అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వరుసగా సంచలన ప్రకటనలు చేస్తున్నారు. అధ్యక్ష భవనంలోకి అడుగుపెట్టకముందే.. తాను ఏం చేయబోతున్నాననే విషయాలను వరుసగా ప్రకటిస్తున్నారాయన. ఈ క్రమంలో వంద ఏళ్లుగా అమెరికన్లు పాటిస్తున్న డేలైట్ సేవింగ్ టైం(DST) విధానానికి ముగింపు పలకబోతున్నట్లు ప్రకటించారు. ఈమేరకు ట్రూత్ సోషల్ వేదికగా పోస్ట్ పెట్టారు.
‘రిపబ్లికన్ పార్టీ డే లైట్ సేవింగ్ టైమ్‌ను రద్దు చేయనుంది. ఈ పద్ధతిని అనుసరించడం ఎంతో అసౌకర్యంగా ఉంది. దీనివల్ల అమెరికన్లపై చాలా భారం పడుతుంది’ అని రాసుకొచ్చారు. డేలైట్ సేవింగ్ టైం అంటే.. వసంతకాలంలో ఒక గంట ముందుకు, శరధ్రుతువులో ఒక గంట వెనక్కి గడియారంలో సమయాలను మార్చుకోవడం. అయితే, ఈ పద్ధతికి కాలం చెల్లిందని, దీనివల్ల ఎలాంటి ప్రయోజనం ఉండడం లేదన్నది చాలామంది అభిప్రాయం.
ఎనర్జీ సేవింగ్.. అంటే పగటికాంతిని సాయంత్ర వేళల్లో సమర్థవంతంగా ఉపయోగించుకునేందుకు ఈ విధానం పాటిస్తున్నారు. అయితే ఈ విధానం వల్ల పనులకు అవాంతరాలు ఎదురవుతున్నాయని, ముఖ్యంగా నిద్రపై ప్రభావం పడుతుందని పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
1784లో బెంజమిన్ ఫ్రాంక్లిన్ తొలిసారిగా డేలైట్ సేవింగ్ టైం ప్రతిపాదన చేశారు. అయితే.. మొదటి ప్రపంచ యుద్ధకాలంలో తొలిసారి ఈ డే లైట్ సేవింగ్ టైమ్‌ను అమెరికన్లు పాటించారు. యుద్ధం ముగిశాక.. ఈ విధానం పాటించడం మానేశారు. అయితే తిరిగి రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ఈ విధానం మళ్లీ అమెరికాలో ఆచరణలోకి వచ్చింది. యూనిఫామ్ టైం యాక్ట్ 1966 కింద.. ఈ విధానం శాశ్వతంగా మారిపోయింది. అయితే హవాయ్,ఆరిజోనా మాత్రం ఈ విధానం పాటించడం లేదు.
అయితే ఈ విధానాన్ని మూర్ఖపు విధానంగా పేర్కొంటూ.. సెనేటర్ మార్కో రుబియో 2022లో సన్‌షైన్ ప్రొటెక్షన్ అనే బిల్లును తెచ్చారు. బిల్లు సెనేట్‌లో పాసైనప్పటికీ.. హౌజ్‌లో మాత్రం ఆమోదం దక్కించుకోలేకపోయింది. దీంతో.. బైడెన్ దాకా ఆ బిల్లు వెళ్లలేకపోయింది. ప్రస్తుతం ట్రంప్ కార్యవర్గంలో రుబియో స్టేట్ సెక్రటరీగా ఉండడం గమనార్హం.
ఎలాన్ మస్క్, వివేక్ రామస్వామిలాంటి ట్రంప్ అనుచరగణం కూడా ఈ విధానానికి వ్యతిరేకంగా ఉంది. మరోవైపు.. డీఎస్‌టీ ద్వారా ఆర్థిక భారం ఎక్కువగా ఉంటుందని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.
ప్రస్తుతం అమెరికన్లు ప్రతీ ఏటా మార్చి-నవంబర్ మధ్య డేలైట్ టైం ను.. నవంబర్-మార్చి మధ్య స్టాండర్డ్ టైంను ఫాలో అవుతున్నారు. ట్రంప్ నిర్ణయం అమల్లోకి వస్తే.. కాలాన్ని మార్చుకునే ఈ వందేళ్ల ఆనవాయితీకి పుల్‌స్టాప్ పడుతుంది. అమెరికా మాత్రమే కాదు.. యూరప్ సహా ప్రపంచంలోని మూడింట దేశాలు ఈ పద్ధతిని అవలంభిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment