యూ2)లో నికర లాభం 32 శాతం క్షీణించి రూ. 426 కోట్లకు పరిమితమైంది. గతేడాది(2020–21) ఇదే కాలంలో రూ. 628 కోట్లు ఆర్జించింది. ఫైనాన్షియల్ సర్వీసుల విభాగం ప్రధానంగా ఫలితాలను దెబ్బతీసినట్లు కంపెనీ తెలియజేసింది. ఫార్మా విభాగాన్ని ప్రత్యేక కంపెనీగా విడదీసేందుకు అక్టోబర్‌లో బోర్డు అనుమతించినట్లు కంపెనీ వివరించింది. ఫార్మా జోరు ఫార్మా విభాగం ఆదాయం రూ. 1,441 కోట్ల నుంచి రూ. 1,621 కోట్లకు ఎగసింది. ఫైనాన్షియల్ సర్వీసుల అమ్మకాలు మాత్రం రూ. 1,861 కోట్ల నుంచి రూ. 1,484 కోట్లకు తగ్గాయి. డీహెచ్ఎఫ్ఎల్ కొనుగోలు లావాదేవీకి రూ. 143 కోట్లు వెచ్చించినట్లు కంపెనీ వెల్లడించింది. దీంతో రూ. 153 కోట్లమేర అనుకోని వ్యయాలు నమోదైనట్లు తెలియజేసింది. ఫలితాల నేపథ్యంలో షేరు బీఎస్ఈలో దాదాపు 4 శాతం పతనమై రూ. 2,714 వద్ద ముగిసింది. గోద్రెజ్ కన్జూమర్... ప్లస్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2021–22) రెండో త్రైమాసికంలో ఎఫ్ఎంసీజీ దిగ్గజం గోద్రెజ్ కన్జూమర్ ప్రొడక్ట్స్ పటిష్ట ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జులై–సెప్టెంబర్(క్యూ2)లో నికర లాభం 5 శాతం పుంజుకుని రూ. 479 కోట్లకు చేరింది. గతేడాది(2020–21) ఇదే కాలంలో రూ. 458 కోట్లు ఆర్జించింది. నికర అమ్మకాలు మరింత వృద్ధితో 9 శాతం ఎగసి రూ. 3,144 కోట్లకు చేరాయి. అయితే మొత్తం వ్యయాలు సైతం 11 శాతం పెరిగి రూ. 2,579 కోట్లను తాకాయి. దేశీ బిజినెస్ 9 శాతంపైగా వృద్ధితో రూ. 1,838 కోట్లను అధిగమించగా.. ఇండొనేసియా మార్కెట్ నుంచి ఆదాయం యథాతథంగా రూ. 445 కోట్లుగా నమోదైంది. ఆఫ్రికా నుంచి అమ్మకాలు 15 శాతం జంప్‌చేసి రూ. 748 కోట్లను దాటాయి. ఇతర మార్కెట్ల నుంచి మాత్రం ఆదాయం 4 శాతం నీరసించి రూ. 174 కోట్లకు పరిమితమైంది. ఫలితాల నేపథ్యంలో షేరు బీఎస్ఈలో 2.5% నష్టంతో రూ. 953 వద్ద ముగిసింది. బజాజ్ హిందుస్తాన్... నష్టాలు తగ్గాయ్ ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2021–22) రెండో త్రైమాసికంలో షుగర్ తయారీ కంపెనీ బజాజ్ హిందుస్తాన్ ప్రోత్సాహకర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జులై–సెప్టెంబర్(క్యూ2)లో నికర నష్టం 29 శాతం తగ్గి రూ. 113 కోట్లకు పరిమితమైంది. గతేడాది(2020–21) ఇదే కాలంలో రూ. 160 కోట్ల నికర నష్టం నమోదైంది. మొత్తం ఆదాయం మాత్రం 14 శాతం క్షీణించి రూ. 1,344 కోట్లకు చేరింది. గత క్యూ2లో రూ. 1,570 కోట్ల ఆదాయం సాధిం చింది. ప్రభుత్వ రంగ సంస్థ పీఎన్బీకి చెందిన రమణి రంజన్ మిశ్రాను నామినీ డైరెక్టర్‌గా బోర్డు ఎంపిక చేసినట్లు బజాజ్ హిందుస్తాన్ పేర్కొంది. ఫలితాల నేపథ్యంలో బజాజ్ హిందుస్తాన్ షేరు బీఎస్ఈలో 0.7 శాతం బలపడి రూ. 14.7 వద్ద ముగిసింది. ఐబీ హౌసింగ్ లాభం... డౌన్ ముంబై: మార్టిగేజ్ కంపెనీ ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ ఈ ఆర్థిక సంవత్సరం (2021–22) రెండో త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. జులై–సెప్టెంబర్(క్యూ2) లో నికర లాభం 11 శాతం క్షీణించి రూ. 286 కోట్లకు పరిమితమైంది. గతేడాది(2020–21) ఇదే కాలంలో రూ. 323 కోట్లు ఆర్జించింది. ఈ కాలంలో ఇతర సంస్థలతో ఒప్పందాల నేపథ్యంలో రూ. 325 కోట్ల రుణాలను విడుదల చేసినట్లు కంపెనీ వెల్లడించింది. వీటిని డిసెంబర్‌కల్లా రూ. 500 కోట్లకు, 2022 మార్చికల్లా రూ. 800 కోట్లకు పెంచుకునే యోచనలో ఉన్నట్లు తెలియజేసింది. రిటైల్ రుణాల విడుదలకు హెచ్డీఎఫ్సీ లిమిటెడ్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యస్ బ్యాంక్, ఆర్బీఎల్ బ్యాంక్, కెనరా బ్యాంక్ తదితరాలతో చేతులు కలిపినట్లు పేర్కొంది. క్యూ2లో స్థూల ఎన్పీఏలు 2.21 శాతం నుంచి 2.69 శాతానికి పెరిగాయి. ఫలితాల నేపథ్యంలో షేరు బీఎస్ఈలో 3.4% పతనమై రూ. 237 వద్ద ముగిసింది. ఆర్సెలర్ మిట్టల్... టర్న్ఎరౌంట్ గ్లోబల్ స్టీల్ దిగ్గజం ఆర్సెలర్ మిట్టల్ ఈ ఏడాది(2021) మూడో త్రైమాసికంలో టర్న్అరౌండ్ ఫలితాలు సాధించింది. జులై–సెప్టెంబర్(క్యూ3)లో 462.1 కోట్ల డాలర్ల(రూ. 34,430 కోట్లు) నికర లాభం ఆర్జించింది. గతేడాది(2020) ఇదే కాలంలో 26.1 కోట్ల డాలర్ల నికర నష్టం ప్రకటించింది. కంపెనీ జనవరి–డిసెంబర్ కాలాన్ని ఆర్థిక సంవత్సరంగా పరిగణిస్తుంది. కాగా.. క్యూ3లో మొత్తం ఆదాయం 13.3 బిలియన్ డాలర్ల నుంచి 20.2 బిలియన్ డాలర్లకు జంప్‌చేసింది. స్థూల రుణభారం బిలియన్ డాలర్లు తగ్గి 8.2 బిలియన్ డాలర్లకు చేరింది. ఈ కాలంలో షిప్‌మెంట్స్ 17.5 మిలియన్ టన్నుల నుంచి తగ్గి 14.6 ఎంటీకి పరిమితమయ్యాయి. ఇందుకు ప్రధానంగా ఆటోమోటివ్ రంగం నుంచి బలహీనపడిన డిమాండ్, ఉత్పత్తి సమస్యలు, ఎగుమతులకు ఆర్డర్లు ఆలస్యంకావడం వంటి అంశాలు కారణమైనట్లు కంపెనీ తెలియజేసింది. ధరలు బలపడటంతో క్యూ3లో పటిష్ట ఫలితాలు సాధించినట్లు ఆర్సెలర్ మిట్టల్ సీఈవో ఆదిత్య మిట్టల్ పేర్కొన్నారు. దీంతో అత్యధిక లాభాలు ఆర్జించడమేకాకుండా 2008 తదుపరి కనిష్ట నికర రుణ భారాన్ని నమోదు చేసినట్లు వెల్లడించారు. మోర్పెన్ ల్యాబ్స్... జూమ్ హెల్త్‌కేర్ రంగ కంపెనీ మోర్పెన్ ల్యాబ్స్ ఈ ఆర్థిక సంవత్సరం(2021–22) రెండో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జులై–సెప్టెంబర్(క్యూ2)లో నికర లాభం 38 శాతం వృద్ధితో రూ. 37 కోట్లను అధిగమించింది. గతేడాది(2020–21) ఇదే కాలంలో రూ. 27 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 340 కోట్ల నుంచి రూ. 398 కోట్లకు ఎగసింది. ఏపీఐలకు ప్రపంచవ్యాప్తంగా పెరిగిన డిమాండ్, చైనా నుంచి సరఫరాలకు అంతరాయాలు ఏర్పడటం వంటి అంశాల నేపథ్యంలో విస్తరణ ప్రణాళికలను వేగవంతం చేసినట్లు కంపెనీ చైర్మన్, ఎండీ సుశీల్ సూరి పేర్కొన్నారు. ఫలితాల నేపథ్యంలో మోర్పెన్ ల్యాబ్స్ షేరు ఎన్ఎస్ఈలో 3.25 శాతం ఎగసి రూ. 52.5 వద్ద ముగిసింది. జీవోసీఎల్‌కు రూ.23 కోట్ల నష్టం హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: జీవోసీఎల్ కార్పొరేషన్ సెప్టెంబర్ త్రైమాసికం కన్సాలిడేటెడ్ ఫలితాల్లో రూ.23 కోట్ల నష్టం ప్రకటించింది. అంత క్రితం ఏడాది ఇదే కాలంలో కంపెనీ రూ. 24 కోట్ల నష్టం చవిచూసింది. టర్నోవర్ రూ. 132 కోట్ల నుంచి రూ. 146 కోట్లకు చేరింది. ఆర్డర్ బుక్ రూ.946 కోట్లు ఉందని జీవోసీఎల్ కార్పొరేషన్ ప్రకటించింది. చదవండి: ఈ షేర్లు... తారాజువ్వలు! -
కోట్లకు... ఆటకు కుదరని మైత్రి
ఐపీఎల్ అంటేనే అంకెలు... పరుగులు, వికెట్లు మాత్రమే కాదు, ఆటగాళ్లకి చెల్లించే ప్రతీ పైసా లెక్కలు కూడా కీలకం. డబ్బే ముఖ్యం కాదు అంటూ బయటకు ఎన్ని మాటలు చెప్పినా, క్రికెటర్లు సహజంగానే భారీ మొత్తాలను కోరుకుంటారు. అటు టీమ్ యాజమాన్యాలు కూడా తాము చెల్లిస్తున్న సొమ్ముకు తగి నంత ప్రతిఫలాన్ని సదరు ఆటగాడి నుంచి ఆశిస్తాయి. దాంతో క్రికెటర్లపై కచ్చితంగా రాణించాల్సిన ఒత్తిడి ఉంటుంది. చాలాసార్లు ఆ భారాన్ని మోయలేక క్రికెటర్లు విఫలమైతే, కొన్నిసార్లు మాత్రం వారు అంచనాలు అందుకుంటారు. చేసే ప్రతీ పరుగును, తీసే ప్రతీ వికెట్‌ను ఇచ్చిన మొత్తంతో గుణింతాలు, భాగహారాలతో లెక్కించి పోల్చడం సహజం. ఈ నేపథ్యంలో ఐపీఎల్–2020లో ఇప్పటివరకు ‘భారీ’ ఆటగాళ్ల ప్రదర్శనను పరిశీలిస్తే.... ప్యాట్ కమిన్స్ (కోల్‌కతా నైట్‌రైడర్స్) వేలంలో విలువ: రూ. 15 కోట్ల 50 లక్షలు ప్రదర్శన: ఐపీఎల్ చరిత్రలో రికార్డు స్థాయిలో అమ్ముడుపోయిన బౌలర్‌గా కమిన్స్ ఈసారి బరిలోకి దిగాడు. టెస్టుల్లో నంబర్‌వన్ బౌలర్‌గా గుర్తింపు తెచ్చుకున్న కమిన్స్ టి20లకు వచ్చేసరికి తేలిపోయాడు. యూఏఈలోని నెమ్మదైన పిచ్‌లు కూడా అతని శైలికి ఏమాత్రం సరిపోకపోవడంతో ఇప్పటికీ లయ అందుకునేందుకు అతను తిప్పలు పడుతూనే ఉన్నాడు. 7 మ్యాచ్‌లలో ఒక్కసారీ ఒంటిచేత్తో మ్యాచ్‌ను మలుపు తిప్పిన ప్రదర్శన లేకపోగా... 2 వికెట్లే తీసిన అతను కనీసం ఒక్క ఓవర్ కూడా మెయిడిన్‌గా వేయలేకపోయాడు. 111 సగటు అతి పేలవం కాగా... 8.53 ఎకానమీ చూస్తే భారీగా పరుగులిచ్చినట్లు అర్థమవుతోంది. ఇది కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు సమస్యగా మారింది. గ్లెన్ మ్యాక్స్‌వెల్ (కింగ్స్ ఎలెవన్ పంజాబ్) వేలంలో విలువ: రూ. 10 కోట్ల 75 లక్షలు ప్రదర్శన: ఒకప్పుడు విధ్వంసానికి చిరునామాగా నిలిచిన మ్యాక్స్‌వెల్ ఇప్పుడు ఒక్కో పరుగు కోసం శ్రమిస్తున్నాడు. నిజానికి ఇంత మొత్తం చెల్లించి తీసుకున్న ఆటగాడిని ఎలా వాడుకోవాలో కూడా అర్థం కాని స్థితిలో పంజాబ్ ఉంది. 8 మ్యాచ్‌లలో కలిపి అతను ఆడింది 61 బంతులే... దాదాపు మ్యాచ్ ముగిసే సమయంలో క్రీజ్‌లోకి వస్తున్న అతను బంతులకంటే తక్కువ పరుగులు (58) చేయడం ఆశ్చర్యకరం. కోల్‌కతాతో మ్యాచ్‌లో 16 బంతుల్లో 21 పరుగులు చేయాల్సిన స్థితిలో కూడా మ్యాక్స్‌వెల్‌కంటే ముందు కనీసం ఒక ఫస్ట్‌క్లాస్ మ్యాచ్ అనుభవం కూడా లేని ప్రభ్‌సిమ్రన్ సింగ్‌ను పంపించారంటే మ్యాక్స్‌వెల్‌పై ఎంత అపనమ్మకమో అర్థమవుతుంది. లీగ్‌లో అతను ఒక్క సిక్సర్ కూడా కొట్టలేదు. అతనికి చెల్లించిన మొత్తంతో పోలిస్తే మ్యాక్సీ ప్రదర్శన అట్టర్ ఫ్లాప్. షెల్డన్ కాట్రెల్ (పంజాబ్) వేలంలో విలువ: రూ. 8 కోట్ల 50 లక్షలు ప్రదర్శన: ప్రధాన పేసర్‌గా పంజాబ్ ఎన్నో అంచనాలు పెట్టుకున్న ‘సెల్యూట్’ కాట్రెల్ దానికి తగినట్లుగా రాణించలేకపోయాడు. 6 మ్యాచ్‌లలో 6 వికెట్లే తీయగా... 8.80 ఎకానమీ చూస్తే పరుగులు నిరోధించడంలో కూడా అతను విఫలమైనట్లు కనిపిస్తోంది. గత రెండు మ్యాచ్‌లలో తుది జట్టు నుంచి తప్పించడాన్ని చూస్తే సీజన్లో మిగిలిన మ్యాచ్‌లలో కూడా పంజాబ్ అతడికి అవకాశం ఇస్తుందా లేదా అనేది సందేహమే. జైదేవ్ ఉనాద్కట్ (రాజస్తాన్ రాయల్స్) వేలంలో విలువ: రూ. 3 కోట్లు ప్రదర్శన: గతంలో ఐపీఎల్ వేలంలో రెండుసార్లు రికార్డు స్థాయి మొత్తాలకు అమ్ముడుపోయి అంతగా రాణించలేకపోయిన ఉనాద్కట్... వాటితో పోలిస్తే ఈసారి తక్కువ మొత్తానికే రాజస్తాన్‌కు అందుబాటులోకి వచ్చాడు. లీగ్‌కు ముందు సౌరాష్ట్ర కెప్టెన్‌గా జట్టుకు తొలి రంజీ ట్రోఫీ అందించిన ఆత్మవిశ్వాసంతో కనిపించిన అతను లీగ్‌కు వచ్చేసరికి ఏమాత్రం ప్రభావం చూపలేకపోయాడు. 6 మ్యాచ్‌లలో కలిపి అతను తీసింది 4 వికెట్లే. చెప్పుకోదగ్గ స్పెల్ ఒక్కటి కూడా వేయని ఉనాద్కట్ 9.57 ఎకానమీతో పరుగులు సమర్పించుకున్నాడు. ఆరోన్ ఫించ్ (బెంగళూరు) వేలంలో విలువ: రూ. 4 కోట్ల 40 లక్షలు ప్రదర్శన: ఎనిమిది మ్యాచ్‌లలో కలిపి ఓవరాల్ ప్రదర్శన పర్వాలేదన్నట్లుగా కనిపిస్తున్నా, ఆస్ట్రేలియాలాంటి మేటి జట్టు పరిమిత ఓవర్ల కెప్టెన్ నుంచి ఆశించింది మాత్రం ఇది (ఒక అర్ధసెంచరీ) కాదు. అంతర్జాతీయ టి20ల్లో అత్యధిక స్కోరు సాధించిన ఈ ఆటగాడి స్ట్రయిక్‌రేట్ 113.69 మాత్రమే, అదీ ఓపెనర్‌గా ఉంటూ చేయడం అంటే వైఫల్యం కిందే లెక్క. ఒక్క విధ్వంసకర ఇన్నింగ్స్ కూడా అతడినుంచి రాలేదు. రాబిన్ ఉతప్ప (రాజస్తాన్ రాయల్స్) వేలంలో విలువ: రూ. 3 కోట్లు ప్రదర్శన: గతంలో కోల్‌కతా జట్టులో కీలక సభ్యుడిగా ఆ జట్టు రెండు టైటిల్స్ సాధించడంలో భాగమైన రాబిన్ ఉతప్పలో జోరు తగ్గినా... రాజస్తాన్ పెద్ద మొత్తానికి అతడిని తీసుకుంది. అయితే ఉతప్ప మరింత పేలవంగా ఆడి ఫ్రాంచైజీని నిరాశపర్చాడు. 6 మ్యాచ్‌లలో కలిపి ఉతప్ప చేసింది 83 పరుగులే (84 బంతుల్లో). తుది జట్టులో భారత ఆటగాళ్లను ఎంచుకునే క్రమంలో ఉతప్ప వైఫల్యం రాయల్స్ కూర్పును దెబ్బ తీసింది. ఇది భిన్నమైన పరిస్థితి... ఆస్ట్రేలియా లెఫ్టార్మ్ పేసర్ నాథన్ కూల్టర్‌నైల్‌ను ముంబై రూ. 8 కోట్ల భారీ మొత్తానికి సొంతం చేసుకుంది. అతడిని తుది జట్టులో ఆడించేందుకు వారికి అవకాశం లభించడం లేదు. బౌల్ట్ చక్కగా రాణిస్తుండగా, ముంబై తుది జట్టు చక్కగా కుదురుకోవడంతో మార్పులకు అవకాశం లేకుండా పోయింది. పూర్తి ఫిట్‌గా ఉన్నా మ్యాచ్ ఆడే అవకాశం లభించని కూల్టర్‌నైల్ పర్సులో మాత్రం భారీ మొత్తం చేరడం విశేషం. రూ. 10 కోట్లు ఇచ్చిన క్రిస్ మోరిస్ (దక్షిణాఫ్రికా)ను బెంగళూరు ఇప్పటికి మూడు మ్యాచ్‌లు ఆడించింది. ఇకపై అతడికి వరుసగా అన్ని మ్యాచ్‌లలో అవకాశం దక్కవచ్చు. -
కూచిపూడికి క్రాంతి ఒరవడి
నృత్యంలో సాధారణంగా ఆడపాత్రలను సైతం మగవారే వేయడం కనిపిస్తుంటుంది. అయితే క్రాంతి మగ పాత్రలే ఎక్కువగా పోషించి తనకంటూ ఒక ప్రత్యేకత సాధించారు. అయితే అదొక్కటే ఆమె ప్రత్యేకత కాదు! ►ఉన్నతోద్యోగాన్ని వదులుకుని కూచిపూడి సేవకు అంకితం ►పేదలకు సంప్రదాయ నృత్యాన్ని నేర్పించడమే లక్ష్యం ►‘రూపానురూపకం’ ద్వారా మరింత ప్రత్యేకంగా దేశవిదేశాల్లో ప్రదర్శనలు ►‘మోహినీ భస్మాసుర’ నాట్యానికి సాహిత్యం లేకుండా సంగీతంతో చేసిన సరికొత్త ప్రయోగానికి దేశవిదేశాల్లో స్టాండింగ్ ఒవేషన్ తెలుగు సంప్రదాయ కూచిపూడి నృత్యమే జీవితంగా క్రాంతి నారాయణ తుపాకుల ముందుకెళుతున్నారు. కూచిపూడినే శ్వాసగా భావిస్తున్న ఆమె సాధ్యమైనంత ఎక్కువమంది పేదలకు ఈ నృత్యాన్ని నేర్పించేందుకు తనవంతుగా కృషి చేస్తున్నారు. మన సంప్రదాయ కూచిపూడి నృత్యాన్ని అనేకమంది నాట్య ప్రవీణులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నత స్థాయిలో నిలబెట్టగా, ఆ ఒరవడిని మరింతగా కొనసాగించేందుకు క్రాంతి పాటుపడుతున్నారు. ఇందులో భాగంగా తన గురువు శోభానాయుడు మార్గదర్శకత్వంలో కొందరికే ప్రత్యేకమైన ‘రూపానురూపకం’ ద్వారా మగపాత్రలతో కూచిపూడి ప్రదర్శనలు ఇచ్చి దేశవిదేశాల్లో మంచి పేరు సంపాదించారు. కొన్నేళ్ల క్రితం వరకు ఆడపాత్రలను సైతం మగవారే వేసేవారు. అయితే క్రాంతి మాత్రం మగ పాత్రలే ఎక్కువగా పోషించి తనకంటూ ఒక ప్రత్యేకత సాధించారు. శివుడు, రాముడు, రావణుడు, విష్ణుమూర్తి, గౌతమబుద్ధ, అశోకుడు, నానవలి తదితర పాత్రలతో కూచిపూడి ప్రదర్శిస్తూ ప్రత్యేకత సాధించారు. అదేవిధంగా ‘మోహినీ భస్మాసుర’ నాట్యాంశాన్ని సరికొత్త ప్రయోగంతో ప్రదర్శించి దేశవిదేశాల్లో స్టాండింగ్ ఒవేషన్ పొందారు. సాంప్రదాయ నాట్యం చేసేందుకు సహజంగా సంగీతంతో పాటు సాహిత్యం ఉంటుంది. అయితే క్రాంతి నారాయణ ఈ నృత్య రూపకానికి సాహిత్యం (లిరిక్స్) లేకుండా కేవలం సంగీత వాయిద్యాలను మాత్రమే ఉపయోగించి సరికొత్త ప్రయోగంతో ప్రదర్శించి ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషలవారికి అర్థమయ్యేలా చేశారు. భరతనాట్యమే ప్రధానంగా భావించే తమిళనాడు నుంచి అనేక ఇతర దేశాల్లోనూ ఈ కూచిపూడి ప్రదర్శనకు స్టాండింగ్ ఒవేషన్ సాధించారు క్రాంతి. సంగీతం అనేది యూనివర్సల్ లాంగ్వేజ్ కావడంతో దీని ద్వారా ప్రయోగం చేశారు. లాభాపేక్షతో కాకుండా ఎక్కువమంది పేదలకు సంప్రదాయ నృత్య కళ నేర్పించడమే లక్ష్యమని, ఇలా చేస్తే కళ ఎప్పటికీ నిలిచి ఉంటుందని క్రాంతి చెబుతున్నారు. అదేవిధంగా సంస్కృతి, సాంప్రదాయాల పట్ల ప్రేమ, అనురాగం పెరుగుతాయంటున్నారు.ఇప్పటివరకు దేశవిదేశాల్లో అనేక ప్రదర్శనలు చేసి తనకంటూ ప్రత్యేకత సంపాదించుకున్న క్రాంతికి అనేక అవార్డులు వచ్చాయి. మరోవైపు ఆమెకు అనేక పెద్ద స్థాయి పెళ్లి సంబంధాలు వచ్చాయి. ఇప్పటివరకు ఆమె సాధించినదాన్ని చూసి అభినందిస్తూనే పెళ్లి అయిన తరువాత కొనసాగించకూడదని నిబంధన పెట్టడంతో క్రాంతి అన్ని సంబంధాలను తిరస్కరించి కూచిపూడిని తన జీవిత సర్వస్వంగా భావించారు. ఈ కళను వదిలేస్తే అన్నివర్గాలకు కూచిపూడిని చేరువ చేయాలనే లక్ష్యాన్ని చేరుకోలేనని ఆమె చెబుతున్నారు. దేవుడు తనను కళారంగంవైపు పిలవడంతోనే ఇటు వచ్చానని అంటున్నారు. శోభానాయుడు సంశయించారు! భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రం కొత్తగూడెంకు చెందిన తుపాకుల క్రాంతి స్థానిక సెయింట్‌మేరీస్ పాఠశాలలో ప్రాథమిక విద్యనభ్యసించారు. నాలుగో తరగతి చదువుతున్నప్పుడు కొన్ని నెలలు కూచిపూడి నేర్చుకున్నారు. ఆ సమయంలో పలు ప్రదర్శనలు చేశారు. తండ్రి మాత్రం వేరే రంగంలో ఎదగాలని సూచించారు. ఈ క్రమంలో అప్పుడు ఆమె నృత్యం ఆపేశారు. అయితే నృత్యం నేర్చుకోవాలనే ఆకాంక్ష బలంగా ఉండడంతో ఉస్మానియా క్యాంపస్‌లో బీఈ మెకానికల్ తృతీయ సంవత్సరంలో శోభానాయుడు వద్దకు వెళ్లి కూచిపూడి నేర్పించమని అడిగారు. ఇంజనీరింగ్ వాళ్లు ఈ రంగాన్ని మధ్యలోనే వదిలేస్తారని శోభానాయుడు నాట్యం నేర్పించేందుకు సంశయించారు. అయితే ఈ రంగంలోనే కొనసాగుతానని మాటిచ్చిన క్రాంతి ఆమె వద్ద నేర్చుకుని ఈ రంగంలోకొచ్చారు. బీఈ తరువాత ఉస్మానియాలో ఎంబీఏ చేస్తూనే క్రాంతి అనేక ప్రదర్శనలు ఇచ్చారు. ఎంబీఏ తరువాత మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీలో అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగం సాధించిన క్రాంతి ఆ కంపెనీ ద్వారా రక్షణ విభాగంలో దేశంలో పలుచోట్ల పనిచేశారు. 2007 నుంచి 2009 వరకు రెండున్నరేళ్లపాటు ఉద్యోగం చేసి దాన్ని మానేశారు. అనంతరం కృష్ణా జిల్లా కూచిపూడిలో ఎంఏ (మాస్టర్ ఆఫ్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్) కోర్సు చేశారు. వేదాంతం రామలింగశాస్త్రి సారథ్యంలో ఆ కోర్సు పూర్తి చేసి ఈ రంగంలో కొనసాగుతున్నారు. దేశంలోని పలు రాష్ట్రాలతో పాటు, విదేశాల్లో క్రాంతి అనేక ప్రదర్శనలు ఇచ్చారు. 2013లో హైదరాబాద్‌లో క్రాంతి కూచిపూడి నాట్యాలయ స్థాపించి నృత్యంపై శిక్షణ ఇస్తున్నారు. అదేవిధంగా సొంతూరిపై మమకారంతో 2017 నుంచి కొత్తగూడెంలోనూ శని, ఆదివారాల్లో ఇన్స్టిట్యూట్ నడిపిస్తున్నారు. విశ్వభారతి, నాట్య అభినయ కౌముది, కళాంజరి, నటరాజ సంగీత తరంగ్ యువ పురస్కారం, అవుట్‌స్టాండింగ్ యంగ్ ఉమెన్ ఆఫ్ ఇయర్ తదితర అవార్డు, ఇంకా మరెన్నో అవార్డులు అందుకున్నారు. తూమాటి భద్రారెడ్డి, సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా -
ఫిపా వరల్డ్‌కప్‌లో తలకిందులవుతున్న అంచనాలు
-
ఒకరు వద్దనుకున్నారు..మరొకరికి వరమయ్యారు
-
నయనానందం
-
కృష్ణమ్మకు భక్త నీరాజనం!
-
కృష్ణమ్మకు ‘కళా’భివందనం