సుదీర్ఘంగా... సుత్తి.! | - | Sakshi
Sakshi News home page

సుదీర్ఘంగా... సుత్తి.!

Published Sun, Nov 3 2024 12:56 AM | Last Updated on Sun, Nov 3 2024 12:35 PM

సుదీర్ఘంగా... సుత్తి.!

సుదీర్ఘంగా... సుత్తి.!

ఐదేళ్ల క్రితం మాటల్నే వల్లెవేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు

రాత్రి 10 గంటల వరకూ సమీక్ష పేరుతో శిక్ష

విజన్‌.. విజన్‌ అంటూ విసిగించిన సీఎం

ప్రతి విషయానికీ అధికారులపై చిర్రుబుర్రులు

సాక్షి, విశాఖపట్నం/మహరాణిపేట: 2014–19లో చెప్పిన మాటలే.. సుదీర్ఘంగా సమీక్ష పేరుతో మరోసారి వల్లెవేశారు. విజన్‌ విజన్‌ అంటూ రాత్రి 10 గంటల వరకూ సీఎం చంద్రబాబు చేసిన సమీక్ష అధికారులకు శిక్షలా మారింది. ప్రతి విషయానికీ అధికారుల వివరణ ఇస్తున్నా పట్టించుకోకుండా చిర్రుబుర్రులాడుతూ అభివృద్ధిపై ఏదో దీర్ఘకాలిక ప్రణాళిక ఉందన్నట్లుగా హడావుడి చేశారు.

శనివారం మధ్యాహ్నం 3 గంటల తర్వాత విశాఖ వచ్చిన చంద్రబాబు.. సాయంత్రం 5.40 గంటలకు కలెక్టరేట్‌కు చేరుకున్నారు. అప్పటి నుంచి విశాఖ మెట్రో ప్రాజెక్టు, మాస్టర్‌ ప్రణాళిక, నీతి ఆయోగ్‌ గ్రోత్‌హబ్‌, రోడ్ల అనుసంధానం, తదితర అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించారు. 1995లో సీఎం అయినప్పటి నుంచి చెబుతున్నట్లుగానే ఈసారి కూడా విశాఖను ఆర్థిక రాజధానిగా చేస్తాను.. విశాఖ అంటే నాకు అపారమైన ఇష్టమంటూ చర్విత చరణంగా మాట్లాడటంపై అధికారులు విసుక్కున్నారు. హుద్‌హుద్‌ సమయంలో చేసిన విషయాలను సమీక్షలో ఎందుకు చెబుతున్నారో తెలియక అధికారులు తలలు పట్టుకున్నారు. 

నగరంలో పార్కులు ఏర్పాటు చేయాలని ఆదేశించగా.. ఇప్పటికే గత ఐదేళ్లలో అభివృద్ధి చేసిన పా ర్కుల వివరాలను అధికారులు వివరిస్తే.. దానిపై అ సహనం వ్యక్తం చేస్తూ కొత్తగా పార్కులను ఆధునికీక రించాలంటూ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. అదే విధంగా గుంతలు లేని రోడ్లు వీలైనంత త్వరగా చూడాలని చెప్పగా.. ఇప్పటి వరకు నిర్మించిన రహదారులు, మరమ్మతుల వివరాలు చెప్పేందుకు ప్రయత్నించిన అధికారులపైనా ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. మెట్రో ప్రాజెక్టుకు డీపీఆర్‌ సిద్ధమై.. కేంద్రానికి పంపించినా కొత్తగా మళ్లీ డీపీఆర్‌ సిద్ధం చేయా లని చంద్రబాబు ఆదేశించారు. 

ఇలా.. ప్రతి అంశంపైనా చర్చిస్తున్న సమయంలో గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన పనుల్ని వివరించేందుకు అధికారులు ప్రయత్నించారు. వాటిని పట్టించుకోకుండా తమ ప్రభుత్వ హయాంలో చేపట్టాల్సిన పనులపైనే దృష్టిసారించాలంటూ చంద్రబాబు హుకుం జారీ చేశారు. హైదరాబాద్‌ మాదిరిగా విశాఖని అభివృద్ధి చేస్తానని.. 2047 విజన్‌ డాక్యుమెంట్‌ ప్రకారం 15 శాతం వృద్ధి సాధించే దిశగా సాగాలని ఆదేశించారు. 2025 లేదా 2026 నాటికి భోగాపురం ఎయిర్‌పోర్టు అందుబాటులోకి వచ్చే నాటికి అన్ని అభివృద్ధి ప్రాజెక్టులు పూర్తి చేయాలన్నారు. సమీక్షలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, అధికారులు పాల్గొన్నారు.

మంత్రులపై ఎమ్మెల్యేల అసహనం..!
వీఎంఆర్డీఏ సమావేశ మందిరంలో శనివారం ఉదయం మంత్రులు నారాయణ, డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి సమీక్ష నిర్వహించారు. వీఎంఆర్‌డీఏ, జీవీఎంసీ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులపై సమీక్ష జరిగింది. దీనికి తమను ఆహ్వానించకపోవడంపై ఎమ్మెల్యేలు అసహనం వ్యక్తం చేశారు. తాము విశాఖ జిల్లా పరిధిలో లేమా..? జీవీఎంసీకి చెందిన ఎమ్మెల్యేలం కాదా అంటూ మంత్రి నారాయ ణని నిలదీశారు. 

ఎందుకు ఆహ్వానించలేదో చెప్పాలని ప్రశ్నించారు. దీనిపై ఇన్‌చార్జి మంత్రి సర్ది చెప్పేందుకు ప్రయత్నించారు. ఈ విషయాన్ని రుషికొండ వద్ద సీ ఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. ఎంపీ శ్రీ భరత్‌, మంత్రులు కలిసి తమని దూరం పెడుతున్నారంటూ ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన బాబు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని మంత్రి నారాయణని హెచ్చరించినట్లు తెలుస్తోంది. రాత్రి 10.30 గంటల తర్వాత టీడీపీ కార్యాలయానికి చేరుకొని కార్యకర్తలనుద్దేశించి ప్రసంగించారు.

 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement