daughter custody
-
కూతుళ్ల కోసం ‘తల్లి’గా మారాడు!
క్విటో(ఈక్వెడార్): కన్న కూతుళ్లంటే ఆ తండ్రి ఎంతో ఇష్టం. విడిపోయిన భార్య వద్ద ఉన్న ఇద్దరు కూతుళ్ల కస్టడీ తనకే ఇవ్వాలంటూ కోర్టులో కేసు వేశాడు. అయితే, తల్లి వద్దే కూతుళ్లు ఉండాలంటుంది చట్టం. అందుకే, కూతుళ్లకు తల్లి ప్రేమను పంచేందుకు దుస్సాహసమే చేశాడు ఆ తండ్రి. ఏకంగా లింగమార్పిడి చేసుకుని మహిళగా మారాడు. ఇప్పుడైనా చట్టం కూతుళ్లను తన వద్దకే పంపిస్తుందని ఆశపడుతున్నాడు..! ఈ ఘటన దక్షిణ అమెరికా దేశం ఈక్వెడార్‌లో చోటుచేసుకుంది. న్యూయార్క్ పోస్ట్ కథనం ప్రకారం.. రెనె సలినాస్ రమోస్(47), అతని భార్య విడిపోయారు. చట్టం ప్రకారం వీరి సంతానం తల్లి సంరక్షణలోనే ఉండాలి. మహిళ మాత్రమే బిడ్డలకు ప్రేమను అందిస్తుందని చట్టం అంటోంది. భార్య ఐదు నెలలుగా కూతుళ్లను కలుసుకునే అవకాశం లేకుండా చేస్తోందని అంటున్నాడు. తనకెంతో ఇష్టమైన కూతుళ్లు దూరం కావడం తట్టుకోలేని రమోస్ మరో మార్గం ఆలోచించాడు. ఏకంగా లింగమార్పిడి చేయించుకుని, మహిళగా మారాడు. అధికార రికార్డుల్లో మహిళగానే ఉన్నా, నిత్య జీవితంలో పురుషుడిగానే చెలామణి అవుతున్నాడు. మహిళగా మారినందున, కోర్టు కేసు గెలుస్తాననే నమ్మకంతో ఉన్నాడు. తల్లి వద్ద ఇబ్బందులు పడుతున్న తన బిడ్డలకు తల్లిగా మారుతానంటున్నాడు. ఈక్వెడార్ ఎల్జీబీటీఐ హక్కుల సంస్థలు మాత్రం రమోస్ చర్యపై మండిపడుతున్నాయి. -
అసలు నువ్వు తండ్రిగా పనికిరావు!
మాజీ భార్యకు ఎనిమిదేళ్ల కూతురిని చూపించనందుకు ముంబైవాసికి మూడు నెలల జైలుశిక్షతో పాటు రూ. 5 లక్షల జరిమానా కూడా పడింది. ఈ మేరకు ముంబై హైకోర్టు తీర్పునిచ్చింది. తాము ఇచ్చిన ఉత్తర్వులను పాటించకుండా ఉల్లంఘనకు పాల్పడ్డారంటూ మండిపడింది. షాహిద్ పలావ్కర్ (42) అనే వ్యక్తి ఇంతకుముందు తన భార్యకు పోస్టు ద్వారా విడాకులు ఇచ్చాడు. అయితే తన కూతురిని భార్యకు చూపించకుండా దాచిపెడుతున్నట్లు అతడిపై ఆరోపణలు వచ్చాయి. దాంతో అతడి భార్య హైకోర్టును ఆశ్రయించింది. దాంతో షాహిద్ అసలు తండ్రిగానే పనికిరాడంటూ జస్టిస్ రేఖ మండిపడ్డారు. తన బావమరిది తన కూతురిపై లైంగికదాడికి పాల్పడుతున్నాడంటూ అతడు చేసిన ఆరోపణలు కూడా తప్పని తేలింది. కస్టడీ అంశంపై ఫ్యామిలీ కోర్టు తుది తీర్పు ఇచ్చేవరకు కూతురు కూడా తల్లివద్దే ఉండాలని కోర్టు స్పష్టం చేసింది. ఈ కేసులో వాస్తవాలు చాలా దిగ్భ్రాంతికరంగా కనిపిస్తున్నాయని, ఇలాంటి పరిస్థితుల్లో కూతురిని ఆ తండ్రి దగ్గర ఉంచడం ప్రమాదకరంగా మారుతుందని జస్టిస్ రేఖ అన్నారు. తండ్రి పనికిమాలినవాడని తేలడంతో, ఇక కూతురి బాధ్యతను తక్షణం తల్లికి అప్పగించాలని ఆమె ఆదేశించారు. కూతురిని తల్లికి చూపించకుండా ఉండేందుకు రకరకాల కుట్రలు పన్నాడని, చివరకు చిన్నారిని కూడా ఆ కుట్రలో ఒక పావుగా వాడుకున్నాడని అన్నారు. ఇందుకు గాను మూడు నెలల జైలుశిక్ష విధించి, భార్యకు రూ. 5 లక్షల పరిహారం కట్టాలని తీర్పు చెప్పారు.