యో అంటే 6 కోట్లు
కో అంటే కోటి తెలుసు గానీ యో అంటే ఆరు కోట్లేంటా అనుకుంటున్నారా? మరేమీ లేదు.. స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్లెట్ పీసీల రాకతో కొత్త కొత్త యాప్‌లు (అప్లికేషన్) వెల్లువలా వస్తున్నాయి. అలాంటిదే యో అనే యాప్ కూడా. దీనితో ప్రయోజనం ఏమిటని గట్టిగా అడిగితే..ఏమీ లేదు. దీన్ని ఇన్‌స్టాల్ చేసుకుంటే మన మిత్రులకు యో అన్న ఒకే ఒక్క పదాన్ని ... టెక్ట్స్, ఆడియో రూపంలో పంపించవచ్చు.
దానివల్ల ఒరిగే ప్రయోజనం ఏమిటని మళ్లీ అడిగితే..ఏమీ లేదు. రకరకాల సందర్భాలకు తగినట్లుగా ఈ యో అన్న పదం రకరకాల అర్థాల్లో ధ్వనిస్తుందన్నది దీన్ని తయారు చేసిన ఆర్ ఆర్బెల్ మాట. ఒక పెద్ద సంస్థలో భారీ జీతం వచ్చే ఉద్యోగాన్ని వదిలేసి మరీ ఆర్బెల్ దీన్ని తయారు చేశాడు.
సరే, ఇంతకీ మరి ఆరు కోట్ల సంగతేంటంటే.. ఈ యాప్ తెగ నచ్చేసి, దీనికి బోలెడంత భవిష్యత్తు ఉందంటూ అమెరికాకు చెందిన ఇన్వెస్టర్లు దీన్ని తయారు చేసిన ఆర్బెల్ సంస్థలో ఇంత మొత్తాన్ని ఇన్వెస్ట్ చేశారు. నిజంగానే దీనికి ఫాలోయింగ్ కూడా బాగానే ఉంటోంది. అదీ విషయం. ఇలాంటి వాటిల్లోనూ ఇన్వెస్ట్ చేసే వారున్నారు కాబట్టి .. మీ దగ్గర వెరైటీ యాప్ ఐడియాలు ఉంటే కోట్లు పట్టేసేందుకు మీరూ ప్రయత్నించవచ్చు.