
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం అమలు దిశగా అడుగు వేశారు. ఆ దేశ విద్యాశాఖ(Department of Education) మూసివేత ఉత్తర్వులపై సంతకం చేశారు. నాలుగు దశాబ్దాలుగా భారీగా ఖర్చు చేస్తున్నా అమెరికాలో విద్యా ప్రమాణాలు మెరుగుపడటం లేదని, ఇంకా యూరప్ దేశాలు.. చైనా కంటే వెనుకబడే ఉన్నామని, కాబట్టే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని వెల్లడించారాయన. అయితే.. విద్యార్థులకు ఫీజుల రాయితీలు, కొన్ని ముఖ్యమైన పథకాలు మాత్రం కొనసాగిస్తామని అన్నారాయన.
గురువారం వైట్‌హౌజ్‌లోని ఈస్ట్ రూమ్‌లో స్కూల్ పిల్లల మధ్య డొనాల్డ్ ట్రంప్(Donald Trump) కూర్చుని ఈ ఉత్తర్వులపై ప్రత్యేక వేడుకలో సంతకం చేయడం గమనార్హం. ఈ కార్యక్రమానికి రిపబ్లికన్ లీడర్లు, పలు రాష్ట్రాల గవర్నర్లు హాజరయ్యారు. విద్యాశాఖ విభాగాన్ని మూసివేస్తూ.. ఆ అధికారాన్ని రాష్ట్రాలకు అప్పగించండి అని విద్యాశాఖ కార్యదర్శి, డబ్ల్యూడబ్ల్యూఈ మాజీ సీఈవో లిండా మెక్ మహోన్(Linda McMahon)కు ట్రంప్ ఆదేశాలు జారీ చేశారు.
అమెరికాకు లిండా మెక్ మహోన్‌నే చివరి విద్యాశాఖ కార్యదర్శి కావొచ్చని ఈ సందర్భంగా ట్రంప్ వ్యాఖ్యానించారు. మార్చి 3వ తేదీన ఆమె ఆ బాధ్యతలను స్వీకరించడం గమనార్హం.
అమెరికాలో 1979 నుంచి విద్యాశాఖ విభాగాన్ని ఫెడరల్ గవర్నమెంట్ చూసుకుంటోంది. విద్యాశాఖ నిర్వహణలో పరిమితమైన పాత్రే పోషిస్తున్నప్పటికీ.. ఫండింగ్ విషయంలో మాత్రం భారీగా ఖర్చు చేయాల్సి వస్తోంది. అయితే.. తాజా ట్రంప్ ఆదేశాలతో ఇక నుంచి స్టేట్స్(రాష్ట్రాలు) ఆ బాధ్యతలను స్వీకరించాల్సి ఉంటుంది. అయితే.. ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల ఇటు డెమోక్రట్లు, అటు విద్యావేత్తలు మండిపడుతున్నారు. ఇది ట్రంప్ తీసుకున్న మరో వినాశకార నిర్ణయమని డెమోక్రట్ సెనేటర్ చుక్ షూమర్ అభిప్రాయపడ్డారు.

ఇదిలా ఉంటే.. ట్రంప్ తాజా నిర్ణయం అమల్లోకి రావడం అంత సులువు కాదు. ఎందుకంటే.. అందుకు పార్లమెంట్ అనుమతి తప్పనిసరి. కానీ, ట్రంప్ మాత్రం వీలైనంత త్వరలో ఈ ఉత్తర్వులను ఆచరణలోకి తెస్తామని చెప్తున్నారు.
ఎన్నికల సమయంలో తన ప్రచారంలోనూ ట్రంప్ ఈ నిర్ణయం తప్పకుండా అమలు చేస్తానని ప్రకటించడం తెలిసిందే. అధికారంలోకి వచ్చాక.. డోజ్(DOGE) విభాగం ద్వారా అనవసరపు ఖర్చులు తగ్గించుకునేందుకు పలు విభాగాలను ట్రంప్ ప్రభుత్వం రద్దు చేస్తోంది. ఈ క్రమంలోనే ప్రముఖ టెక్ బిలియనీర్ ఇలాన్ మస్క్ సాయం తీసుకుంటున్నారాయన.
Comments
Please login to add a commentAdd a comment