సునీత రాక.. బైడెన్‌పై ఎలాన్‌ మస్క్‌ సంచలన ఆరోపణలు | Elon Musk Reaction Over Sunita Williams Return To Earth From Space After 9 Months, Check Video Goes Viral | Sakshi
Sakshi News home page

సునీత రాక.. బైడెన్‌పై ఎలాన్‌ మస్క్‌ సంచలన ఆరోపణలు

Published Wed, Mar 19 2025 8:19 AM | Last Updated on Wed, Mar 19 2025 10:20 AM

Elon Musk Reaction Over Sunita Williams Return

వాషింగ్టన్‌: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్‌) నుంచి భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్, బుచ్‌ విల్మోర్‌ భూమి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మిషన్‌కు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిన ట్రంప్‌నకు మస్క్‌ శుభాకాంక్షలు తెలిపారు. ఇదే సమయంలో అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్‌పై సంచలన ఆరోపణలు చేశారు.

వ్యోమగామి సునీతా విలియమ్స్‌ భూమిని చేరుకున్న తర్వాత ఎలాన్‌ మస్క్‌ స్పందించారు. ఈ సందర్బంగా మస్క్‌ ఓ మీడియా చానెల్‌తో మాట్లాడుతూ.. గతంలోనే వ్యోమగాములు సునీతా విలియమ్స్‌, బచ్‌ విల్మోర్‌ను భూమి మీదకు తీసుకువచ్చేందుకు మేం ప్రయత్నించాం. ఈ మేరకు జో బైడెన్‌ ప్రభుత్వానికి సూచనలు కూడా చేశాం. కానీ, రాజకీయ కారణాల వల్ల మా ప్రతిపాదనను బైడెన్ స్వీకరించలేదు. ఒకవేళ అప్పుడే మా సూచనలు ఆయన తీసుకుని ఉంటే వ్యోమగాములు ముందుగానే భూమిని చేరుకునేవారు అని అన్నారు. 

ఇక, వారిద్దరూ కేవలం ఎనిమిది రోజులు మాత్రమే అక్కడు ఉండాల్సింది. కానీ, అనివార్య కారణాల వల్ల తొమ్మిది నెలల పాటు అక్కడే ఉన్నారు. బైడెన్‌ ప్రభుత్వం వారిద్దరి పట్ల చాలా దారుణంగా వ్యవహరించింది. కానీ, ట్రంప్‌ మాత్రం అలా చేయలేదు. ఈ మిషన్‌కు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు. వారిద్దరిని వీలైనంత తొందరగా సురక్షితంగా భూమికి తీసుకురావాలని మమ్మల్ని ఆదేశించారు. ఆయన కృషి వల్ల ఇది సాధ్యమైంది. ట్రంప్‌నకు కృతజ్ఞతలు. మిషన్‌ సక్సెస్‌ చేసిన నాసా, స్పేస్‌ఎక్స్‌లకు శుభాకాంక్షలు’ అని కామెంట్స్‌ చేశారు.

మరోవైపు.. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) నుంచి సురక్షితంగా భూమికి చేరుకున్న నలుగురు సభ్యుల వ్యోమగాముల బృందానికి అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా (NASA) స్వాగతం పలికింది. విజయవంతంగా యాత్రను పూర్తి చేసిన క్రూ-9 సిబ్బందికి అభినందనలు తెలిపింది. ఈ యాత్ర విజయవంతం కావడంలో స్పేస్‌ ఎక్స్‌ది అద్భుత పాత్ర అని నాసా కొనియాడింది.

అనంతరం నాసా ఉన్నతాధికారులు మీడియాతో మాట్లాడుతూ..‘స్పేస్‌ ఎక్స్‌ సంస్థ ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం శక్తిని చాటింది. క్యాప్సూల్‌ భూమిని చేరే సమయంలో వాతావరణం అనుకూలంగా ఉంది. ప్రశాంత వాతావరణం వల్ల ల్యాండింగ్‌కు ఇబ్బంది ఎదురుకాలేదు. ల్యాండింగ్‌ సమయంలో భద్రతపరంగా అమెరికా కోస్ట్‌గార్డ్‌ అన్ని చర్యలు తీసుకుంది. అన్‌డాకింగ్‌ నుంచి సాఫ్ట్‌ ల్యాండింగ్‌ వరకు అన్నీ అనుకున్నట్లుగా జరిగాయి. ప్రస్తుత పరిణామాలు భవిష్యత్‌ మానవసహిత అంతరిక్షయాత్రకు కొత్తబాట చూపాయి.

ఒక వ్యోమనౌకలో అంతరిక్షంలోకి వెళ్లి మరో వ్యోమనౌకలో సురక్షితంగా తిరిగి వచ్చారు. భవిష్యత్‌ అంతరిక్ష ప్రయోగాలు, ప్రైవేటు భాగస్వామ్యాలకు ఇదొక సరికొత్త ప్రారంభం. ఈ యాత్రలో సునీతా విలియమ్స్‌ రెండుసార్లు స్పేస్‌ వాక్‌ చేశారు. క్రూ-9 వ్యోమగాములు 150కి పైగా ప్రయోగాలు నిర్వహించారు. ఐఎస్‌ఎస్‌లో వ్యోమగాములు స్టెమ్‌సెల్స్‌ సాంకేతికతపై పరిశోధనలు చేశారు. క్యాన్సర్లకు పరిష్కారాలు చూపే మార్గాలపైనా పరిశోధనలు చేశారు. నలుగురు వ్యోమగాముల కృషి, పరిశోధనలు భవిష్యత్‌కు ఎంతో ఉపయుక్తం. ఐఎఎస్‌ఎస్‌ బయట కొన్ని నమూనాలను సునీత, విల్మోర్‌ సేకరించారు. భవిష్యత్తులో నాసా మరెన్నో ప్రయోగాలు, పరిశోధనలు చేపట్టబోతోంది’ అని తెలిపారు
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement