శివాలయం స్థలం మధ్యలో నిర్మించిన రోడ్డు (తారు వేయకుండా వదిలేసిన భాగం)
ఆరిలోవ(విశాఖ తూర్పు): నగరంలో సంచలనం సృష్టిస్తున్న రేవ్ పార్టీ సంస్కృతికి ఎప్పటి నుంచో బీజం పడిందనే అనుమానాలు బలపడుతున్నాయి. రేవ్ పార్టీలు ఏర్పాటు చేయడానికి ముందుగానే ప్రజాప్రతినిధులు, అధికారులు సహకారం అందించారనే వాదన వినిపిస్తోంది. రేవ్ పార్టీ నిర్వహించిన స్థలానికి రూ.2 కోట్లుతో రోడ్డు నిర్మించడమే దీనికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. రుషికొండ దరి గీతం వర్సిటీ ముందు గాయత్రి కాలేజీ ఎదురుగా బీచ్‌లో సీఆర్‌జెడ్‌లో నాలుగు ఎకరాల స్థలాన్ని ఏపీ టూరిజం శాఖ అధికారులు మంత్రి గంటా శ్రీనవాసరావు సన్నిహితుడి కుమారుడు డి.నరేంద్రకుమార్‌కు 15 సంవత్సరాలపాటు లీజుకు ఇచ్చేశారు. సీఆర్‌జెడ్ పరిధిలో ఉన్న స్థలాలు లీజుకు ఇవ్వడం నిబంధనలకు విరుద్ధమైనా మంత్రి ఒత్తిడితో అధికారుల తలొగ్గారు. అంతటితో ఆగకుండా ఆ స్థలానికి రోడ్డు నిర్మించేశారు. ఇప్పుడు అక్కడ యువతను మత్తులో ముంచేస్తున్న రేవ్ పార్టీలు జరిగిపోతున్నాయి. ఈ నెల 13న రాత్రి జరిగిన రేవ్‌పార్టీ నగరంలో సంచలనం సృష్టిస్తోంది. పోలీసులకు సవాల్ విసురుతోంది.
అవసరం లేకపోయినా రోడ్డు నిర్మాణం
సాధారణంగా గాయత్రి కాలేజీ ఎదురుగా బీచ్‌లోకి రోడ్డు అవసరం లేదు. రుషికొండ బీచ్‌లోకి సందర్శకులు వెళ్లడానికి గీతం గేటు దాటిన తర్వాత ప్రత్యేకంగా రోడ్డు నిర్మించారు. ఇరుకుగా ఉన్న ఈ రోడ్డును రెండేళ్ల క్రితం విస్తరించి సందర్శకులు బీచ్‌లోకి వాహనాలతో చేరడానికి అనుకూలంగా నిర్మించారు. ఈ రోడ్డు ఉంటుండగా రేవ్ పార్టీ కోసం లీజుకు తీసుకొన్న నిర్వాహకుడి స్థలానికి ప్రత్యేకంగా ఏపీ టూరిజం శాఖ రోడ్డు నిర్మించేసింది. దీనికి కోసం రూ.2 కోట్లు కేటాయించింది. గత ఏడాది ఫిబ్రవరి 4న ఈ రోడ్డు నిర్మాణం కోసం మంత్రి గంటా శ్రీనివాసరావు శంకుస్థాపన చేశారు. కొండను తవ్వేసి ఈ స్థలం వరకు రోడ్డు నిర్మించారు. వాస్తవానికి లీజుకు తీసుకొన్న స్థలానికి ఎటువైపు నుంచి చూసినా రహదారి లేకపోవడం విశేషం. ఓ పక్క ‘బే పార్కుకు చెందిన స్థలం’ అడ్డంగా ఉండగా మరో పక్క రుషికొండ బీచ్, అక్కడి పురాతన శివాలయం అడ్డంగా ఉన్నాయి. దీంతో ఈ స్థలానికి రహదారి నిర్మించాలనే ఆలోచనతో గాయత్రి కాలేజీ ఎదురుగా కొండ అంచును తవ్వేసి అవసరం లేకపోయినా రోడ్డు నిర్మించేసి అప్పగించేశారు.
శివాలయం స్థలంలో రోడ్డు
బీచ్ రోడ్డులో గాయత్రి కాలేజీ ఎదురు కొండ అంచు నుంచి రోడ్డు నిర్మించారు. ఈ రోడ్డు లీజుకు తీసుకొన్న స్థలం వరకు నిర్మించి ఆపేస్తే ప్రజలకు అనుమానం వస్తుందనే ఆలోచనలతో అధికారులు ఆ రోడ్డును మరింత ముందుకు పొడిగించి అటువైపు రుషికొండ బీచ్ వరకు ఉన్న రోడ్డుకు కలిపారు. ఈ మధ్యలో పురాతనమైన సప్తరుషులు నిర్మించారని చెప్పుకొనే శివాలయానికి చెందిన స్థలం మధ్యగా దీన్ని నిర్మించేశారు. ఈ స్థలం మధ్య నుంచి రోడ్డు నిర్మించ వద్దంటూ శివాలయం నిర్వాహకులు అడ్డుకొన్నా అధికారులు పట్టించుకోలేదు. రేవ్ పార్టీ నిర్వాహకుడు స్థలం వరకు తారు రోడ్డు నిర్మించి అక్కడి నుంచి మట్టిపోసి వదిలేయడం మరో విశేషం. ప్రజలను నమ్మించడానికని శివాలయం స్థలం మధ్య నుంచి ఆగమేఘాలపై రోడ్డు పనులు చేపట్టి మట్టిపోసి వదిలేశారు. ఇలాంటి ఇన్ని చర్యలు కారణంగా రేవ్‌పార్టీ నిర్వాహకులకు పెద్దల అండ పుష్కలంగా ఉన్నట్లు స్పష్టమవుతోందని, ఇదంతా పక్కా ప్రణాళిక ప్రకారం సాగిన వ్యవహారమేనని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
ఇసుక దిబ్బలను కప్పేస్తూ...
బీచ్‌లో సీఆర్‌జెడ్ పరిధిలో ఉన్న స్థలాన్ని ఏపీ టూరిజం లీజుకు ఇచ్చేసింది. ఇక్కడ అంతా ఇసుకు దిబ్బలే ఉన్నాయి. షెడ్‌లు వేయడానికి ఇసుకపై వీలు పడకపోవడంతో నిర్వాహకులు ప్రత్యామ్నాయం ఆలోచించారు. నేరుగా ఇక్కడి ఇసుక దిబ్బలను మట్టితో కప్పేస్తున్నారు. బీచ్‌లో ఇసుక కనిపించకుండా మట్టిపోసి షెడ్లు నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఇక్కడ ఐదు షెడ్‌లు నిర్మించేశారు. ఈ షెడ్‌లలోనే ఈ నెల 13న అర్ధరాత్రి సమయంలో పెద్ద స్పీకర్లు పెట్టి రేవ్ పార్టీ నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment