‘ ఫిజిక్స్‌’కు కేంద్రం దన్ను | Center for 'Physics' | Sakshi
Sakshi News home page

‘ ఫిజిక్స్‌’కు కేంద్రం దన్ను

Published Tue, Aug 8 2017 11:00 PM | Last Updated on Sun, Sep 17 2017 5:19 PM

‘ ఫిజిక్స్‌’కు కేంద్రం దన్ను

‘ ఫిజిక్స్‌’కు కేంద్రం దన్ను

  •  డీఎస్‌టీ నుంచి రూ.1.08 కోట్లు మంజూరు
  • అధునాతన పరిశోధనలకు ఊతం
  •  

    ఎస్కేయూ (అనంతపురం):

    శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలోని ఫిజిక్స్‌ విభాగానికి కేంద్ర శాస్త్ర సాంకేతిక మంత్రిత్వశాఖ దన్నుగా నిలిచింది. ఈ విభాగంలో జరిగే పరిశోధనలకు రూ.1.08 కోట్ల ఆర్థిక సాయాన్ని అందించింది. శాస్త్ర సాంకేతిక రంగాల్లో జరిగే పరిశోధనలకు కేంద్ర శాస్త్ర సాంకేతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఫండింగ్‌ ఏజెన్సీగా ఉన్న డీఎస్‌టీ (డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ) ద్వారా ఈ నిధులు అందనున్నాయి. మెటీరియల్‌ సైన్సెస్‌కు సంబంధించిన పరిశోధనలు, ఆవిష్కరణలకు అయ్యే ఖర్చును ఈ నిధుల ద్వారా వినియోగించుకోవచ్చు.

    ఫిజిక్స్‌లో నాణ్యమైన పరిశోధనలు

    ఎస్కేయూ ఫిజిక్స్‌ విభాగంలో నాణ్యమైన పరిశోధనలు కొనసాగుతున్నాయి. భారత అంతరిక్ష సంస్థ (ఇస్రో)కు సంబంధించి ప్రాంతీయ వాతావరణ అధ్యయన కేంద్రాన్ని ఫిజిక్స్‌ విభాగంలో నిర్వహిస్తున్నారు. ఇస్రోలో పనిచేసే శాస్త్రవేత్తలు ఇక్కడ రీసెర్చ్‌ స్కాలర్లుగానూ ఉన్నారు. నిరంతర వాతావరణ, శీతోష్ణస్థితి పరిస్ధితులను ఎప్పటికప్పుడు ఇస్రోకు సమాచారం అందజేస్తుంటారు. ఇక్కడి పరిశోధన శాలల్లో నిరంతరమూ ఏదో ఒక పరిశోధన జరుగుతూ ఉంటుంది.

    ఐదేళ్లకు మరింత పెరగనున్న సాయం

    నాణ్యమైన పరిశోధనలే విశ్వవిద్యాలయం గుర్తింపునకు గీటురాయిగా మారింది. ఈ నేపథ్యంలో ప్రామాణికమైన ఆవిష్కరణలపై దృష్టిసారించారు. డీఎస్‌టీ నుంచి ఫిస్ట్‌ (ఫండ్‌ ఫర్‌ ఇంప్రూవ్‌మెంట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ) అనే పథకం ద్వారా రూ.1.08 కోట్లు ఈ విద్యా సంవత్సరం నుంచి అందించనున్నారు. ఎమ్మెస్సీ ఫిజిక్స్‌ చదివే విద్యార్థుల ల్యాబ్‌ సౌకర్యాలకు రూ. 20 లక్షలు, పుస్తకాలకు రూ.5లక్షలు, కంప్యూటర్‌ ల్యాబ్‌ నిర్వహణకు రూ.13 లక్షలు, మెటీరియల్‌ సైన్సెస్‌కు సంబంధించిన పరికరాలకు రూ.50 లక్షలు ఖర్చు చేయనున్నారు.  గతంలో జరిగిన పరిశోధనల ప్రామాణికంగానే ఈ నిధులు మంజూరు చేసినట్లు డీఎస్‌టీ తన అనుమతి పత్రంలో పేర్కొంది.

     

    పరిశోధనలకు ఊతం

    అధునాతనమైన ప్రయోగ పరికరాలతో నాణ్యమైన పరిశోధనలకు ఆస్కారం ఏర్పడనుంది. ఇవి పరిశోధన విద్యార్థులకు ఎంతో దోహదపడనున్నాయి.  తొలి దశలో ఎలక్ట్రానిక్ పరికరాలకు నిధులు మంజూరు చేశారు. తాజాగా మెటీరియల్‌ సైన్సెస్‌కు సంబంధించిన పరికరాల కొనుగోలుకు నిధులు మంజూరు చేశారు.

    – ప్రొఫెసర్‌ టి. సుబ్బారావు, ఫిజిక్స్‌ విభాగం బీఓఎస్‌ ఛైర్మెన్, పాలిమర్‌ సైన్సెస్‌ విభాగాధిపతి, బీఎం బిర్లా సైన్స్‌ సెంటర్‌ ప్రొఫెసర్‌ ఇన్‌ఛార్జ్‌

     

    ఉన్నతాధికారుల సహకారం మరువలేం

    ఫిజిక్స్‌ విభాగం పురోగతికి వీసీ, రిజిస్ట్రార్ల సహకారం మరువలేం. డీఎస్‌టీ –ఫిస్ట్‌ ద్వారా నిధులు రావడం గర్వకారణం. అధునాతన ల్యాబ్‌ల ఏర్పాటుకు ఆస్కారం కానుంది. ప్రామాణికమైన పరిశోధనలు చేయడానికి విద్యార్థులకు సహకారం అందిస్తున్నాం.

    – డాక్టర్‌ ఎం.వి.లక్ష్మయ్య, అసోసియేట్‌ ప్రొఫెసర్, ఎస్కేయూ

     

     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement