పేలుళ్లు, దాడుల సమాచారం చెప్పే యాప్!
ఈ ఏడాది జరిగిన బాంబు పేలుళ్లు, ఉగ్రదాడులు, ప్రకృతి వైపరీత్యాల నేపథ్యంలో ఫ్రాన్స్ ప్రభుత్వం వీటన్నింటి సమాచారం ప్రజలకు ఎప్పటికప్పుడు అందేలా ఒక యాప్ ను అందుబాటులోకి తెచ్చింది. మరో రెండు రోజుల్లో యూరో కప్ 2016 ఫుట్ బాల్ పోటీలు ప్రారంభం అవుతుండటంతో ఫ్రాన్స్ హోం మంత్రి ఈ 'సైప్' యాప్ ను విడుదల చేశారు. ఇంగ్లీషు, ఫ్రెంచ్ భాషల్లో అందుబాటులో ఉండే ఈ యాప్ ద్వారా యూజర్ కు దగ్గరలో ఏదైనా దాడి లేదా బాంబు పేలుడు లేదా ప్రకృతి వైపరీత్యం సంభవిస్తే అప్పటికప్పుడు ఆ సమాచారాన్ని అందిస్తుంది. ఫోన్ స్క్రీన్ మీద పెద్ద అక్షరాలతో ఎరుపు రంగులో అలర్ట్ అని చూపిస్తూ చుట్టుపక్కల ఏం జరుగుతుందో తెలుపుతుంది.
యూజర్ స్క్రీన్ మీద టచ్ చేయడం ద్వారా పోలీసుల ఆపరేషన్ మొదలైందో లేదో కూడా తెలుసుకోవచ్చని వివరించారు. అలర్ట్ వివరాలను సోషల్ మీడియాలో కూడా షేర్ చేసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. మొదట ఉగ్రదాడులు, బాంబు పేలుళ్ల వరకే యాప్ ను ఉపయోగించాలని నిర్ణయించినా, తర్వాత ప్రకృతి వైపరీత్యాల సందర్భంలో కూడా ఉపయోగపడేలా మార్చినట్లు చెప్పారు.