'కేసు వాదిస్తావా?.. చంపేస్తా'
'కేసు వాదిస్తావా?.. చంపేస్తా'
Published Wed, Mar 1 2017 9:05 AM | Last Updated on Tue, Sep 5 2017 4:56 AM
రాజ్‌కోట్: ఉగ్ర అనుమానితుల తరఫు కోర్టులో వాదిస్తే చంపేస్తామంటూ గుజరాత్ లాయర్లకు బెదిరింపులు వచ్చాయి. గుజరాత్‌లో ఇద్దరు ఐసిస్ ఉగ్రఅనుమానితులను పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. దీనిపై స్పందించిన హిందూసేన ఉగ్రవాదుల తరఫున ఏ లాయరైన కోర్టులో వాదిస్తే అతన్ని హత్య చేస్తామని పేర్కొంది. హిందూసేన బెదిరింపులకు తలొగ్గిన చాలా మంది లాయర్లు కేసును వాదించడానికి ముందుకు రాలేదు. దీంతో జామానగర్‌కు చెందిన ఇంత్యాజ్ కొరేజా అనే లాయర్ తాను కేసును టేకప్ చేస్తానని ముందుకు వచ్చారు.
ఇంత్యాజ్ ప్రకటనపై మాట్లాడిన ప్రతీక్ భట్ అనే వ్యక్తి తనను తాను హిందూసేన గుజరాత్ అధ్యక్షుడిగా పరిచయం చేసుకున్నారు. ఉగ్రవాదుల తరఫు నిలిచిన ఇంత్యాజ్, ఆయన కుటుంబ సభ్యులను హత్య చేస్తామని బహిరంగంగా వ్యాఖ్యానించారు. లాయర్లంతా కలిసి ఒక నిర్ణయానికి రావాలని ఉగ్రవాదుల తరఫు వాదిస్తే హిందూసేన చూస్తూ ఊరుకోదని అన్నారు. కాగా, సోమవారం జరిగిన బార్ కౌన్సిల్ సమావేశంలో ఉగ్రవాదుల తరఫు ఎవరూ వాదించకూడదనే నిర్ణయాన్ని ఏకగ్రీవంగా ఆమోదించారు.
బార్ కౌన్సిల్ తీర్మానాన్ని పక్కన పెట్టి కేసు వాదించడానికి పూనుకున్న ఇంత్యాజ్ ఇంటికి నిప్పు పెడతామని ప్రతీక్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తన వ్యాఖ్యలపై మీడియా ప్రెస్‌నోట్‌ను కూడా విడుదల చేశారు ప్రతీక్. ప్రతీక్ వ్యాఖ్యలతో అక్కడికి చేరుకున్న పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకుని కొద్దిసేపటి తర్వాత వదిలేశారు.
Advertisement
Advertisement