'ది వైల్డ్ వన్ పార్టీ'పై రైడ్: 141 మంది అరెస్టు
జకర్తా: ఇండోనేషియా రాజధానిలోని ఓ జిమ్‌పై రైడింగ్ నిర్వహించిన పోలీసులు ఆదివారం 141 మంది 'గే'(స్వలింగ సంపర్కులు)లను అరెస్టు చేశారు. ఈ మేరకు ఓ ప్రకటనను విడుదల చేశారు. పట్టుబడిన వారిలో పది మంది ఇండోనేషియా పోర్నోగ్రఫీ చట్టాలను ఉల్లంఘించారని తెలిపారు.
రైడింగ్‌లో పెద్ద మొత్తంలో దొరికిన కండోమ్‌లు, సీసీటీవీ రికార్డింగ్‌లు, పరుపులను మీడియాకు చూపించారు. నిందితులందరినీ విచారిస్తున్నట్లు తెలిపారు. 'ది వైల్డ్ వన్' పేరుతో సెక్స్ పార్టీని ఏర్పాటు చేశారని వెల్లడించారు. పార్టీలో పాల్గొనేందుకు ఒక్కొక్కరి నుంచి రూ.900 వసూలు చేసినట్లు వివరించారు.
స్వలింగ సంపర్కం ఇండోనేషియాలో నేరం కాదు. అయితే, అసెహ్ ప్రావిన్సులో మాత్రం స్వలింగ సంపర్కులపై నిషేధం ఉంది. జకర్తా ఏ ప్రావిన్సులోకి రాదు. దాన్ని ఆ దేశ కేంద్ర ప్రభుత్వం పాలిస్తోంది. 141 మంది స్వలింగ సంపర్కులను అదుపులోకి తీసుకోవడంపై కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది ఎల్‌జీబీటీల హక్కులను కాలరాయడమేనని అంటున్నారు.