LGBT
-
తప్పయి పోయింది క్షమించండి.. బ్రిటీష్ ప్రధాని రిషి సునాక్
లండన్: ఇంగ్లాండ్ ప్రధాని రిషి సునాక్ బ్రిటీష్ హౌస్ ఆఫ్ కామన్స్ లో సంచలన వ్యాఖ్యలు చేశారు. బ్రిటీష్ సైన్యానికి గతంలో ప్రాతినిధ్యం వహించిన స్వలింగసంపర్కులైన సైనికులకు బ్రిటీష్ ప్రభుత్వం తరపున క్షమాపణ చెప్పారు. సైన్యంలోకి వారిని తీసుకోకుండా నిషేధించడం బ్రిటీష్ ప్రభుత్వం యొక్క ఘోర వైఫల్యమని అన్నారు. దయచేసి క్షమించండి.. రిషి సునాక్ మాట్లాడుతూ ఏమన్నారంటే.. 2000 సంవత్సరానికి ముందు వ్యక్తిగత అభిప్రాయాల ఆధారంగా స్వలింగ సంపర్కులైన సైనికులపై బ్రిటీష్ ప్రభుత్వం వ్యవహరించిన తీరు అమానుషం. స్వలింగ సంపర్కులను సైన్యం నుండి నిషేధిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వారి జీవితాల పైనా వారి కుటుంబాలపైనా ఎంతటి తీవ్ర ప్రభావం చూపిందో మేము అర్ధం చేసుకున్నాము. ఆరోజున వివక్షకు గురైన ఆనాటి వీరులందరికీ బ్రిటీష్ ప్రభుత్వం తరపున క్షమాపణలు చెబుతున్నాను. మీరు కూడా మిగతా సైన్యంలాగే దేశం కోసం చేసిన త్యాగాలను, క్లిష్ట సమయాల్లో చూపిన ఆపార ధైర్య సాహాసాలను తలచుకుని గర్వపడాలన్నారు. ఆయన ఈ ప్రకటన చేయగానే సభ్యులంతా హర్షాతిరేకాలు తెలిపారు. యూకే డిఫెన్స్ సెక్రటరీ బెన్ వాలెస్ మాట్లాడుతూ.. 1967-2000 మధ్యలో అనుభవజ్ఞులైన ఎందరో స్వలింగసంపర్కులైన సైనికులు చాలా వివక్షకు గురయ్యారు. సైన్యంలోకి వారిని నిషేధించడంతో వారి జీవితాలు ఛిద్రమయ్యాయి. బ్రిటీష్ సాయుధ దళాల చరిత్రలోనే అదొక అవమానకరమైన సహించరాని పొరపాటని అన్నారు. On a historic day, the Prime Minister @10DowningStreet has apologised on behalf of the British state for the treatment of veterans who were affected by the ban on LGBT personnel before 2000.https://t.co/FHIu0baTEU pic.twitter.com/3a8trpaJgI — Office for Veterans' Affairs (@VeteransGovUK) July 19, 2023 ఇది కూడా చదవండి: ప్రపంచ కప్ టోర్నమెంటుకు ముందు కాల్పుల కలకలం.. ఇద్దరి మృతి -
కూతుళ్ల కోసం ‘తల్లి’గా మారాడు!
క్విటో(ఈక్వెడార్): కన్న కూతుళ్లంటే ఆ తండ్రి ఎంతో ఇష్టం. విడిపోయిన భార్య వద్ద ఉన్న ఇద్దరు కూతుళ్ల కస్టడీ తనకే ఇవ్వాలంటూ కోర్టులో కేసు వేశాడు. అయితే, తల్లి వద్దే కూతుళ్లు ఉండాలంటుంది చట్టం. అందుకే, కూతుళ్లకు తల్లి ప్రేమను పంచేందుకు దుస్సాహసమే చేశాడు ఆ తండ్రి. ఏకంగా లింగమార్పిడి చేసుకుని మహిళగా మారాడు. ఇప్పుడైనా చట్టం కూతుళ్లను తన వద్దకే పంపిస్తుందని ఆశపడుతున్నాడు..! ఈ ఘటన దక్షిణ అమెరికా దేశం ఈక్వెడార్‌లో చోటుచేసుకుంది. న్యూయార్క్ పోస్ట్ కథనం ప్రకారం.. రెనె సలినాస్ రమోస్(47), అతని భార్య విడిపోయారు. చట్టం ప్రకారం వీరి సంతానం తల్లి సంరక్షణలోనే ఉండాలి. మహిళ మాత్రమే బిడ్డలకు ప్రేమను అందిస్తుందని చట్టం అంటోంది. భార్య ఐదు నెలలుగా కూతుళ్లను కలుసుకునే అవకాశం లేకుండా చేస్తోందని అంటున్నాడు. తనకెంతో ఇష్టమైన కూతుళ్లు దూరం కావడం తట్టుకోలేని రమోస్ మరో మార్గం ఆలోచించాడు. ఏకంగా లింగమార్పిడి చేయించుకుని, మహిళగా మారాడు. అధికార రికార్డుల్లో మహిళగానే ఉన్నా, నిత్య జీవితంలో పురుషుడిగానే చెలామణి అవుతున్నాడు. మహిళగా మారినందున, కోర్టు కేసు గెలుస్తాననే నమ్మకంతో ఉన్నాడు. తల్లి వద్ద ఇబ్బందులు పడుతున్న తన బిడ్డలకు తల్లిగా మారుతానంటున్నాడు. ఈక్వెడార్ ఎల్జీబీటీఐ హక్కుల సంస్థలు మాత్రం రమోస్ చర్యపై మండిపడుతున్నాయి. -
ఈ డాక్టర్లకు ఆల్ ది బెస్ట్
హైదరాబాద్‌లో ఇద్దరు డాక్టర్లు ప్రభుత్వ ఆసుపత్రిలో నియామకం పొందారు. అదేం పెద్ద విశేషం? విశేషమే. ఎందుకంటే వీరిద్దరూ ట్రాన్స్జెండర్లు. గత కొంతకాలంగా దేశంలో తమ ఆత్మగౌరవం కోసం, ఉపాధి కోసం, హక్కుల కోసం పోరాడుతున్న ‘ఎల్జిబిటి’ సమూహాలకు ఈ నియామకం ఒక గొప్ప గెలుపు. అందుకే వీరికి ఆల్ ది బెస్ట్ చెప్పాలి. గత వారం ప్రాచీ రాథోడ్ (30), రూత్ జాన్ పాల్ (28) ఉస్మానియా జనరల్ ఆస్పత్రిలో హెచ్.ఐ.వి రోగులకు చికిత్స అందించే ఏ.ఆర్.టి విభాగంలో వైద్యాధికారులుగా నియమితులయ్యారు. వీరు రాష్ట్రంలో డాక్టర్లుగా బాధ్యతలు చేపట్టిన తొలి ట్రాన్స్జెండర్లు కావడం విశేషం. కొత్త చరిత్రకు నాంది పలికిన వీరు ‘సాక్షి’ తో తమ అనుభవాలు పంచుకున్నారు. మా కమ్యూనిటీకి విజయమిది... ఈ ఇద్దరిలో డాక్టర్ రూత్‌ది ఖమ్మం. డాక్టర్ ప్రాచీ రాథోడ్‌ది ఆదిలాబాద్ జిల్లా. చిన్న వయసులోనే డాక్టర్లు కావాలని కలలు కన్నప్పటికీ, కుటుంబ సభ్యుల మద్దతు కరువై, స్కూల్లో తోటి విద్యార్థుల వేధింపులు, సమాజంలో చిన్నచూపు వంటివి ఎదుర్కొంటూనే లక్ష్యాన్ని సాధించగలిగారు. తమలాంటి ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు. ప్రభుత్వ రంగంలో భాగస్వామ్యం కోసం పోరాడుతున్న ట్రాన్స్ జెండర్ కమ్యూనిటీకి ఇదొక చారిత్రాత్మక విజయం అని వీరు అంటున్నారు. అర్హత ఉన్నా... తిరస్కరించారు... ‘మల్లారెడ్డి వైద్య విజ్ఞాన సంస్థలో 2018లో వైద్యవిద్య పూర్తి చేసినప్పటి నుంచి ఉద్యోగం కోసం విఫలయత్నాలు ఎన్నో చేశా. సిటీలో కనీసం 15–20 ఆసుపత్రులు ఉద్యోగ దరఖాస్తులను తిరస్కరించాయి. దీనికి కారణం మా జెండర్ అని ముఖం మీద చెప్పలేదు. కానీ అది మాకు అర్ధమైంది’ అన్నారు డా.రూత్.. తొలుత ఓ ఆసుపత్రిలో ఇన్ టర్న్షిప్ చేస్తున్నప్పుడు తనకు ఏ సమస్యా రాలేదనీ ∙లింగ మార్పిడి విషయం బయటపెట్టిన తర్వాతే తనకు ఇబ్బందులు ఎదురయ్యాయని చెప్పారామె. తన అర్హతలను కాకుండా జెండర్‌నే చూశారన్నారు. తెలిశాక... వద్దన్నారు... డాక్టర్ ప్రాచీ రాథోడ్ రిమ్స్ నుంచి డిగ్రీ పూర్తి చేసి ప్రైవేట్‌రంగంలో పనిచేస్తూ కెరీర్ ప్రారంభించారు. సిటీలో ఓ ఆస్పత్రిలో పని చేస్తూనే ఎమర్జెన్సీ మెడిసిన్ లో డిప్లొమా చేశారు. సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో మూడేళ్లపాటు పని చేశారు. తన మార్పిడి గురించి తెలిశాక.. రోగులరాకకు ఇబ్బంది అవుతుందని ఆసుపత్రి భావించడంతో ఉద్యోగం పోగొట్టుకున్నారు. ఏపీలో పెన్షన్ భేష్ ‘ఉస్మానియాలో సహ వైద్యులు, రోగులు బాగా సహకరిస్తున్నారు. ఎటువంటి ఇబ్బందులూ లేకపోవడం సంతోషంగా ఉంది’ అని వీరు చెప్పారు. పొరుగునే ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో ట్రాన్స్జెండర్లకు పింఛనుగా ఏటా రూ.10 వేలు ఇస్తున్న విషయాన్ని ప్రస్తావిస్తూ అలాంటి ప్రత్యేక సహాయ సహకారాలు అన్ని చోట్లా మొదలు కావాలని ఆశిస్తున్నామన్నారు. ‘మేమిద్దరం ట్రాన్స్ఉమెన్ గా నీట్ పీజీ పరీక్షలను రాశాము, అయితే థర్డ్ జెండర్‌ను గుర్తించి అడ్మిషన్ ను మంజూరు చేసేందుకు వీలు కల్పించిన 2014 నాటి సుప్రీం కోర్ట్‡ తీర్పుకు అనుగుణంగా రిజర్వ్డ్ సీట్లు పొందలేదు’ అని చెప్పారు. తమ కమ్యూనిటీకి జరుగుతున్న అన్యాయాలపై గళమెత్తుతామని, సమాజంలో సమాన హక్కులకై పోరాడుతూనే ఉంటామని స్పష్టం చేస్తున్నారు. దేశంలోనూ అక్కడక్కడ వైద్య రంగంలో కెరీర్ ఎంచుకుంటున్న ట్రాన్స్‌జెండర్స్ దేశంలో మరికొన్ని ప్రాంతాల్లోనూ కనిపిస్తున్నారు. కర్ణాటకలో త్రినేత్ర హల్దార్ గుమ్మరాజు ట్రాన్స్ డాక్టర్‌గా, యాక్టివిస్ట్‌గా జాతీయస్థాయిలో పేరొందారు. అలాగే కేరళకు చెందిన వి.ఎస్.ప్రియ కూడా లింగమార్పిడి చేయించుకున్న తొలి వైద్యురాలిగా రాణిస్తున్నారు. ఇప్పటికే రెండు ట్రాన్స్‌జెండర్ క్లినిక్స్ ప్రారంభించిన తొలి నగరంగా సిటీ నిలిచింది. ఇద్దరు ట్రాన్స్ డాక్లర్లకు చిరునామాగా నిలిచిన ఘనతను కూడా తన సొంతం చేసుకుంది. ఒకే తరహా కష్టం కలిపింది స్నేహం అనేకానేక బాధాకరమైన అనుభవాల తర్వాత బతుకుదెరువు వేటలో భాగంగా వీరు ఇద్దరూ వేర్వేరుగా గత ఏడాది నారాయణగూడలో ఎన్.జి.ఓ ఆధ్వర్యంలో ప్రారంభమైన ట్రాన్స్‌జెండర్ క్లినిక్ ‘మిత్ర్’లో చేరారు. మంచి స్నేహితులయ్యారు. ఒకే తరహా సమస్యల మధ్య ఏర్పడిన తమ స్నేహం వేగంగా దృఢమైన బంధంగా బలపడిందనీ ఒకరి కొకరు తోడుగా, తోడబుట్టిన అక్కచెల్లెళ్లను మించి సాగుతోందని వీరు చెప్పారు. ప్రతీ సందర్భంలోనూ ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ ముందుకు సాగుతున్నామంటున్నారు. – ఎస్.సత్యబాబు సాక్షి, సిటీబ్యూరో -
'నేనొక లెస్బియన్'.. రష్యన్ టెన్నిస్ స్టార్ సంచలన వ్యాఖ్యలు
రష్యన్ మహిళా టెన్నిస్ స్టార్.. ప్రపంచ నెంబర్ 12.. డారియా కసత్కినా స్వలింగ సంపర్కంపై సంచలన ఆరోపణలు చేసింది. తాను లెస్బియన్ అని సగర్వంగా చెప్పుకుంటున్నాని.. ఎల్జీబీటీక్యూ(LGBTQ), హోమో సెక్సువల్పై రష్యా అనుసరిస్తున్న విధానాలను వ్యతిరేకిస్తూ ఈ వ్యాఖ్యలు చేసింది. ఇక 1993లోనే మాస్కో అధికారికంగా స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణించింది. 2013 నుంచి స్వలింగ సంపర్కం అనే పదం వినిపించడానికి వీల్లేదని.. ఎక్కడా కూడా ఆ పదం వాడకూడదంటూ నిషేధం విధించింది. ఇటీవలే రష్యా ప్రజా సముదాయాల్లో సాంప్రదాయేతర లైంగిక సంబంధాలపై సమాచారాన్ని నిషేధించే మరిన్ని ప్రతిపాదనలను తీసుకొచ్చింది. దీంతో దేశంలో స్వలింగ సంపర్కులు కన్నెర్రజేశారు. తాను లెస్బియన్ అన్న విషయాన్ని ట్విటర్ వేదికగా ప్రకటించిన కసత్కినా.. రష్యన్ స్కేటింగ్ క్రీడాకారిణి నటాలియా జబైకో తో కలిసి ఉన్న ఫోటోను పంచుకుంటూ ‘మై క్యూటీ పై’ అని షేర్ చేసి అందరిని ఆశ్చర్యపరిచింది. ఆ తర్వాత ఒక యూట్యూబ్ ఛానెల్లో మాట్లాడుతూ.. ‘రష్యాలో ఇంతకంటే ముఖ్యమైన అంశాలెన్నో నిషేధించడానికి ఉన్నాయి. అయితే ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయమేమీ షాకింగ్ గా అనిపించలేదు..ప్రభుత్వం చెప్పినట్టు మీ భాగస్వామితో గదిలోనే జీవించడం, బయట మాట్లాడకపోవడం అనే దాంట్లో అర్థం లేదు. మీరు దాని గురించి మాట్లాడుకోవాల్సి వస్తే అది మీ ఇష్టం. ఏం చెప్పాలి..? ఏం చెప్పకూడదు అనేది వ్యక్తులకు సంబంధించిన విషయం.’అని తెలిపింది. కాగా గతవారం రష్యన్ మహిళా ఫుట్‌బాలర్ నడ్య కరపోవా కూడా స్వలింగ సంపర్కంపై తనదైన శైలిలో స్పందించింది. కసత్కినా స్పందిస్తూ.. ‘కరపోవా ఈ విషయంలో మాట్లాడినందుకు చాలా సంతోషం. కానీ ఇంకా చాలా మంది మాట్లాడాలి. ముఖ్యంగా అమ్మాయిలు దీని మీద గళం వినిపించాలి. ఇలాంటి సందర్భాల్లో యువతకు మద్దతు కావాలి.మరీ ముఖ్యంగా క్రీడలలో ఉండే వ్యక్తులు చాలామందిని ప్రభావితం చేయగలుగుతారు. వాళ్ల ఈ సమస్య గురించి విరివిగా మాట్లాడాలి.’ అని పేర్కొంది. @DKasatkina mama I’m a criminal pic.twitter.com/cCU05hr9tv — Natalia Zabiiako (@NataliaZabiiako) July 19, 2022 చదవండి: World Athletics Championships 2022: షెల్లీ... జగజ్జేత మళ్లీ -
Virat Kohli: కోహ్లికి చెందిన రెస్టారెంట్‌పై సంచలన ఆరోపణలు
Virat Kohli Restaurant One8 Commune Faces Allegations From LGBTQIA+ Group: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లికి చెందిన రెస్టారెంట్ చైన్ వన్8 కమ్యూన్‌పై ఎల్జీబీటీక్యూఐఏ ఆక్టివిజమ్ గ్రూపు ‘‘ఎస్.. వి ఎగ్జిట్’’ తీవ్ర ఆరోపణలు చేసింది. స్వలింగ సంపర్కుల పట్ల ఈ రెస్టారెంట్ వివక్ష చూపుతోందని ఆరోపించింది. వన్8 కమ్యూన్ పుణె బ్రాంచ్‌లో తమకు ఎదురైన చేదు అనుభవమే ఇందుకు నిదర్శనమని సదరు గ్రూపు సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. తన రెస్టారెంట్ నిర్వాహకులు ఇలా వ్యవహరిస్తున్నారన్న విషయం కోహ్లికి తెలిసి ఉండదన్న ‘‘ఎస్.. వి ఎగ్జిట్’’ గ్రూపు... ఏదేమైనా ఇలా తమ పట్ల వివక్ష చూపడం ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని వాపోయింది. ఈ మేరకు..‘‘విరాట్ కోహ్లి నీకు ఈ విషయం తెలియదనే అనుకుంటున్నాం. వన్8 కమ్యూన్ పుణె బ్రాంచ్ ఎల్జీబీటీక్యూఐఏ గెస్టుల పట్ల వివక్షపూరితంగా వ్యవహరిస్తోంది. మీ రెస్టారెంటులోని మిగతా బ్రాంచీలు కూడా ఇదే తరహాలో వ్యవహరిస్తున్నాయి. ఇది మేమసలు ఊహించలేదు. ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదు. ఈ విషయం తెలిసిన తర్వాత మీరు నిబంధనలు మారుస్తారనే అనుకుంటున్నాం. జొమాటోకు కూడా మా విజ్ఞప్తి. ఇలాంటి రెస్టారెంట్లతో మీరు భాగస్వామ్యం కావొద్దు’’ అని ‘‘ఎస్.. వి ఎగ్జిట్’’ గ్రూపు ఇన్‌స్టాలో ఓ పోస్టు షేర్ చేసింది. కాగా ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనం ప్రకారం... పుణె బ్రాంచ్‌లో గేలకు ఎంట్రీ లేదని వన్8 కమ్యూన్ తెలిపినట్లు సమాచారం. అయితే, ఈ విషయంపై స్పందించిన రెస్టారెంట్ నిర్వాహకులు.. ఇవి కేవలం ఉద్దేశపూర్వకంగా చేసిన ఆరోపణలు మాత్రమేనని కొట్టిపారేశారు. తాము కేవలం స్టాగ్స్ ఎంట్రీ(ఒంటరిగా వచ్చే అబ్బాయిలు)పై మాత్రమే ఆంక్షలు విధించామని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో వన్8 కమ్యూన్ పుణె బ్రాంచ్‌కు చెందిన అమిత్ జోషి మాట్లాడుతూ.. ‘‘మేమెలాంటి లింగ వివక్ష చూపడం లేదు. ఒంటరిగా వచ్చే అబ్బాయిలను మాత్రమే లోపలికి అనుమతించడం లేదు. అది కూడా మహిళల భద్రతా దృష్ట్యా. అంతకుమించి వేరే ఉద్దేశం ఏమీ లేదు’’ అని వివరణ ఇచ్చారు. చదవండి: IND vs NZ T20I Series 2021: భారత్‌తో టీ20 సిరీస్ ముందు కివీస్‌కు షాక్.. తప్పుకొన్న విలియమ్సన్.. ఎందుకంటే.. View this post on Instagram A post shared by Yes, We Exist (@yesweexistindia) -
కరోనా వ్యాప్తికి ‘గే పెళ్లిళ్లు’ కారణమంట
మహమ్మారి కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తోంది. ఆ వైరస్ వ్యాప్తికి కారణాలు ఇంకా తెలుసుకునే పని కొనసాగుతోంది. ఈ క్రమంలో ఓ రాజకీయ నాయకుడు ఓ కొత్త కారణం చెప్పారు. అది జరగడం వలన కరోనా వ్యాప్తి మొదలైందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయనెవరో కాదు స్కాట్లాండ్ దేశానికి చెందిన రాజకీయ నాయకుడు పీటర్ జెయిట్. ఓ ఆంగ్ల పత్రిక చేసిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేయడంతో వైరల్‌గా మారాయి. పీటర్ టెయిట్ స్కాట్లాండ్లోని షెట్ల్యాండ్లో రాజకీయ నాయకుడు పీటర్. 2019లో జరిగిన ఉప ఎన్నికల్లో స్వంతంత్ర అభ్యర్థిగా పీటర్ పోటీ చేశాడు. అయితే పోటీ చేసిన పది మందిలో అతి తక్కువ ఓట్లు వచ్చిన వ్యక్తిగా పీటర్ నిలిచాడు. ఇటీవల ఆయనను స్థానిక మీడియా ఇంటర్వ్యూ చేసింది. ఈ క్రమంలో కరోనా గురించి కూడా మాట్లాడాడు. తనకున్న మత సంబంధమైన విశ్వాసాల కారణంగా ‘స్వలింగ సంపర్కుల వివాహం’ కారణంగానే కరోనా వైరస్ వ్యాప్తి మొదలైంది అని పేర్కొన్నాడు. ఈ వ్యాఖ్యలు చేసినందుకు తనపై వ్యతిరేకత వస్తుందని కూడా పీటర్ తెలిపాడు. ‘ఇది వాళ్లు అంగీకరించరు’ అనే విషయం కూడా తనకు తెలుసని చెప్పాడు. ఆయన చేసిన వ్యాఖ్యలు ఆగ్రహం తెప్పిస్తున్నాయి. ముఖ్యంగా ఎల్జీబీటీలు మండిపడుతున్నారు. అతడి వ్యాఖ్యలు హాస్యస్పదంగా ఉన్నాయని పేర్కొంటున్నారు. సమాజంలో తమపై వివక్ష, విద్వేషాన్ని పెంచేలా ఆ వ్యాఖ్యలు ఉన్నాయని చెబుతున్నారు. ఆయన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో తిట్టి దుమ్మెత్తిపోస్తున్నారు. ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని కోరుతున్నారు. అయితే గతంలోనూ ఉక్రెయిన్‌కు చెందిన ఓ వ్యక్తి కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేశాడు. -
‘అలాంటి వారిని ఆర్మీలోకి తీసుకోం’
న్యూఢిల్లీ : స్వలింగ సంపర్కం నేరకాదంటూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. కానీ ఆర్మీలో మాత్రం ఇలాంటివి కుదరవంటున్నారు ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్. మీడియాతో మాట్లాడుతూ.. స్వలింగ సంపర్కుల్ని సైన్యంలోకి అనుమతించం అన్నారు. ఇలాంటి(ఎల్జీబీటీ) విషయాలు ఆర్మీలో ఆమోదయోగ్యం కాదని ఆర్మీ యాక్ట్‌లోని పలు సెక్షన్లలో ఉందని తెలిపారు. ‘మేం (ఆర్మీ)సుప్రీం కోర్టుకంటే అధికులమని కూడా కాదు.. దేశంలో ఉన్న చట్టాలు అందరికి సమానంగానే వర్తిస్తాయి. కానీ సైన్యంలోకి వచ్చేవారు మాత్రం కొన్ని హక్కులను, సంతోషాలను వదులుకోవాల్సి ఉంటుంద’న్నారు బిపిన్ రావత్. అంతేకాక ఎల్జీబీటీ వంటి విషయాల్ని జనాలు ఎలా స్వీకరిస్తారు.. అసలు ఇలాంటి వాటిని అంగీకరిస్తారా.. లేదా అనేది భవిష్యత్తులో తెలుస్తుందన్నారు. గత ఏడాది సెప్టెంబరులో సుప్రీంకోర్టు స్వలింగ సంపర్కం నేరం కాదంటూ చరిత్రాత్మక తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. సమానత్వ హక్కును అది ఉల్లంఘిస్తోందంటూ 158ఏళ్ల నాటి చట్టాన్ని కోర్టు కొట్టేసింది. -
మాన్వేంద్రసింగ్ (గుజరాత్ ‘గే’ ప్రిన్స్)
మనసు మయూరమై నాట్యమాడుతోంది. ఎంత వెచ్చని కబురొచ్చి వాలింది ఈవేళ మా ఇంటి జామచెట్టు మీద! భుజం మీది చిలుక నా బుగ్గను కొరికి, గిలిగింతలు పెట్టింది. ఇన్నేళ్లుగా మూసి ఉంచారు, ఇకనైనా తెరవమని కోర్టు చెప్పేవరకు ఈ లోకం మా కోసం మనసును పరచలేకపోయింది! చిలకలు జాంపండును మాత్రమే కొరకాలని ఏముందీ.. వాటిష్టం.. దేన్నైనా కొరకొచ్చని న్యాయస్థానం చెప్పినప్పుడు.. ముందుగా నా బుగ్గే ఎరుపెక్కిందో, లేక.. చిలుక ముక్కే పదునెక్కిందో గమనించుకోలేదు. గాటు పడ్డ చోటు నుంచి రక్తపుచుక్క హరివిల్లు వర్ణంలో కిందికి జారింది. చూద్దును కదా.. అది చిలుక పెట్టిన గాటు కాదు. పరవశపు తత్తరపాటులో నాకై నేను కొరుక్కున్న పెదవి గాటు! ఆడామగే ఉండాలి ఈ దేశంలో, ఆడామగే ఉండాలి ఈ దేశపు విహార స్థలాల్లో, ఆడామగే ఉండాలి ఈ దేశపు విడిది గృహాల్లో! న్యాయమేనా? ఈ లోకంలో ఉన్నది ఒక్క ఆడామగేనా? లోపలి మనసుల్ని వదిలేసి, పైపైన మనుషుల్ని చూస్తూ ఉంటే ఆడామగ మాత్రమే కనిపిస్తారు. ఆడలోని మగను, మగలోని ఆడను చూడండని ఎన్నేళ్లు అడిగాం. ఎన్నేళ్లు విజ్ఞప్తి చేశాం. ఎన్నేళ్లు ప్రదర్శనలు చేశాం. ఎన్నేళ్లు అభాసుపాలయ్యాం. ఎన్నేళ్లు అవమానాలు పడ్డాం. ఎన్నేళ్లు చచ్చి బతికాం! ఇన్నేళ్లూ రక్తమంటే ఎర్ర రంగే. ఇకనుంచీ రక్తమంటే వైలెట్, బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్ కూడా. మతం లేని, జాతి లేని, జాతీయత లేని, జెండర్ లేని ఒక నిండైన మానవ ప్రపంచం సొగసైన వంపుగా భువిపై విరిసిందీ వేళ. ప్యాలెస్ బయటికొచ్చి నిలబడ్డాను. కోలాహలంగా ఉంది. అంతా ముద్దుల రంగులు అద్దుకుని ఉన్నారు. ముఖాలు వెలిగిపోతున్నాయి. కొందరింకా ఆలింగనాల అలసట నుంచి తేరుకోనే లేదు. ‘మనం సాధించాం.. మాన్వేంద్రా?’ అంటున్నారు. నవ్వాను. ‘మీ వెనుక ఏముందో చూడండి’ అని పెద్దగా అరిచి చెప్పాను. అంతా తలలు వెనక్కి తిప్పి చూసి.. ‘ఓ..’ అని ఉత్సాహంతో కేరింతలు కొట్టారు. భూమ్యాకాశాలు కలిసే చోట పెద్ద ఇంద్రధనుస్సు! ‘‘మనం ఇప్పుడు ఆ ఇంద్రధనుస్సు పౌరులం’’ అన్నాను. అంతా ‘ఓ..’ అని అరిచారు మళ్లీ. ‘‘మనదిప్పుడు ఇంద్రధనుస్సు పౌరసత్వం’’ అన్నాను. దిగ్మండలం పులకించేలా మళ్లీ ‘ఓ..’ అనే ధ్వని! ప్యాలెస్ లోపలికి వచ్చి నిలబడ్డాను. గోడపై ఫొటోలో మహారాణాశ్రీ రఘుబీర్ సింహ్‌జీ రాజేంద్రసింగ్‌జీ! నాన్న. ఆయన పక్కనే రాణీ రుక్ష్మిణీ దేవి! అమ్మ. వాళ్ల పెళ్లినాటి ఫొటో. ‘‘నా కడుపున చెడబుట్టావురా’’ అంది అమ్మ.. నాలో స్త్రీహృదయం మాత్రమే ఉందని తొలిసారి అమ్మకు తెలిసినప్పుడు! నేనే ఆ సంగతి అమ్మకు చెప్పాను. విషాదంలో కూరుకుపోయింది అమ్మ. ‘‘వద్దన్నా పెళ్లి చేశారు. రాకుమారి చంద్రికా కుమారిని ఇప్పుడు నేనేం చేసుకునేదమ్మా’’ అని అమ్మను అడిగాను. చంద్రిక నా భార్య. తను అర్థం చేసుకుంది. వెళ్లిపోయింది. అమ్మ అర్థం చేసుకోలేదు. నన్ను వెళ్లిపొమ్మంది. ‘వీడు నా కొడుకు కాదు’ అని బహిరంగంగా ప్రకటన కూడా చేయించింది. స్త్రీ అయి ఉండి అమ్మ నాలోని స్త్రీ మనసును అర్థం చేసుకోలేకపోయింది. పుట్టింట్లోంచి వచ్చేశాను. దుఃఖమేం లేదు. స్త్రీకే కదా పుట్టింట్లోంచి వచ్చేసే పరిస్థితి ఏర్పడుతుంది. పైకి ఒకలా ఉండి, లోపల ఇంకోలా ఉండే స్వేచ్ఛ ప్రతి మనిషికీ ఉన్నప్పుడు.. లోపల ఉన్నట్లే పైకీ ఉండగలిగే స్వేచ్ఛ ఎందుకు ఉండకూడదు? ఆ స్వేచ్ఛ ఇన్నేళ్లకొచ్చింది. న్యాయమూర్తులకు ధన్యవాదాలు. మాధవ్ శింగరాజు -
పెళ్లి, వారసత్వ హక్కుల కోసం....
సెక్షన్ 377పై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుతో ఉత్సాహం పొందిన ఎల్‌జీబీటీక్యూలు ఇప్పుడు ఇతర హక్కుల సాధనపై దృష్టి సారిస్తున్నారు. ఇతరుల్లా తమకు కూడా వివాహం, వారసత్వం, సరోగసి,దత్తత వంటి విషయాల్లో హక్కులు కల్పించాలని వారు ఉద్యమించేందుకు సన్నద్ధమవుతున్నారు.అయితే, ధర్మాసం స్వలింగ సంపరాన్ని నేరం కాదన్న అంశం వరకే పరిమితం కావాలని ఇతర హక్కుల జోలికి వెళ్లరాదని అదనపు సొలిసిటర్ జనరల్ సెక్షన్ 377 కేసు విచారణలో సుప్రీం కోర్టుకు స్పష్టం చేశారు. దీన్ని బట్టి గేలకు ఇతర హక్కులు కల్పించడానికి ప్రభుత్వం సుముఖంగా లేదని అర్థమవుతోందని న్యాయ నిపుణులు అంటున్నారు.వివాహం, సరోగసి, దత్తత, వారసత్వం వంటి హక్కుల కోసం గేలు పోరాడాల్సి వస్తే తప్పకుండా పోరాడుతామని గే హక్కుల ఉద్యమకారుడు, సుప్రీం కోర్టు న్యాయవాది అదిత్య బందోపాధ్యాయ స్పష్టం చేశారు. 377 సెక్షన్‌పై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు గేల ఇతర హక్కులపై చర్చకు అవకాశం కల్పిస్తుందని సీనియర్ జర్నలిస్టు, ఎల్జీబీటీ హక్కుల కార్యకర్త ప్రసాద్ రామమూర్తి ఆశాభావం వ్యక్తం చేశారు. స్వలింగ సంపర్కం నేరం కాదన్న సుప్రీం కోర్టు తీర్పుతో గేలకు ప్రాథమిక హక్కు లభించింది కాబట్టి వివాహం, వారసత్వం, బీమా వంటి హక్కులు కూడా దీనిలో భాగమవుతాయని,ఈ హక్కుల్ని నిరాకరించడం రాజ్యాంగవిరుద్ధమని 377 కేసు పిటీషనర్లలో ఒకరైన సునీల్ మెహ్రా అన్నారు. 377 సెక్షన్‌పై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు మా విజయంలో మొదటి అడుగు. వివాహం ఇతర హక్కుల సాధన రెండో అడుగు వేస్తాం అని మరో పిటిషనర్ గౌతమ్ యాదవ్ వ్యాఖ్యానించారు. న్యాయపరమైన అంశాలపై అంతగా అవగాహన లేనప్పటికీ గోద్రేజ్ వంటి కార్పొరేట్ సంస్థలు చాలా ఏళ్ల క్రితమే గేలకు ఇతరులతో పాటు సమాన హక్కులు కల్పించాయి.‘ ఎల్జీబీటీ ఉద్యోగుల పట్ల వివక్ష చూపకపోవడం, ఇతర ఉద్యోగుల్లాగే ఆరోగ్య బీమా వంటి అన్ని సదుపాయాలు అందించడం ద్వారా వారిని మాలో కలుపుకోవడమే మా విధానం’అన్నారు గోద్రేజ్ ఇండియా కల్చరల్ ల్యాబ్ అధిపతి పరమేశ్ సహాని. గేల వివాహాన్ని ఆమోదించదు స్వలింగ సంపర్కం నేరం కాదన్నంత వరకు బాగానే ఉందని, అయితే వారి వివాహాన్ని కూడా చట్టబద్దం చేయాలన్న డిమాండును మాత్రం ప్రభుత్వం వ్యతిరేకిస్తుందని ఉన్నతాధికారి ఒకరు చెప్పారు.రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆరెస్సెస్)కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తోంది.‘ఇద్దరు మహిళలు లేదా ఇద్దరు పురుషులు పెళ్లాడటమన్నది ప్రకృతి విరుద్ధం.దీన్ని మేమెంత మాత్రం సమర్థించం.ఇలాంటి సంబంధాలను గుర్తించే సంప్రదాయం భారతీయ సమాజంలో లేనేలేదు’అని స్పష్టం చేశారు ఆరెస్సెస్ ప్రతినిధి ఆరుణ్ కుమార్. సెక్షన్ 377 రద్దును స్వాగతించిన కాంగ్రెస్ గేలకు ఇతర హక్కుల కల్పన విషయంలో తన వైఖరి స్పష్టం చేయలేదు. ఈ విషయంలో నిర్ణయం తీసుకోవలసింది ప్రభుత్వమేనని తర్వాతే దానిపై స్పందిస్తామన్నారు కాంగ్రెస్ ప్రతినిధి రణ్‌దీప్ సింగ్ సుర్జేవాలా. ఇతర హక్కుల జోలికెళ్లని ధర్మాసనం స్వలింగ సంపర్కం నేరం కాదంటూ తీర్పు ఇచ్చిన సుప్రీం కోర్టు వారి ఇతర హక్కుల జోలికి వెళ్లలేదు. సామాజిక నిబంధనలు గేల రాజ్యాంగ హక్కులను ఎలా నియంత్రించజాలవో తన తీర్పులో వివరించిన ధర్మాసనం వివాహం, వారసత్వం వంటి ఇతర హక్కుల గురించి ఏమీ ప్రస్తావించలేదు. అలాంటి పెళ్లిళ్లు జరుగుతున్నాయి మన దేశంలో స్వలింగ వివాహాలు(సేమ్ సెక్స్ మ్యారేజ్) చట్టబద్ధం కానప్పటికీ గత పదేళ్లుగాజరుగుతూనే ఉన్నాయి. చట్టానికి భయపడే కొందరు అలాంటి వివాహాల్ని ఆమోదించే ఇతర దేశాలకు వెళ్లి పెళ్లి చేసుకుంటున్నారు.377 కేసు పిటిషనర్ ఒకరు ఇలాగే విదేశానికి వెళ్లి పెళ్లి చేసుకున్నారు. -
చరిత్రాత్మకమైన తీర్పు
భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 377లో స్వలింగ సంపర్కులను నేరస్తులుగా పేర్కొనే నిబంధన ఎట్టకేలకు బుట్టదాఖలా అయింది. అది చెల్లుబాటు కాదంటూ గురువారం సర్వోన్నత న్యాయస్థానం వెలువరించిన ఏకగ్రీవ తీర్పు సమానత్వ సాధనలో, మానవ హక్కుల ప్రస్థానంలో మేలి మలుపుగా నిలుస్తుంది. సృష్టి ఒక గీత గీసిందని... అందరూ ఆ గీతకు అటో ఇటో ఉంటారని, ఉండాలని శతా బ్దాల తరబడి పాతుకుపోయిన భావనను ఈ తీర్పు నిర్ద్వంద్వంగా తోసిపుచ్చింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని అయిదుగురు సభ్యుల ధర్మాసనం యుక్త వయసున్న ఇద్దరు వ్యక్తులు పరస్పర అంగీకారంతో తమ లైంగిక భావనలకు అనుగుణంగా శృంగా రంలో పాల్గొనవచ్చునని, దాన్ని నేరంగా పరిగణించటం సరికాదని తేల్చిచెప్పింది. ఆడ మగ మధ్య లైంగిక సంబంధాలే సహజమైనవనీ, మిగిలినవన్నీ అసహజమని అనడం కాలం చెల్లిన భావనగా తెలిపింది. ‘ప్రకృతి ఇచ్చింది ఏదైనా సహజమైనదే’ అని స్పష్టం చేసింది. అసహజ లైంగిక నేరాలను ఏకరువుపెట్టే సెక్షన్ 377లో స్వలింగ సంపర్కం చేర్చటం సరికాదంటూ మన దేశంలో సాగుతున్న పోరాటం సుదీర్ఘమైనది. పదిహేడేళ్లుగా న్యాయస్థానాలే వేదికగా ఆ పోరాటం సాగుతోంది. బ్రిటిష్ వలసపాలకుల ఏలుబడిలో దాదాపు 160 ఏళ్లక్రితం భారతీయ శిక్షాస్మృతిలో స్వలింగ సంపర్కం నేరంగా మారింది. అప్పటినుంచి అనేకమంది పౌరులు వేధింపులకు గురవుతున్నారు. భయంతో బతుకీడుస్తున్నారు. 2000 సంవత్సరంలో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బీపీ జీవన్ రెడ్డి నేతృత్వంలోని లా కమిషన్ స్వలింగ సంపర్కం నేరంగా భావించలేమని, దీన్ని శిక్షాస్మృతి నుంచి తొలగించి ఇతర అసహజ నేరాలను కొత్తగా 376–ఎఫ్ కిందకు తీసుకురావాలని సిఫార్సు చేసింది. అయినా ఏ ప్రభుత్వమూ కదల్లేదు. 2009లో అప్పటి ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏపీ షా, న్యాయమూర్తి జస్టిస్ ఎస్. మురళీధర్‌లతో కూడిన ధర్మాసనం మొదటిసారి ఈ సెక్షన్ రాజ్యాంగంలోని 21, 14, 15 అధికరణలను ఉల్లంఘిస్తున్నదని నిర్ధారించింది. ఆ సెక్షన్‌లోని అస హజ నేరాల జాబితా నుంచి దీన్ని తొలగించాలని తీర్పునిచ్చింది. అయితే మరో నాలుగేళ్లకు సుప్రీం కోర్టులో జస్టిస్ జీఎస్ సింఘ్వీ, జస్టిస్ ఎస్జే ముఖోపాధ్యాయలతో కూడిన ధర్మాసనం అది రాజ్యాం గబద్ధమైనదేనని చెప్పి స్వలింగసంపర్కుల ఉత్సాహంపై నీళ్లు జల్లింది. దాన్ని కొట్టేసే అధికారం న్యాయస్థానాలకు లేదని, పార్లమెంటు మాత్రమే నిర్ణయం తీసుకోవాలని తెలిపింది. ఏదైనా కీలక సమస్య వచ్చిపడినప్పుడు దానికొక ప్రజాస్వామిక పరిష్కారాన్ని చూపడం రాజ్యం బాధ్యత. పాలకులుగా ఉంటున్నవారు ఈ బాధ్యతను స్వీకరించటం సబబు. వారు దాన్ని సక్రమంగా నెరవేర్చనప్పుడు న్యాయవ్యవస్థ అయినా జోక్యం చేసుకొని సరిదిద్దాలి. కానీ సెక్షన్ 377 విషయంలో రెండుచోట్లా ఇన్నాళ్లూ నిరాదరణే ఎదురైంది. సుప్రీంకోర్టు ధర్మాసనంలోని మహిళా న్యాయమూర్తి జస్టిస్ ఇందూ మల్హోత్రా దీన్ని దృష్టిలో పెట్టుకునే ‘స్వలింగ సంపర్కాన్ని సహజమైన ప్రక్రియగా పరిగణించలేనందుకూ, పర్యవసానంగా శతాబ్దాలుగా వీరు పడుతున్న అవమానాలకూ చరిత్ర క్షమాపణ చెప్పాల్సి ఉన్నద’ని వ్యాఖ్యానించారు. ఏ సమాజంలోనైనా అత్యధిక సంఖ్యాకుల మనోభావాలకు అనుగుణంగానే అన్ని రకాల విలువలూ ఏర్పడతాయి. వాటి ఆధారంగానే చట్టాలు రూపొందుతాయి. సమాజంలో ఆడ మగ కలిసి ఉండటమే సహజమని, ఇతరమైనవన్నీ అసహ జమని అత్యధికులు భావించబట్టి ఇతరత్రా లైంగిక భావనలున్నవారందరూ అపరాధ భావనతో కుమిలిపోతుంటారు. తమ లైంగిక వాంఛలు వెల్లడైతే వెలివేస్తారని భీతిల్లుతారు. జస్టిస్ దీపక్ మిశ్రా అన్నట్టు స్వీయ వ్యక్తీకరణకు అవకాశం లేకపోవటం చావుతో సమానం. ఈ స్వలింగసంపర్కులంతా ఇన్నేళ్లుగా జీవచ్ఛవాలుగా మనుగడ సాగిస్తున్నారు. దేశంలోని ఇతర పౌరులు అనుభవిస్తున్న హక్కులు వీరికి లేకుండా పోయాయి. బడిలో తోటి పిల్లల హేళనలతో మొదలై కుటుంబంలోనూ, బంధువుల్లోనూ వెలివేసినట్టు చూడటం, సమాజంలో నిరాదరణ ఎదురుకావటం ఈ స్వలింగç Üంపర్కులు నిత్యం ఎదుర్కొంటున్న సమస్య. ఎవరైనా ఫిర్యాదు చేయటం వల్ల పట్టుబడితే 377 సెక్షన్ ప్రకారం దోషులకు యావజ్జీవ శిక్ష లేదా పదేళ్లవరకూ శిక్ష, జరిమానా విధిస్తారు. ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పు విషయంలో 2012లో అప్పటి యూపీఏ ప్రభుత్వం తత్తరపడింది. స్వలింగ సంపర్కం సామాజిక కట్టుబాట్లకు విరుద్ధమని, దానివల్ల ఎయిడ్స్‌లాంటి జబ్బులు వ్యాపిస్తాయని సర్వోన్నత న్యాయస్థానంలో అప్పటి అదనపు సొలిసిటర్ జనరల్ పి.పి. మల్హోత్రా వాదించారు. అదంతా చానెళ్లలో ప్రసారమయ్యేసరికల్లా ఆదరా బాదరాగా మరో అదనపు సొలిసిటర్ జనరల్ మోహ న్జైన్ను పంపి దానిపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోలేదని అనిపించారు. ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వమైతే తన వైఖరేమిటో నిర్ధారించుకోలేకపోయింది. దీన్ని న్యాయస్థానం ‘విజ్ఞత’కే వదిలేస్తున్నామని చెప్పింది. ప్రజామోదంతో గద్దెనెక్కి, వారిని ఒప్పించగలిగిన స్థితిలో ఉండే పాలకులు ఇలాంటి సంక్లిష్ట అంశాల విషయంలో దాటవేత ధోరణి అవలంబించటం ఆశ్చర్యం కలిగిస్తుంది. లెనిన్ ఆధ్వర్యంలో ఏర్పడిన సోవియెట్ ప్రభుత్వం 1920లో ప్రపంచంలోనే తొలిసారి స్వలింగ సంపర్కాన్ని సామాజిక, సాంస్కృతిక అంశంగా పరిగణించింది. స్వలింగసంపర్కులను కూడా పౌరులుగా గుర్తించి వారికి హక్కులు కల్పించింది. ఆ తర్వాతే అభివృద్ధి చెందిన దేశాల్లో ఈ ఉద్యమం ఊపందుకుంది. ఆధిపత్య భావజాలం ఏ రూపంలో ఉన్నా అది సమాజాన్ని ఎదగ నీయదు. ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పునిచ్చినంత మాత్రాన స్వలింగ సంపర్కులకు స్వేచ్ఛ లభిం చిందని భావించలేం. వారికి చట్టపరమైన అవరోధాలు తొలగినా సమాజంలో అలుముకున్న సంకు చిత భావాలు వెనువెంటనే మాయం కావు. కనీసం ఆ విషయంలోనైనా ప్రభుత్వాలు బాధ్యత తీసుకుని వారిపట్ల వివక్ష ప్రదర్శిస్తే చర్యలు తప్పవన్న సంకేతాలిస్తే మేలు. -
ఎన్నాళ్లో వేచిన హృదయం
దేశంలో చాలా సమస్యలు ఉండొచ్చు. ఆత్మాభిమానం దెబ్బ తినడం అన్నిటికన్నా పెద్ద సమస్య. ప్రపంచంలోని విప్లవాలన్నీ అస్తిత్వ పోరాటాల ఫలితాలే. ఈరోజు ఎల్జీబీటీలకు సంబంధించిన తీర్పు కూడా వాళ్ల అస్తిత్వ పోరాట ఫలితమే. 2015లో.. ఎల్జీబీటీ యాక్టివిస్ట్ హరీష్ అయ్యర్ వాళ్ల అమ్మ పద్మాఅయ్యర్ ఓ ప్రకటన పట్టుకొని పత్రికాఫీసులన్నీ తిరిగింది. దాన్ని చూసిన వాళ్లంతా కనీసం మాట కూడా మాట్లాడకుండా ‘వేయలేం’ అన్నట్టుగా తల అడ్డంగా ఊపి ఆమెను పంపించేశారు. చివరకు హిందుస్థాన్ టైమ్స్ ఒప్పుకుంది ఆ ప్రకటన వేయడానికి. అన్ని వార్తా పత్రికలు తిరస్కరించిన ఆ ప్రకటన ఏంటి?ఆమె కొడుకు కోసం పెళ్లికొడుకు ప్రకటన! ‘‘ఎన్జీవోలో పనిచేస్తున్న 36 ఏళ్ల నా కొడుకు కోసం వరుడు కావాలి. అయిదు అడుగుల పదకొండు అంగుళాల ఎత్తుండే నా కొడుక్కి.. జంతు ప్రేమికుడు, శాకాహారి, మంచి ఉద్యోగం చేస్తున్నజతగాడు కావాలి. అయ్యర్ కులస్తులకు ప్రాధాన్యం. అయినా క్యాస్ట్ నో బార్’’ ఇదీ ఆ ప్రకటన సారాంశం. ఇది పత్రికల వాళ్లకే కాదు.. ఎల్జీబీటీలను పౌరులుగా చూడని చోట్లల్లా సంచలనమే అయింది. హరీష్ అయ్యర్‌కు లైఫ్ పార్టనర్ దొరికాడా లేదా అన్నది అప్రస్తుతం. ఒక తల్లి అభ్యర్థన ఎంత నవ్వుల పాలైంది? ఒక మనిషి వ్యక్తిగత ఆసక్తిని ఎందుకు కించపరిచారన్నది చర్చనీయాంశం. దీనికి ఇప్పుడు సమాధానం దొరికింది. సుప్రీంకోర్టు తీర్పుతో. ఎల్జీబీటీ (లెస్బియన్, గే, బైసెక్సువల్, ట్రాన్స్‌జెండర్) హక్కులనూ గౌరవిస్తూ.. వాళ్లనూ పౌరులుగా గుర్తిస్తూ తీర్పునిచ్చింది. దేశంలో ఇంకేం సమస్యలు లేనట్టు కొంతమంది అసహజ ప్రవర్తనకు గ్రీన్ సిగ్నల్ రావడాన్ని ఇంత సంబరంగా ఎందుకు చూస్తున్నారు.. అని చాలా మంది ఈసడించుకున్నారు. ఇంకెంతో మంది ‘‘అయిపోయింది.. దేశం గంగలో కలుస్తోంది’’ అంటూ పెదవి విరిచారు. అతి కొద్ది మంది మాత్రమే ‘‘ఇన్నాళ్లకు వాళ్ల పోరాటం ఫలించింది. వాళ్ల ఆత్మగౌరవానికీ గుర్తింపు దొరికింది’’ అంటూ సంతోషపడ్డారు. నిజమే, దేశంలో చాలా సమస్యలు ఉండొచ్చు. ఆత్మాభిమానం దెబ్బ తినడం అన్నిటికన్నా పెద్ద సమస్య. ప్రపంచంలోని విప్లవాలన్నీ అస్తిత్వ పోరాటాల ఫలితాలే. ఈరోజు ఎల్జీబీటీలకు సంబంధించిన తీర్పు కూడా వాళ్ల అస్తిత్వ పోరాట ఫలితమే. ఆకలినైనా ఓర్చుకుంటాం.. కాని ఆత్మాభిమానం దెబ్బతింటే తట్టుకోలేం. పోరుకు సిద్ధపడతాం. మిగతా పోరాటాలన్నిటికీ అంగీకారం దొరికినప్పుడు ఎల్జీబీటీల స్ట్రగుల్ మాత్రం ఎందుకు సమ్మతం కాకూడదు? వాళ్ల హక్కులకు గుర్తింపు ఎందుకు ఉండకూడదు? దీని మీద న్యాయపోరాటానికి సిద్ధపడింది ఎల్జీబీటీ కమ్యూనిటీ. ఇప్పుడు సుప్రీంకోర్టు ‘‘స్వలింగ సంపర్కం నేరం కాదు. అది అసహజమూ కాదు.. అంటువ్యాధి అంతకన్నా కాదు! అదొక బయోలాజికల్ ఫెమినా..!’’ అంటూ తీర్పునిచ్చింది. ఎల్జీబీటీకి సంబంధించి ఇండియన్ పీనల్ కోడ్‌లోని సెక్షన్ 377ను సడలించింది. నిజంగా ఇప్పుడు ఇది సంచలనమే. ద్వంద్వ ప్రమాణాల సమాజంలో ఎన్నో తర్జనభర్జనల అనంతరం సుప్రీం ఈ తీర్పునివ్వడం నిజంగా ఊరటే. ద్వంద్వ ప్రమాణాలు అంటే మనందరికీ కోపం రావచ్చు. ఖజురహోలో స్వలింగ సంపర్క శిల్పాలను కళగా ఆస్వాదిస్తాం.. ఆమోదిస్తాం. ఏ కళ అయినా సమాజ జీవితానికి ప్రతిబింబమే కదా! శిల్పాలుగా ఆ గోడల మీదకు ఎక్కాయి అంటే అది జనబాహుళ్యంలో ఉన్నట్టే కదా! బయట ఒప్పుకోవడానికి సంస్కృతీసంప్రదాయాలు అడ్డు తగులుతాయి. అందుకే ద్వంద్వప్రమాణాలు అన్నది. ఆకర్షణ బయోలాజికల్ ఇన్స్టింక్ట్. మానసిక రుగ్మత కాదు. ఎల్జీబీటీలను ఎల్‌జీబీటీలుగానే గుర్తించి.. గౌరవిస్తే.. సమాజమంతా ఎల్‌జీబీటీలుగా మారరు. అది ఫ్యాషన్ కాదు.. ట్రెండ్ కాదు.. సుప్రీంకోర్టే చెప్పినట్టు అంటువ్యాధి అంతకన్నా కాదు. గుర్తించకపోతేనే అనర్థం.అయితే కోర్టు తీర్పుతో అంతా మారిపోదు. ముందు ఇంట్లోంచే ఆమోదం మొదలు కావాలి. స్కూళ్లు, కాలేజీలు.. కార్యాలయాలు.. వాళ్లను థర్డ్ సిటిజన్స్‌గా కాదు.. సిటిజన్స్‌గా ఐడెంటిటీ ఇవ్వడం ప్రారంభించాలి. అభివృద్ధికి నమూనా అడ్వాన్స్డ్ టెక్నాలజీని వాడటం కాదు.. అందరి హక్కులను గౌరవించడం. పౌరులు అందరికీ ఈక్వల్ స్పేస్ ఇవ్వడం! ప్రకృతే వీళ్లను ఆదరించినప్పుడు మనమూ దాని బిడ్డలమే.. వీళ్లకు సోదరీసోదరులమే కదా! మనమెందుకు అక్కున చేర్చుకోకూడదు?! సరస్వతి రమ -
దేశంలోని ట్రాన్స్జెండర్ల విజయం..
తిరువనంతపురం, కేరళ : భారత్‌లో లెసిబియన్, గే, బై సెక్సువల్ అండ్ ట్రాన్స్‌జెండర్ (ఎల్జీబీటీ) కమ్యూనిటీ తొలి విజయం సాధించింది. కేరళ రాష్ట్రంలో ఇషాన్, సూర్య అనే ఇద్దరు ట్రాన్స్జెండర్లు చట్టబద్దంగా గురువారం వివాహం చేసుకున్నారు. పురుషుడి భావాలు కలిగిన ఇషాన్, స్త్రీ భావాలు కలిగిన సూర్యలు లింగమార్పిడి ఆపరేషన్లు చేయించుకున్నారు. ఒకరంటే మరొకరికి ఉన్న అనురాగంతో వివాహం చేసుకున్నారు. తిరువనంతపురంలోని మన్నం మెమోరియల్ హాల్లో జరిగిన ఈ వేడుకకు ఇరువురి కుటుంబసభ్యులు హాజరయ్యారు. అనంతరం ప్రత్యేక వివాహ చట్టం కింద వివాహాన్ని రిజిస్టర్ చేయించుకున్నారు. ఇషాన్, సూర్యలు ట్రాన్స్‌జెండర్ జస్టిస్ బోర్డులో కొన్నేళ్లుగా సభ్యులు. స్నేహితులు. వీరి వివాహం భారత్‌లో ఎప్పటినుంచో ఎల్జీబీటీ కమ్యూనిటీ ఎదుర్కొంటున్న అవమానాల నుంచి విజయంగా భావిస్తున్నారు. -
‘సుప్రీం’ నిర్ణయం భేష్
స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణించే భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 377 రాజ్యాంగబద్ధమైనదేనంటూ నాలుగేళ్లక్రితం తానిచ్చిన తీర్పును పునఃసమీక్షించడా నికి అంగీకరించడం ద్వారా సుప్రీంకోర్టు సోమవారం చరిత్రాత్మక నిర్ణయం తీసు కుంది. ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా తన నేతృత్వంలోని ముగ్గురు న్యాయ మూర్తుల బెంచ్ తరఫున ఈ నిర్ణయాన్ని ప్రకటిస్తూ చేసిన వ్యాఖ్యలు స్వలింగ సంపర్కుల్లో ఆశలు రేకెత్తించకమానవు. జస్టిస్ దీపక్ మిశ్రా అన్నట్టు ప్రకృతి నియమాలు స్థిరంగా ఉండేవి కాదు. నిరంతర మార్పే వాటి సహజ స్వభావం. సమాజమైనా అంతే. తమ తమ వ్యక్తిగత లైంగిక భావనల కారణంగా ఏ వ్యక్తీ లేదా కొంతమంది వ్యక్తుల సమూహం వేధింపులూ, బెదిరింపులూ ఎదుర్కొనకూడ దని... భయంతో బతుకీడ్చే పరిస్థితి ఉండరాదని ఆయన చెప్పడం స్వలింగ సంప ర్కులకు ధైర్యాన్నిస్తుంది. వాస్తవానికి నిరుడు ఆగస్టులో వ్యక్తిగత గోప్యతపై తొమ్మిదిమంది న్యాయమూర్తులతో కూడిన సుప్రీంకోర్టు విస్తృత రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పులోనే ఇందుకు సంబంధించిన మూలాలున్నాయి. దేన్ని ఎంపిక చేసుకోవాలో, దేనికి ప్రాధాన్యమివ్వాలో నిర్ణయించుకునే స్వేచ్ఛ పౌరుల కుంటుందని ఆ తీర్పులో సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది. ఇప్పుడు సెక్షన్ 377పై ఇచ్చిన తీర్పును పునస్సమీక్షిస్తామనడం దానికి కొనసాగింపే. 2009లో అప్పటి ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏపీ షా, న్యాయమూర్తి జస్టిస్ ఎస్. మురళీ ధర్ల ధర్మాసనం స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణించలేమని తీర్పునిచ్చింది. దీన్ని నేరంగా నిర్ధారిస్తున్న సెక్షన్ 377 రాజ్యాంగంలోని 21, 14, 15 అధికరణలను ఉల్లంఘిస్తున్నదని చెప్పింది. ఆ సెక్షన్‌లోని ‘అసహజ నేరాల’ జాబితా నుంచి దీన్ని తొలగించాలని ఆదేశించింది. అయితే ఆ తీర్పుపై దాఖలైన అప్పీల్‌ను పరిశీలించిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఆ సెక్షన్ రాజ్యాంగబద్ధతను ధ్రువీకరించింది. ఈ చట్టంలో మార్పు అవసరమో కాదో పార్లమెంటే చెప్పాలి తప్ప న్యాయస్థానాలు కాదని తెలిపింది. కాలచక్రం ఎప్పుడూ ముందుకే తిరుగుతుంటుంది. అదే సమయంలో దాన్ని తాత్కాలికంగా ఆపడానికి లేదా వెనక్కి తిప్పడానికి ప్రయత్నాలు నిరంతరం జరుగుతూనే ఉంటాయి. బ్రిటన్ను క్వీన్ విక్టోరియా పాలించినప్పుడు అమలులో ఉన్న సంకుచిత నైతిక విలువలకు అనుగుణంగా 1861లో బ్రిటిష్ వలసవాదులు మన దేశంలో ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. దోషులకు యావజ్జీవశిక్ష లేదా పదేళ్ల వరకూ శిక్ష, జరిమానా విధించవచ్చునని చట్టం చెబుతోంది. ఇక్కడి మత, ఛాందసవాద సంస్థలు ఆదినుంచీ ఈ సెక్షన్ ఉండాల్సిందేనని గట్టిగా వాదిస్తున్నాయి. ఏ తరహా సమాజంలోనైనా వ్యక్తి స్వేచ్ఛాస్వాతంత్య్రాలకూ, సామాజిక, సంప్రదాయిక కట్టుబాట్లకూ మధ్య ఇలాంటి వైరుధ్యం తప్పదు. అటువంటప్పుడు ప్రభుత్వమూ లేదా న్యాయస్థానాలూ క్రియాశీలంగా వ్యవ హరించి ఆ వైరుధ్యాన్ని పరిష్కరించాల్సివస్తుంది. స్వలింగ సంపర్కం నేరంగా భావించలేమని, భారతీయ శిక్షాస్మృతి నుంచి దీన్ని తొలగించాలని 2000 సంవత్సరంలో జస్టిస్ బీపీ జీవన్‌రెడ్డి నేతృత్వంలోని లా కమిషన్ 172వ నివేదిక సిఫార్సు చేసింది. ఆ సెక్షన్లో ఉన్న ఇతర అసహజ నేరాలను కొత్తగా సెక్షన్ 376 ఎఫ్ తీసుకొచ్చి దాని కిందకు చేర్చవచ్చునని సూచించింది. కానీ ఇంతవరకూ ఏ ప్రభుత్వాలూ ఆ సిఫార్సు విషయంలో శ్రద్ధ పెట్టలేదు. అయితే పార్టీలకతీతంగా చాలామంది రాజకీయ నాయకులు ఈ సెక్షన్‌పై అడపా దడపా వ్యతిరేకత వ్యక్తం చేస్తూనే ఉన్నారు. 2009లో అప్పటి కేంద్ర న్యాయశాఖ మంత్రి వీరప్ప మొయిలీ దీన్ని కాలం చెల్లిన చట్టంగా అభివర్ణించారు. అప్పటి కేంద్ర ఆరోగ్యమంత్రి అన్బుమణి రామదాస్ ఇది రద్దు చేయదగిన చట్టమని చెప్పారు. ఇలాంటి అభిప్రాయాలే కొందరు బీజేపీ నాయకులు సైతం వ్యక్తం చేశారు. పక్కవారికి ఇబ్బంది కలిగించనంతవరకూ స్వలింగ సంపర్కం నేరం కాదని రెండేళ్లక్రితం ఆరెస్సెస్ సహ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోసబలె ప్రకటించి, ఆ తర్వాత నాలిక కరుచుకున్నారు. అది సామాజిక అనైతికమని స్వరం మార్చారు. నైతిక విలువల భావనకూ, వాస్తవానికీ మధ్య ఊగిసలాటలు మనలాంటి సమాజంలో సహజమే. పురుషాధిక్యత ఇతర జెండర్లను తక్కువ చేసి చూస్తుంది. స్త్రీ పురుష శృంగారం మాత్రమే సహజమైనదని, పునరుత్పత్తితో ముడిపడని శృంగారం అసహజమైనదని అంటుంది. మనుషుల్లో మాత్రమే కాదు... సమస్త జీవుల్లో కూడా ఇందుకు సంబంధించి వైవిధ్యతలున్నాయన్న సంగతిని ఒప్పుకోదు. పర్యవసానంగా భిన్న లైంగిక భావనలున్నవారిని రోగులుగా పరిగణించడమేకాక... వారికి చికిత్స జరిపిస్తే ‘అందరిలా’ ఉండగలరనే అభిప్రాయం చాలామందిలో ఇప్పటికీ ఉంది. ఇటీవల తెలంగాణలో ఇద్దరు యువతులు ఆలుమగల్లా కలిసి ఉంటామని పటు బట్టడం, వారి తల్లిదండ్రులు అందుకు అంగీకరించకపోవడంతో వివాదం తలె త్తడం మీడియాలో ప్రముఖంగా వచ్చింది. స్వలింగ సంపర్కులను ఈ చట్టం కింద అరెస్టు చేసి శిక్షించిన సందర్భాలు స్వల్పమే అయినా, అది అమల్లో ఉండటం వల్ల తలెత్తే ఇతర సమస్యలు తక్కువేం కాదు. సమాజం వెలివేసినట్టు చూడటం, వేధింపులకు దిగడం వల్ల స్వలింగ సంపర్కులు బాహాటంగా బయటపడరు. ఇది ఇతరత్రా అనేక సమస్యలకు దారితీస్తుంది. అసలు ప్రేమించడమే సామాజిక నియమాల అతిక్రమణగా పరిగణించే మన సమాజంలో కులాంతర, మతాంతర ప్రేమలూ, పెళ్లిళ్లను ఆహ్వానించలేని సంకుచిత స్థితి ఉంది. ఇక స్వలింగ సంపర్కం లాంటి లైంగిక భావనల విషయంలో ఏ స్థాయిలో వ్యతిరేకత ఉంటుందో ఊహించు కోవచ్చు. కానీ మన రాజ్యాంగం వ్యక్తిగత స్వేచ్ఛకూ, సమానత్వ భావనకూ, మైనారిటీల హక్కులకూ రక్షణ కల్పిస్తోంది. సెక్షన్ 377 చెల్లుబాటుపై గతంలో ఇచ్చిన తీర్పును విస్తృత ధర్మాసనం పునఃపరిశీలించాలన్న సుప్రీంకోర్టు తాజా నిర్ణయం ఆ రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణమైనదే. ఇందుకు న్యాయమూర్తులను అభినందించాలి. -
‘స్వలింగ సంపర్కం’పై స్వామి ఏమన్నారంటే..
సాక్షి, న్యూఢిల్లీ: స్వలింగ సంపర్కులతోపాటు, స్త్రీ, పురుషుల మధ్య అసహజ శృంగారానికి అడ్డుకట్ట వేస్తున్న భారతీయ శిక్షా స్మతిలోని 377వ సెక్షన్‌ను సర్వోన్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు పునర్ పరిశీలించేందుకు అంగీకరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీ సీనియర్ నేత సుబ్రమణ్య స్వామి స్వలింగ సంపర్కం (మగ-మగ, ఆడ-ఆడ మధ్య శృంగారం), ఎల్జీబీటీల అంశంపై స్పందించారు. ఎల్జీబీటీ కమ్యూనిటీకి చెందినవారు ఏం చేసినా వ్యక్తిగత విషయంగా ఉండాలని, కానీ పబ్లిక్ లో ఆ విషయాన్ని బహిరంగంగా వెల్లడించడంలాంటివి చేస్తే శిక్షించాల్సిందేనని అభిప్రాయపడ్డారు. జన్యు పరమైన లోపాల కారణంగానే స్వలింగ సంపర్కులుగా తయారవుతారని చెప్పారు. తమ జెండర్ (హోమో సెక్స్‌వల్) పలానా అని, తాము పలానా కమ్యూనిటీ(ఎల్జీబీటీ) వ్యక్తులతో శృంగారంలో పాల్గొంటామని బహిర్గతం చేయడం చేస్తే చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రపంచంలో సగానికి పైగా దేశాలు స్వలింగ సంపర్క వివాహాలను వ్యతిరేకిస్తున్నారని స్వామి గుర్తుచేశారు. మనుషులు సాధారణంగా హమో సెక్స్‌వల్స్‌గా మారడం లేదని, జన్యుపరమైన లోపాలు అందుకు ప్రధాన కారణంగా కనిపిస్తోందని బీజేపీ సీనియర్ నేత పేర్కొన్నారు. -
ఇద్దరు అమ్మాయిలు పెళ్లి చేసుకోరాదా?
బెంగళూరు: సమాజంలో ఇప్పటికే ఎన్నో సమస్యలతో జీవన పోరాటం చేస్తున్న తమను మరింత ఇబ్బందికి గురిచేసేలా తమ వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకోవటం ప్రసార మాధ్యమాలకు తగదని ఎల్జీబీటీ సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేశారు. అక్కాచెల్లెలి వరసయ్యే ఇద్దరు అమ్మాయిలు పెళ్లి చేసుకున్నారని బుధవారం టీవీ చానెళ్లలో పదేపదే చూపించడం, పత్రికల్లో ప్రచురించడాన్ని ఖండిస్తున్నామని అన్నారు. గురువారం బెంగళూరు ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశంలో పలు లింగమార్పిడి, స్వలింగ సంపర్కుల హక్కుల (ఎల్జీబీటీ) సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ.... జరిగిన సంఘటనను వక్రీకరించి ప్రసారం చేశారని విమర్శించారు. ఇద్దరు మహిళలు వివాహం చేసుకున్నారనే సంగతిని ప్రసారం చేసేవారు, దీనివల్ల వారి వ్యక్తిగత జీవితానికి ఎంత నష్టం వాటిల్లుతుందనేది ఆలోచించకపోవటం శోచనీయమని ఆక్షేపించారు. ప్రపంచంలో ఎక్కడా జరగడం లేదా? తమ గురించి ఈ విధంగా ప్రచారం జరగటంతో సమాజంలో ఎన్నో అవమానాలను, బాధలను ఎదుర్కోవాల్సి వస్తున్నదని తెలిపారు. ఇద్దరు మహిళలు కలసి జీవించటం అనేది పెద్ద నేరం, ప్రపంచంలో ఎక్కడా జరుగలేదన్న విధంగా చేయటం విడ్డూరంగా ఉందన్నారు. వివాహమనేది వారి వ్యక్తిగత విషయమనే సంగతనేది మరువరాదన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం తాము ఏమిటో చెప్పుకోవటానికి తమకు మాత్రమే హక్కు ఉంది, తాము ఫలానా అని ఇతరులు ప్రచారం చేయటం తప్పు అవుతుంది అని చెప్పారు. సమాజంలో తాము కూడా గౌరవంగా జీవించడానికి దోహదపడిన మీడియా తొలిసారిగా ఇబ్బందికి గురిచేసేలా వ్యవహరించిందని అన్నారు. ఆ ఇద్దరు మహిళల సంగతిని పోలీసులు మీడియాకు తెలియజేయటం కూడా సరైన విధానం కాదని వారు ఖాకీలనూ తప్పుబట్టారు. అక్క చెల్లెళ్ల ప్రేమపెళ్లి.. సహజీవనం -
'ది వైల్డ్ వన్ పార్టీ'పై రైడ్: 141 మంది అరెస్టు
జకర్తా: ఇండోనేషియా రాజధానిలోని ఓ జిమ్‌పై రైడింగ్ నిర్వహించిన పోలీసులు ఆదివారం 141 మంది 'గే'(స్వలింగ సంపర్కులు)లను అరెస్టు చేశారు. ఈ మేరకు ఓ ప్రకటనను విడుదల చేశారు. పట్టుబడిన వారిలో పది మంది ఇండోనేషియా పోర్నోగ్రఫీ చట్టాలను ఉల్లంఘించారని తెలిపారు. రైడింగ్‌లో పెద్ద మొత్తంలో దొరికిన కండోమ్‌లు, సీసీటీవీ రికార్డింగ్‌లు, పరుపులను మీడియాకు చూపించారు. నిందితులందరినీ విచారిస్తున్నట్లు తెలిపారు. 'ది వైల్డ్ వన్' పేరుతో సెక్స్ పార్టీని ఏర్పాటు చేశారని వెల్లడించారు. పార్టీలో పాల్గొనేందుకు ఒక్కొక్కరి నుంచి రూ.900 వసూలు చేసినట్లు వివరించారు. స్వలింగ సంపర్కం ఇండోనేషియాలో నేరం కాదు. అయితే, అసెహ్ ప్రావిన్సులో మాత్రం స్వలింగ సంపర్కులపై నిషేధం ఉంది. జకర్తా ఏ ప్రావిన్సులోకి రాదు. దాన్ని ఆ దేశ కేంద్ర ప్రభుత్వం పాలిస్తోంది. 141 మంది స్వలింగ సంపర్కులను అదుపులోకి తీసుకోవడంపై కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది ఎల్జీబీటీల హక్కులను కాలరాయడమేనని అంటున్నారు. -
ఎల్జీబీటీ వివక్ష పరిశీలనకు నిపుణుడి నియామకం
ఐరాస తీర్మానం ఓటింగ్‌కు భారత్ గైర్హాజరు జెనీవా/న్యూఢిల్లీ: ఎల్జీబీటీ(గే, లెస్బియన్, ద్విలింగ సంపర్కం, ట్రాన్స్‌జెండర్ ) వర్గం ఎదుర్కొంటున్న హింస, వివక్ష సంఘటనల పరిశీలనకు స్వతంత్ర నిపుణుడ్ని ఏర్పాటు చేయాలని ఐరాస మానవ హక్కుల కౌన్సిల్ నిర్ణయించింది. ఇందుకోసం జెనీవాలో నిర్వహించిన ఓటింగ్‌లో తీర్మానం తక్కువ ఓట్ల తేడాతో ఆమోదం పొందింది. 23 దేశాలు అనుకూలంగా, 18 దేశాలు వ్యతిరేకంగా ఓటు వేయగా మూడు దేశాలు గైర్హాజరయ్యాయి. తీర్మానంపై ఓటింగ్‌కు భారత్ గైర్హాజరైంది. మూడేళ్ల కాల వ్యవధితో పనిచేసే ఈ స్వతంత్ర నిపుణుడు గే, లెస్బియన్, ట్రాన్స్జెండర్లపై హింస వివరాల్ని పరిశీలిస్తారు. భారత్ నిర్ణయాన్ని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి వికాస్ స్వరూప్ సమర్థించుకున్నారు. ఎల్జీబీటీ అంశంలో భారత్‌లో న్యాయపరంగా ఉన్న వాస్తవం ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ఎల్జీబీటీ హక్కుల అంశం సుప్రీం పరిధిలో ఉందని, వివిధ సంస్థలు క్యూరేటివ్ పిటిషన్లు దాఖలు చేశాయని, వాటిపై నిర్ణయం వెల్లడవాల్సి ఉందన్నారు. -
ఎల్జీబీటీ సంఘానికి జుకర్ బర్గ్ మద్దతు!
శాన్ ఫ్రాన్సిస్కోః ఫేస్ బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్ బర్గ్ ఎల్జీబీటీ ప్రైడ్ పరేడ్ లో పాల్గొన్నారు. లెస్బియన్, గే, బై సెక్సువల్, ట్రాన్స్ జెండర్లు శాన్ ఫ్రాన్సిస్కోలో నిర్వహించిన పరేడ్ లో పాల్గొని, అనంతరం ఫేస్ బుక్ లో వారికి అందించే తోడ్పాటుతో కూడని విషయాలను వివరిస్తూ ఓ సుదీర్ఘ వ్యాసాన్ని పోస్టు చేశారు. మార్క్ జుకర్ బర్గ్ మరోసారి తన ప్రత్యేకతను చాటుకున్నారు. అమెరికా శాన్ ఫ్రాన్సిస్కోలో నిర్వహించిన ఎల్జీబీటీ ప్రైడ్ మార్చ్ లో పాల్గొన్న ఆయన.. ఆ సమాజ సభ్యులకు తన అండదండలు ఎప్పుడూ ఉంటాయన్నారు. ఇటీవల ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు ప్రైడ్ పరేడ్స్ లో పాల్తొంటున్నారని, ఎల్జీబీటీ సమాజ సభ్యులతో తాను పెరేడ్ లో కలసి నిలబడటమే కాదు.. ఫేస్ బుక్ వారికి సురక్షితమైన స్థలంగా మార్చేందుకు కట్టుబడి ఉన్నానని జుకర్ బర్గ్ తన ఫేస్ బుక్ పోస్ట్ లో తెలిపారు. తమకూ స్వేచ్ఛా, ఆనందం, జీవించే హక్కు కావాలని కోరుకుంటున్న వారిని గౌరవిస్తూ వారితో కలసి తాను ఎల్జీబీటీ నిర్వహించే నెలవారీ ప్రైడ్ సంబరాలు జరుపుకుంటున్నానని, సమానత్వంకోసం వారు చేసే పోరాటంలోనూ తాను పాల్గొన్నానని తెలిపారు. వారి సమస్యల పోరాటానికి ప్రత్యేకంగా పనిచేస్తానని తెలిపారు. ఎల్జీబీటీ ప్రైడ్ పరేడ్ కు మద్దతు పలికిన టెక్ సీఈవోల్లో ఫేస్ బుక్ సీఈవో జుకర్ బర్గ్ మాత్రమే కాక... యాపిల్ సీఈవో టిమ్ కుక్, వారి ఉద్యోగులు కూడ పాల్గొని ఎల్జీబీటీ హక్కుల పోరాటానికి మద్దతు పలికారు. -
'రెయిన్ బో' రెపరెపల వెనుక కథ ఇదే!
లెస్బియన్స్, గే, బెసైక్సువల్, ట్రాన్స్‌జెండర్స్(ఎల్జీబీటీ) కమ్యూనిటీల పరేడ్లు, ప్రచారాలు ఒక్కసారి చూడండి. ఆకాశంలో కనిపించే ఇంద్రధనుస్సు ఒక్కసారిగా ఇలని కప్పేసినట్టు అనిపిస్తుంది. అది ఎలా అనుకుంటున్నారా? రంగురంగుల ఇంద్రధనుస్సు జెండా రూపంలో. అసలు ఈ ఇంద్రధనుస్సు జెండా వారి చిహ్నంగా ఎలా స్థిరపడింది? అది ఎప్పటినుంచి వారికి గుర్తింపుగా నిలుస్తుందో తెలుసుకుంటే మీకు ఆశ్చర్యమనిపిస్తుంది. 1978లోనే శాన్ఫ్రాన్సిస్కోకు చెందిన గిల్బర్ట్ బేకర్ ఈ జెండాను ఎల్జీబీటీ కమ్యూనిటీల కోసం రూపొందించారంట. స్థానిక ఎల్జీబీటీ కమ్యూనిటీల కోరిక మేరకు ఆయన దీన్ని డిజైన్ చేశారు. ఈ జెండాల్లో ఉండే ఒక్కో రంగుకి ఒక్కో ప్రాధాన్యముంటోంది. ఎరుపు జీవితానికి, గులాబీ లైంగికతకు, పసుపు సూర్యుడికి, ఆకుపచ్చ ప్రకృతికి, నారింజ వైద్యానికి, నీలం కళకు, ముదురు నీలివర్ణం సామరస్యానికి, వెలైట్ ధైర్యానికి ప్రతీకగా నిలుస్తూ ఉంటాయి. 1978 గే ఫ్రీడమ్ డే పరేడ్‌లో మొదటిసారి ఈ జెండాను ఎగరవేశారు. ఎనిమిది రంగులుగా ఉన్న రెయిన్ బో జెండా కాస్త, కాలానుగుణంగా ఆరు రంగులుగా మారింది. ‘గే’ గర్వానికి ప్రతీకగా ఈ జెండా రంగులు నిలుస్తాయని ఎల్జీబీటీల నమ్మకం. ఆరు సాదాసీదా రంగులతో ఉండే ఈ జెండా, చాలామంది ఎల్జీబీటీల లోగిళ్లలో మనకు కనిపిస్తుంది. ఈ జెండాల్లో సాదాసీదా రంగులే కాక, వ్యత్యాసముతో కూడిన మరిన్ని రంగులు కూడా మనం గుర్తిస్తుంటాం. ప్రపంచమంతా ఎల్జీబీటీలు తమ ఉనికిని చాటుకోవడానికి ఈ రెయిన్ బో జెండా వాడుతూ వస్తున్నారు. ఐపీసీ 377 ప్రకారం స్వలింగ సంపర్కం నేరంకిందికి వస్తుందని పేర్కొంటూ గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పునఃపరిశీలించాలంటూ ఓ ఎన్జీవో వేసిన పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం మంగళవారం విచారించింది. ఈ అంశాన్ని ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనానికి నివేదించాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఎల్జీబీటీ వర్గాలు ఆనందంలో మునిగిపోతూ.. 'రెయిన్ బో' జెండాను రెపరెపలాడిస్తున్న సంగతి తెలిసిందే. -
మరోసారి తెరపైకి ఎల్జీబీటీ
న్యూఢిల్లీ: మరోసారి ఎల్జీబీటీ (లెస్బియన్స్, గే, బైసెక్సువల్, ట్రాన్స్ జెండర్స్) వివాదం తెరపైకి వచ్చింది. భారత పీనల్ కోడ్ చట్టం 377 ప్రకారం స్వలింగ సంపర్కం నేరంకిందికి వస్తుందని పేర్కొంటూ గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పునఃపరిశీలించాలంటూ ఓ ఎన్జీవో వేసిన పిటిషన్‌ను మంగళవారం అత్యున్నత న్యాయస్థానం పరిశీలించింది. స్వలింగ సంపర్కం అంశంపై నిషేధం విధించాలా లేక కొనసాగించాలా అనే విషయాన్ని ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం పరిశీలిస్తుందని ఈ సందర్భంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి టీఎస్ ఠాకూర్ పిటిషన్ దారుకు తెలియజేశారు. దీంతో అసలు విచారణకే రాదనకున్న తమ పిటిషన్‌పై చాలాకాలం తర్వాత కదలిక రావడంతో స్వలింగ సంపర్కుల్లో ఆనందం వెల్లివిరిసి సంబరాలకు సిద్ధమయ్యారు. -
స్వలింగ సంపర్కుల్లో చిగురించిన కొత్త ఆశలు
న్యూఢిల్లీ: స్వలింగ సంపర్కం నేరమంటూ సుప్రీంకోర్టు గత ఏడాది ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ గే హక్కుల కార్యకర్తలు దాఖలు చేసిన క్యూరేటివ్ పిటిషన్లను బహిరంగ కోర్టులో విచారించేందుకు సుప్రీం కోర్టు ఈ రోజు అంగీకరించింది. దీనిని వచ్చేవారం చేపట్టే విచారణల జాబితాలో చేర్చాలని పేర్కొంటూ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ పి.సదాశివం నేతృత్వంలోని నలుగురు సభ్యుల ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో గే సెక్స్ నేరమంటూ ఇచ్చిన తీర్పును కోర్టు సవరించుకోవచ్చని భావిస్తున్న ఎల్జీబీటీ(లెస్బియన్, గే, బెసైక్సువల్, ట్రాన్స్‌జెండర్) వర్గాల్లో కొత్త ఆశలు చిగురించాయి. గే సెక్స్ నేరమని, అందుకు జీవిత ఖైదు వరకూ శిక్ష విధించవచ్చని పేర్కొనే ఐపీసీ సెక్షన్ 377(అసహజ శృంగార నేరాలు) చట్టబద్ధతను సమర్థిస్తూ గత ఏడాది డిసెంబరు 11న సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ నాజ్ ఫౌండేషన్, ప్రముఖ సినీ దర్శకుడు శ్యాం బెనెగల్, గే హక్కుల కార్యకర్తలు సుప్రీంలో క్యూరేటివ్ పిటిషన్లు దాఖలు చేశారు. పిటిషన్లను ఓపెన్ కోర్టులో విచారించాలంటూ పిటిషనర్ల తరఫు సీనియర్ న్యాయవాదులు కోరగా వారి విజ్ఞప్తిని పరిశీలిస్తామని సదాశివం నేతృత్వంలోని ధర్మాసనం తెలిపింది. బహిరంగ కోర్టులో విచారించేందుకు సుప్రీం కోర్టు ఈ రోజు ఆమోదించింది. కోర్టు తీర్పులపై అప్పీళ్లలో క్యూరేటివ్ పిటిషన్ వేయడం అనేది న్యాయపరంగా ఆఖరి ప్రక్రియ. సాధారణంగా క్యూరేటివ్ పిటిషన్లపై ఎలాంటి వాదనలకూ అవకాశం ఇవ్వకుండా న్యాయమూర్తులు ఇన్-చాంబర్ కోర్టులోనే పిటిషన్లను విచారిస్తారు. అరుదైన సందర్భాల్లో మాత్రమే ఇలా బహిరంగ కోర్టులో విచారించేందుకు అంగీకరిస్తారు. -
మేమూ మనుషులమే
ఎల్జీబీటీల ప్రధాన డిమాండ్లు.. లైంగికంగా వెనక బడిన వర్గాల కింద పరిగణించాలి. మనిషిగా గుర్తింపు ఇవ్వాలి. గుర్తింపు కార్డులివ్వాలి. విద్య, వైద్యం, గృహ సౌకర్యాలు కల్పించాలి. రాజకీయాలలో రిజర్వేషన్ ఇవ్వాలి. గచ్చిబౌలి, న్యూస్‌లైన్: పురాతన కాలంలో సమ లైంగికుల పట్ల ఆదరణ చూపే వారని, ఆధునిక సమాజంలో అవహేళన చేస్తున్నారని శుభోదయ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకులు విద్య పేర్కొన్నారు. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ హైటెక్‌సిటీ రైల్యే స్టేషన్ నుంచి శిల్పారామం వరకు సురక్ష సంస్థ ఆధ్వర్యంలో ‘హైదరాబాద్ క్యూర్ ప్రైడ్’ పేరిట ఎల్జీబీటీ(లెస్బియన్స్, గే, బై సెక్సువల్స్ అండ్ ట్రాన్స్‌జెండర్)లు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని సినీనటి మంచు లక్ష్మి ప్రారంభించారు. ఈ సందర్భంగా నల్సార్ యూనివర్సిటీకి చెందిన న్యాయవాది గిరిష్మ మాట్లాడుతూ ఆర్టికల్ 377ను సమర్ధిస్తూ సుప్రీం కోర్టు తీర్పు ఇవ్వడంతో ఎల్జీబీటీలు ఆందోళనకు గురవుతున్నారన్నారు. వారిది ప్రకృతి విరుద్ధమైన చర్యలు కావని సహజత్వం ద్వారానే అలా ఉన్నారని తెలిపారు. అవగాహన స్వచ్ఛంద సంస్థ ప్రాజెక్ట్ మేనేజర్ చంద్రముఖి మాట్లాడుతూ తామూ దేవుడు చేసిన మనుషులమేనని చెప్పారు. అనంతరం సమ లైంగికులు సమాజంలో ఎదుర్కొంటున్న సమస్యలను తెలియజేసే సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించారు. మా సమస్యలపై హామీ ఇస్తేనే ఓటు వేస్తాం.. రాష్ట్ర వ్యాప్తంగా ఐదు లక్షల మంది ఉన్నాం. అందరికీ ఓటు హక్కు ఉంది. ఎల్జీబీటీల సమస్యలను మ్యూనిఫెస్టోలో పెట్టిన పార్టీకే ఓటు వేస్తాం. - కృష్ణ, సురక్ష వ్యవస్థాపకులు మమ్మల్ని ఆదరించండి.. సమలైంగికులంతా ఒక వేదికపై కలుస్తున్నాం. సమాజం మాపట్ల చూపుతున్న వివక్ష మాటలతో చెప్పలేం. మమ్మల్ని ఆదరించండి. - నవ్‌దీప్ సమాజం గుర్తించాలి.. సుప్రీంకోర్టు తీర్పు బాధకల్గిస్తోంది. అందరి మాదిరిగానే మాకు ప్రాథమిక హక్కులు కల్పించాలి. - షేన్, కాల్ సెంటర్ ఉద్యోగి ఆధార్‌కార్డు కూడా ఇవ్వడం లేదు.. రోడ్లపై నడుచుకుంటే వెళితే అవహేళన చేస్తారు. అన్నీ భరిస్తున్నాం. కనీసం ఆధార్ కార్డు కూడ ఇవ్వడం లేదు. మాలో చాలా మంది చదువుకున్న వాళ్లున్నారు. రిజర్వేషన్ సౌకర్యం కల్పించాలి. - శిరీష -
మేం నేరస్తులం కాదు
న్యూఢిల్లీ: స్వలింగ సంపర్కంపై విధించిన నిషేధాన్ని ఎత్తేయాలని ఎల్జీబీటీ (స్వలింగ సంపర్కులు, ద్విలింగ సంపర్కులు, లింగమార్పిడి చేయించుకున్నవారు) కార్యకర్తలు, సభ్యులు డిమాండ్ చేశారు. దీనిపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును పున:సమీక్షించాలని కోరారు. ‘మేం నేరస్తులం కాదు’, ‘మరొక వ్యక్తిని ప్రేమించడమనేది నేరం కాదు’ తదితర ప్లకార్డులు, బ్యానర్లు చేతబూని జంతర్ మంతర్‌లో ఆందోళన చేశారు. స్వలింగ సంపర్కం నేరమన్న సుప్రీం తీర్పుని మళ్లీ ఒకసారి పరిశీలించాలని డిమాండ్ చేశారు. వ్యక్తిగత స్వేచ్ఛ, మానవ హక్కులకు వ్యతిరేకంగా వచ్చిన ఈ తీర్పును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని సొసైటీ ఫర్ పీపుల్స్ అవేర్నెస్, కేర్ అండ్ ఎంపవర్మెంట్ (స్పేస్)అనే సంస్థ వ్యవస్థాపక సభ్యుడు అంజన్ జోషి అన్నారు. ఇతర వర్గాల ప్రజల నుంచి మాకు భారీ మద్దతు లభిస్తోందని, దీన్ని ప్రభుత్వం, న్యాయవ్యవస్థ పరిగణనలోకి తీసుకోవాలని జోషి విలేకరులకు తెలిపారు. స్వలింగ సంపర్కంపై ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు ఢిల్లీలోని వివిధ ప్రాంతాల్లో వారంపాటు ఆందోళనకు దిగనున్నామని హెచ్చరించారు. ‘ఒక పిల్లర్‌ను ఏర్పాటుచేసి మాకు మద్దతిచ్చే వారి సంతకాలను దానిపై తీసుకుంటాం. అన్ని ప్రాంతాలకు ఈ పిల్లర్‌ను తీసుకెళ్లి అందరి మద్దతు కూడగడతాం. ఆ తర్వాత దాన్ని న్యాయశాఖ మంత్రి కపిల్ సిబల్‌కు బహూకరిస్తామ’ని జోషి వెల్లడించారు. స్వలింగ సంపర్కంపై నిషేధాన్ని 2009లో సడలించిన ఢిల్లీ హైకోర్టు తీర్పును కొట్టేసిన సుప్రీంకోర్టు అది ముమ్మాటికీ నేరమేనని ఇటీవల తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. -
మేం నేరస్తులం కాదు: స్వలింగ సంపర్కుల ఆందోళన
న్యూఢిల్లీ: స్వలింగ సంపర్కంపై విధించిన నిషేధాన్ని ఎత్తేయాలని ఎల్జీబీటీ (స్వలింగ సంపర్కులు, ద్విలింగ సంపర్కులు, లింగమార్పిడి చెయ్యించుకున్నవారు) కార్యకర్తలు, సభ్యులు డిమాండ్ చేశారు. దీనిపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం కూడా తమకు అండగా నిలవాలని వారు కోరారు.‘మేం నేరస్తులం కాదు, అవతలి వ్యక్తిని ప్రేమించు హక్కు మా క్కూడా ఉంందని స్వలింగ సంపర్కులు తెలిపారు.తదితర ప్లకార్డులు, బ్యానర్లు చేతబూని ఆందోళన చేశారు. స్వలింగ సంపర్కం నేరమన్న సుప్రీం తీర్పుని మళ్లీ ఒకసారి పరిశీలించాలని డిమాండ్ చేశారు. వ్యక్తిగత స్వేచ్ఛ, మానవ హక్కులకు వ్యతిరేకంగా వచ్చిన ఈ తీర్పును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని సొసైటీ ఫర్ పీపుల్స్ అవేర్నెస్, కేర్ అండ్ ఎంపవర్మెంట్ (స్పేస్)అనే సంస్థ వ్యవస్థాపక సభ్యుడు అంజన్ జోషి అన్నారు. ఇతర వర్గాల ప్రజల నుంచి మాకు భారీ మద్దతు లభిస్తోందని, దీన్ని ప్రభుత్వం, న్యాయవ్యవస్థ పరిగణనలోకి తీసుకోవాలని జోషి విలేకరులకు తెలిపారు. స్వలింగ సంపర్కంపై ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు ఢిల్లీలోని వివిధ ప్రాంతాల్లో వారంపాటు ఆందోళనకు దిగనున్నామని హెచ్చరించారు. -
స్వలింగ సంపర్కంపై సుప్రీం తీర్పు వివక్ష, హింసలకు దారితీస్తుంది
న్యూఢిల్లీ: స్వలింగ సంపర్కాన్ని నిషేధిస్తూ సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పును ఎల్జీబీటీ బృందం వ్యతిరేకించింది. ఈ తీర్పు వివక్షకు, హింసకు కారణమౌతుందని విమర్శించారు. భారత శిక్షా స్మృతిలో సెక్షన్ 377లో మార్పు చేయడానికి రాజ్యాంగబద్ధమైన అవకాశాలు లేవని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. స్వలింగ సంపర్కులైన స్త్రీ, పురుషుల మధ్య శారీరక సంబంధాల నిషేధం సమర్థనీయమేనని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. కాగా ఈ తీర్పును ఎల్బీబీటీ బృందాలు తీవ్రంగా నిరసించాయి.‘‘మాకు ఈ రోజు బ్లాక్ డే. సుప్రీం ప్రకటించిన తీర్పు మనలను మరో 100 ఏళ్లు వెనుకకు తోసింది. మన సంస్కృతి, ప్రజల మీద దీని ప్రభావం ఎలా ఉండనుంది. నిజంగా ఇది వికారపు నిర్ణయం. ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టు సమర్థించడం దురదృష్టకరం’’ అని నాజ్ ఫౌండేషన్ ట్రస్ట్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ అంజలీ గోపాలన్ తెలిపారు. ప్రత్యామ్నాయ న్యాయ వేదిక న్యాయవాది అరవింద్ నారాయణ్ మాట్లాడుతూ‘‘ఢిల్లీ కోర్టు తీర్పును సుప్రీం కోర్టు సమర్థించడం మమ్మల్ని విషాదంలో ముంచింది. ఈ తీర్పు ప్రాథమిక హక్కులకు భంగకరం. రాజ్యాంగం ప్రతి పౌరుని ఆత్మగౌరవాన్ని గుర్తించాలి’’ అన్నారు. తీర్పుపట్ల అసంతృప్తిని, దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన పురుష స్వలింగ సంపర్కుల బృందం కార్యకర్త అశోక్ రౌ కవి మాట్లాడుతూ‘‘ ఇది దిగ్భ్రమకు గురిచేసే తీర్పు. ఇది మనల్ని తరాల వెనుకకు తోసేస్తుంది. మేము దీనికి వ్యతిరేకంగా పోరాడుతాం’’ అని ప్రకటించారు.