నో మోర్ సైలెన్స్ | No more Silence | Sakshi
Sakshi News home page

నో మోర్ సైలెన్స్

Published Sat, Jan 17 2015 11:11 PM | Last Updated on Sat, Sep 2 2017 7:49 PM

నో మోర్ సైలెన్స్

నో మోర్ సైలెన్స్

ఆటపాటలు, స్టేజ్ షోలు..వీటితో పాటు తొలిసారి ‘ఎల్‌జీబీటీ’ కళాకారులు చిత్రించిన బొమ్మలూ కొలువుదీరాయి. ప్రతి పాట..ఆట.. ప్రతి చిత్రం.. వాళ్ల జీవనశైలిని గౌరవించమని చెబుతున్నవే!. ఈ వేడుక కేవలం జెండర్ మైనారిటీల కోసమే నిర్వహించింది కాదు. వాళ్ల ఉనికిని హేళన చేస్తున్న సమాజం కోసం కూడా! వాళ్లను అర్థం చేసుకునే వేదికైంది!.  అందుకే ఆ ఆవరణలో ఓ తల్లి కనిపించింది కొడుకు (గే)కి అండగా, ఓ అక్క వచ్చింది చెల్లి (ట్రాన్స్‌జెండర్)కి తోడుగా, ఓ స్నేహితురాలు హాజరైంది తోటి స్నేహితురాలి (బై సెక్సువల్)కి మద్దతుగా, తండ్రీ ఉన్నాడు కూతురు కోసం (లెస్బియన్).. ఆశ్చర్యంగా నిశ్శబ్దం బద్దలైంది.. చర్చ మొదలైంది ఓ తల్లి నుంచే!.
 
 మేమున్నాం..
‘నేనో ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాను. నాకు ఒక్కడే కొడుకు. వాడు డాక్టర్. తను ‘గే’ అనేది తను ఎంబీబీఎస్ చదువుతున్నప్పుడు తెలిసింది. వినగానే నేనేమీ కుంగిపోలేదు. ‘ఓకే నాన్నా.. డోంట్‌వర్రీ..’ అన్నాను. కౌన్సెలింగ్‌కి ఒప్పించాను. తర్వాత ఇంటర్నెట్‌లో, ఇంగ్లిష్ మ్యాగజైన్స్‌లో ఎల్‌జీబీటీ గురించి సమాచారం తెలుసుకున్నాక తనను అర్థం చేసుకోవడం మొదలుపెట్టాను. అయితే నా ప్రవర్తనకు మా అబ్బాయి ఆశ్చర్యపోయాడు. ‘అమ్మేంటి? నేను చెప్పింది విని అరుస్తుంది, ఏడుస్తుంది అనుకుంటే ఇంతలా నాకు సపోర్ట్ చేస్తుంది’ అని.

కొన్నాళ్లకి మావారికీ నెమ్మదిగా విషయం చెప్పాను. అతనూ అర్థం చేసుకున్నాడు. తప్పు మా పిల్లాడిది కాదు కదా!. వాడి బర్త్ అలా ఉన్నప్పుడు మా అబ్బాయినెందుకు శిక్షించాలి? పైగా వీళ్లు సమాజంలో ఎవరినీ ఇబ్బంది పెట్టట్లేదు. వాళ్ల బతుకేదో వాళ్లు బతుకున్నారు. ఇది పూర్తిగా కుటుంబ విషయం. రేపొద్దున్న నా కొడుకు ఇంకో అబ్బాయితో సహజీవనం చేసినా మాకు సమ్మతమే. ఇలాంటి పిల్లల్ని ముందు తల్లిదండ్రులే అర్థం చేసుకోవాలి. అప్పుడే సమాజమూ వాళ్లను గౌరవిస్తుంది’ అంటూ తన గళమిప్పింది ఆ అమ్మ.
 
 ముందు మాట్లాడలేదు..
జర్నలిజం అండ్ సైకాలజీలో గ్రాడ్యుయేషన్ చేస్తున్న అమృతా లారెన్స్ అయితే- ‘నేను బై సెక్సువల్‌ని. ఇంటర్‌లో ఉన్నప్పుడు నా సెక్సువాలిటీ ఏంటో తెలియక చాలా స్ట్రగుల్ అయ్యాను. అబ్బాయిలను చూస్తే ఎలాంటి ఫీలింగ్స్ కలిగేవో, అమ్మాయిలను చూసినా అలాంటి ఫీలింగ్సే కలిగేవి. చదువుని నెగ్లెక్ట్ చేశాను. ఆ టైమ్‌లోనే లండన్‌లో ఉన్న నా ఫ్రెండ్ జెన్నిఫర్‌తో నా పరిస్థితి గురించి డిస్కస్ చేశాను. అప్పుడు నా మెదడు చేసే అలజడిని ఏమంటారో తెలిసింది. నా ఉనికేంటో అర్థమైంది. ఏదైనా బతకాలని ధైర్యం తెచ్చుకున్నాను. చదువు మీద శ్రద్ధ పెట్టాను. డిగ్రీ ఫస్టియర్ ఎండింగ్‌లో నాన్నకు చెప్పాను. అప్పటికే అమ్మ చనిపోయింది. నేను చెప్పింది విన్న నాన్న రెండు రోజులు నాతో మాట్లాడలేదు. తర్వాత- ‘నువ్వేంటో నీకు తెలుసు కాబట్టి.. ఎలా ఉండాలో కూడా తెలుసుకున్నావ్ కాబట్టి తండ్రిగా నా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది.
 
 కానీ ఏం చేయాలనుకున్నా చెప్పి చెయ్. ఏదీ దాచొద్దు’ అని చెప్పాడు. ఆ రెండు రోజులు నాన్న నాలాంటి వాళ్ల గురించిన సమాచారం తెలుసుకున్నాడు. మాకు ఎలాంటి సపోర్ట్ కావాలో అర్థం చేసుకున్నాడు. బయట కూడా నా గురించి దాచను. నచ్చిన వాళ్లు నాతో ఉంటారు. నచ్చని వాళ్లు తప్పుకుంటారు. కొంతమంది మాటలతో పించ్ చేస్తుంటారు. ఇవేమీ పట్టించుకోను. నేనో మంచి రైటర్‌ని కావాలి, అంతకన్నా గొప్ప ఫొటో జర్నలిస్ట్‌ని కావాలి, నాకు నచ్చినట్టు బతకాలి.. ఇవే నా లక్ష్యాలు’ అని చెబుతుంది ఎంతో నిర్భయంగా.
 
 వాళ్లూ మనలాంటి మనుషులే..
సమాజంలో రకరకాల మనుషులున్నారు. జెండర్ మైనారిటీస్‌ను గౌరవంగా చూడడమనేది యూత్ నుంచే మొదలవ్వాలి. యూతే భావి నిర్ణేతలు కాబట్టి.. వాళ్ల ఆలోచనల్లో మార్పు రావాలి. వాళ్ల వల్ల ఇతరులకు ఇబ్బంది లేనప్పుడు సొసైటీ నుంచి వాళ్లనెందుకు ఐసోలేట్ చేయాలి? వాళ్ల ఆత్మగౌరవాన్నెందుకు కించపర్చాలి? వాళ్లకూ మనసుంది, మనం గౌరవించాలి.     
 - ప్రాప్తి, సెయింట్ జోసెఫ్స్ కాలేజ్
 
శ్రేయస్సు కాంక్షిస్తున్నారు..
 జెండర్ మైనారిటీస్‌కున్న స్కిల్స్, వ్యక్తిత్వాలు ఎంత అద్భుతమైనవో చాటేందుకు నిర్వహిస్తున్నదే ఈ కార్నివాల్. ఆర్ట్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్‌లో వాళ్లకున్న ప్రావీణ్యం, వాళ్లు ఎలాంటి లైఫ్‌ని లీడ్ చేస్తున్నారో ఈ ఉత్సవంలో పాల్గొంటే తెలుస్తుంది. వాళ్లు అనాథ పిల్లలకు చదువులు చెప్పిస్తున్నారు, వైద్య సేవలందిస్తున్నారు. జెండర్ మైనారిటీస్‌కి, సమాజానికి మధ్య ఉన్న అంతరాన్ని చెరిపేయడానికే ఈ వేడుకను నిర్వహిస్తున్నాం. కిందటేడు ఎల్‌జీబీటీస్ కన్నా మిగిలినవాళ్లే ఎక్కువొచ్చారు. ఇప్పుడూ అదే రెస్పాన్స్.                       
 - నవదీప్, కార్నివాల్ నిర్వహణలో భాగస్వామి
 
క్వీర్ క్యాంపస్ నేపథ్యమిదీ..
లెస్బియన్, గే, బై సెక్సువల్, ట్రాన్స్‌జెండర్.. వాళ్లూ మనుషులే. వారికీ ఆత్మ గౌరవం ఉంటుంది. అది వారి ప్రాథమిక హక్కు. వారికి మిగిలిన సమాజానికి మధ్య దూరాన్ని తగ్గించేందుకు పుట్టిందే క్వీర్ క్యాంపస్. చాన్నాళ్ల కిందట ఇది జర్మనీలో మొదలైంది. ఆపై దిల్లీ, కోల్‌కతా, ముంబై నగరాలను దాటి కిందటేడాది హైదరాబాద్ చేరుకుంది. ఇక్కడిది ఊపిరిపోసుకోవడానికి ఆద్యులు అభి, సత్య అనే యువకులు. ‘మా గళం వినిపించడానికి ఓ వేదిక కావాలి.
 
 మనసులో మాటను ఆటపాటగా అందిస్తే అందరికీ చేరుతుంది. ఆలోచనలు రేకెత్తిస్తుంది. అలా మా ఉనికి పోరాటాన్ని గౌరవప్రదంగా మలచడానికి, దాని గురించి అందరికీ అవగాహన కల్పించడానికి అప్పటికే మనుగడలో ఉన్న ఈ క్వీర్ క్యాంపస్‌ను డయాస్‌గా మలచుకోవాలనుకుని నిరుడు క్వీర్ క్యాంపస్ హైదరాబాద్‌ను స్టార్ట్ చేశాం. త్వరలో ఇతర పట్టణాలకు, ఊళ్లకూ స్ప్రెడ్ చేయాలనుకుంటున్నాం’ అని చెబుతాడు అభి.
 - సరస్వతి రమ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement