
అమ్మ కష్టాన్ని చూడలేక ఈ చిన్నారులు(అక్కా, తమ్ముడు) చలించిపోయారు. పొట్ట కూటి కోసం వలస వచ్చిన ఈ తల్లి పొలం నుంచి వస్తూ వంటకు పుల్లలు పోగు చేసుకుని, ఆ పుల్లల మోపు తలపై పెట్టుకుని, మరో పెద్ద కట్టెను భుజాన వేసుకుని వస్తోంది. తల్లి కష్టాన్ని చూడలేక ఆమె భుజాలపై ఉన్న పెద్ద కట్టెను చిన్నారులిద్దరూ తమ భుజాలపైకి తీసుకుని దాదాపు నాలుగు కిలోమీటర్లు నడిచారు. గుంటూరు జిల్లా (Guntur District) వట్టిచెరుకూరు మండలం ఐదో మైలు సమీపంలో కనిపించిన ఈ దృశ్యం చూపరులను కట్టిపడేసింది. – ప్రత్తిపాడు

మంచు జల్లులో తడిసి ప్రకృతి పులకిస్తోంది.. వెండి చినుకులు ఆకుల అంచులపై నుంచి సుతారంగా జాలువారుతూ నేలను మురిపెంగా ముద్దాడుతుంటే.. మట్టి తడిసి ముద్దవుతోంది. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోన సీమ జిల్లా మలికిపురం మండలం గుడిమళ్ల లంకగ్రామంలో మంగళవారం ఉదయం మంచు కురుస్తున్న దృశ్యం అబ్బురపరిచింది.
– సాక్షి ఫొటోగ్రాఫర్, రాజమండ్రి
హెల్మెట్ ధరించి వాహనాలు నడిపి ప్రాణాలు కాపాడుకోవాలని, ఫిబ్రవరి 1 నుంచి తప్పనిసరిగా హెల్మెట్ (Helmet) వాడాలని ఏలూరు జిల్లా కలెక్టర్ కే.వెట్రిసెల్వి పిలుపునిచ్చారు. ఆమె ఏలూరులో (Eluru) హెల్మెట్ ధరించని వాహనదారులకు మంగళవారం అవగాహన కల్పించారు. హెల్మెట్ ధరించని పలువురికి చలానా విధించారు.
– సాక్షి ఫోటోగ్రాఫర్, ఏలూరు
కీడల్లో రాణించాలన్న వారి పట్టుదల ముందు రన్నింగ్ ట్రాక్ చిన్నబోయింది. ఉత్తి కాళ్లపై విద్యార్థినులు పోటీల్లో పరుగు పెట్టిన తీరు ఆకట్టుకుంది. విశాఖపట్నంలో మంగళవారం రాష్ట్ర స్థాయి రన్నింగ్ పోటీలు నిర్వహించగా... ఇందులో కొంత మంది విద్యార్థినులు కాళ్లకు షూ లేనప్పటికీ.. పోటీల్లో ఇలా పాల్గొన్నారు.
– సాక్షి ఫోటోగ్రాఫర్, విశాఖపట్నం
ఫిషింగ్ హర్బర్‌లో భారతీయ మత్స్య పరిశోధనా సంస్థ, విశాఖపట్నం (Visakhapatnam) ఆధ్వర్యంలో రెండు పరిశోధనా నౌకల్లో ప్రజలు, విద్యార్థులు సందర్శన కోసం ఓపెన్ హౌస్ నిర్వహించారు. మత్స్య షికారి, మత్స్య దర్శిని నౌకల సందర్శనకు విద్యార్థులు భారీగా బారులు తీరారు.
– సాక్షి ఫోటోగ్రాఫర్, విశాఖపట్నం
చదవండి: అమ్మకడుపులో రాచపుండు
Comments
Please login to add a commentAdd a comment