స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణించే భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 377 రాజ్యాంగబద్ధమైనదేనంటూ నాలుగేళ్లక్రితం తానిచ్చిన తీర్పును పునఃసమీక్షించడా నికి అంగీకరించడం ద్వారా సుప్రీంకోర్టు సోమవారం చరిత్రాత్మక నిర్ణయం తీసు కుంది. ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా తన నేతృత్వంలోని ముగ్గురు న్యాయ మూర్తుల బెంచ్ తరఫున ఈ నిర్ణయాన్ని ప్రకటిస్తూ చేసిన వ్యాఖ్యలు స్వలింగ సంపర్కుల్లో ఆశలు రేకెత్తించకమానవు. జస్టిస్ దీపక్ మిశ్రా అన్నట్టు ప్రకృతి నియమాలు స్థిరంగా ఉండేవి కాదు.
నిరంతర మార్పే వాటి సహజ స్వభావం. సమాజమైనా అంతే. తమ తమ వ్యక్తిగత లైంగిక భావనల కారణంగా ఏ వ్యక్తీ లేదా కొంతమంది వ్యక్తుల సమూహం వేధింపులూ, బెదిరింపులూ ఎదుర్కొనకూడ దని... భయంతో బతుకీడ్చే పరిస్థితి ఉండరాదని ఆయన చెప్పడం స్వలింగ సంప ర్కులకు ధైర్యాన్నిస్తుంది. వాస్తవానికి నిరుడు ఆగస్టులో వ్యక్తిగత గోప్యతపై తొమ్మిదిమంది న్యాయమూర్తులతో కూడిన సుప్రీంకోర్టు విస్తృత రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పులోనే ఇందుకు సంబంధించిన మూలాలున్నాయి. దేన్ని ఎంపిక చేసుకోవాలో, దేనికి ప్రాధాన్యమివ్వాలో నిర్ణయించుకునే స్వేచ్ఛ పౌరుల కుంటుందని ఆ తీర్పులో సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది.
ఇప్పుడు సెక్షన్ 377పై ఇచ్చిన తీర్పును పునస్సమీక్షిస్తామనడం దానికి కొనసాగింపే. 2009లో అప్పటి ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏపీ షా, న్యాయమూర్తి జస్టిస్ ఎస్. మురళీ ధర్‌ల ధర్మాసనం స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణించలేమని తీర్పునిచ్చింది. దీన్ని నేరంగా నిర్ధారిస్తున్న సెక్షన్ 377 రాజ్యాంగంలోని 21, 14, 15 అధికరణలను ఉల్లంఘిస్తున్నదని చెప్పింది. ఆ సెక్షన్‌లోని ‘అసహజ నేరాల’ జాబితా నుంచి దీన్ని తొలగించాలని ఆదేశించింది. అయితే ఆ తీర్పుపై దాఖలైన అప్పీల్‌ను పరిశీలించిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఆ సెక్షన్ రాజ్యాంగబద్ధతను ధ్రువీకరించింది. ఈ చట్టంలో మార్పు అవసరమో కాదో పార్లమెంటే చెప్పాలి తప్ప న్యాయస్థానాలు కాదని తెలిపింది.
కాలచక్రం ఎప్పుడూ ముందుకే తిరుగుతుంటుంది. అదే సమయంలో దాన్ని తాత్కాలికంగా ఆపడానికి లేదా వెనక్కి తిప్పడానికి ప్రయత్నాలు నిరంతరం జరుగుతూనే ఉంటాయి. బ్రిటన్‌ను క్వీన్ విక్టోరియా పాలించినప్పుడు అమలులో ఉన్న సంకుచిత నైతిక విలువలకు అనుగుణంగా 1861లో బ్రిటిష్ వలసవాదులు మన దేశంలో ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. దోషులకు యావజ్జీవశిక్ష లేదా పదేళ్ల వరకూ శిక్ష, జరిమానా విధించవచ్చునని చట్టం చెబుతోంది. ఇక్కడి మత, ఛాందసవాద సంస్థలు ఆదినుంచీ ఈ సెక్షన్ ఉండాల్సిందేనని గట్టిగా వాదిస్తున్నాయి.
ఏ తరహా సమాజంలోనైనా వ్యక్తి స్వేచ్ఛాస్వాతంత్య్రాలకూ, సామాజిక, సంప్రదాయిక కట్టుబాట్లకూ మధ్య ఇలాంటి వైరుధ్యం తప్పదు. అటువంటప్పుడు ప్రభుత్వమూ లేదా న్యాయస్థానాలూ క్రియాశీలంగా వ్యవ హరించి ఆ వైరుధ్యాన్ని పరిష్కరించాల్సివస్తుంది. స్వలింగ సంపర్కం నేరంగా భావించలేమని, భారతీయ శిక్షాస్మృతి నుంచి దీన్ని తొలగించాలని 2000 సంవత్సరంలో జస్టిస్ బీపీ జీవన్‌రెడ్డి నేతృత్వంలోని లా కమిషన్ 172వ నివేదిక సిఫార్సు చేసింది. ఆ సెక్షన్‌లో ఉన్న ఇతర అసహజ నేరాలను కొత్తగా సెక్షన్ 376 ఎఫ్ తీసుకొచ్చి దాని కిందకు చేర్చవచ్చునని సూచించింది. కానీ ఇంతవరకూ ఏ ప్రభుత్వాలూ ఆ సిఫార్సు విషయంలో శ్రద్ధ పెట్టలేదు.
అయితే పార్టీలకతీతంగా చాలామంది రాజకీయ నాయకులు ఈ సెక్షన్‌పై అడపా దడపా వ్యతిరేకత వ్యక్తం చేస్తూనే ఉన్నారు. 2009లో అప్పటి కేంద్ర న్యాయశాఖ మంత్రి వీరప్ప మొయిలీ దీన్ని కాలం చెల్లిన చట్టంగా అభివర్ణించారు. అప్పటి కేంద్ర ఆరోగ్యమంత్రి అన్బుమణి రామదాస్ ఇది రద్దు చేయదగిన చట్టమని చెప్పారు. ఇలాంటి అభిప్రాయాలే కొందరు బీజేపీ నాయకులు సైతం వ్యక్తం చేశారు. పక్కవారికి ఇబ్బంది కలిగించనంతవరకూ స్వలింగ సంపర్కం నేరం కాదని రెండేళ్లక్రితం ఆరెస్సెస్ సహ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోసబలె ప్రకటించి, ఆ తర్వాత నాలిక కరుచుకున్నారు. అది సామాజిక అనైతికమని స్వరం మార్చారు. నైతిక విలువల భావనకూ, వాస్తవానికీ మధ్య ఊగిసలాటలు మనలాంటి సమాజంలో సహజమే.
పురుషాధిక్యత ఇతర జెండర్లను తక్కువ చేసి చూస్తుంది. స్త్రీ పురుష శృంగారం మాత్రమే సహజమైనదని, పునరుత్పత్తితో ముడిపడని శృంగారం అసహజమైనదని అంటుంది. మనుషుల్లో మాత్రమే కాదు... సమస్త జీవుల్లో కూడా ఇందుకు సంబంధించి వైవిధ్యతలున్నాయన్న సంగతిని ఒప్పుకోదు. పర్యవసానంగా భిన్న లైంగిక భావనలున్నవారిని రోగులుగా పరిగణించడమేకాక... వారికి చికిత్స జరిపిస్తే ‘అందరిలా’ ఉండగలరనే అభిప్రాయం చాలామందిలో ఇప్పటికీ ఉంది. ఇటీవల తెలంగాణలో ఇద్దరు యువతులు ఆలుమగల్లా కలిసి ఉంటామని పటు బట్టడం, వారి తల్లిదండ్రులు అందుకు అంగీకరించకపోవడంతో వివాదం తలె త్తడం మీడియాలో ప్రముఖంగా వచ్చింది.
స్వలింగ సంపర్కులను ఈ చట్టం కింద అరెస్టు చేసి శిక్షించిన సందర్భాలు స్వల్పమే అయినా, అది అమల్లో ఉండటం వల్ల తలెత్తే ఇతర సమస్యలు తక్కువేం కాదు. సమాజం వెలివేసినట్టు చూడటం, వేధింపులకు దిగడం వల్ల స్వలింగ సంపర్కులు బాహాటంగా బయటపడరు. ఇది ఇతరత్రా అనేక సమస్యలకు దారితీస్తుంది. అసలు ప్రేమించడమే సామాజిక నియమాల అతిక్రమణగా పరిగణించే మన సమాజంలో కులాంతర, మతాంతర ప్రేమలూ, పెళ్లిళ్లను ఆహ్వానించలేని సంకుచిత స్థితి ఉంది.
ఇక స్వలింగ సంపర్కం లాంటి లైంగిక భావనల విషయంలో ఏ స్థాయిలో వ్యతిరేకత ఉంటుందో ఊహించు కోవచ్చు. కానీ మన రాజ్యాంగం వ్యక్తిగత స్వేచ్ఛకూ, సమానత్వ భావనకూ, మైనారిటీల హక్కులకూ రక్షణ కల్పిస్తోంది. సెక్షన్ 377 చెల్లుబాటుపై గతంలో ఇచ్చిన తీర్పును విస్తృత ధర్మాసనం పునఃపరిశీలించాలన్న సుప్రీంకోర్టు తాజా నిర్ణయం ఆ రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణమైనదే. ఇందుకు న్యాయమూర్తులను అభినందించాలి.
Comments
Please login to add a commentAdd a comment