
అనకాపల్లిలో రెండు చోట్ల లభ్యమైన మిగతా శరీర భాగాలు
సహజీవనం చేస్తున్న వ్యక్తిపైనే అనుమానం
పోలీసుల అదుపులో నిందితుడు?
అనకాపల్లి టౌన్/కశింకోట/మునగపాక: బయ్యవరం వద్ద లభించిన శరీర భాగాలతో వెలుగు చూసిన వ్యక్తి హత్య కేసులో మిస్టరీ వీడింది. బుధవారం మరో రెండు చోట్ల మిగతా శరీర భాగాలు లభ్యం కావడంతో హత్యకు గురైన వ్యక్తిని ట్రాన్స్‌జెండర్‌గా గుర్తించారు. బయ్యవరం వద్ద జాతీయ రహదారి వంతెన కింద మంగళవారం ఒక చేయితోపాటు నడుం కింద శరీర భాగాలతో ఉన్న మూట దొరకడంతో గుర్తు తెలియని మహిళ హత్యగా భావించిన పోలీసులు వాటిని అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రికి తరలించి భద్రపరిచిన సంగతి తెలిసిందే.
ఏడు ప్రత్యేక పోలీసు దర్యాప్తు బృందాలు మృతదేహం మిగిలిన భాగాల కోసం గాలింపు చేపట్టాయి. అనకాపల్లిలో డైట్ కళాశాల వద్ద జాతీయ రహదారి పక్కన జలగల మదుం వద్ద కాలువలో హతురాలి తల భాగం, ఎడమ చేయి లభ్యమయ్యాయి. మండలంలోని తాళ్లపాలెం జాతీయ రహదారి వంతెన దిగువన మొండెం భాగం సంచిలో లభ్యమైంది. వీటిని పరిశీలించి హత్యకు గురైన వ్యక్తిని అనకాపల్లి గవరపాలెం ముత్రాసు కాలనీకి చెందిన మైపల దిలీప్ శివశంకర్ అలియాస్ దీపు (40)గా గుర్తించారు. ప్రత్యేక బృందాలు విచారిస్తున్నట్లు స్థానిక సీఐ అల్లు స్వామినాయుడు తెలిపారు. హత్యకు కారకునిగా భావిస్తున్న పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండకు చెందిన నిందితుడ్ని అదుపులోకి తీసుకొని హత్యకు గల కారణాలపై విచారిస్తున్నట్లు సమాచారం.
ఎనిమిదేళ్ల క్రితం వివాహం
పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన వ్యక్తితో 8 సంవత్సరాల క్రితం దీపు వివాహం చేసుకొని మునగపాక మండలం నాగులాపల్లి వద్ద నివాసముంటున్నారు. ఆనవాళ్లను బట్టి పోలీసులు మృతదేహాన్ని గుర్తించి నాగులాపల్లిలోని దీపు ఇంటికి క్లూస్ టీమ్‌ను తీసుకొని వెళ్లారు. గదిలో ఎటువంటి ఆనవాళ్లు లేకుండా నిందితుడు జాగ్రత్త పడినట్టు తెలిసింది.
పోలీసులు నిందితులను పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్న సమయంలో బుధవారం అనకాపల్లికి చెందిన హిజ్రాలందరూ తమ వర్గానికి చెందిన వ్యక్తి చనిపోయినట్లుగా గుర్తించి అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రి వద్ద ధర్నాకు దిగారు. నిందితులను తక్షణమే ఎన్‌కౌంటర్ చేయాలని, లేనిపక్షంలో తమ సంఘానికి అప్పగించాలని ఎన్టీఆర్ ఆస్పత్రి నుంచి ర్యాలీగా నెహ్రుచౌక్‌కు చేరుకొని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా హిజ్రాలు కొండబాబు, భారతమ్మలు మాట్లాడుతూ నిందితుడిగా అనుమానిస్తున్న వ్యక్తి, దీపు గత కొంతకాలంగా కలిసి ఉంటున్నారన్నారు. హత్య జరిగిన ముందు రోజు కూడా కలిసే ఉన్నారని తెలిపారు. గతంలో హిజ్రాలపై హత్యలు జరిగినప్పటికీ నేటి వరకూ పోలీసులు పట్టించుకోలేదని రోజురోజుకు హిజ్రాలపై దాడులు జరుగుతున్నాయన్నారు. అనంతరం నెహ్రుచౌక్ నుంచి ర్యాలీగా వచ్చి డీఎస్పీ శ్రావణితో హిజ్రాలు మాట్లాడారు.
Comments
Please login to add a commentAdd a comment