సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: నగర శివారు బీచ్‌కు దగ్గరలోని ఓ బార్‌కు వెళ్లారా మీ పని అంతే. మీరు రెండు పెగ్గులు వేద్దామని ఆర్డర్ ఇస్తే.. డ్రింక్ ఆఫర్ ఇస్తున్నామంటూ అందమైన అమ్మాయిలు మీ వద్దకు వస్తారు. మాటలతో మాయచేసి వలపు వాకిట్లోకి తీసుకెళ్తారు. మొదటగా ఒక పెగ్గు ఇప్పించి.. ఆ తర్వాత తమకూ డ్రింక్ ఆఫర్ చేయాలంటూ అడుగుతారు. ఆ మత్తు మాయలో నుంచి వలపు కౌగిల్లో నుంచి తేరుకునేలోపు బార్ సిబ్బంది వచ్చి మీ చేతిలో వేల రూపాయల బిల్లు పెడతాడు.
కనీసం రూ.5 వేల నుంచి రూ.10 వేల మేర బిల్లు ఉంటుంది. ఇదంతా నేనెప్పుడు ఖర్చు చేశానని మీరు తలపట్టుకునే లోగానే ముక్కు పిండి మరీ ఆ బిల్లు వసూలు చేస్తారు. అయితే రెగ్యులర్‌గా వచ్చే మందుబాబులను కాకుండా.. బయట నుంచి వచ్చే కస్టమర్లనూ ఎంపిక చేసుకుని మరీ వల వేస్తారు. వాస్తవానికి వారికి ఇచ్చేది సాధారణ మద్యం అయినప్పటికీ.. ఖరీదైన మద్యం పేరుతో జేబుకు చిల్లు పెడతారు. ఈ బార్‌లో కేవలం ఈ తరహా మోసాలు చేసేందుకు నలుగురైదుగురు అమ్మాయిలు ఉన్నట్టు సమాచారం. ఈ వ్యవహారం జరుగుతున్నట్టు స్థానిక పోలీసులకు సమాచారం ఉన్నప్పటికీ అటువైపు కన్నెత్తి చూడడం లేదన్న విమర్శలున్నాయి.
ఈ బార్‌కు అవసరమైన అనుమతులు కూడా జీవీఎంసీ నుంచి సక్రమంగా లేవు. ఈ బార్ యజమానికి అధికార పార్టీలోని ముఖ్యులందరితోనూ సన్నిహిత సంబంధాలు ఉండటంతో అధికారులు మిన్నకుండిపోతున్నారు. అంతేకాకుండా లంచం ఇస్తున్న సమయంలో రహస్య కెమెరాలతో బంధించిన వీడియోలతో అధికారులను బ్లాక్‌మెయిల్ చేస్తున్నట్టు సమాచారం. ఇక ఈ బార్‌లో వాటా కోసం ఏకంగా రూ.2 కోట్ల మేర ఓ కూటమి ఎమ్మెల్యే సమర్పించుకున్నారు. ఇప్పుడు వాటా లేదంటూ ఆ బార్ యజమాని ఖరాఖండింగా తేల్చి చెబుతున్నాడు. అయినప్పటికీ ఆ ఎమ్మెల్యే కిమ్మనకుండా ఉండిపోవడం వెనుక ఏ తతంగం నడిచిందోననే చర్చ జరుగుతోంది.
అధికారులకు దడ
ఈ బార్‌కు అనుమతులు లేవనే ఫిర్యాదులున్నాయి. నిర్మాణం చేయకూడని ప్రాంతంలో చేశారనే విమర్శలున్నాయి. అధికారులు తూతూ మంత్రంగా నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. బార్ వైపునకు వెళ్లేందుకు ఇటు జీవీఎంసీ అధికారులు.. అటు పోలీసులు కూడా జంకుతున్నారనే విమర్శలున్నాయి. ఇందుకు ప్రధాన కారణం అధికారులకు లంచాలు ఇస్తూ రహస్యంగా బార్ యజమాని వీడియోలు తీశారనే ప్రచారం ఉంది. ఈ నేపథ్యంలో ఒకవేళ ఫిర్యాదులపై స్పందిస్తే ఎక్కడ తమ వీడియోలు బయటకు వస్తాయనే ఆందోళన ఉద్యోగుల్లో కనిపిస్తుందనే చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో అక్కడ వ్యవహారాలన్నీ చట్టవిరుద్ధంగా నడుస్తున్నాయనే సమాచారం పక్కాగా ఉన్నప్పటికీ.. అధికారులెవ్వరూ అటువైపు తొంగిచూడకపోవడం ఈ వాదనకు బలం చేకూరుస్తోంది.
ఎమ్మెల్యేకు జెల్ల
కూటమి ఎమ్మెల్యే ఈ బార్ కోసం ఏకంగా రూ.2 కోట్ల మేర చెల్లించారు. బార్‌లో తనకూ వాటా ఇవ్వాలంటూ ఈ చెల్లింపులన్నీ చేశారు. జీవీఎంసీ నుంచి అనుమతులతో పాటు బార్ లైసెన్స్ ఫీజు కూడా ఆయనే చెల్లించారు. బార్‌లో ఉపయోగించే వివిధ రకాల సామగ్రికి కూడా ఆయనే నగదు ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ విధంగా రూ.2 కోట్లకుపైగా చెల్లింపులు పూర్తయిన తర్వాత ఇప్పుడు భాగస్వామ్యం లేదంటూ బార్ యజమాని తేల్చి చెప్పడంతో ఆ ఎమ్మెల్యే పరిస్థితి ‘కుడితిలో పడ్డ ఎలుక’లా తయారైంది.
బార్ యాజమాని అధికార పార్టీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతోపాటు పలువురు ముఖ్యులతో సన్నిహిత సంబంధాలు ఉండటంతో... సదరు కూటమి ఎమ్మెల్యే మిన్నకుండిపోవాల్సి వచ్చిందనే ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా ఎమ్మెల్యేకు చెందిన పలు వ్యవహారాలు ఆ బార్ యజమానికి తెలిసి ఉండటం కూడా.. అతడు మాట్లాడకపోవడానికి ప్రధాన కారణమనే వాదన బలంగా వినిపిస్తోంది. రూ.2 కోట్లకుపైగా సమర్పించుకున్న ఎమ్మెల్యే కక్కలేక మింగలేక గమ్మున ఉండిపోయారనే ప్రచారం బార్ యాజమాన్యాల సర్కిల్‌లో వినిపిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment