నల్ల గౌన్లు, టోపీలకు చెల్లు!
లక్నో: కాన్పూర్ ఐఐటీ విద్యార్థులు తమ స్నాతకోత్సవం సందర్భంగా గురువారం భారత సంప్రదాయాలు ఉట్టిపడేలా కుర్తా – పైజామా, కుర్తా – సల్వార్‌లను ధరించారు. బ్రిటిష్ కాలం నాటి నల్లటి కోట్లు, తలపై టోపీలను దూరం పెట్టారు. ‘దేశంలో తొలిసారి ఐఐటీలో విద్యార్థులు బ్రిటిష్ కాలం నాటి గౌన్లు, టోపీలు కాకుండా పైజామాలు, సల్వార్లు ధరించి తమ పట్టాలు పొందారు.
తమ తమ కోర్సులను సూచించేలా వేర్వేరు రంగుల్లో స్టోల్స్(స్కార్ఫ్ లాంటి వస్త్రాలు)ను కూడా ధరించారు’ అని ఐఐటీ డైరెక్టర్ ప్రొ.ఇంద్రాణిల్ మన్నా తెలిపారు. భవిష్యత్తులో జరిగే స్నాతకోత్సవాల్లో కూడా విద్యార్థులు భారత సంప్రదాయ దుస్తులే వేసుకుంటారని అన్నారు. 673 మంది బీటెక్, 136 మంది బీఎస్ విద్యార్థులు టాటా సన్స్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్ నుంచి పట్టాలు అందుకున్నారు.