గే, లెస్బియన్, బై సెక్సువల్, ట్రాన్స్ జెండర్ (ఎల్ జీబీటీ) కమ్యూనిటీలకు చెందిన ఏకైక వెబ్ సైట్ ను పాకిస్థాన్ నిషేధించింది. ఇంటర్నెట్ వినియోగదారుల ఫిర్యాదు మేరకు పాకిస్థాన్ టెలికాం అధికారులు వెబ్ సైట్(queerpk.com) ను తొలగించారు. అత్యధికంగా ఫిర్యాదులు రావడంతో వినియోగదారులకు అందుబాటులో ఉండకుండా ఎల్ జీబీటీ వెబ్ సైట్స్ ను ఇంటర్నెట్ నుంచి తొలగించినట్టు టెలికాం అధికారులు తెలిపారు. గే కమ్యూనిటీని ఆదరించండి అంటూ ప్రారంభించిన వెబ్ సైట్ ను నిషేధిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని కోర్టులో సవాల్ చేస్తామని సంబంధిత నిర్వాహకులు తెలిపారు.
అయితే ఇస్లాం మతానికి వ్యతిరేకంగా ఉన్న వెబ్ సైట్ పై కేసును వాదించడానికి పాకిస్థాన్ కు చెందిన లాయర్లు ఎవరూ కూడా ముందుకు రాలేదని నిర్వహకులు వెల్లడించారు. ఇలాంటి వెబ్ సైట్ ను నిర్వహించడం పెద్ద సవాల్ అని. అన్నారు. అయినప్పటికి.. సమాచారం పొందుపరచడంలో అనేక జాగ్రత్తలను పాటిస్తున్నామన్నారు. నెటిజన్లకు వెబ్ సైట్ ను http://humjins.com ద్వారా అందుబాటులోకి తెచ్చామని అధికారులు తెలిపారు. స్వలింగ సంపర్కం పాకిస్థాన్ చట్ట విరుద్దం కావడంతో ఇలాంటి వెబ్ సైట్లను నిర్వహించే క్రమంలో అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నామన్నారు.