
ఒడిశాలోని పూరీలో గల జగన్నాథ ఆలయంలోకి అనధికారికంగా తొమ్మిది మంది బంగ్లాదేశీయులు ప్రవేశించారు. వీరిని ఒడిశా పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు.
కొందరు బంగ్లాదేశ్ జాతీయులు ఆలయంలోకి వెళ్లడాన్ని తాము చూశామని విశ్వహిందూ పరిషత్ కార్యకర్తలు తమకు చెప్పారని ఒక అధికారి మీడియాకు తెలిపారు. ఈ ఘటనపై వీహెచ్‌పీ కార్యకర్తలు సింగ్‌ద్వార్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు ఆ బంగ్లాదేశ్ జాతీయులను అదుపులోకి తీసుకున్నారు.
కొందరు హిందూయేతర బంగ్లాదేశీయులు ఆలయంలోకి ప్రవేశించినట్లు తమకు ఫిర్యాదు అందిందని, ఇద్దరు బంగ్లాదేశీయులను అదుపులోకి తీసుకున్నామని, వారిని విచారిస్తున్నామని పూరీ అదనపు పోలీసు సూపరింటెండెంట్ ఎస్పీ సుశీల్ మిశ్రా తెలిపారు. ఆలయ నిబంధనల ప్రకారం హిందువులకు మాత్రమే ఆలయంలోనికి ప్రవేశం ఉంది. ఈ ఆలయంలోనికి హిందువులు కానివారు ప్రవేశిస్తే వారిపై చర్యలు తీసుకుంటారు.
అదుపులోకి తీసుకున్న బంగ్లాదేశీయుల పాస్‌పోర్టులను తనిఖీ చేస్తున్నామని అదనపు పోలీసు సూపరింటెండెంట్ తెలిపారు. విచారణ సమయంలో ఒకరు హిందువని తేలింది. మిగిలిన పాస్‌పోర్టులపై విచారణ కొనసాగుతోంది. ఆలయ పరిసరాల్లోకి వచ్చిన తొమ్మిది మందిలో నలుగురు ఆలయంలోనికి ప్రవేశించినట్లు విచారణలో తేలింది.