Coats
-
‘ ఫిజిక్స్’కు కేంద్రం దన్ను
డీఎస్టీ నుంచి రూ.1.08 కోట్లు మంజూరు అధునాతన పరిశోధనలకు ఊతం ఎస్కేయూ (అనంతపురం): శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలోని ఫిజిక్స్ విభాగానికి కేంద్ర శాస్త్ర సాంకేతిక మంత్రిత్వశాఖ దన్నుగా నిలిచింది. ఈ విభాగంలో జరిగే పరిశోధనలకు రూ.1.08 కోట్ల ఆర్థిక సాయాన్ని అందించింది. శాస్త్ర సాంకేతిక రంగాల్లో జరిగే పరిశోధనలకు కేంద్ర శాస్త్ర సాంకేతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఫండింగ్ ఏజెన్సీగా ఉన్న డీఎస్టీ (డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ) ద్వారా ఈ నిధులు అందనున్నాయి. మెటీరియల్ సైన్సెస్‌కు సంబంధించిన పరిశోధనలు, ఆవిష్కరణలకు అయ్యే ఖర్చును ఈ నిధుల ద్వారా వినియోగించుకోవచ్చు. ఫిజిక్స్‌లో నాణ్యమైన పరిశోధనలు ఎస్కేయూ ఫిజిక్స్ విభాగంలో నాణ్యమైన పరిశోధనలు కొనసాగుతున్నాయి. భారత అంతరిక్ష సంస్థ (ఇస్రో)కు సంబంధించి ప్రాంతీయ వాతావరణ అధ్యయన కేంద్రాన్ని ఫిజిక్స్ విభాగంలో నిర్వహిస్తున్నారు. ఇస్రోలో పనిచేసే శాస్త్రవేత్తలు ఇక్కడ రీసెర్చ్ స్కాలర్లుగానూ ఉన్నారు. నిరంతర వాతావరణ, శీతోష్ణస్థితి పరిస్ధితులను ఎప్పటికప్పుడు ఇస్రోకు సమాచారం అందజేస్తుంటారు. ఇక్కడి పరిశోధన శాలల్లో నిరంతరమూ ఏదో ఒక పరిశోధన జరుగుతూ ఉంటుంది. ఐదేళ్లకు మరింత పెరగనున్న సాయం నాణ్యమైన పరిశోధనలే విశ్వవిద్యాలయం గుర్తింపునకు గీటురాయిగా మారింది. ఈ నేపథ్యంలో ప్రామాణికమైన ఆవిష్కరణలపై దృష్టిసారించారు. డీఎస్టీ నుంచి ఫిస్ట్ (ఫండ్ ఫర్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ) అనే పథకం ద్వారా రూ.1.08 కోట్లు ఈ విద్యా సంవత్సరం నుంచి అందించనున్నారు. ఎమ్మెస్సీ ఫిజిక్స్ చదివే విద్యార్థుల ల్యాబ్ సౌకర్యాలకు రూ. 20 లక్షలు, పుస్తకాలకు రూ.5లక్షలు, కంప్యూటర్ ల్యాబ్ నిర్వహణకు రూ.13 లక్షలు, మెటీరియల్ సైన్సెస్‌కు సంబంధించిన పరికరాలకు రూ.50 లక్షలు ఖర్చు చేయనున్నారు. గతంలో జరిగిన పరిశోధనల ప్రామాణికంగానే ఈ నిధులు మంజూరు చేసినట్లు డీఎస్టీ తన అనుమతి పత్రంలో పేర్కొంది. పరిశోధనలకు ఊతం అధునాతనమైన ప్రయోగ పరికరాలతో నాణ్యమైన పరిశోధనలకు ఆస్కారం ఏర్పడనుంది. ఇవి పరిశోధన విద్యార్థులకు ఎంతో దోహదపడనున్నాయి. తొలి దశలో ఎలక్ట్రానిక్ పరికరాలకు నిధులు మంజూరు చేశారు. తాజాగా మెటీరియల్ సైన్సెస్‌కు సంబంధించిన పరికరాల కొనుగోలుకు నిధులు మంజూరు చేశారు. – ప్రొఫెసర్ టి. సుబ్బారావు, ఫిజిక్స్ విభాగం బీఓఎస్ ఛైర్మెన్, పాలిమర్ సైన్సెస్ విభాగాధిపతి, బీఎం బిర్లా సైన్స్ సెంటర్ ప్రొఫెసర్ ఇన్ఛార్జ్ ఉన్నతాధికారుల సహకారం మరువలేం ఫిజిక్స్ విభాగం పురోగతికి వీసీ, రిజిస్ట్రార్ల సహకారం మరువలేం. డీఎస్టీ –ఫిస్ట్ ద్వారా నిధులు రావడం గర్వకారణం. అధునాతన ల్యాబ్‌ల ఏర్పాటుకు ఆస్కారం కానుంది. ప్రామాణికమైన పరిశోధనలు చేయడానికి విద్యార్థులకు సహకారం అందిస్తున్నాం. – డాక్టర్ ఎం.వి.లక్ష్మయ్య, అసోసియేట్ ప్రొఫెసర్, ఎస్కేయూ -
నల్ల గౌన్లు, టోపీలకు చెల్లు!
లక్నో: కాన్పూర్ ఐఐటీ విద్యార్థులు తమ స్నాతకోత్సవం సందర్భంగా గురువారం భారత సంప్రదాయాలు ఉట్టిపడేలా కుర్తా – పైజామా, కుర్తా – సల్వార్‌లను ధరించారు. బ్రిటిష్ కాలం నాటి నల్లటి కోట్లు, తలపై టోపీలను దూరం పెట్టారు. ‘దేశంలో తొలిసారి ఐఐటీలో విద్యార్థులు బ్రిటిష్ కాలం నాటి గౌన్లు, టోపీలు కాకుండా పైజామాలు, సల్వార్లు ధరించి తమ పట్టాలు పొందారు. తమ తమ కోర్సులను సూచించేలా వేర్వేరు రంగుల్లో స్టోల్స్(స్కార్ఫ్ లాంటి వస్త్రాలు)ను కూడా ధరించారు’ అని ఐఐటీ డైరెక్టర్ ప్రొ.ఇంద్రాణిల్ మన్నా తెలిపారు. భవిష్యత్తులో జరిగే స్నాతకోత్సవాల్లో కూడా విద్యార్థులు భారత సంప్రదాయ దుస్తులే వేసుకుంటారని అన్నారు. 673 మంది బీటెక్, 136 మంది బీఎస్ విద్యార్థులు టాటా సన్స్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్ నుంచి పట్టాలు అందుకున్నారు. -
బుడ్డోడూ.. పది లచ్చలు!
ఓరి బుడ్డోడా ఇంత డబ్బు నీకెక్కడిదిరా.. ఏందిరా ఎక్కడన్నా కన్నం వేశావా ఏంది... ఇలా రా.. ఈడ కూకో... ఆ మూట విప్పు.. ఏందిరా ఇన్ని కట్టలు.. లచ్చలు లచ్చలు ఉన్నట్టు ఉన్నాయిగందరా.. ఓరి నాయనో నాకేదో భయమేస్తుందిరా.. పదపద.. ముందు మీ ఆసామి దగ్గరకు పోదాం పదా..! ఈ సంభాషణ చదువుతుంటే పల్లెటూరి చిన్నోడి వద్ద ఉన్న డబ్బు గురించి ఓ తల్లి ఆరా తీస్తూ భయపడుతున్నట్టు ఉంది గదా.. ఔను నిజమే.. ఆ బుడ్డోడి వద్ద లక్షలాది రూపాయలు ఉన్నమాట నిజమే. వాడు ఆసామి వద్ద పనిచేస్తున్న మాటా నిజమే.. అయితే, ఆ తల్లి భయపడినట్టు వాడు దొంగతనం చేయలేదు.. మరో నేరమో చేయలేదు.. వాడు చేసింది జస్ట్ బిజినెస్.. వచ్చిపడింది పది లక్షలు. అక్షరాలా పదిలక్షల రూపాయలు. ఆశ్చర్యంగా ఉందిగదా. ఎస్.. ఓ చిన్న కుర్రోడు అంతమొత్తం ఎలా సంపాదించాడనేగా మీ డౌట్.. అయితే, ఓసారి రాజధాని నిర్మించతలపెట్టిన గ్రామాల్లో జరుగుతున్న భూముల బిజినెస్‌పై ఓ లుక్కేయండి. కోట్లలో పలుకుతున్న భూముల ధరలు మధ్యవర్తులను లక్షాధికారులను చేస్తున్నాయి. ఎకరా పొలం అమ్మితే రైతుతో పాటు కోనుగోలుదారులు ఇచ్చే కమీషన్ నాలుగు శాతం జేబులో పడుతోంది. ఇప్పుడక్కడ ఎకరా ధర కోటి పై మాటే.. ఈ లెక్కన నాలుగు లక్షలు కమీషన్ రూపంలో వస్తున్నాయి. అంటే రైతు వద్ద కోటీ పది లేదా కోటీ ఇరవై లక్షలకు బేరం కుదుర్చుకుని వేరే వారికి కోటీ నలబై లక్షలకు అమ్ముకోవడం అన్నమాట. ఈ వ్యవహారంలో ఎకరాకు పది నుంచి రూ.20 లక్షలు సంపాదిస్తున్న మధ్యవర్తులూ ఉన్నారు. ఆ గ్రామాల్లో పొలం పనులు చేసే కుర్రకారు నలుగురైదుగురు పోగై మారు బేరాలు చేస్తున్నారు. ఆ నలుగురిలో చిన్నారావు ఒకడు. స్నేహితులతో కలిసి రెండెకరాలు మారు బేరం చేయడంతో అతడికి దక్కిన డబ్బు పది లక్షలు. ఇలా అందరికీ వస్తున్నాయని కాదు సుమా.. రియల్ బిజినెస్‌లో ఇదో కోణం మాత్రమే. ఒక్కోసారి అదృష్టం అలా వరించేసింది మరి. - గుంటూరు డెస్క్ -
అంచనా వ్యయం రూ. 3,212 కోట్లు
మన జిల్లా - మన ప్రణాళిక ఖరారు తొలుత రూ.81.13 కోట్లతో పనుల ప్రతిపాదనలు ఇతర జిల్లాలను అనుసరిస్తూ తుది జాబితా తయూరు భారీగా పెరిగిన అంచనాలు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అందజేత సాక్షి, హన్మకొండ : జిల్లా సమగ్రాభివృద్ధే లక్ష్యంగా ‘మన జిల్లా-మన ప్రణాళిక’ ఖరారైంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమంలో భాగంగా జిల్లా పరిషత్ పాలకమండలి, అధికారులు తుది ప్రతిపాదనలు రూపొందించారు. వివిధ ప్రభుత్వ విభాగాలకు సంబంధించి మొదటి ప్రాధాన్యత అంశాలుగా 50 పనులను ఎంపిక చేశారు. ఈ పనులు చేపట్టేందుకు రూ.3,212 కోట్ల వ్యయం అవసరమవుతుందని అంచనా వేశారు. ఈ మేరకు మన జిల్లా- మన ప్రణాళిక తుది జాబితాను జిల్లా అధికారులు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వానికి అందజేశారు. బడ్జెట్ రూపకల్పనలో ఈ జాబితాను అనుసరించి రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకు నిధులు కేటాయించనుంది. రూ.81.13 కోట్ల నుంచి రూ.3,212 కోట్లు... ప్రజల అవసరాలు, ఆకాంక్షలు ప్రతిబింబించేలా రాష్ట్ర ప్రభుత్వం మన జిల్లా-మన ప్రణాళిక కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా జిల్లా పరిషత్ కార్యాలయంలో జూలై 27న తొలి పాలకమండలి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జిల్లాలోని 50 మండలాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న జెడ్పీటీసీ సభ్యులు అందరూ కలిపి 1,557 పనులను సూచించారు. అయితే... రాష్ట్ర ప్రభుత్వం మండలానికి ఒక్క పనిని మాత్రమే మన జిల్లా-మన ప్రణాళికలో చేర్చాలని సూచించింది. దీంతో తొలి విడతలో రూ.81.13 కోట్ల అంచనా వ్యయంతో ప్రతి మండలం నుంచి ఒక పని వంతున 50 పనులను ఎంపిక చేశారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వానికి మిగిలిన జిల్లాలు సమర్పించిన జాబితాలో ఒకే రకమైన పనులన్నింటీని ఒకదానిగానే పరిగణించారు. ఉదాహరణకు ఆరోగ్య విభాగానికి సంబంధించి అన్ని మండలాల నుంచి వచ్చిన ప్రతిపాదనలను ఒకే పనిగా పేర్కొంటూ మన జిల్లా-మన ప్రణాళిక జాబితాను సమర్పించారు. ఈ నేపథ్యంలో ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల ప్రణాళికలు రూ. 2,500 కోట్లను దాటాయి. దీంతో వరంగల్ జిల్లా పరిషత్ చైర్పర్సన్ గద్దల పద్మ, జిల్లాపరిషత్ అధికారులు రూ.81.13 కోట్లతో తొలుత సమర్పించిన ప్రణాళికను రద్దు చేశారు. ఒకే విధమైన పనులను ఒకేదానిగా పేర్కొంటూ రూ 3,212 కోట్ల అంచనా వ్యయంతో కొత్త ప్రణాళికను సిద్ధం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపించారు. ప్రభుత్వానికి సమర్పించిన జాబితా ప్రకారం... ప్రాంతాల్లో అస్తవ్యస్తంగా ఉన్న రోడ్ల అభివృద్ధితోపాటు కొత్త రోడ్ల నిర్మాణానికి జిల్లా ప్రణాళికలో ప్రాధాన్యం లభించింది. జిల్లాలోని 50 మండలాల్లో రహదారులు, భవనాల శాఖ ఆధ్వర్యంలో పాత బీటీ రోడ్ల అభివృద్ధికి రూ.384 కోట్లు... 47 మండలాల్లో కొత్త బీటీ రోడ్ల నిర్మాణానికి రూ.78.68 కోట్లు అవసరమవుతాయని ప్రణాళికలో పేర్కొన్నారు. వీటితోపాటు కేసముద్రం, ఖానాపూర్ మండలాల్లో రోడ్ల అభివృద్ధికి రూ.80 కోట్లు.. మద్దూరు, మహబూబాబాద్, మరిపెడకు రూ.79.76 కోట్లు... నర్మెట, నర్సంపేటకు రూ.62.22 కోట్లు... నెక్కొండకు రూ.66.06 కోట్లు... నెల్లికుదురు, పాలకుర్తి, పరకాలకు రూ.94.57 కోట్లు... రాయపర్తి, రేగొండ, సంగెం మండలాల్లో రూ.51.61 కోట్లతో వివిధ రోడ్ల నిర్మాణానికి ప్రతిపాదనలు అదేవిధంగా వివిధ నియోజకవర్గాల్లో తాగునీటి పనులకు రూ.709 కోట్లు అవసరమవుతాయని ప్రణాళికలో పొందుపరిచారు. జిల్లాలో 25 మండలాల పరిధిలోని చెరువులు, తూముల మరమ్మతులకు రూ.99.35 కోట్లు, మరో 25 మండలాల్లో చెరువుల అభివృద్ధికి రూ.97 కోట్లు కేటాయించారు. జిల్లాలోని ప్రతి మండలంలో భూసార పరీక్ష కేంద్రాలను నెలకొల్పేందుకు రూ.320 కోట్లు... పది మండలాల్లో వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెటింగ్ సదుపాయూల కోసం రూ.410 కోట్లు అవసరమవుతాయని ప్రతిపాదించారు. 32 మండలాల్లో గ్రామపంచాయతీల భవనాల నిర్మాణానికి రూ 99 కోట్లు... 50 మండలాల్లో డివిజన్ పంచాయతీ ఆఫీస్ భవనాలకు రూ 23.30 కోట్లు... 18 మండలాల్లో మండల సమాఖ్య భవనాలు, మార్కెటింగ్ గోదాంలకు రూ 44.81 కోట్లు అవసరమని జిల్లా ప్రణాళికలో ప్రతిపాదించారు. వైద్యరంగంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులకు రూ.173.39 కోట్లు... విద్యారంగానికి రూ.69.32 కోట్లు... రీజనల్ సైన్స్ సెంటర్ అభివృద్ధికి రూ 5.50 కోట్లు... జిల్లాలో పర్యాటక ప్రాంతాల్లో చేపట్టాల్సిన పనులకు రూ.38.25 కోట్లు జిల్లా ప్రణాళికలో పేర్కొన్నారు. వీటితోపాటు ఒక్కో చోట రూ.25 కోట్ల వ్యయంతో స్టేషన్‌ఘన్‌పూర్, డోర్నకల్, ములుగు, వర్ధన్నపేట నియోజకవర్గాల్లో బస్‌డిపోలు నిర్మించాలని పేర్కొన్నారు. క్రీడలకు సంబంధించి 50 మండలాల్లో యూత్ వెల్ఫేర్ హాస్టళ్లను నెలకొల్పేందుకు రూ.149 కోట్లు కావాలని మన జిల్లా-మన ప్రణాళికలో పేర్కొన్నారు. -
యో అంటే 6 కోట్లు
కో అంటే కోటి తెలుసు గానీ యో అంటే ఆరు కోట్లేంటా అనుకుంటున్నారా? మరేమీ లేదు.. స్మార్ట్ఫోన్లు, ట్యాబ్లెట్ పీసీల రాకతో కొత్త కొత్త యాప్‌లు (అప్లికేషన్) వెల్లువలా వస్తున్నాయి. అలాంటిదే యో అనే యాప్ కూడా. దీనితో ప్రయోజనం ఏమిటని గట్టిగా అడిగితే..ఏమీ లేదు. దీన్ని ఇన్స్టాల్ చేసుకుంటే మన మిత్రులకు యో అన్న ఒకే ఒక్క పదాన్ని ... టెక్ట్స్, ఆడియో రూపంలో పంపించవచ్చు. దానివల్ల ఒరిగే ప్రయోజనం ఏమిటని మళ్లీ అడిగితే..ఏమీ లేదు. రకరకాల సందర్భాలకు తగినట్లుగా ఈ యో అన్న పదం రకరకాల అర్థాల్లో ధ్వనిస్తుందన్నది దీన్ని తయారు చేసిన ఆర్ ఆర్బెల్ మాట. ఒక పెద్ద సంస్థలో భారీ జీతం వచ్చే ఉద్యోగాన్ని వదిలేసి మరీ ఆర్బెల్ దీన్ని తయారు చేశాడు. సరే, ఇంతకీ మరి ఆరు కోట్ల సంగతేంటంటే.. ఈ యాప్ తెగ నచ్చేసి, దీనికి బోలెడంత భవిష్యత్తు ఉందంటూ అమెరికాకు చెందిన ఇన్వెస్టర్లు దీన్ని తయారు చేసిన ఆర్బెల్ సంస్థలో ఇంత మొత్తాన్ని ఇన్వెస్ట్ చేశారు. నిజంగానే దీనికి ఫాలోయింగ్ కూడా బాగానే ఉంటోంది. అదీ విషయం. ఇలాంటి వాటిల్లోనూ ఇన్వెస్ట్ చేసే వారున్నారు కాబట్టి .. మీ దగ్గర వెరైటీ యాప్ ఐడియాలు ఉంటే కోట్లు పట్టేసేందుకు మీరూ ప్రయత్నించవచ్చు.