వీడ్‌లు.. డోప్‌లు..! | Marijuana And Drugs Buy From Websites And Cafes | Sakshi
Sakshi News home page

వీడ్‌లు.. డోప్‌లు..!

Published Sat, Apr 20 2019 10:33 AM | Last Updated on Wed, Apr 24 2019 12:36 PM

Marijuana And Drugs Buy From Websites And Cafes - Sakshi

గంజాయి చాక్లెట్లు సిగరెట్టులోకి గంజాయి కూరుతున్న వైనం

మీకు తెలుసా? ‘వీడ్‌’ అంటే గంజాయి సిగరెట్‌.. డోప్‌ అంటే చాక్లెట్‌ అని..! మీకే కాదు.. నగరంలో చాలామందికి తెలియదు. కానీ మాదకద్రవ్యాలకు బానిసలై మత్తులో మునిగితేలే వారు మాత్రం ఎవరికీ అనుమానం రాకుండా ఈ కోడ్‌ భాషలతోనే కథ నడిపిస్తారు. వీటి కోసం కాఫీడే సెంటర్లు, బార్లు, పార్కులు వంటి వాటిని అడ్డాలుగా చేసుకుంటున్నారు. సిగరెట్లు, చాక్లెట్ల రూపంలో అందుబాటులో ఉంచుతున్నారు. మత్తుకు అలవాటు పడిన వారు బానిసలుగా మారి చట్టవ్యతిరేక కార్యకలాపాలకు తెగబడుతున్నారు. ఇందులో అత్యధికులు విద్యావంతులే కాక బడాబాబుల పిల్లలు ఉంటున్నారు. ఇంకా ఒకడుగు ముందుకేసీ విశాఖలో రేవ్‌ పార్టీలకు కూడా వీరే కారణమవుతున్నారు. ఇటీవల రుషికొండ బీచ్‌లో నిర్వహించిన రేవ్‌ పార్టీలో మాదక ద్రవ్యాలు, మద్యం సేవించి అదుపు తప్పిన యువత తీరు చూసి ప్రశాంత విశాఖ నివ్వెరపోయింది.

సాక్షి, విశాఖపట్నం: స్మార్ట్‌ సిటీ విశాఖ మాదకద్రవ్యాల మాఫియాకు అడ్డాగా మారుతోంది. ఊహించని రీతిలో నగర శివార్లలోనే కాదు.. నడిబొడ్డున కూడా మత్తులో ముంచెత్తడానికి ఎన్నో అడ్డాలు అందుబాటులోకి వచ్చాయి. వీడ్‌లు (గంజాయి సిగరెట్లు, డోప్‌లు (మిల్క్‌ బార్‌లు మాదిరి) డ్రగ్స్‌ చాక్లెట్లను గుట్టుచప్పుడు కాకుండా విక్రయిస్తున్నారు. విశాఖలోని కొన్ని ఇంజినీరింగ్‌ కాలేజీలు, విద్యా సంస్థల్లో మాదకద్రవ్యాలకు అలవాటు పడిన విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఉన్నారని, ఏటా వీరి సంఖ్య పెరుగుతోందని ఇప్పటికే అధికారులు నిర్ధారించారు. కొంతమంది ధనికులు, స్థితిమంతుల పిల్లలు వీటికి అలవాటు పడ్డాక మాదక ద్రవ్యాలు సరఫరా చేసే వారి ద్వారా తమ వద్దకే (కాలేజీలు, పార్కులు, హోటళ్ల వద్దకు) రప్పించుకుంటున్నారు. తొలుత మత్తునిచ్చే గంజాయి సేవనం మరిగాక కొన్నాళ్లకు నిషేధిత మాదకద్రవ్యాల వైపు మళ్లుతున్నారు.

చాలా కాస్టిలీ గురూ..
 ఎవరికీ అనుమానం రాకుండా సిగరెట్లు, చాక్లెట్ల రూపంలో వీటిని తయారు చేస్తున్నారు. మామూలు సిగరెట్లలో పొగాకును తొలగించి పొడిలా చేసిన గంజాయిని కూరుతారు. వీటినే కాఫీడేలు, బార్లు, పార్కులు, హోటళ్లు వద్ద ఎక్కువగా విక్రయిస్తుంటారు. మరోవైపు హైదరాబాద్, పాడేరు, అరకులోయ కేంద్రంగా గంజాయి చాక్లెట్లు తయారవుతున్నాయి. గంజాయి నూనె, పొడి మిశ్రమంతో సిసలైన చాక్లెట్ల మాదిరిగా వీటిని తయారు చేస్తుంటారు. వీటిని కూడా కాఫీడేలు, బార్‌ అండ్‌ రెస్టారెంట్లు, ఖరీదైన హోటళ్ల వద్ద రహస్యంగా విక్రయిస్తున్నారు. ఒక్కో సిగరెట్‌ ధర రూ.100 నుంచి 250 వరకు, చాక్లెట్‌ సైజును బట్టి రూ.500 నుంచి 1000 వరకు ఉందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. 

మాదకద్రవ్యాలకు మారుపేర్లుకోడ్‌లు, డీకోడ్‌లతో విక్రయాలు..
గంటల తరబడి మత్తు..
గంజాయి సిగరెట్‌ తాగితే దాదాపు గంటకు పైగా మత్తుగా ఉంటుంది.  గంజాయి చాక్లెట్‌ ప్రభావం మరింత తీవ్రంగా  ఉంటుందంటారు. ఒక చాక్లెట్‌ను తింటే ఆరు నుంచి ఎనిమిది గంటల పాటు మత్తులో ముంచెత్తుతుంది. అందుకే వీటికి అలవాటైన స్థితిమంతుల పిల్లలు ఎంత ఖరీదైనా వెనకడగు వేయరు. ఒకసారి మాదకద్రవ్యాలకు బానిసలయ్యాక వాటి నుంచి బయట పడలేకపోతున్నారు. మానసిక ఒత్తిడి అధికమై అఘాయిత్యాలకు పాల్పడు తున్నారు. చేతిలో డబ్బుల్లేకపోతే చోరీల బాట పడుతున్నారు. చోరీలు, గొలుసు దొంగతనాల్లో పట్టుబడుతున్న వారిలో పలువురు యువకులతో పాటు ఇంజినీరింగ్‌ చదివిన, చదువుతున్న వారే ఉండడం విస్తుగొలుపుతోంది.

ఆన్‌లైన్‌.. వెబ్‌సైట్‌..
ఇటీవల రుషికొండలో నిర్వహించిన రేవ్‌ పార్టీలో మాదకద్రవ్యాలను సేవించినట్టు తేలింది. అంతేకాదు వారి వద్ద ఎండీఎం, ఎల్‌ఎస్‌డీ వంటి నిషేధిత మాదకద్రవ్యాలు లభించాయి. వీటిని ఆన్‌లైన్‌ ద్వారా కొనుగోలు చేసినట్టు నిందితులు వెల్లడించారు.  ఏకంగా దీనికోసం ఒక వెబ్‌సైట్‌నే నడుపుతున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

ఎక్కడెక్కడ స్థావరాలు?
నగరంలో కొన్ని బార్‌ అండ్‌ రెస్టారెంట్లు, కాఫీడే సెంటర్లు, సిరిపురం జంక్షన్, హెచ్‌Œ ఎస్‌బీసీ–వుడా పార్క్‌ మధ్య ప్రాంతం, ఏయూ ఇంటర్నేషనల్‌ హాస్టల్‌ పరిసరాలు, పాతపోస్టాఫీసు, రైల్వేస్టేషన్, ఎంవీపీ కాలనీ, సాగరతీరంలోని గోకుల్‌పార్క్, లాసన్స్‌బే బీచ్, తెన్నేటి పార్క్, రుషికొండ (సమీపంలోని సరుగుడు తోటలు) తదితర ప్రాంతాలు మాదక ద్రవ్యాలకు కేరాఫ్‌ అడ్రస్‌లుగా ఉన్నాయి.  

అవగాహన కల్పిస్తాం..
డ్రగ్స్‌ వినియోగంతో వాటిల్లే దుష్ప్రభావాలపై యువత, విద్యార్థినీ విద్యార్థులకు అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తాం. వీటి అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. డ్రగ్స్‌ సరఫరాదార్లపై షీట్లు ఓపెన్‌ చేస్తాం.  –మహేంద్ర మత్తే, ఏసీపీ, టాస్క్‌ఫోర్స్‌.

నిఘా పెడుతున్నాం..
మాదక ద్రవ్యాల సరఫరా, వినియోగంపై నిఘా పెడుతున్నాం. ఇంజినీరింగ్‌ కాలేజీలు, ఆంధ్ర విశ్వవిద్యాలయం పరిసరాలు, వన్‌టౌన్, పోర్టు ఏరియా, ఎయిర్‌పోర్టు, రుషికొండ తదితర ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారిస్తాం. పాడేరు, అరకు ప్రాంతాల్లో గంజాయి చాక్లెట్‌ తయారవుతున్నట్టు సమాచారం ఉంది. డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌లతో కలిసి మందుల షాపుల్లో మత్తు ఇంజక్షన్ల విక్రయాలపై తనిఖీలు నిర్వహిస్తాం. కాలేజీల్లో విద్యార్థులకు, తల్లిదండ్రులకు డ్రగ్స్‌పై అవగాహనా సదస్సులు నిర్వహిస్తాం.–శ్రీనివాసరావు, డిప్యూటీ కమిషనర్, ఎక్సైజ్‌శాఖ.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement