
Virat Kohli Restaurant One8 Commune Faces Allegations From LGBTQIA+ Group: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లికి చెందిన రెస్టారెంట్ చైన్ వన్8 కమ్యూన్‌పై ఎల్‌జీబీటీక్యూఐఏ ఆక్టివిజమ్ గ్రూపు ‘‘ఎస్.. వి ఎగ్జిట్’’ తీవ్ర ఆరోపణలు చేసింది. స్వలింగ సంపర్కుల పట్ల ఈ రెస్టారెంట్ వివక్ష చూపుతోందని ఆరోపించింది. వన్8 కమ్యూన్ పుణె బ్రాంచ్‌లో తమకు ఎదురైన చేదు అనుభవమే ఇందుకు నిదర్శనమని సదరు గ్రూపు సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. తన రెస్టారెంట్ నిర్వాహకులు ఇలా వ్యవహరిస్తున్నారన్న విషయం కోహ్లికి తెలిసి ఉండదన్న ‘‘ఎస్.. వి ఎగ్జిట్’’ గ్రూపు... ఏదేమైనా ఇలా తమ పట్ల వివక్ష చూపడం ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని వాపోయింది.
ఈ మేరకు..‘‘విరాట్ కోహ్లి నీకు ఈ విషయం తెలియదనే అనుకుంటున్నాం. వన్8 కమ్యూన్ పుణె బ్రాంచ్ ఎల్‌జీబీటీక్యూఐఏ గెస్టుల పట్ల వివక్షపూరితంగా వ్యవహరిస్తోంది. మీ రెస్టారెంటులోని మిగతా బ్రాంచీలు కూడా ఇదే తరహాలో వ్యవహరిస్తున్నాయి. ఇది మేమసలు ఊహించలేదు. ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదు. ఈ విషయం తెలిసిన తర్వాత మీరు నిబంధనలు మారుస్తారనే అనుకుంటున్నాం. జొమాటోకు కూడా మా విజ్ఞప్తి. ఇలాంటి రెస్టారెంట్లతో మీరు భాగస్వామ్యం కావొద్దు’’ అని ‘‘ఎస్.. వి ఎగ్జిట్’’ గ్రూపు ఇన్‌స్టాలో ఓ పోస్టు షేర్ చేసింది.
కాగా ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనం ప్రకారం... పుణె బ్రాంచ్‌లో గేలకు ఎంట్రీ లేదని వన్8 కమ్యూన్ తెలిపినట్లు సమాచారం. అయితే, ఈ విషయంపై స్పందించిన రెస్టారెంట్ నిర్వాహకులు.. ఇవి కేవలం ఉద్దేశపూర్వకంగా చేసిన ఆరోపణలు మాత్రమేనని కొట్టిపారేశారు. తాము కేవలం స్టాగ్స్ ఎంట్రీ(ఒంటరిగా వచ్చే అబ్బాయిలు)పై మాత్రమే ఆంక్షలు విధించామని పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో వన్8 కమ్యూన్ పుణె బ్రాంచ్‌కు చెందిన అమిత్ జోషి మాట్లాడుతూ.. ‘‘మేమెలాంటి లింగ వివక్ష చూపడం లేదు. ఒంటరిగా వచ్చే అబ్బాయిలను మాత్రమే లోపలికి అనుమతించడం లేదు. అది కూడా మహిళల భద్రతా దృష్ట్యా. అంతకుమించి వేరే ఉద్దేశం ఏమీ లేదు’’ అని వివరణ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment