
విమానాశ్రయంలో మోహరించిన భద్రతా బలగాలు
విమానాన్ని చుట్ట్టుముట్టి ఆపరేషన్
విశాఖ సిటీ: విశాఖ విమానాశ్రయంలో ఒక్కసారిగా భద్రతా బలగాలు మోహరించాయి. ఎన్‌ఎస్‌జీ కమాండోలు, సీఐఎస్‌ఎఫ్ అధికారులు ఆయుధాలతో రన్‌వే పై పరుగులు తీసి.. ఒక విమానాన్ని చుట్టుముట్టారు. అందరిలోనూ ఒకటే టెన్షన్. ఏం జరుగుతోందో తెలియని పరిస్థితి నెలకొంది. కొంత సేపటికి అది ఒక డ్రిల్‌గా తెలుసుకుని అందరూ ఊపిరిపీల్చుకున్నారు. విశాఖ విమానాశ్రయంలో యాంటీ హైజాక్ ప్రదర్శన నిర్వహించారు.
విమానం హైజాక్ అయితే తలెత్తే పరిస్థితులు, భద్రతా బలగాలు చేసే సాహసాలు, ముష్కరుల నుంచి ప్రయాణికుల విముక్తి, ఇలా అన్ని అంశాలను యథాతథంగా విన్యాసాలు చేశారు. విమానాశ్రయంలో ఆకస్మిక ప్రణాళిక, హైజాక్ సమయంలో పరిస్థితుల అంచనా, ప్రయాణికుల భద్రత, కేంద్ర, రాష్ట్ర బలగాలు, శాఖల మధ్య సమన్వయంపై ప్రద ర్శన చేపట్టారు.
ఐఎన్‌ఎస్ డేగా, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్(సీఐఎస్‌ఎఫ్), నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (ఎన్‌ఎస్‌జీ), ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా, రాష్ట్ర ప్రభుత్వ ఏజెన్సీలు ఇందులో పాల్గొన్నాయి. హైజాక్ సమయంలో అప్రమత్తత, సంసిద్ధత, అత్యవసర ఆపరేషన్ నిర్వహణ, శాఖల మధ్య సమన్వయానికి ఈ ప్రదర్శన దోహదం చేస్తుందని ఐఎన్‌ఎస్ డేగా అధికారులు పేర్కొన్నారు. నేషనల్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ ప్రొగ్రాం కింద ఈ వార్షిక డ్రిల్‌ను నిర్వహించారు.

● విమానం హైజాక్!