సమావేశంలో మాట్లాడుతున్న కొయ్య ప్రసాదరెడ్డి, చిత్రంలో నాయకులు రొంగలి జగన్నాథం తదితరులు
సాక్షి, విశాఖపట్నం: ప్రశాంతమైన విశాఖ నగరంలో ఈవెంట్ల పేరుతో టీడీపీ నేతలు విష సంస్కృతికి బీజం వేస్తున్నారని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి కొయ్య ప్రసాదరెడ్డి ఆరోపించారు. శుక్రవారం మద్దిలపాలెంలోని పార్టీ నగర కార్యలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అధికార పార్టీ అండదండలతోనే బీచ్‌రోడ్డులో ‘రేవ్ పార్టీ’నిర్వహించారని మండిపడ్డారు. యువతను తప్పుదారి పట్టించి వారికి డ్రగ్స్ సరఫరా చేసిన నిందితులను తక్షణమే శిక్షించాలని డిమాండ్ చేశారు. గతంలో గీతం యూనివర్సిటీలో డ్రగ్స్ పట్టు బడినప్పుడే వైఎస్సార్‌సీపీ నేతలంతా వాటిపై విచారణ జరపాలని ధర్నాలు చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. ఎన్నో ఎళ్లుగా సంపాదించిన విశాఖ బ్రాండ్ ఇమేజ్‌ను పోగొట్టుడానికే అధికార పార్టీ నేతలు గంటా శ్రీనివాసరావు, అయ్యన్నపాత్రుడు, వెలగపూడి రామకృష్ణబాబు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. ప్రశాంతతకు మారుపేరుగా ఉన్న విశాఖ నగరాన్ని డ్రగ్స్ మాఫియాతో అతలాకుతలం చేస్తున్నారన్నారు. బీచ్ రోడ్డులో జరిగిన రేవ్ పార్టీలో డ్రగ్స్ సరఫరా జరిగినట్టు వెలుగులోకి వచ్చి మూడు రోజులైనా ముఖ్యమంత్రి, హోంమంత్రి స్పందించిన పాపానపోలేదని విచారం వ్యక్తంచేశారు. ఈ డ్రగ్స్ మాఫియా వెనుక ఎవరున్నా తక్షణమే వారి అరెస్ట్ చేయాలన్నారు. ఎన్నికల్లో గెలవలేక డేటాచోరీతో అక్రమాలకు పాల్పడ్డారని అన్నారు. విష సంస్కృతికి తెరలేపిన, డ్రగ్స్ మాఫియాను తక్షణమే అరెస్ట్ చేయాలని, లేదంటే మే 23 తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతుందని, దీని వెనుక ఉన్నవారందరినీ జైల్లో ఊసలు లెక్కపెట్టిస్తామన్నారు.
చంద్రబాబుకు చుక్కెదురు
ఏపీ ఎన్నికల్లో ఈవీఎంలు ట్యాంపరింగ్ అయ్యాయని రెండో విడత ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో తప్పుడు ప్రచారం చేయడానకి వెళ్లిన చంద్రబాబు వ్యాఖ్యలను వివిధ రాష్ట్ర ప్రజలు తిప్పికొట్టారన్నారు. చంద్రబాబు ఆకృత్యాలకు మరో 33 రోజుల్లో తెరపడనుందని పేర్కొన్నారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి రొంగలి జగన్నాథం, అదనపు కార్యదర్శి మొల్లి అప్పారావు, రవిరెడ్డి, కన్నబాబు, పార్టీ సీనియర్ నాయకులు పీలా ఉమారాణి, సతీష్‌వర్మ, నగర అనుబంధ విభాగాల అధ్యక్షులు పీలా వెంకటలక్ష్మీ, బోని శివరామకృష్ణ, కలిదిండి బద్రీనాథ్, యువశ్రీ, సత్యాల సాగరిక,బి. కాంతారావు, బాకీ శ్యాంకుమార్‌రెడ్డి, పి.రామారావు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment