'రెయిన్ బో' రెపరెపల వెనుక కథ ఇదే!
లెస్బియన్స్, గే, బెసైక్సువల్, ట్రాన్స్‌జెండర్స్(ఎల్జీబీటీ) కమ్యూనిటీల పరేడ్‌లు, ప్రచారాలు ఒక్కసారి చూడండి. ఆకాశంలో కనిపించే ఇంద్రధనుస్సు ఒక్కసారిగా ఇలని కప్పేసినట్టు అనిపిస్తుంది. అది ఎలా అనుకుంటున్నారా? రంగురంగుల ఇంద్రధనుస్సు జెండా రూపంలో. అసలు ఈ ఇంద్రధనుస్సు జెండా వారి చిహ్నంగా ఎలా స్థిరపడింది? అది ఎప్పటినుంచి వారికి గుర్తింపుగా నిలుస్తుందో తెలుసుకుంటే మీకు ఆశ్చర్యమనిపిస్తుంది. 1978లోనే శాన్‌ఫ్రాన్సిస్కోకు చెందిన గిల్‌బర్ట్ బేకర్ ఈ జెండాను ఎల్జీబీటీ కమ్యూనిటీల కోసం రూపొందించారంట. స్థానిక ఎల్జీబీటీ కమ్యూనిటీల కోరిక మేరకు ఆయన దీన్ని డిజైన్ చేశారు.
ఈ జెండాల్లో ఉండే ఒక్కో రంగుకి ఒక్కో ప్రాధాన్యముంటోంది. ఎరుపు జీవితానికి, గులాబీ లైంగికతకు, పసుపు సూర్యుడికి, ఆకుపచ్చ ప్రకృతికి, నారింజ వైద్యానికి, నీలం కళకు, ముదురు నీలివర్ణం సామరస్యానికి, వెలైట్ ధైర్యానికి ప్రతీకగా నిలుస్తూ ఉంటాయి. 1978 గే ఫ్రీడమ్ డే పరేడ్‌లో మొదటిసారి ఈ జెండాను ఎగరవేశారు. ఎనిమిది రంగులుగా ఉన్న రెయిన్ బో జెండా కాస్త, కాలానుగుణంగా ఆరు రంగులుగా మారింది. ‘గే’ గర్వానికి ప్రతీకగా ఈ జెండా రంగులు నిలుస్తాయని ఎల్జీబీటీల నమ్మకం. ఆరు సాదాసీదా రంగులతో ఉండే ఈ జెండా, చాలామంది ఎల్జీబీటీల లోగిళ్లలో మనకు కనిపిస్తుంది. ఈ జెండాల్లో సాదాసీదా రంగులే కాక, వ్యత్యాసముతో కూడిన మరిన్ని రంగులు కూడా మనం గుర్తిస్తుంటాం. ప్రపంచమంతా ఎల్జీబీటీలు తమ ఉనికిని చాటుకోవడానికి ఈ రెయిన్ బో జెండా వాడుతూ వస్తున్నారు.
ఐపీసీ 377 ప్రకారం స్వలింగ సంపర్కం నేరంకిందికి వస్తుందని పేర్కొంటూ గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పునఃపరిశీలించాలంటూ ఓ ఎన్జీవో వేసిన పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం మంగళవారం విచారించింది. ఈ అంశాన్ని ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనానికి నివేదించాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఎల్జీబీటీ వర్గాలు ఆనందంలో మునిగిపోతూ.. 'రెయిన్ బో' జెండాను రెపరెపలాడిస్తున్న సంగతి తెలిసిందే.