ఎన్నాళ్లో వేచిన హృదయం | Revolutions of the world are the result of existential struggles | Sakshi
Sakshi News home page

ఎన్నాళ్లో వేచిన హృదయం

Published Sat, Sep 8 2018 12:06 AM | Last Updated on Sat, Sep 8 2018 12:06 AM

Revolutions of the world are the result of existential struggles - Sakshi

కోర్టు తీర్పు అనంతరం సంబరాలు జరుపుకుంటున్న ఎల్‌జీబీటీ మద్దతుదారులు (కోల్‌కతా)

దేశంలో చాలా సమస్యలు ఉండొచ్చు. ఆత్మాభిమానం దెబ్బ తినడం అన్నిటికన్నా పెద్ద సమస్య. ప్రపంచంలోని విప్లవాలన్నీ అస్తిత్వ పోరాటాల ఫలితాలే. ఈరోజు ఎల్‌జీబీటీలకు సంబంధించిన తీర్పు కూడా వాళ్ల అస్తిత్వ పోరాట ఫలితమే.

2015లో.. ఎల్‌జీబీటీ యాక్టివిస్ట్‌ హరీష్‌ అయ్యర్‌ వాళ్ల అమ్మ పద్మాఅయ్యర్‌ ఓ ప్రకటన పట్టుకొని పత్రికాఫీసులన్నీ తిరిగింది. దాన్ని చూసిన వాళ్లంతా  కనీసం మాట కూడా మాట్లాడకుండా ‘వేయలేం’ అన్నట్టుగా తల అడ్డంగా ఊపి ఆమెను పంపించేశారు. చివరకు హిందుస్థాన్‌ టైమ్స్‌ ఒప్పుకుంది ఆ ప్రకటన వేయడానికి. అన్ని వార్తా పత్రికలు తిరస్కరించిన ఆ ప్రకటన ఏంటి?ఆమె కొడుకు కోసం పెళ్లికొడుకు ప్రకటన! ‘‘ఎన్‌జీవోలో పనిచేస్తున్న 36 ఏళ్ల నా కొడుకు కోసం వరుడు కావాలి. అయిదు అడుగుల పదకొండు అంగుళాల ఎత్తుండే నా కొడుక్కి.. జంతు ప్రేమికుడు, శాకాహారి, మంచి ఉద్యోగం చేస్తున్నజతగాడు కావాలి. అయ్యర్‌ కులస్తులకు ప్రాధాన్యం. అయినా క్యాస్ట్‌ నో బార్‌’’ ఇదీ ఆ ప్రకటన సారాంశం. 

ఇది పత్రికల వాళ్లకే కాదు.. ఎల్‌జీబీటీలను పౌరులుగా చూడని చోట్లల్లా సంచలనమే అయింది. హరీష్‌ అయ్యర్‌కు లైఫ్‌ పార్టనర్‌ దొరికాడా లేదా అన్నది అప్రస్తుతం. ఒక తల్లి అభ్యర్థన ఎంత నవ్వుల పాలైంది? ఒక మనిషి వ్యక్తిగత ఆసక్తిని ఎందుకు కించపరిచారన్నది చర్చనీయాంశం. దీనికి ఇప్పుడు సమాధానం దొరికింది. సుప్రీంకోర్టు తీర్పుతో. ఎల్‌జీబీటీ (లెస్బియన్, గే, బైసెక్సువల్, ట్రాన్స్‌జెండర్‌) హక్కులనూ గౌరవిస్తూ.. వాళ్లనూ పౌరులుగా గుర్తిస్తూ తీర్పునిచ్చింది.  దేశంలో ఇంకేం సమస్యలు లేనట్టు కొంతమంది అసహజ ప్రవర్తనకు గ్రీన్‌ సిగ్నల్‌ రావడాన్ని ఇంత సంబరంగా ఎందుకు చూస్తున్నారు.. అని చాలా మంది ఈసడించుకున్నారు. ఇంకెంతో మంది ‘‘అయిపోయింది.. దేశం గంగలో కలుస్తోంది’’ అంటూ పెదవి విరిచారు. అతి కొద్ది మంది మాత్రమే ‘‘ఇన్నాళ్లకు వాళ్ల పోరాటం ఫలించింది. వాళ్ల ఆత్మగౌరవానికీ గుర్తింపు దొరికింది’’ అంటూ సంతోషపడ్డారు. 

నిజమే, దేశంలో చాలా సమస్యలు ఉండొచ్చు. ఆత్మాభిమానం దెబ్బ తినడం అన్నిటికన్నా పెద్ద సమస్య. ప్రపంచంలోని విప్లవాలన్నీ అస్తిత్వ పోరాటాల ఫలితాలే. ఈరోజు ఎల్‌జీబీటీలకు సంబంధించిన తీర్పు కూడా వాళ్ల అస్తిత్వ పోరాట ఫలితమే. ఆకలినైనా ఓర్చుకుంటాం.. కాని ఆత్మాభిమానం దెబ్బతింటే తట్టుకోలేం. పోరుకు సిద్ధపడతాం. మిగతా పోరాటాలన్నిటికీ అంగీకారం దొరికినప్పుడు ఎల్‌జీబీటీల స్ట్రగుల్‌ మాత్రం ఎందుకు సమ్మతం కాకూడదు? వాళ్ల హక్కులకు గుర్తింపు ఎందుకు ఉండకూడదు? దీని మీద న్యాయపోరాటానికి సిద్ధపడింది ఎల్‌జీబీటీ కమ్యూనిటీ.  ఇప్పుడు సుప్రీంకోర్టు  ‘‘స్వలింగ సంపర్కం నేరం కాదు. అది అసహజమూ కాదు.. అంటువ్యాధి అంతకన్నా కాదు! అదొక బయోలాజికల్‌ ఫెమినా..!’’ అంటూ తీర్పునిచ్చింది. ఎల్‌జీబీటీకి సంబంధించి ఇండియన్‌ పీనల్‌ కోడ్‌లోని సెక్షన్‌ 377ను సడలించింది. నిజంగా ఇప్పుడు ఇది సంచలనమే. ద్వంద్వ ప్రమాణాల సమాజంలో ఎన్నో తర్జనభర్జనల అనంతరం సుప్రీం ఈ తీర్పునివ్వడం నిజంగా ఊరటే.  ద్వంద్వ ప్రమాణాలు అంటే మనందరికీ కోపం రావచ్చు. ఖజురహోలో స్వలింగ సంపర్క శిల్పాలను కళగా ఆస్వాదిస్తాం.. ఆమోదిస్తాం.  ఏ కళ అయినా సమాజ జీవితానికి ప్రతిబింబమే కదా! శిల్పాలుగా ఆ గోడల మీదకు ఎక్కాయి అంటే అది జనబాహుళ్యంలో ఉన్నట్టే కదా! బయట ఒప్పుకోవడానికి సంస్కృతీసంప్రదాయాలు అడ్డు తగులుతాయి. అందుకే ద్వంద్వప్రమాణాలు అన్నది.  ఆకర్షణ బయోలాజికల్‌ ఇన్‌స్టింక్ట్‌. మానసిక రుగ్మత కాదు. ఎల్‌జీబీటీలను ఎల్‌జీబీటీలుగానే గుర్తించి.. గౌరవిస్తే.. సమాజమంతా ఎల్‌జీబీటీలుగా మారరు. అది ఫ్యాషన్‌ కాదు.. ట్రెండ్‌ కాదు.. సుప్రీంకోర్టే చెప్పినట్టు అంటువ్యాధి అంతకన్నా కాదు. గుర్తించకపోతేనే అనర్థం.అయితే కోర్టు తీర్పుతో అంతా మారిపోదు. ముందు ఇంట్లోంచే ఆమోదం మొదలు కావాలి. స్కూళ్లు, కాలేజీలు.. కార్యాలయాలు.. వాళ్లను థర్డ్‌ సిటిజన్స్‌గా కాదు.. సిటిజన్స్‌గా ఐడెంటిటీ ఇవ్వడం ప్రారంభించాలి.  అభివృద్ధికి నమూనా అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీని వాడటం కాదు.. అందరి హక్కులను గౌరవించడం. పౌరులు అందరికీ ఈక్వల్‌ స్పేస్‌ ఇవ్వడం!  ప్రకృతే వీళ్లను ఆదరించినప్పుడు మనమూ దాని బిడ్డలమే.. వీళ్లకు సోదరీసోదరులమే కదా! మనమెందుకు అక్కున చేర్చుకోకూడదు?!
సరస్వతి రమ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement