‘‘గంజాయిని కలిగి ఉన్నా.. లేదంటే సేవించినంత పని చేసినా ఇక నుంచి జైలుకేం వెళ్లరు’’ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో స్వయంగా చేసిన పోస్ట్ ఇది. ప్రజాభిప్రాయం పరిగణనలోకి తీసుకుని ఈ ఫెడరల్ పాలసీని ప్రతిపాదించినట్లు బైడెన్ ప్రభుత్వం చెబుతోంది.
వాషింగ్టన్: అమెరికాలో మాదకద్రవ్యాల చట్టంలో మార్పులు జరిగాయి. గంజాయిని నెమ్మదిగా ఆ దేశంలో చట్టబద్ధం చేసే ప్రయత్నాల్లో మొదటి అడుగు పడినట్లయ్యింది. ఈ క్రమంలోనే గంజాయిని షెడ్యూల్-3 డ్రగ్ నుంచి షెడ్యూల్-1 డ్రగ్ కేటగిరీకి మార్చారు. అంటే ప్రమాదకరమైన మాదక ద్రవ్యాల జాబితా నుంచి తక్కువ ప్రమాదకరమైన మాదకద్రవ్యాల జాబితాలోకి మార్చబోతున్నారన్నమాట.
అమెరికాలో మాదకద్రవ్యాల నిషేధిత చట్టం రూపకల్పన 1937లో జరిగింది. రేసిజం నేపథ్యంలోనే ఈ చట్టాన్ని రూపొందించడం గమనార్హం. ఆ తర్వాత మైనర్‌లు డ్రగ్స్ బారిన పడుతున్నారనే 1970లో కొత్త చట్టం తెచ్చారు. అదే కంట్రోల్డ్ సబ్‌స్టాన్సెస్ యాక్ట్. దీని ప్రకారం గంజాయిని ఇంతకాలం షెడ్యూల్-1 డ్రగ్ కింద ఉంచారు. ఈ షెడ్యూల్-1 డ్రగ్స్‌లో హెరాయిన్, ఎల్‌ఎస్డీ, ఎక్సాట్సీ వంటివి కూడా ఉన్నాయి. ఇవి చాలా ప్రమాదకరమైన డ్రగ్స్ అని, వీటిని సేవించినా.. కనీసం కలిగి ఉన్నట్లు రుజువైన ఇంతకాలం కఠిన శిక్షలు అమలు చేస్తూ వచ్చారు. అయితే ఇప్పుడు ఆ లిస్ట్‌లో ఉన్న గంజాయిని.. షెడ్యూల్3 డ్రగ్స్‌లోకి మార్చేందుకు ప్రతిపాదన చేశారు.
షెడ్యూల్-3 డ్రగ్స్‌లో కెటామైన్, పెయిన్‌కిలర్స్‌లో వాడే కోడైన్(codeine) ఉన్నాయి. గంజాయిని ఇందులోంచి మినహాయించడంతో.. ఇక నుంచి గంజాయి బ్యాచ్‌లకు కాస్త ఊరట కలగనుంది. అలాగని అమెరికాలో గంజాయిని కలిగి ఉండడం చట్టబద్ధం అని మాత్రం కాదు. కాకుంటే.. ఇంతకు ముందు స్థాయిలో మాత్రం అరెస్టులు ఉండకపోవచ్చు.
వాస్తవానికి గంజాయిని ప్రమాదకరమైన డ్రగ్స్ జాబితాను తొలగించే ప్రయత్నాలు బైడెన్ హయాంలో 2022లోనే మొదలయ్యాయి. అయితే.. గంజాయిని రీక్లాసిఫై చేసే ప్రతిపాదనను మాత్రం బైడెన్ ప్రభుత్వం ఈ ఏప్రిల్ చివరి వారంలోనే రూపొందించింది. జస్టిస్ డిపార్ట్‌మెంట్ మాత్రం ఆ ప్రాసెస్‌ను అధికారికంగా గురువారం నుంచే ప్రారంభించింది. అంటే.. ఆ ప్రతిపాదనకు ఆమోద ముద్ర పడేదాకా ఇంకొంచెం సమయం పడుతుంది. అప్పటిదాకా ఇది ప్రమాదకరమైన మాదక ద్రవ్యాల జాబితాలోనే కొనసాగనుంది.
ప్రపంచంలో చాలా దేశాల్లో గంజాయి వాడకం తప్పేం కాదు. అలాగే గంజాయిని చట్ట బద్ధం చేయాలనే డిమాండ్ అమెరికాలో ఎప్పటి నుంచో ఉంది. ప్యూ రీసెర్చ్‌సెంటర్ సర్వే ప్రకారం.. 88 శాతం అమెరికన్లు గంజాయి వాడకాన్ని చట్టబద్ధం చేయాలని కోరుతున్నారు. కేవలం 11 శాతం మంది మాత్రమే వద్దని కోరారు.
బైడెన్ తీసుకున్న ఈ నిర్ణయం.. ఈ ఏడాది నవంబర్‌లో జరగబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికలను తీవ్ర ప్రభావితం చేస్తుందని, ముఖ్యంగా యువ ఓటర్లను ఆకర్షించే దిశగా ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment