hindu sena
-
ఆదిపురుష్‌పై ఢిల్లీ హైకోర్టులో పిటిషన్
బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ డైరెక్షన్లో ప్రభాస్, కృతి సనన్ జంటగా వచ్చిన మైథలాజికల్ మూవీ ఆదిపురుష్ కు వ్యతిరేకంగా ఢిల్లీ హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. ఈ చిత్రం హిందువుల మనోభావాల్ని దెబ్బతీసిందని.. హిందువులకు పవిత్రమైన ఇతిహాస రామాయణాన్ని హేళన చేసేలా ఉందంటూ హిందూసేన అభ్యంతరం వ్యక్తం చేస్తూ శుక్రవారం ఓ పిటిషన్ దాఖలు చేసింది. శుక్రవారం ఆదిపురుష్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలైన సంగతి తెలిసిందే. అయితే.. చిత్రంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ హిందూ సేన జాతీయాధ్యక్షుడు విష్ణు గుప్తా ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. ఈ చిత్రం కోట్లాది హిందువుల మనోభావాలను దెబ్బతీయడంతో పాటు రామాయణాన్ని, అలాగే శ్రీరాముడిని, భారత సంప్రదాయాల్ని ఎగతాళి చేసినట్లు ఉందని పిటిషన్లో పేర్కొన్నారాయన. సినిమాలో ప్రధాన పాత్రలను చూపించిన తీరు సరికాదనేది హిందూ సేన ప్రధాన అభ్యంతరం. వాల్మీకి మహర్షి రచించిన రామాయణంలో, అలాగే తులసీదాస్ రచించిన రామచరితమానస్‌లోనూ ప్రధాన పాత్రల వర్ణనకు.. ఆదిపురుష్‌లో పాత్రలను చూపించిన తీరుకు చాలా తేడాలు ఉన్నాయని పిటిషన్లో ప్రస్తావించారు. హిందూ దేవుళ్లైన రాముడు, సీత, హనుమంతుడు, రావణుడికి సంబంధించిన అభ్యంతరకర సన్నివేశాలను తొలగించాలని లేదంటే సరిదిద్దడానికి చిత్రయూనిట్‌కు ఆదేశాలు జారీ చేయాలని పిటిషనర్ కోర్టును అభ్యర్థించారు. ముఖ్యంగా రావణ బ్రహ్మ పాత్రధారి(సైఫ్ అలీఖాన్)ను గడ్డంతో ఏదో క్రూరుడిగా చూపించినట్లు ఉందని అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది హిందూ సేన. ప్రామాణికమైన వాల్మీకి రామాయణం గురించి తెలుసుకోవాలంటే పండితుల్ని, సాహిత్యకారుల్ని సంప్రదించాల్సిందేనంటూ ఈ చిత్ర ప్రారంభంలోనే నోట్ ఇవ్వడం గమనార్హం. ఇదీ చదవండి: ఆదిపురుష్ ఆ ఓటీటీలోనే.. వచ్చేసిన క్లారిటీ -
ఢిల్లీలో ఒవైసీ ఇంటిపై దాడి
న్యూఢిల్లీ: ఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అధికారిక నివాసంపై దాడి చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐదుగురు హిందూ సేన సభ్యులను మంగళవారం అరెస్టు చేసినట్లు ఢిల్లీ పోలీసులు చెప్పారు. ఢిల్లీలోని అశోక రోడ్డులో ఒవైసీ నివాసం ఉంది. ఈ దాడి గురించి సాయంత్రం 5 గంటలకు తమకు సమాచారం అందిందని, వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నామని పోలీసులు తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేశామన్నారు. ఈ దాడిలో ఎవరికీ గాయాలు కాలేదని, ఆస్తి నష్టం వాటిల్లలేదని పేర్కొన్నారు. -
'కేసు వాదిస్తావా?.. చంపేస్తా'
రాజ్‌కోట్: ఉగ్ర అనుమానితుల తరఫు కోర్టులో వాదిస్తే చంపేస్తామంటూ గుజరాత్ లాయర్లకు బెదిరింపులు వచ్చాయి. గుజరాత్లో ఇద్దరు ఐసిస్ ఉగ్రఅనుమానితులను పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. దీనిపై స్పందించిన హిందూసేన ఉగ్రవాదుల తరఫున ఏ లాయరైన కోర్టులో వాదిస్తే అతన్ని హత్య చేస్తామని పేర్కొంది. హిందూసేన బెదిరింపులకు తలొగ్గిన చాలా మంది లాయర్లు కేసును వాదించడానికి ముందుకు రాలేదు. దీంతో జామానగర్‌కు చెందిన ఇంత్యాజ్ కొరేజా అనే లాయర్ తాను కేసును టేకప్ చేస్తానని ముందుకు వచ్చారు. ఇంత్యాజ్ ప్రకటనపై మాట్లాడిన ప్రతీక్ భట్ అనే వ్యక్తి తనను తాను హిందూసేన గుజరాత్ అధ్యక్షుడిగా పరిచయం చేసుకున్నారు. ఉగ్రవాదుల తరఫు నిలిచిన ఇంత్యాజ్, ఆయన కుటుంబ సభ్యులను హత్య చేస్తామని బహిరంగంగా వ్యాఖ్యానించారు. లాయర్లంతా కలిసి ఒక నిర్ణయానికి రావాలని ఉగ్రవాదుల తరఫు వాదిస్తే హిందూసేన చూస్తూ ఊరుకోదని అన్నారు. కాగా, సోమవారం జరిగిన బార్ కౌన్సిల్ సమావేశంలో ఉగ్రవాదుల తరఫు ఎవరూ వాదించకూడదనే నిర్ణయాన్ని ఏకగ్రీవంగా ఆమోదించారు. బార్ కౌన్సిల్ తీర్మానాన్ని పక్కన పెట్టి కేసు వాదించడానికి పూనుకున్న ఇంత్యాజ్ ఇంటికి నిప్పు పెడతామని ప్రతీక్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తన వ్యాఖ్యలపై మీడియా ప్రెస్‌నోట్‌ను కూడా విడుదల చేశారు ప్రతీక్. ప్రతీక్ వ్యాఖ్యలతో అక్కడికి చేరుకున్న పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకుని కొద్దిసేపటి తర్వాత వదిలేశారు. -
సంబరాలు చేసుకున్న హిందుసేన
న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించడంతో హిందుసేన సంబరాలు చేసుకుంది. ట్రంప్ గెలవడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ బుధవారం బాజాలు మోగిస్తూ, స్వీట్లు పంచుకుని హిందుసేన కార్యకర్తలు వీధుల్లో సంబరాలు చేసుకున్నారు. ట్రంప్ విజయంతో భారత్-అమెరికా సంబంధాలు మరింత మెరుగవుతాయని హిందుసేన అధ్యక్షుడు విష్ణు గుప్తా అన్నారు. ‘అమెరికా ఎన్నికల ఫలితాలు మాకెంతో ఆనందం కలిగించాయి. ట్రంప్ విజయం సాధించడం పట్ల సంతోషంగా ఉంది. ఇప్పుడు అమెరికాకు భారత్ సన్నిహిత దేశమవుతుంది. తీవ్రవాదం నిర్మూలనకు భారత్, అమెరికా కలిసికట్టుగా పనిచేస్తాయ’ని విష్ణు గుప్తా పేర్కొన్నారు. ట్రంప్ విజయం కోసం మే నెలలో హిందూసేన ప్రత్యేక ప్రార్థనలు చేసింది. జూన్ లో ట్రంప్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించింది. -
ట్రంప్‌కు హేపీ బర్త్‌డే చెప్పిన హిందూసేన
న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్ష పదవికి రిపబ్లికన్ పార్టీ తరఫు అభ్యర్ధి డోనాల్డ్ ట్రంప్ జన్మదిన వేడుకలను భారతదేశ రాజధానిలో హిందూ సేన అంగరంగ వైభవంగా జరుపుకొంది. ట్రంప్ పుట్టినరోజు సందర్భంగా జంతర్ మంతర్ వద్ద ఏర్పాటుచేసిన వేదికపై కేక్ కట్ చేసిన హిందూ సేన ట్రంప్ ఫాలోవర్స్.. ఆయన బ్యానర్ కు కేక్ తినిపించారు. వేదికను బెలూన్లు, హ్యపీ బర్త్ డే ట్రంప్ అని ఉన్న ప్లకార్డులతో నింపారు. వేదిక పక్కకు ఉన్న ఒక బ్యానర్ లో తుపాకీని చేతితో పట్టుకున్న ట్రంప్ చిత్రాన్ని ఉంచారు. దీనిపై 'హ్యపీ బర్త్ డే అండ్ లాంగ్ లివ్ ట్రంప్' అని రాశారు. పుట్టినరోజు వేడుకల ప్రారంభానికి ముందు హిందూసేన సభ్యులందరూ ఒర్లాండో నరమేధంలో బాధితుల ఆత్మలకు శాంతి చేకూరాలని ఒక నిమిషం పాటు మౌనం పాటించారు. -
ఢిల్లీలో ట్రంప్ కు పూజలు
న్యూఢిల్లీ: గత కొంత కాలంగా ముస్లింలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న డొనాల్డ్ ట్రంప్ కు హిందూసేన కార్యకర్తల నుంచి మద్దతు లభించింది.ఇస్లామిక్ టెర్రరిజం నుంచి మానవత్వాన్ని ట్రంప్ మాత్రమే కాపాడగలడని, అమెరికా అధ్యక్ష ఎన్నకల్లో ఆయన విజయం సాధించాలని ట్రంప్ ఫో టోలకు పూజలు చేశారు. ఢిల్లీలోని ప్రొటెస్ట్ పార్క దగ్గర హిందూ సేన మద్దతు దారులు శివుడు,హనుమాన్ ఫోటోల చుట్టూ ట్రంప్ ఫోటోలు పెట్టియజ్ఞం చేసి, సామూహిక వేద మంత్రాలు పఠించి ట్రంప్ గెలవాలని పూజలు చేశారు. ప్రపంచం మొత్తం ఇస్లామిక్ ఉగ్రవాదంతో ఇబ్బందులుపడుతోందని ట్రంప్ మాత్రమే మానవత్వాన్ని ఉగ్రవాదం నుంచి కాపాడుతారని హిందూసేన అధ్యక్షుడు విష్ణుగుప్త పేర్కొన్నారు. Trump,Hindu sena, Puja For Him,photos,డొనాల్డ్ ట్రంప్, హిందూసేన,పూజలు -
అతడు మాత్రమే ప్రపంచాన్ని కాపాడగలడు!
న్యూఢిల్లీ: డొనాల్డ్ ట్రంప్ విజయాన్ని కాంక్షిస్తూ ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద బుధవారం హోమం నిర్వహించారు. మంత్రాలు జపిస్తూ ట్రంప్‌కు విజయం చేకూరాలని భగవంతున్ని ప్రార్థించారు హిందూ సేన కార్యకర్తలు. ఇటీవలి ప్రైమరీ ఎన్నికల్లో అనూహ్య విజయం సాధించి రిపబ్లికన్ పార్టీ తరపున నవంబర్‌లో జరగనున్న అధ్యక్ష ఎన్నికల బరిలో నిలవడానికి దూసుకుపోతున్న ట్రంప్ మాత్రమే ప్రపంచాన్ని కాపాడగలడని, ఆయన విజయం సాధించాలని ఈ సందర్భంగా హిదూసేన కార్యకర్తలు వేడుకున్నారు. ఇస్లామిక్ ఉగ్రవాదం నుంచి ప్రజలను కాపాడేందుకు ఉన్నటువంటి ఒకే ఒక ఆశ 'డొనాల్డ్ ట్రంప్' అని ఈ సందర్భంగా హిందూ సేన కార్యకర్తలు వెల్లడించారు. 'వి లవ్ ట్రంప్', 'వి సపోర్ట్ ట్రంప్' అని రాసివున్న ట్రంప్ ఫొటోలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల ప్యారిస్ దాడుల నేపథ్యంలో అమెరికాలోకి ముస్లింలను రానివ్వకుండా బ్యాన్ చేయాలని ట్రంప్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన విషయం తెలిసిందే. -
పాక్ ఎయిర్ లైన్స్ కార్యాలయంపై దాడి
-
పాక్ ఎయిర్ లైన్స్ కార్యాలయంపై దాడి
న్యూఢిల్లీ: పాకిస్థాన్ ఎయిర్ లైన్స్(పీఐఏ) కార్యాలయంపై గురువారం దాడి జరిగింది. బారాఖాంభా రోడ్డులో ఉన్న పీఐఏ కార్యాలయంలో హిందూ సేన కార్యాకర్తలు విధ్వంసానికి దిగారు. ఈ ఘటనకు సంబంధించి ఒకరిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. మధ్యాహ్నం 3.15 గంటల ప్రాంతంలో కార్యాలయంలోకి చొరబడిన దుండగులు సెక్యురిటీ గార్డ్ పై చేయి చేసుకున్నారు. తర్వాత కార్యాలయంలోని ఫర్నీచర్ ను ధ్వంసం చేశారు. కస్టమర్స్ లా నటించి పీఐఏ కార్యాలయంలోకి ప్రవేశించిన నలుగురు వ్యక్తులు విధ్వంసానికి దిగారని డీసీపీ జతిన్ నార్వాల్ తెలిపారు. ఒకరిని అరెస్ట్ చేశామని చెప్పారు. పఠాన్ కోట్ లో భారత వైమానిక స్థావరంపై ఈ నెల 2న పాకిస్థాన్ ఉగ్రవాదులు దాడి చేయడంతో రెండు దేశాల మధ్య సంబంధాల పునరుద్ధరణపై సందిగ్ధంలో పడింది. ఈ నేపథ్యంలో పాక్ ఎయిర్ లైన్స్ పై హిందూ సేన దాడికి దిగడం కలకలం రేపుతోంది.