క్విటో(ఈక్వెడార్): కన్న కూతుళ్లంటే ఆ తండ్రి ఎంతో ఇష్టం. విడిపోయిన భార్య వద్ద ఉన్న ఇద్దరు కూతుళ్ల కస్టడీ తనకే ఇవ్వాలంటూ కోర్టులో కేసు వేశాడు. అయితే, తల్లి వద్దే కూతుళ్లు ఉండాలంటుంది చట్టం. అందుకే, కూతుళ్లకు తల్లి ప్రేమను పంచేందుకు దుస్సాహసమే చేశాడు ఆ తండ్రి. ఏకంగా లింగమార్పిడి చేసుకుని మహిళగా మారాడు. ఇప్పుడైనా చట్టం కూతుళ్లను తన వద్దకే పంపిస్తుందని ఆశపడుతున్నాడు..! ఈ ఘటన దక్షిణ అమెరికా దేశం ఈక్వెడార్‌లో చోటుచేసుకుంది.
న్యూయార్క్ పోస్ట్ కథనం ప్రకారం.. రెనె సలినాస్ రమోస్(47), అతని భార్య విడిపోయారు. చట్టం ప్రకారం వీరి సంతానం తల్లి సంరక్షణలోనే ఉండాలి. మహిళ మాత్రమే బిడ్డలకు ప్రేమను అందిస్తుందని చట్టం అంటోంది. భార్య ఐదు నెలలుగా కూతుళ్లను కలుసుకునే అవకాశం లేకుండా చేస్తోందని అంటున్నాడు. తనకెంతో ఇష్టమైన కూతుళ్లు దూరం కావడం తట్టుకోలేని రమోస్ మరో మార్గం ఆలోచించాడు. ఏకంగా లింగమార్పిడి చేయించుకుని, మహిళగా మారాడు. అధికార రికార్డుల్లో మహిళగానే ఉన్నా, నిత్య జీవితంలో పురుషుడిగానే చెలామణి అవుతున్నాడు. మహిళగా మారినందున, కోర్టు కేసు గెలుస్తాననే నమ్మకంతో ఉన్నాడు. తల్లి వద్ద ఇబ్బందులు పడుతున్న తన బిడ్డలకు తల్లిగా మారుతానంటున్నాడు. ఈక్వెడార్ ఎల్జీబీటీఐ హక్కుల సంస్థలు మాత్రం రమోస్ చర్యపై మండిపడుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment