అగమ్యగోచరం.. స్టీల్‌ప్లాంట్‌ భవితవ్యం | Visakhapatnam Steel Plant’s Crisis | Sakshi
Sakshi News home page

అగమ్యగోచరం.. స్టీల్‌ప్లాంట్‌ భవితవ్యం

Published Sat, Sep 14 2024 11:55 AM | Last Updated on Sat, Sep 14 2024 12:52 PM

Visakhapatnam Steel Plant’s Crisis

నోరు మెదపని చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌

 ఒక ఫర్నేస్‌తో కనిష్ట ఉత్పత్తి

సెయిల్‌లో విలీనంతోనే పరిష్కారం

ఉక్కునగరం: రాష్ట్రంలోని అతి పెద్ద ప్రభుత్వ రంగ సంస్థ విశాఖ స్టీల్‌ప్లాంట్‌ భవిష్యత్‌ ఆందోళనకరంగా మారింది. ప్రస్తుతం అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో, ఒక బ్లాస్ట్‌ఫర్నేస్‌తో కనిష్ట ఉత్పత్తి సాధిస్తూ సమస్యల సుడిగుండలో చిక్కుకుంది. ఇప్పుడు ఉన్న బొగ్గు, ఐరన్‌ ఓర్‌ నిల్వలతో సింగిల్‌ ఫర్నేస్‌ తప్ప రెండు ఫర్నేస్‌లు నడిపే పరిస్థితి లేదు. సింగిల్‌ ఫర్నేస్‌తో నెలకు రూ. 1000 కోట్లకు మించి టర్నోవర్‌ సాధ్యం కాదు. తద్వారా మరిన్ని అప్పులు, ఇబ్బందులు తప్పవని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నా రు. ఇదే పరిస్థితి కొనసాగి.. ఉన్న ఒక్క ఫర్నేస్‌లో సాంకేతిక లోపం తలెత్తితే జీరో ఉత్పత్తి ఏర్పడే ప్రమాదం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో సెయిల్‌లో విలీనమే శాశ్వత పరిష్కారమని కార్మిక సంఘాల నాయకులు అంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని విలీ నం దిశగా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కోరుతున్నారు.

ఇటీవల కాలంలో స్టీల్‌ప్లాంట్‌ పరిస్థితి అత్యంత క్లిష్టదశకు చేరుకుంది. మూడు బ్లాస్ట్‌ఫర్నేస్‌లలో ఒకటి మూడేళ్లుగా మూత పడి ఉంది. ఉన్న రెండింటిలో ఒక బ్లాస్ట్‌ఫర్నేస్‌లోనే కనిష్ట స్థాయి ఉత్పత్తి చేయాల్సిన పరిస్థితి రావడంతో ఆర్థిక ఇబ్బందులు మరింత తీవ్రమయ్యాయి. గత మూడు రోజులుగా న్యూఢిల్లీ కేంద్రంగా ఉక్కు మంత్రిత్వశాఖ విస్తృతంగా జరిపిన చర్చల్లో ఉక్కు యాజమాన్య ప్రతినిధులు రూ.12 వేల కోట్లు బెయిల్‌ ఔట్‌ ప్యాకేజీ ఇస్తే పూర్తి సామర్థ్యంతో ఉత్పత్తి చేస్తామని నివేదించారు. 

దీనిపై ఉక్కు మంత్రిత్వశాఖ అధికారులు అంతసాయం చేయలేమని, రూ.3,100 కోట్లు ఇవ్వగలమని, దానికి సంబంధించి ప్రణాళిక ఇవ్వాల్సిందిగా సూచించారు. ఈ మేరకు స్టీల్‌ప్లాంట్‌ వర్గాలు కసరత్తు చేస్తున్నాయి. ఉక్కు మంత్రిత్వశాఖ ఇస్తామన్న ప్యాకేజీ రూ.3,100 కోట్లు ముడి సరకులు కొనుగోలుకు ఉపయోగపడటం తప్ప ఇప్పటి వరకు ఉన్న బకాయిలు చెల్లించడానికి సరిపోయే పరిస్థితిలేదు. ఒకవేళ ఆర్థిక మంత్రిత్వ శాఖ అనుమతితో ఆ ప్యాకేజీ ఇచ్చినప్పటికీ స్టీల్‌ప్లాంట్‌ సింగిల్‌ ఫర్నేస్‌ నిర్వహణకు తప్ప ఎటువంటి ప్రయోజనం లేదని ఉక్కు అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు.

పట్టించుకోని కూటమి ప్రభుత్వం
ఇటీవల జరిగిన సాధారణ ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌.. అప్పటి రాష్ట్ర ప్రభుత్వం స్టీల్‌ప్లాంట్‌ను పట్టించుకోలేదని, తాము అధికారంలోకి వస్తే స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ కాకుండా ఆపడంతో పాటు సెయిల్‌లో విలీనం చేయిస్తామని హామీ ఇచ్చారు. ఎన్నికల్లో విశాఖ ఎంపీ, గాజువాక ఎమ్మెల్యేలను ప్రజలు అత్యంత మెజార్టీతో గెలిపించారు. గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్‌ ఉక్కు అఖిలపక్ష నాయకులను అమరావతికి తీసుకెళ్లి సీఎం చంద్రబాబుతో సమావేశం ఏర్పాటు చేయించారు.

 ‘మీరు పని చేయండి.. నేను చూసుకుంటాను’ అని చంద్రబాబు చెప్పడం తప్ప.. ఆ దిశగా ఎటువంటి చర్యలు కనిపించలేదు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత ప్రధాని మోదీని చంద్రబాబు కలిసినప్పటికీ స్టీల్‌ప్లాంట్‌ అంశాన్ని లేవనెత్తకపోవడం పట్ల ఉక్కు వర్గాలు విస్మయం చెందాయి. విశాఖ ఎంపీ భరత్‌ను కలిసి స్టీల్‌ప్లాంట్‌ పరిస్థితిని ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు వివరించారు. అతను కూడా కేంద్ర మంత్రి కుమారస్వామితో మాట్లాడి ఒత్తిడి తెచ్చిన దాఖలాలు లేవు. కొత్త ప్రభుత్వం కొలువైన తర్వాత స్టీల్‌ప్లాంట్‌ పర్యటనకు వచ్చిన కేంద్ర ఉక్కు మంత్రి కుమారస్వామి 45 రోజులు సమయం ఇస్తే కచ్చితంగా మంచి చేస్తానని హామీ ఇచ్చారు. 

ఆ హామీకీ అతీగతి లేదు. గత వారం ఉక్కు అధికారుల సంఘం నాయకులు కేంద్ర ఉక్కు కార్యదర్శి సందీప్‌ను కలిసి సెయిల్‌లో విలీనం అంశంపై మాట్లాడారు. ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒత్తిడి వస్తే తప్ప పరిస్థితిలో మార్పు ఉండదని తేల్చి చెప్పినట్లు తెలిసింది. ఈ పరిస్థితుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ తక్షణం జోక్యం చేసుకోవాలని కార్మిక నాయకులు డిమాండ్‌ చేస్తున్నారు. స్టీల్‌ప్లాంట్‌కు ప్యాకేజీ ఇప్పించడంతో పాటు సెయిల్‌లో విలీనం చేసేలా ఒత్తిడి తేవాలని ముక్తకంఠంతో కోరుతున్నారు.

స్టీల్‌ప్లాంట్‌ను కాపాడటం అందరి బాధ్యత
స్టీల్‌ప్లాంట్‌ను కాపాడటం రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కర్తవ్యం. కేంద్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఆధారపడి ఉందనే విషయం అందరికీ తెలిసిందే. ఆయన మాట చెబితే ఆగుతుంది. 1,310 రోజులుగా ఉద్యమం జరుగుతోంది. ఇతర స్టీల్‌ప్లాంట్ల కంటే ఎక్కువ ల్యాండ్‌ బ్యాంక్‌ ఉండటం వల్లే అందరి కళ్లు ఈ ప్లాంట్‌పై పడ్డాయి. రాష్ట్ర ప్రభుత్వం స్టీల్‌ప్లాంట్‌ను కాపాడాలి. 
– జె.అయోధ్యరామ్‌, గౌరవాధ్యక్షుడు, స్టీల్‌ప్లాంట్‌ సీఐటీయూ

ప్రభుత్వ రంగం కోసమే భూములిచ్చారు
రాష్ట్రంలోని అతి పెద్ద ప్రభుత్వ రంగ సంస్థ స్టీల్‌ప్లాంట్‌ను రక్షించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది. ప్రభుత్వ రంగ సంస్థ కోసమే నిర్వాసితులు తమ భూములు, ఇళ్లు ఇచ్చారు. వారి పునరావాసం, ఉపాధి చూడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే. రాష్ట్ర ప్రభుత్వం అనుమతి లేకుండా ప్లాంట్‌ను ప్రైవేటుపరం చేసే హక్కు కేంద్రానికి లేదు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తెచ్చి ప్యాకేజీతో పాటు సెయిల్‌లో విలీనం చేసేలా చూడాలి.
– మంత్రి రాజశేఖర్‌, ఐఎన్‌టీయూసీ ప్రధానకార్యదర్శి, స్టీల్‌ప్లాంట్‌

విస్తరణ అప్పులు, వడ్డీ పదేళ్లు వాయిదా వేయాలి
స్టీల్‌ప్లాంట్‌ విస్తరణకు చేసిన అప్పులు, దానిపై వడ్డీ భారం వల్ల స్టీల్‌ప్లాంట్‌కు ఈ పరిస్థితి తలెత్తింది. దేశంలోని ఇతర ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు ఇచ్చినట్టే విస్తరణ అప్పులు, వడ్డీలను మాఫీ చేయడం లేదా కనీసం పదేళ్లపాటు వాయిదా వేయాలి. ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తెచ్చి ఆర్థిక భారం తొలగించాలి. సెయిల్‌లో విలీనం చేయడం ద్వారా ముడిసరకు కొరత లేకుండా చర్యలు తీసుకోవాలి.
– డి.ఆదినారాయణ, గుర్తింపు యూనియన్‌ ప్రధాన కార్యదర్శి, స్టీల్‌ప్లాంట్‌

ప్రభుత్వ రంగంలో సీట్లు పెంచాలి
నీట్‌లో 478 మార్కులు వచ్చాయి. దీని వల్ల ఏ–కేటగిరీకి బదులు బి–కేటగిరీ సీటు వచ్చింది. ఏలూరు ఆశ్రమ్‌ కాలేజీలో చదువుతున్నాను. రిజర్వేషన్‌ లేదు. మాలాంటి వారికి  ఓపెన్‌లో ఏ–కేటగిరీలో ప్రభుత్వ కాలేజీలో సీటు రావాలంటే కొత్తగా ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలు పెరగాలి. ప్రస్తుతం ఏడాదికి  ఫీజు రూ.13 లక్షల ఫీజు కట్టాల్సి వస్తోంది. అదే ఏ –కేటగిరీ అయితే ఫీజు రూ.20 వేలు మాత్రమే ఉంటుంది. ప్రభుత్వ  కాలేజీలు అయితే సూపర్‌ స్పెషాలిటీ వైద్యం అందుబాటులోకి వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి పేద విద్యార్థులకు మేలు జరిగేలా తగిన నిర్ణయం తీసుకోవాలి.                                                                    

    – గోపిశెట్టి గీత, మురళీనగర్‌

ఆశలు నీరుగార్చవద్దు 
మెడిసిన్‌ చేయాలని ఎన్నో ఆశలతో చదువుతున్నాం. కూటమి ప్రభుత్వం కొత్త వైద్య కళాశాలలను ప్రైవేట్‌పరం చేయాలని చూస్తోంది. గత ప్రభుత్వం మొత్తం 17 ప్రభుత్వ వైద్య కళాశాలలకు శ్రీకారం చుట్టింది. ఇందులో  ఐదు ప్రారంభమయ్యాయి. మరో ఐదు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. ఇంకా 7 నిర్మాణ దశలో ఉన్నాయి. ఈ కళాశాలలన్నీ పూర్తయితే మొత్తం 1,800 సీట్లు అందుబాటులో వస్తాయి. దీంతో ఎక్కువ మంది విద్యార్థులు మెడిసిన్‌ చదవడానికి అవకాశం లభిస్తుందనుకొన్నాం. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఆ కాలేజీలపై కత్తి కట్టింది. దీని వల్ల నీట్‌  రాసి మంచి ర్యాంకులు సాధించినప్పటికీ సీట్లు పొందలేని పరిస్థితి ఏర్పడింది.     
 – గొలగాని శ్రీరాజ్ఞ,పెదగదిలి 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement