dst
-
ట్రంప్ మరో సంచలన నిర్ణయం.. డీఎస్టీ రద్దు
అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వరుసగా సంచలన ప్రకటనలు చేస్తున్నారు. అధ్యక్ష భవనంలోకి అడుగుపెట్టకముందే.. తాను ఏం చేయబోతున్నాననే విషయాలను వరుసగా ప్రకటిస్తున్నారాయన. ఈ క్రమంలో వంద ఏళ్లుగా అమెరికన్లు పాటిస్తున్న డేలైట్ సేవింగ్ టైం(DST) విధానానికి ముగింపు పలకబోతున్నట్లు ప్రకటించారు. ఈమేరకు ట్రూత్ సోషల్ వేదికగా పోస్ట్ పెట్టారు.‘రిపబ్లికన్ పార్టీ డే లైట్ సేవింగ్ టైమ్‌ను రద్దు చేయనుంది. ఈ పద్ధతిని అనుసరించడం ఎంతో అసౌకర్యంగా ఉంది. దీనివల్ల అమెరికన్లపై చాలా భారం పడుతుంది’ అని రాసుకొచ్చారు. డేలైట్ సేవింగ్ టైం అంటే.. వసంతకాలంలో ఒక గంట ముందుకు, శరధ్రుతువులో ఒక గంట వెనక్కి గడియారంలో సమయాలను మార్చుకోవడం. అయితే, ఈ పద్ధతికి కాలం చెల్లిందని, దీనివల్ల ఎలాంటి ప్రయోజనం ఉండడం లేదన్నది చాలామంది అభిప్రాయం.ఎనర్జీ సేవింగ్.. అంటే పగటికాంతిని సాయంత్ర వేళల్లో సమర్థవంతంగా ఉపయోగించుకునేందుకు ఈ విధానం పాటిస్తున్నారు. అయితే ఈ విధానం వల్ల పనులకు అవాంతరాలు ఎదురవుతున్నాయని, ముఖ్యంగా నిద్రపై ప్రభావం పడుతుందని పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.1784లో బెంజమిన్ ఫ్రాంక్లిన్ తొలిసారిగా డేలైట్ సేవింగ్ టైం ప్రతిపాదన చేశారు. అయితే.. మొదటి ప్రపంచ యుద్ధకాలంలో తొలిసారి ఈ డే లైట్ సేవింగ్ టైమ్‌ను అమెరికన్లు పాటించారు. యుద్ధం ముగిశాక.. ఈ విధానం పాటించడం మానేశారు. అయితే తిరిగి రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ఈ విధానం మళ్లీ అమెరికాలో ఆచరణలోకి వచ్చింది. యూనిఫామ్ టైం యాక్ట్ 1966 కింద.. ఈ విధానం శాశ్వతంగా మారిపోయింది. అయితే హవాయ్,ఆరిజోనా మాత్రం ఈ విధానం పాటించడం లేదు. అయితే ఈ విధానాన్ని మూర్ఖపు విధానంగా పేర్కొంటూ.. సెనేటర్ మార్కో రుబియో 2022లో సన్‌షైన్ ప్రొటెక్షన్ అనే బిల్లును తెచ్చారు. బిల్లు సెనేట్‌లో పాసైనప్పటికీ.. హౌజ్‌లో మాత్రం ఆమోదం దక్కించుకోలేకపోయింది. దీంతో.. బైడెన్ దాకా ఆ బిల్లు వెళ్లలేకపోయింది. ప్రస్తుతం ట్రంప్ కార్యవర్గంలో రుబియో స్టేట్ సెక్రటరీగా ఉండడం గమనార్హం.ఎలాన్ మస్క్, వివేక్ రామస్వామిలాంటి ట్రంప్ అనుచరగణం కూడా ఈ విధానానికి వ్యతిరేకంగా ఉంది. మరోవైపు.. డీఎస్టీ ద్వారా ఆర్థిక భారం ఎక్కువగా ఉంటుందని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.ప్రస్తుతం అమెరికన్లు ప్రతీ ఏటా మార్చి-నవంబర్ మధ్య డేలైట్ టైం ను.. నవంబర్-మార్చి మధ్య స్టాండర్డ్ టైంను ఫాలో అవుతున్నారు. ట్రంప్ నిర్ణయం అమల్లోకి వస్తే.. కాలాన్ని మార్చుకునే ఈ వందేళ్ల ఆనవాయితీకి పుల్‌స్టాప్ పడుతుంది. అమెరికా మాత్రమే కాదు.. యూరప్ సహా ప్రపంచంలోని మూడింట దేశాలు ఈ పద్ధతిని అవలంభిస్తున్నాయి. -
డిజిటల్ ట్యాక్స్‌పై అమెరికా గుర్రు
వాషింగ్టన్: అమెరికన్ టెక్నాలజీ కంపెనీలను లక్ష్యంగా చేసుకుని పలు దేశాలు అనుచిత డిజిటల్ సర్వీస్ ట్యాక్స్‌లు విధిస్తున్నాయని అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది. భారత్‌తో పాటు పలు దేశాలు విధిస్తున్న డిజిటల్ సర్వీస్ పన్నులపై (డీఎస్టీ) విచారణ జరపాలని నిర్ణయించింది. ఆస్ట్రియా, బ్రెజిల్, చెక్ రిపబ్లిక్, యూరోపియన్ యూనియన్, ఇండోనేసియా, ఇటలీ, స్పెయిన్, టర్కీ, బ్రిటన్ మొదలైనవి ఈ జాబితాలో ఉన్నాయి. ‘మా సంస్థలను అసమంజసంగా టార్గెట్ చేసుకుని కొన్ని వాణిజ్య భాగస్వామ్య దేశాలు అమలు చేస్తున్న పన్నుల స్కీమ్‌లపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆందోళన వ్యక్తం చేశారు. మా వ్యాపార సంస్థలు, ఉద్యోగులపై ఎలాంటి వివక్ష చూపినా తగు చర్యలు తీసుకునేందుకు మేం సిద్ధంగా ఉన్నాం‘ అని అమెరికా వాణిజ్య ప్రతినిధుల సంస్థ (యూఎస్టీఆర్) పేర్కొంది. వాణిజ్య చట్టం 1974లోని సెక్షన్ 301 కింద ఈ విచారణ జరపాలని అమెరికా నిర్ణయించింది. దీని ప్రకారం అమెరికా వాణిజ్యంపై ప్రతికూల ప్రభావాలు చూపేలా ఇతర దేశాలు వివక్షాపూరిత, అసమంజస విధానాలేమైనా అమలు చేస్తేవిచారణ జరిపేందుకు యూఎస్టీఆర్కు విస్తృత అధికారా లు ఉంటాయి. దీనిపై ఫెడరల్ రిజిస్టర్ నోటీసులు జారీ చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఏప్రిల్ 1 నుంచి డీఎస్టీ అమల్లోకి.. డిజిటల్ ట్యాక్స్ అంశం కొన్నాళ్లుగా అంతర్జాతీయంగా నలుగుతూనే ఉంది. దీనికి ప్రత్యామ్నాయంపై చర్చలు జరిగినప్పటికీ దేశాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. చివరికి వివిధ రకాలుగా దేశాలు ఏకపక్షంగా డిజిటల్ ట్యాక్స్‌ను విధించడం ప్రారంభించాయి. 2019లో ఫ్రాన్స్ ఇలాగే అమెరికా ఉత్పత్తులపై డీఎస్టీ విధించింది. ప్రతిగా అమెరికా కూడా కొన్ని ఫ్రెంచ్ ఉత్పత్తులపై మరింత అధిక స్థాయిలో పన్నులు వడ్డించింది. దీంతో డీఎస్టీని నిలుపుదల చేసిన ఫ్రాన్స్ బహుళపక్ష చర్చలు ప్రారంభించింది. భారత్ విషయానికొస్తే ఆన్లైన్లో వస్తు, సేవలు విక్రయించే విదేశీ కంపెనీలపై రెండు శాతం డీఎస్టీ విధించాలని ఈ ఏడాది తొలినాళ్లలో ప్రభుత్వం నిర్ణయించింది. 2020–21 బడ్జెట్లో చేసిన ఈ ప్రతిపాదనల కింద రెండు డజన్లకు పైగా విదేశీ టెక్ కంపెనీలు ఈ పన్నుల పరిధిలోకి వస్తాయి. సుమారు 2,67,000 డాలర్ల వార్షికాదాయాలు ఉన్న కంపెనీలకు మాత్రమే దీన్ని వర్తింపచేస్తూ ఏప్రిల్ 1 నుంచి ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. తొలి విడత చెల్లింపులు కంపెనీలు జూలై 7న కట్టాల్సి ఉంది. గడువు దగ్గరపడుతుండటంతో ఆదాయపు పన్ను శాఖ అధికారులు ఇప్పటికే వసూళ్లపై కసరత్తు చేస్తున్నారు. వాస్తవానికి భారత్‌లో శాశ్వతమైన సంస్థను ఏర్పాటు చేయకుండా డిజిటల్ ప్రకటనల సేవల ద్వారా విదేశీ సంస్థలు ఒక ఏడాదిలో రూ. లక్షకు పైగా ఆదాయం ఆర్జించిన పక్షంలో 6 శాతం మేర సమానత్వ పన్ను విధించాలంటూ 2016 ఫైనాన్స్ చట్టంలో ప్రతిపాదించారు. 2020–21 బడ్జెట్లో 2% రేటుతో ఈ–కామర్స్ కంపెనీలనూ దీని పరిధిలోకి చేర్చారు. ఇది భారత్‌తో వాణిజ్యం చేసే ఇతర దేశాల కంపెనీలను ఆశ్చర్యపర్చింది. కరోనా పరిణామాల కారణంగా దీన్ని తొమ్మిది నెలల పాటు వాయిదా వేయాలంటూ అమెరికా, యూరప్, ఆస్ట్రేలియా, ఆసియా ఖండాల దేశాల కంపెనీలు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు గత నెలలో లేఖ రాశాయి. చర్చలతో పరిష్కరించుకోవాలి.. ఈ వివాదాన్ని బహుళపక్ష చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని అమెరికా చాంబర్ ఆఫ్ కామర్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ మైరాన్ బ్రిలియంట్ తెలిపారు. ‘ఆర్థిక వృద్ధి, ఉద్యోగాల కల్పనకు శక్తిమంతమైన చోదకంగా డిజిటల్ కామర్స్ ఎదిగింది. అయితే, కొన్ని దేశాలు ప్రస్తుతం ఏకపక్షంగా, వివక్షాపూరితంగా వ్యవహరిస్తూ కొత్తగా డిజిటల్ ట్యాక్సులు విధించాలని భావిస్తున్నాయి. ఏకపక్ష పన్నులను నివారించేందుకు అన్ని వర్గాలు కలిసి చర్చించుకోవాల్సిన అవసరం ఉంది‘ అని పేర్కొన్నారు. ‘అమెరికా గతేడాది భారత్‌కు 27 బిలియన్ డాలర్ల విలువ చేసే సేవలను ఎగుమతి చేసింది. కాబట్టి కొత్త పన్నుల విధానంతో ఎక్కువగా అమెరికాపైనే ప్రతి కూల ప్రభావం పడవచ్చు. డిజిటల్ దిగ్గజంగా ఎదగాలని భారత్ ఆశిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఇలాంటి కొత్త పన్నుల వల్ల అవరోధాలేమీ తలెత్తకుండా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందన్నది వేచి చూడాల్సి ఉంటుంది‘ అని న్యాయసేవల సంస్థ నాంగియా ఆండర్సన్ పార్ట్నర్ సందీప్ ఝున్‌ఝున్‌వాలా పేర్కొన్నారు. భారత్‌పై పోరు కాదు... ఈ లిస్టులో అమెరికా మిత్రదేశాలు కూడా చాలానే ఉన్నందున దీన్ని కేవలం భారత్‌పై పోరుగా పరిగణించక్కర్లేదని పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. ఇది చర్చల ప్రక్రియకు నాంది మాత్రమేనని, యూఎస్టీఆర్ ఇంకా భారత్ విధానాలపై వాస్తవాలు సమీకరిస్తోందని వివరించాయి. తర్వాత దశలో భారత్ అనుచిత వాణిజ్య విధానాలేమీ అమలు చేయడం లేదని కూడా నిర్ధారణ కావచ్చని పేర్కొన్నాయి. అమెరికన్ చట్టాల ప్రకారం ఆరోపణలు ఎదుర్కొంటున్న వర్గాలు (ప్రస్తుత కేసులో భారత్) కూడా తమ విధానాలను సమర్థించుకునేందుకు, వాదనలు వినిపించేందుకు అవకాశాలు ఉంటాయని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ఒకవేళ భారత్ అనుచిత వాణిజ్య విధానాలు పాటిస్తోందని యూఎస్టీఆర్ నిర్ధారణకు వచ్చినప్పటికీ అమెరికాతో చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకునే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. -
‘ ఫిజిక్స్’కు కేంద్రం దన్ను
డీఎస్టీ నుంచి రూ.1.08 కోట్లు మంజూరు అధునాతన పరిశోధనలకు ఊతం ఎస్కేయూ (అనంతపురం): శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలోని ఫిజిక్స్ విభాగానికి కేంద్ర శాస్త్ర సాంకేతిక మంత్రిత్వశాఖ దన్నుగా నిలిచింది. ఈ విభాగంలో జరిగే పరిశోధనలకు రూ.1.08 కోట్ల ఆర్థిక సాయాన్ని అందించింది. శాస్త్ర సాంకేతిక రంగాల్లో జరిగే పరిశోధనలకు కేంద్ర శాస్త్ర సాంకేతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఫండింగ్ ఏజెన్సీగా ఉన్న డీఎస్టీ (డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ) ద్వారా ఈ నిధులు అందనున్నాయి. మెటీరియల్ సైన్సెస్‌కు సంబంధించిన పరిశోధనలు, ఆవిష్కరణలకు అయ్యే ఖర్చును ఈ నిధుల ద్వారా వినియోగించుకోవచ్చు. ఫిజిక్స్‌లో నాణ్యమైన పరిశోధనలు ఎస్కేయూ ఫిజిక్స్ విభాగంలో నాణ్యమైన పరిశోధనలు కొనసాగుతున్నాయి. భారత అంతరిక్ష సంస్థ (ఇస్రో)కు సంబంధించి ప్రాంతీయ వాతావరణ అధ్యయన కేంద్రాన్ని ఫిజిక్స్ విభాగంలో నిర్వహిస్తున్నారు. ఇస్రోలో పనిచేసే శాస్త్రవేత్తలు ఇక్కడ రీసెర్చ్ స్కాలర్లుగానూ ఉన్నారు. నిరంతర వాతావరణ, శీతోష్ణస్థితి పరిస్ధితులను ఎప్పటికప్పుడు ఇస్రోకు సమాచారం అందజేస్తుంటారు. ఇక్కడి పరిశోధన శాలల్లో నిరంతరమూ ఏదో ఒక పరిశోధన జరుగుతూ ఉంటుంది. ఐదేళ్లకు మరింత పెరగనున్న సాయం నాణ్యమైన పరిశోధనలే విశ్వవిద్యాలయం గుర్తింపునకు గీటురాయిగా మారింది. ఈ నేపథ్యంలో ప్రామాణికమైన ఆవిష్కరణలపై దృష్టిసారించారు. డీఎస్టీ నుంచి ఫిస్ట్ (ఫండ్ ఫర్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ) అనే పథకం ద్వారా రూ.1.08 కోట్లు ఈ విద్యా సంవత్సరం నుంచి అందించనున్నారు. ఎమ్మెస్సీ ఫిజిక్స్ చదివే విద్యార్థుల ల్యాబ్ సౌకర్యాలకు రూ. 20 లక్షలు, పుస్తకాలకు రూ.5లక్షలు, కంప్యూటర్ ల్యాబ్ నిర్వహణకు రూ.13 లక్షలు, మెటీరియల్ సైన్సెస్‌కు సంబంధించిన పరికరాలకు రూ.50 లక్షలు ఖర్చు చేయనున్నారు. గతంలో జరిగిన పరిశోధనల ప్రామాణికంగానే ఈ నిధులు మంజూరు చేసినట్లు డీఎస్టీ తన అనుమతి పత్రంలో పేర్కొంది. పరిశోధనలకు ఊతం అధునాతనమైన ప్రయోగ పరికరాలతో నాణ్యమైన పరిశోధనలకు ఆస్కారం ఏర్పడనుంది. ఇవి పరిశోధన విద్యార్థులకు ఎంతో దోహదపడనున్నాయి. తొలి దశలో ఎలక్ట్రానిక్ పరికరాలకు నిధులు మంజూరు చేశారు. తాజాగా మెటీరియల్ సైన్సెస్‌కు సంబంధించిన పరికరాల కొనుగోలుకు నిధులు మంజూరు చేశారు. – ప్రొఫెసర్ టి. సుబ్బారావు, ఫిజిక్స్ విభాగం బీఓఎస్ ఛైర్మెన్, పాలిమర్ సైన్సెస్ విభాగాధిపతి, బీఎం బిర్లా సైన్స్ సెంటర్ ప్రొఫెసర్ ఇన్ఛార్జ్ ఉన్నతాధికారుల సహకారం మరువలేం ఫిజిక్స్ విభాగం పురోగతికి వీసీ, రిజిస్ట్రార్ల సహకారం మరువలేం. డీఎస్టీ –ఫిస్ట్ ద్వారా నిధులు రావడం గర్వకారణం. అధునాతన ల్యాబ్‌ల ఏర్పాటుకు ఆస్కారం కానుంది. ప్రామాణికమైన పరిశోధనలు చేయడానికి విద్యార్థులకు సహకారం అందిస్తున్నాం. – డాక్టర్ ఎం.వి.లక్ష్మయ్య, అసోసియేట్ ప్రొఫెసర్, ఎస్కేయూ -
ఎస్సార్‌లో ఉమెన్స్ టెక్నాలజీ పార్కు ప్రారంభం
హసన్‌పర్తి : ఎప్పటికప్పుడు సాంకేతిక రంగంలో నూతన మార్పులు వస్తున్నాయని.. వీటిని విద్యార్థినులు అందిపుచ్చుకోవాలని నిజామాబాద్ ఎంపీ కవిత సూచించారు. వరంగల్ శివారు అన్నాసాగరంలోని ఎస్సార్ ఇంజనీరింగ్ కళాశాలలో డీఎస్టీ(డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ) ఆర్థిక సాయంతో ఏర్పాటు చేసిన ఉమెన్స్ టెక్నాలజీ పార్క్‌ను శనివారం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడారు. ఎమ్మెల్సీ, మండలి చీఫ్ విప్ పాతూరి సుధాకర్‌రెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ మాట్లాడారు. ఎస్సార్ విద్యాసంస్థల చైర్మన్ వరదారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో గ్రేటర్ మేయర్ నన్నపునేని నరేందర్, జెడ్పీ చైర్మన్ గద్దెల పద్మ, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు టి.రవీందర్రావు, కళాశాల సెక్రటరీ మధుకర్‌రెడ్డి, ప్రిన్సిపాల్ మహేష్, డైరెక్టర్ గురురావు, తెలంగాణ జాగృతి జిల్లా అధ్యక్షుడు కోరబోయిన విజయ్, చల్లా వెంకటేశ్వర్‌రెడ్డి, కార్పొరేటర్లు నాగమళ్ల ఝానీ, రాజునాయక్, సర్వోత్తంరెడ్డి, సర్పంచ్ రత్నాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.