డిజిటల్‌ ట్యాక్స్‌పై అమెరికా గుర్రు | US begins probe into digital services taxes imposed by India | Sakshi
Sakshi News home page

డిజిటల్‌ ట్యాక్స్‌పై అమెరికా గుర్రు

Published Thu, Jun 4 2020 4:01 AM | Last Updated on Thu, Jun 4 2020 4:01 AM

US begins probe into digital services taxes imposed by India - Sakshi

వాషింగ్టన్‌: అమెరికన్‌ టెక్నాలజీ కంపెనీలను లక్ష్యంగా చేసుకుని పలు దేశాలు అనుచిత డిజిటల్‌ సర్వీస్‌ ట్యాక్స్‌లు విధిస్తున్నాయని అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది. భారత్‌తో పాటు పలు దేశాలు విధిస్తున్న డిజిటల్‌ సర్వీస్‌ పన్నులపై (డీఎస్‌టీ) విచారణ జరపాలని నిర్ణయించింది. ఆస్ట్రియా, బ్రెజిల్, చెక్‌ రిపబ్లిక్, యూరోపియన్‌ యూనియన్, ఇండోనేసియా, ఇటలీ, స్పెయిన్, టర్కీ, బ్రిటన్‌ మొదలైనవి ఈ జాబితాలో ఉన్నాయి. ‘మా సంస్థలను అసమంజసంగా టార్గెట్‌ చేసుకుని కొన్ని వాణిజ్య భాగస్వామ్య దేశాలు అమలు చేస్తున్న పన్నుల స్కీమ్‌లపై అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆందోళన వ్యక్తం చేశారు.

మా వ్యాపార సంస్థలు, ఉద్యోగులపై ఎలాంటి వివక్ష చూపినా తగు చర్యలు తీసుకునేందుకు మేం సిద్ధంగా ఉన్నాం‘ అని అమెరికా వాణిజ్య ప్రతినిధుల సంస్థ (యూఎస్‌టీఆర్‌) పేర్కొంది. వాణిజ్య చట్టం 1974లోని సెక్షన్‌ 301 కింద ఈ విచారణ జరపాలని అమెరికా నిర్ణయించింది. దీని ప్రకారం అమెరికా వాణిజ్యంపై ప్రతికూల ప్రభావాలు చూపేలా ఇతర దేశాలు వివక్షాపూరిత, అసమంజస విధానాలేమైనా అమలు చేస్తేవిచారణ జరిపేందుకు యూఎస్‌టీఆర్‌కు విస్తృత అధికారా లు ఉంటాయి. దీనిపై ఫెడరల్‌ రిజిస్టర్‌ నోటీసులు జారీ చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

ఏప్రిల్‌ 1 నుంచి డీఎస్‌టీ అమల్లోకి..
డిజిటల్‌ ట్యాక్స్‌ అంశం కొన్నాళ్లుగా అంతర్జాతీయంగా నలుగుతూనే ఉంది. దీనికి ప్రత్యామ్నాయంపై చర్చలు జరిగినప్పటికీ దేశాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. చివరికి వివిధ రకాలుగా దేశాలు ఏకపక్షంగా డిజిటల్‌ ట్యాక్స్‌ను విధించడం ప్రారంభించాయి. 2019లో ఫ్రాన్స్‌ ఇలాగే అమెరికా ఉత్పత్తులపై డీఎస్‌టీ విధించింది. ప్రతిగా అమెరికా కూడా కొన్ని ఫ్రెంచ్‌ ఉత్పత్తులపై మరింత అధిక స్థాయిలో పన్నులు వడ్డించింది. దీంతో డీఎస్‌టీని నిలుపుదల చేసిన ఫ్రాన్స్‌ బహుళపక్ష చర్చలు ప్రారంభించింది.

భారత్‌ విషయానికొస్తే ఆన్‌లైన్‌లో వస్తు, సేవలు విక్రయించే విదేశీ కంపెనీలపై రెండు శాతం డీఎస్‌టీ విధించాలని ఈ ఏడాది తొలినాళ్లలో ప్రభుత్వం నిర్ణయించింది.  2020–21 బడ్జెట్‌లో చేసిన ఈ ప్రతిపాదనల కింద రెండు డజన్లకు పైగా విదేశీ టెక్‌ కంపెనీలు ఈ పన్నుల పరిధిలోకి వస్తాయి. సుమారు 2,67,000 డాలర్ల వార్షికాదాయాలు ఉన్న కంపెనీలకు మాత్రమే దీన్ని వర్తింపచేస్తూ ఏప్రిల్‌ 1 నుంచి ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. తొలి విడత చెల్లింపులు కంపెనీలు జూలై 7న కట్టాల్సి ఉంది. గడువు దగ్గరపడుతుండటంతో ఆదాయపు పన్ను శాఖ అధికారులు ఇప్పటికే వసూళ్లపై కసరత్తు చేస్తున్నారు.

వాస్తవానికి భారత్‌లో శాశ్వతమైన సంస్థను ఏర్పాటు చేయకుండా డిజిటల్‌ ప్రకటనల సేవల ద్వారా విదేశీ సంస్థలు ఒక ఏడాదిలో రూ.  లక్షకు పైగా ఆదాయం ఆర్జించిన పక్షంలో 6 శాతం మేర సమానత్వ పన్ను విధించాలంటూ 2016 ఫైనాన్స్‌ చట్టంలో ప్రతిపాదించారు. 2020–21 బడ్జెట్‌లో 2% రేటుతో ఈ–కామర్స్‌ కంపెనీలనూ దీని పరిధిలోకి చేర్చారు. ఇది భారత్‌తో వాణిజ్యం చేసే ఇతర దేశాల కంపెనీలను ఆశ్చర్యపర్చింది. కరోనా పరిణామాల కారణంగా దీన్ని తొమ్మిది నెలల పాటు వాయిదా వేయాలంటూ అమెరికా, యూరప్, ఆస్ట్రేలియా, ఆసియా ఖండాల దేశాల కంపెనీలు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు గత నెలలో లేఖ రాశాయి.

చర్చలతో పరిష్కరించుకోవాలి..  
ఈ వివాదాన్ని బహుళపక్ష చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని అమెరికా చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ మైరాన్‌ బ్రిలియంట్‌ తెలిపారు. ‘ఆర్థిక వృద్ధి, ఉద్యోగాల కల్పనకు శక్తిమంతమైన చోదకంగా డిజిటల్‌ కామర్స్‌ ఎదిగింది. అయితే, కొన్ని దేశాలు ప్రస్తుతం ఏకపక్షంగా, వివక్షాపూరితంగా వ్యవహరిస్తూ కొత్తగా డిజిటల్‌ ట్యాక్సులు విధించాలని భావిస్తున్నాయి. ఏకపక్ష పన్నులను నివారించేందుకు అన్ని వర్గాలు కలిసి చర్చించుకోవాల్సిన అవసరం ఉంది‘ అని పేర్కొన్నారు. ‘అమెరికా గతేడాది భారత్‌కు 27 బిలియన్‌ డాలర్ల విలువ చేసే సేవలను ఎగుమతి చేసింది. కాబట్టి కొత్త పన్నుల విధానంతో ఎక్కువగా అమెరికాపైనే ప్రతి కూల ప్రభావం పడవచ్చు. డిజిటల్‌ దిగ్గజంగా ఎదగాలని భారత్‌ ఆశిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఇలాంటి కొత్త పన్నుల వల్ల అవరోధాలేమీ తలెత్తకుండా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందన్నది వేచి చూడాల్సి ఉంటుంది‘ అని న్యాయసేవల సంస్థ నాంగియా ఆండర్సన్‌ పార్ట్‌నర్‌ సందీప్‌ ఝున్‌ఝున్‌వాలా పేర్కొన్నారు.

భారత్‌పై పోరు కాదు...
ఈ లిస్టులో అమెరికా మిత్రదేశాలు కూడా చాలానే ఉన్నందున దీన్ని కేవలం భారత్‌పై పోరుగా పరిగణించక్కర్లేదని పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. ఇది చర్చల ప్రక్రియకు నాంది మాత్రమేనని, యూఎస్‌టీఆర్‌ ఇంకా భారత్‌ విధానాలపై వాస్తవాలు సమీకరిస్తోందని వివరించాయి. తర్వాత దశలో భారత్‌ అనుచిత వాణిజ్య విధానాలేమీ అమలు చేయడం లేదని కూడా నిర్ధారణ కావచ్చని పేర్కొన్నాయి. అమెరికన్‌ చట్టాల ప్రకారం ఆరోపణలు ఎదుర్కొంటున్న వర్గాలు (ప్రస్తుత కేసులో భారత్‌) కూడా తమ విధానాలను సమర్థించుకునేందుకు, వాదనలు వినిపించేందుకు అవకాశాలు ఉంటాయని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ఒకవేళ భారత్‌ అనుచిత వాణిజ్య విధానాలు పాటిస్తోందని యూఎస్‌టీఆర్‌ నిర్ధారణకు వచ్చినప్పటికీ అమెరికాతో చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకునే అవకాశాలు ఉన్నాయని చెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement