కొత్త సంవత్సరం వేళ.. కేవలం గంటల వ్యవధిలో అమెరికాను వరుస దాడులు వణికించాయి. ముఖ్యంగా న్యూ ఓర్లీన్స్ ట్రక్కు దాడి కేసు తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ ఘటనపై విచారణ పూర్తిగా ఉగ్రకోణంలోనే సాగుతోందని ఎఫ్‌బీఐ తాజాగా ప్రకటించింది. ఈ మేరకు అనుమానితుడికి సంబంధించిన పూర్తి వివరాలను మీడియాకు విడుదల చేసింది.
గతంలో అమెరికా సైన్యం పని చేసిన షంసుద్ దిన్ జబ్బార్(42)ను ఈ దాడికి ప్రధానసూత్రధారిగా అనుమానిస్తున్నారు. ట్రక్కుతో దాడికి పాల్పడిన అనంతరం.. అతడ్ని భద్రతా బలగాలు అక్కడికక్కడే కాల్చి చంపాయి. అయితే అతనొక మానసిక రోగినా? లేకుంటే ఉగ్రవాదినా? అనేదానిపై ఇంకా స్పష్టమైన ప్రకటన వెలువడలేదు. కానీ..
👉జబ్బార్ గతంలో టెక్సాస్‌లో రియల్ ఎస్టేట్(Real Estate) ఎజెంట్‌గా పని చేశాడు. అంతకు ముందు చాలాఏళ్లు అమెరికా సైన్యంలో పని చేశాడు. అయితే.. ఆర్థిక సమస్యలతో పాటు విడాకులు అతని వ్యక్తిగత జీవితాన్ని కుంగదీసినట్లు తెలుస్తోంది. నాలుగేళ్ల కిందట.. యూట్యూబ్ ఛానెల్‌లో తనను తాను రియల్ ఎస్టేట్ ఏజెంట్‌గా పరిచయం చేసుకున్న ఓ వీడియో సైతం ఇప్పుడు బయటకు వచ్చింది.
👉ఇదిలా ఉంటే.. జబ్బార్ 2005 నుంచి 2015 మధ్య అమెరికా సైన్యంలో హ్యూమన్ రీసోర్స్ స్పెషలిస్ట్‌గా, ఐటీ స్పెషలిస్ట్‌గా పని చేశాడని అమెరికా రక్షణ కార్యాలయం పెంటగాన్ ప్రకటించింది. అంతేకాదు.. 2009-10 మధ్య అఫ్గనిస్థాన్‌లో అతను విధులు నిర్వహించాడు. తాజా దాడి ఘటన తర్వాత.. అమెరికా సైన్యంలో అతను పని చేసిన టైంలో ఓ వీడియో యూట్యూబ్‌లో వైరల్ అయ్యింది. అయితే కాసేపటికే ఆ వీడియోను ఎవరో యూట్యూబ్ నుంచి డిలీట్ చేశారు.
👉వీటితో పాటు 2021 నుంచి ప్రముఖ ఆడిటింగ్ సంస్థ డెలాయిట్‌లో అతడు సీనియర్ సొల్యూషన్ స్పెషలిస్ట్‌గా విధులు నిర్వహించాడు.
👉దాడి ఘటనపై అతని కుటుంబం స్పందించింది. తన సోదరుడు జబ్బార్ ఎంతో మంచివాడని అబ్దుర్ జబ్బార్ చెప్తున్నాడు. చిన్నతనంలో మా కుటుంబం మతం మారింది. కానీ, ప్రస్తుత దాడిని మతానికి ముడిపెట్టడం సరికాదు. రాడికలైజేషన్ ప్రభావంతోనే నా సోదరుడు ఉన్మాదిగా మారిపోయి ఉంటాడు అని అబ్దుర్ చెప్తున్నాడు.
👉జార్జియా స్టేట్ యూనివర్సిటీలో జబ్బార్ విద్యాభ్యాసం కొనసాగింది. 2015-17 మధ్య కంప్యూటర్స్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడతను. జబ్బార్ డైవోర్సీ. రెండుసార్లు వివాహం జరగ్గా.. ఇద్దరితోనూ విడాకులు తీసుకున్నాడు. ఆర్థిక సమస్యలతోనే రెండో భార్య నుంచి విడాకులు తీసుకుంటున్నట్లు 2022లో అతను పంపిన మెయిల్‌ను అధికారులు పరిశీలించారు.
👉రియల్ ఎస్టేట్ నష్టాలతో జబ్బార్ ఆర్థికంగానూ జబ్బార్ చితికిపోయి ఉన్నాడు. ఒకానొక టైంలో అద్దె కూడా చెల్లించని లేని స్థితికి చేరుకున్నాడు. ఆఖరికి లాయర్‌కు ఫీజులను కూడా క్రెడిట్ కార్డులతో చెల్లించి.. వాటిని ఎగ్గొట్టాడు.
👉నేర చరిత్రను పరిశీలిస్తే.. 2002లో దొంగతనం, 2005లో కాలం చెల్లిన డ్రైవింగ్ లైసెన్స్‌తో బండి నడిపి శిక్ష అనుభవించాడు.
👉షంషుద్దీన్ జబ్బార్ దాడి చేస్తాడని కొన్ని గంటల ముందే ఎఫ్‌బీఐ తనకు సమాచారం అందించినట్లు అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ వెల్లడించారని ఏబీసీ న్యూస్ ఓ కథనం ప్రచురించింది. ఐసిస్ స్ఫూర్తితోనే తాను ఈ చర్యకు ఉపక్రమిస్తున్నట్లు వీడియో పోస్ట్ చేశాడు. ఇస్లామిక్ స్టేట్ ఆర్మ్‌డ్ గ్రూప్(ఐసిస్‌కు మరో పేరు) జెండా కూడా దాడికి పాల్పడిన ట్రక్కులో ఉన్నట్లు ఎఫ్‌బీఐ తనకు నివేదించిందని బైడెన్ చెప్పినట్లు ఆ కథనం పేర్కొంది.
👉షంషుద్దీన్ జబ్బార్‌ను ఐసిస్ ఒంటరి తోడేలు (Lone Wolf)గా ఎఫ్‌బీఐ భావిస్తోంది. అంటే.. ఒంటరిగాగానీ లేదంటే చిన్నగ్రూపులుగా ఏర్పడి దాడులు చేయడం. అమెరికాలో జరిగే అత్యధిక ఉగ్రదాడులు ఈ రూపంలోనే ఉంటున్నాయి. 2014లో బెల్జియంలో యూదుల మ్యూజియంపై, 2012లో బ్రస్సెల్స్‌లో మసీదుపై, 2016లో ఫ్రాన్స్‌లో బాస్టిల్‌డే నాడు ట్రక్కుతో దాడి ఇలా చేసినవే.
‘‘అతడికి సైనిక నేపథ్యం ఉంది. కానీ, ఏనాడూ యుద్ధంలో పాల్గొనలేదు. నౌకాదళంలో చేరేందుకు ప్రయత్నించినా.. అది వీలుకాలేదు. దాడికి ముందు సెయింట్ రోచ్ సమీపంలో ఓ ఇంటి సమీపంలో అతడు ట్రక్కును ఆపి కొన్ని పెట్టెలను కిందకి దించుతున్న దృశ్యాలు నమోదయ్యాయి. ఆ తర్వాత కొన్ని గంటలకే అక్కడున్న ఆ ప్రాంతంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. నిందితుడు జబ్బార్ ఎయిర్ బీఎన్‌బీలో ఒక గది తీసుకొని.. అక్కడ న్యూఆర్లీన్ దాడికి పేలుడు పదార్థాలు తయారుచేశాడు.
టూరో అనే యాప్ సాయంతో అతడు ఫోర్డ్ ఎఫ్-150 లైటినింగ్ అనే భారీ ఎలక్ట్రిక్ పికప్ ట్రక్కును బుక్ చేశాడు. దానిని వాడే నూతన సంవత్సర వేడుకల వేళ బర్బన్ వీధిలో విచక్షణా రహితంగా దాడి చేసి 15 మందిని బలిగొన్నాడు’’ అని లూసియానా అటార్నీ జనరల్ లిజ్ ముర్రిల్ల్ తెలిపారు.
అయితే జబ్బార్ తన కుటుంబాన్ని ఐసిస్‌లో కలవాలని కుటుంబ సభ్యులను ఒత్తిడి చేశాడని.. వినకపోయేసరికి వాళ్లను సైతం కడతేర్చడానికి వెనుకాడలేదని అధికారులు చెప్తుండగా.. కుటుంబ సభ్యులు మాత్రం ఆ వాదనను కొట్టిపారేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment