దేశంలో చాలా ఘటనలు జరుగుతుంటాయి. కానీ రెండు మాత్రం జరగకూడనివి జరిగాయి. 800 ఏళ్ల నాటి ప్రశస్త చరిత్ర గల అజ్మీర్ షరీఫ్ దర్గా మీద హిందూ సేన కోర్టులో కేసు వేయడం మొదటిది. ఈ దర్గాను లక్షలాదిమంది సందర్శిస్తారు. ఇందులో ముస్లింలే కాదు, హిందువులు కూడా ఉంటారు. దాని కింద శివాలయం ఉందన్నది అభియోగం. నిజంగా ఆలయాన్ని వెలికితీయాలని దీని ఉద్దేశం అనుకోను.
కేవలం ముస్లింలను పీడించడం మాత్రమే దీని వెనుక ఉన్న కారణం. ఇక రెండో ఘటనలో బంగ్లాదేశీయులకు వైద్యం చేయరాదని రెండు ఆసుపత్రులు తీర్మానించడం! కులమతాలు, జాతులకుఅతీతంగా వైద్యం చేయాలన్న నైతికతకు ఇది విరుద్ధం. ఈ దేశానికి ఏమయ్యింది?
నిజాయితీగా చెప్పాలంటే.. సరైన పదం కోసం వెతుక్కుంటాను నేనిప్పుడు. ఈ మధ్యకాలంలో జరిగిన రెండు పరిణామాలు నన్నీ స్థితికి చేర్చాయి. అర్థం చేసుకోలేనిది అందామా? దూషించదగ్గది అని కూడా అనలేను. బహుశా విచిత్రమైంది అనవచ్చునేమో! ఎందుకంటే ఆ రెండు పరిణామాలు ఆశ్చర్యం కలిగించేవి మాత్రమే కాదు.... అసాధారణమైనవి కూడా! ఇంతకీ ఏమిటా సంఘటనలు?
నిజానికి ఇలాంటివి చాలానే చోటుచేసుకుంటున్నాయి ఈమధ్య. మొదటి ఘటన... 800 ఏళ్ల పురాతనమైన అజ్మీర్ షరీఫ్ దర్గాపై కోర్టులో వేసిన వ్యాజ్యం. శివాలయం ఒకదాన్ని ధ్వంసం చేసి దర్గా కట్టారన్నది పిటిషనర్ల ఆరోపణ. దేని ఆధారంగా ఈ కేసు వేశారంటే... 1910లో హర్ బిలాస్ సర్దా రాసిన పుస్తకం!
ఇది విన్న వెంటనే ‘‘అయితే ఏంటి?’’ అని నన్ను నేను ప్రశ్నించుకున్నాను. ఢిల్లీలోని నేనుండే వసంత్ విహార్ కింద పృథ్వీరాజ్ చౌహాన్ కాలం నాటి రాజదర్బార్ ఉంటే ఉండవచ్చు. హిందూసేన లాంటివి ఏవో కోర్టులో కేసు వేసి... నా ఇల్లు తవ్వి చూస్తానంటే మాత్రం నేను కేకలు పెట్టాల్సి వస్తుంది. ఎప్పుడో 800 సంవత్సరాల క్రితం జరిగిందంటున్న ఘటన అది. నిజమో కాదో, కేవలం నమ్మకమో తెలియదు. ఉంటే చారిత్రక ప్రాసంగికత ఉంటుంది తప్ప, వందల మంది పూజించే దర్గాను కూల్చేసేందుకు ఇవేవీ కారణాలు కారాదు. దేశ విదేశాల్లోని హిందూ, ముస్లింలు లక్షలు, కోట్ల మంది అజ్మీర్ దర్గాను సందర్శిస్తూంటారు. ప్రార్థనలు చేస్తూంటారు.
పోనీ... హిందూ సేన అనేది నిజంగానే ఎప్పుడో కనిపించకుండా పోయిన శివాలయాన్ని వెతికే పనిలో ఉందా? నాకు డౌటే! ముస్లింలను హింసించాలనీ, దర్గాను నాశనం చేయాలనీ తద్వారా ముస్లింలకు వారి స్థాయి ఏమిటో చూపాలన్నదే లక్ష్యమన్నది నా అభిప్రాయం. చరిత్ర గతిలో జరిగిన తప్పులను సరిచేసేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పడం ప్రతీకారం తీర్చుకోవడమే అవుతుంది కానీ న్యాయం కోసం చేస్తున్న పనిలా అనిపించదు. ఇది ఫక్తు ముస్లిం వ్యతిరేకత. వారి చర్రిత, సంస్కృతి, వారికి స్ఫూర్తినిచ్చే మతంపై వ్యతిరేకత మాత్రమే.
నేను ఓ హిందువును. అందుకు గర్విస్తా. అయినంత మాత్రాన ఇలాంటి పిటిషన్లకు ఏమాత్రం మద్దతివ్వను. హిందువుల పేరు చెప్పి బలవంతంగా ఈ అకృత్యం చేయవద్దని విస్పష్టంగా, గట్టిగా అరుస్తా. కానీ ఇలా చేస్తే ఒక ప్రశ్న వస్తుంది. ఇలా అరిచి గీపెట్టే కదా కొంతమంది తమ ఇమేజీని పెంచుకుంటున్నదీ అని! ఇలాంటి చేష్టలపై న్యాయస్థానాలు కొంచెం సీరియస్‌గా ఆలోచించి చర్యలు తీసుకోవాలి కదా? కానీ అలా ఎందుకు చేయడం లేదు? దేశం రెండు ముక్కలవుతున్నా ఎవరూ పట్టించుకోకపోవడం విచిత్రమే!
రెండో ఘటన... మొదటిదాని కంటే ఎక్కువ బాధపెట్టేది. కోల్‌కతా, త్రిపురల్లోని కొన్ని ఆసుపత్రుల వైద్యులు తాము బంగ్లాదేశీయులకు చికిత్స చేయమని భీష్మించుకున్నారు. ఎంత చిల్లరతనం? అపోహలతో కూడిన ద్వేషం? బంగ్లాదేశ్‌లో ఎవరో భారతీయ జాతీయ పతాకాన్ని అగౌరవ పరిచారన్న వార్తలు చదివి వీరు ఇలా తీర్మానించారట! కోల్‌కతాలో ప్రఖ్యాతి గాంచిన జే.ఎన్ .రే ఆసుపత్రి, అగర్తలలోని ఐఎల్‌ఎస్ ఆసుపత్రులు వీటిల్లో ఉండటం విచారకరం.
జే.ఎన్ .రే ఆసుపత్రి డైరెక్టర్ శుభ్రాంశు భక్త తమ నిర్ణయంపై ఇచ్చిన వివరణ ఏమిటంటే... ‘‘దేశం అన్నింటి కంటే గొప్పది. దేశాన్ని కాదని ఏ పనీ జరగదు. వైద్యవృత్తి చాలా పవిత్రమైంది. కానీ దేశం పరువు మర్యాదలు అంతకంటే పెద్దవి. మిగిలిన ఆసుపత్రులు కూడా ఇదే పని చేయాలి’’ అంటూ సమర్థించుకున్నారు.
బాగానే ఉంది కానీ... వైద్యవృత్తిలోకి అడుగుపెట్టేటప్పుడు చేసిన హిపొక్రటిక్ ప్రమాణం మాటేమిటి? రోగులందరికీ వైద్యం అందించాల్సిన నైతిక బాధ్యత మాటేమిటి? కులమతాలు, జాతులకు అతీతంగా స్త్రీ, పురుష భేదం లేకుండా వైద్యం అందించాలని కదా హిపొక్రటిక్ ఓత్ చెప్పేది? వైద్యులు అందరూ గర్వంగా చెప్పుకునే వృత్తి గౌరవం మాటేమిటి? ఎక్కడో... ఎవరో కొందరు అనామక బంగ్లాదేశీయులు త్రివర్ణ పతాకాన్ని తొక్కి ఉండవచ్చునన్న వార్తకే వీటన్నింటినీ పక్కన పెట్టేయాలా? వదిలేసుకోవాలా?
నిజంగానే విచిత్రమైంది ఇది. అవసరమైన సమయంలో వైద్యం చేయనని భీష్మించిన వైద్యుడు నా జీవితంలో ఇప్పటివరకూ ఒక్కరూ తగల్లేదు. బ్రిటన్ లో ఓ పర్యాటకుడు ఫుట్‌పాత్ మీద కుప్పకూలిపోతే అక్కడి ప్రభుత్వ నేషనల్ హెల్త్ సర్వీసెస్ అత్యవసర వైద్యం అందిస్తుంది. విదేశీయుడా? అని చూడదు. నిజానికి ఇలా చేయడం నైతిక ధర్మం మాత్రమే కాదు... గౌరవ మన్ననలకు పాత్రమైనవి. రోగులు కూడా సాటి మనుషులేగా? కోల్‌కతాలోని కొంతమంది డాక్టర్లకు మాత్రం బంగ్లాదేశీయులైతే మనుషులుగా కనిపించడం లేదేమో!
సరైన పదం కోసం వెతుక్కుంటున్నానని చెప్పాను కదా... ఇందుకే! ఈ పనులు చేసిన వారి తప్పు ఒప్పులు ఎన్నాలన్నది నా ఉద్దేశం కాదు. కానీ... ఎందుకు తప్పుపట్టకూడదో తెలియక నేను పడుతున్న ఇబ్బందిని వాళ్లకు చెప్పాలని మాత్రం ఉంది. విచిత్రం అని అందామంటే... సాదాసీదాగా ఉంటుంది. ఒకరకంగా మనకు సంబంధం లేనిదన్నట్టుగా అవుతుంది. అసాధారణం, అనూహ్యం కావచ్చు. అనవసరం కూడా కావచ్చు. ఈ రెండు ఘటనలనూ వివరించేందుకు మీకు ఇంకా ఏదైనా మంచి పదం తోస్తే చెప్పండి.
- వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్
- కరణ్ థాపర్
Comments
Please login to add a commentAdd a comment