స్వలింగ సంపర్కంపై సుప్రీం తీర్పు వివక్ష, హింసలకు దారితీస్తుంది
న్యూఢిల్లీ: స్వలింగ సంపర్కాన్ని నిషేధిస్తూ సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పును ఎల్‌జీబీటీ బృందం వ్యతిరేకించింది. ఈ తీర్పు వివక్షకు, హింసకు కారణమౌతుందని విమర్శించారు. భారత శిక్షా స్మృతిలో సెక్షన్ 377లో మార్పు చేయడానికి రాజ్యాంగబద్ధమైన అవకాశాలు లేవని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. స్వలింగ సంపర్కులైన స్త్రీ, పురుషుల మధ్య శారీరక సంబంధాల నిషేధం సమర్థనీయమేనని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. కాగా ఈ తీర్పును ఎల్‌బీబీటీ బృందాలు తీవ్రంగా నిరసించాయి.‘‘మాకు ఈ రోజు బ్లాక్ డే. సుప్రీం ప్రకటించిన తీర్పు మనలను మరో 100 ఏళ్లు వెనుకకు తోసింది. మన సంస్కృతి, ప్రజల మీద దీని ప్రభావం ఎలా ఉండనుంది.
నిజంగా ఇది వికారపు నిర్ణయం. ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టు సమర్థించడం దురదృష్టకరం’’ అని నాజ్ ఫౌండేషన్ ట్రస్ట్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ అంజలీ గోపాలన్ తెలిపారు. ప్రత్యామ్నాయ న్యాయ వేదిక న్యాయవాది అరవింద్ నారాయణ్ మాట్లాడుతూ‘‘ఢిల్లీ కోర్టు తీర్పును సుప్రీం కోర్టు సమర్థించడం మమ్మల్ని విషాదంలో ముంచింది. ఈ తీర్పు ప్రాథమిక హక్కులకు భంగకరం. రాజ్యాంగం ప్రతి పౌరుని ఆత్మగౌరవాన్ని గుర్తించాలి’’ అన్నారు. తీర్పుపట్ల అసంతృప్తిని, దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన పురుష స్వలింగ సంపర్కుల బృందం కార్యకర్త అశోక్ రౌ కవి మాట్లాడుతూ‘‘ ఇది దిగ్భ్రమకు గురిచేసే తీర్పు. ఇది మనల్ని తరాల వెనుకకు తోసేస్తుంది. మేము దీనికి వ్యతిరేకంగా పోరాడుతాం’’ అని ప్రకటించారు.