మన దేశం ప్రపంచ వాణిజ్య సంస్థలో భాగస్వామిగా చేరినప్పటి నుంచి రైతాంగం, వ్యవసాయ రంగం పరిస్థితి మరింత వేగంగా క్షీణించడం ప్రారంభమైంది. 2022 నాటికల్లా రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని, స్వామినాథన్ సిఫారసుల ప్రకారం వ్యవసాయ పంటలకు కనీస మద్దతు ధర ఇస్తామని నమ్మబలికిన ఎన్డీయే పాలనలో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. గెలిచే వరకు మద్దతు ధర గురించి ఊదరగొట్టి, గెలిచిన తర్వాత సి2 + 50 సూత్రం (ఉత్పత్తికి అయ్యే ఖర్చుకు అదనంగా అందులో సగభాగం కలిపి ఆ మొత్తంపై లెక్కగట్టటం) ప్రకారం తాము కనీస మద్దతు ధర ఇవ్వలేమని సుప్రీంకోర్టుకు ఎన్డీఏ ప్రభుత్వం అఫిడవిట్ సమర్పించడం ద్వారా తన రైతు వ్యతిరేక విధానాన్ని బయట పెట్టుకొన్నది.
ఇప్పటికే దేశంలోని 52 శాతం వ్యవసాయ కుటుంబాలు అప్పుల్లో కూరుకుపోయి ఉన్నాయని, వారి నెత్తిపై సగ టున 74,121 రూపాయల అప్పు ఉందని అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. మార్కెట్‌లో పంటల ధరలు గిట్టుబాటు కాక, పెట్టిన పెట్టుబడులు తిరిగి రాక అప్పుల సుడి గుండంలో చిక్కుకుంటున్న రైతు కుటుంబాల్లో ఆత్మహత్యల పరంపర కొనసాగుతున్నది. 2013 నుండి 2022 వరకు అధికారిక లెక్కల (ఎన్‌సీఆర్‌బీ) ప్రకారమే గత పదేళ్లలో లక్షా ఇరవై వేల మందికి పైగా రైతులు ఆత్మ హత్య చేసుకున్నారంటే రైతాంగం పరిస్థితి ఎంత దయ నీయంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
వ్యవసాయ పంటలపై కార్పొరేట్ శక్తులకు అధి కారాన్ని కట్టబెట్టే విధంగా మోదీ ప్రభుత్వం తీసుకు వచ్చిన ఉరితాళ్ల వంటి మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా 13 నెలల పాటు ఢిల్లీ కేంద్రంగా రైతులు వీరోచితంగా పోరాడారు. ఫలితంగా ప్రభుత్వం కనీస మద్దతు ధర చట్టబద్ధత అవకాశాల పరిశీలన కోసం ఉద్యమ నాయ కత్వానికి రాతపూర్వక హామీ ఇచ్చింది. అయితే మూడు సంవత్సరాలు దాటినా దీనిపై ఎలాంటి పురోగతి లేకపోగా తిరిగి దొడ్డి దారిన ఆ మూడు నల్ల చట్టాలను అమలు చేయడానికి ప్రభుత్వం సిద్ధం అవుతోంది. దానిలో భాగంగానే కొత్త వ్యవసాయ మార్కెట్ విధానాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నది. అటవీ సంరక్షణ నియమాల పేరుతో 2006 అటవీ హక్కుల చట్టానికి పాతరేయటానికి పూనుకున్నది. అటవీ సంరక్షణ నియమాల బిల్లు ఆమోదం పొందితే అడవులకు, అడవుల్లో నివసించే జన సమూహాల హక్కులకు ముప్పు ఏర్పడుతుందని పార్లమెంట్ సభ్యులకు కాన్‌స్టిట్యూషనల్ కండక్ట్ గ్రూపు తరపున 155 మంది మాజీ ఐఏఎస్ అధికారులు తమ సంతకాలతో లేఖ రాశారు. అయినా కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గకుండా ఆ బిల్లును ఆమోదింప చేసు కుంది. మరోవైపు విద్యుత్ బిల్లు–2020ని చట్టం చేయడా నికి మార్గం సుగమం చేసుకుంది. కచ్చితంగా ఇది వ్యవ సాయ రంగంపై పెను భారం మోపే బిల్లు అనొచ్చు.
వ్యవసాయ రంగంలో పని చేసే వారంతా రైతులే. వీరిలో కౌలు రైతులు, మహిళా రైతులు, వ్యవసాయ కూలీల పరిస్థితి మరింత దారుణంగా వుంది. రైతును, వ్యవసాయ రంగాన్ని రక్షించుకోలేక పోతే దేశంలో ఆహార కొరత ఏర్పడే ప్రమాదం వుంది. ఇప్పటికైనా రైతులు, రైతు సంఘాలు మేల్కొనాలి. ప్రమాదంలో ఉన్న వ్యవసాయ రంగాన్ని కాపాడుకోవడానికి ముందుకు రావాలి. ఉద్యమ శక్తుల ఐక్యత ద్వారానే రైతాంగాన్ని, వ్యవసాయ రంగాన్నీ కాపాడుకోగలుగుతాం. ‘అఖిలభారత రైతుకూలీ సంఘం’ అనే పేరుతో కొనసాగుతూ వస్తున్న రెండు వేర్వేరు నిర్మాణాలు ఈ నేపథ్యంలోనే ‘ఆలిండియా కిసాన్ మజ్దూర్ సభ’ (ఏఐకేఎంఎస్)గా ఒకటి అవుతున్నాయి. ఆదివారం మహబూబాబాద్‌లో విలీన సభ జరుపుకొంటున్నాయి.
– గౌని ఐలయ్య,
ఏఐకేఎంఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
Comments
Please login to add a commentAdd a comment